ఒక జీపు.. ఇద్దరు వ్యక్తులు.. 15 దేశాలు.. 51 రోజులు.. 13,500 కిలోమీటర్లు.. లండన్ నుంచి న్యూఢిల్లీ వరకు.. అంతా రోడ్డు ప్రయాణమే. పెంపుడు జంతువుల కోసం ఒక జంట జరిపిన అవగాహన యాత్ర ఇది. లండన్‌లో నివసిస్తున్న తుషార్, పూజ దంపతులు ఈ వినూత్న ప్రయాణం చేసి ఎన్నో అనుభవాలు మూటగట్టుకున్నారు. ఆ మహాయాత్రలోని కొన్ని మైలురాళ్లను చదవండి. ప్లాన్ ఎ లాంగ్ డ్రైవ్ అందరికీ ఒక కల. ఆ కలకు ఒక ప్రతిఫలం ఉండాలి. అది చరిత్రలో నిలిచిపోవాలి. అప్పుడే మనస్సుకు తృప్తి. పడ్డ కష్టానికి ప్రయోజనం. పెంపుడు జంతువుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఢిల్లీకి చెందిన ఫ్రెండికోస్ స్వచ్ఛంద సంస్థ కోసం నిధులు సేకరించటం మా యాత్ర ఉద్దేశ్యం. పదిహేను దేశాల మీదుగా ప్రయాణం అంటే అంత సులువు కాదు. రూట్ మ్యాప్ సరిగ్గా ఉండాలి. వీసాలు, పర్మిట్లు, వెహికిల్, ఇన్సూరెన్స్, వసతి, వనరులు, ఆహారం.. ఇన్ని చూసుకోవాలి. ఆరునెలల పాటు ఇంటర్‌నెట్‌లో సర్చ్‌చేసి ఒక ప్లాన్ రూపొందించాం. వీసాలు, పర్మిట్లు, ఇన్సూరెన్స్‌లు, కార్నెట్లు, స్పాన్సర్లను రెడీ చేసుకోవడానికి తలప్రాణం తోకకొచ్చింది. ప్లాన్ బి మాకు అన్ని సదుపాయాలూ ఉండే ఒక వాహనం కావాలి. ...