1978, కర్ణాటక ఆ గ్రామవాసులు.. రక్షిత మంచినీటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో.. సర్కారు బడికి పది కిలోమీటర్ల దూరంలో.. ప్రభుత్వాసుపత్రికి పాతిక కిలోమీటర్ల దూరంలో.. దురదృష్టానికి మాత్రం అతి దగ్గరగా బతుకుతున్నారు. గూగుల్ కూడా గుర్తించలేని ఆ కుగ్రామం పేరు మొటక్‌పల్లి. అప్పట్లో అక్కడ నలభై యాభై పూరి గుడిసెలుండేవంతే. ఒకరోజు రచ్చబండ దగ్గర ఊరంతా చేరి పంచాయితీ పెట్టారు. "ఇక వాడ్ని ఊళ్లో ఉంచడానికి వీల్లేదు'' తీర్మానించాడు ఒక పెద్దమనిషి. "అయ్యా! ఊరు కాని ఊరు. చేతుల పైసల్ గూడ లేవు. వాడ్ని అంత దూరం తీస్కపోయేదెట్టయ్యా?'' బతిమాలాడు ఒకాయన. "అదంతా మాకు తెల్వదు. ఆడ్ని ఈడ్నే ఉంచి ఊర్ని వల్లకాడు చేస్తావా ఏంది? నర్సిగాడు ఊళ్లో ఉండడానికి వీల్లేదంతే'' కరాకండిగా చెప్పాడు పెద్దమనిషి. ఆయన చెప్పిన నర్సిగాడి అసలు పేరు నరసప్ప. పదేళ్ల పిల్లాడు. అతని తల్లిదండ్రులు పేద రైతుకూలీలు. వారికి ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారిలో నాలుగోవాడే నరసప్ప. వారెవ్వరూ బడికి వెళ్లేవారు కాదు. అందరూ రోజూ కూలీకి వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నరసప్ప చేతిపైన కొన్ని మచ...