"నీ బాంచెన్ కాల్మొక్తా'' అన్న సామాన్యులు తుపాకీ పడితే ఏమైతదో తేలిన రోజులు.. "నైజాం సర్కరోడా.. నీ గోరి కడతం కొడుకో..'' అంటూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యానికి, దొరల, భూస్వాముల అణచివేతలకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం జరుగుతున్న తరుణం.. కడుపు మండిన నిరుపేదల ఆవేశం ముందు ఏ ఆయుధం నిలవదని నిజాం గ్రహించి లొంగిపోయిన అనంతర కాలం.. సుబేదార్లు.. జాగీర్దార్లు.. షేర్వానీలు విడిచి ఖద్దరు చొక్కాలు తొడుక్కుని నయా బానిసత్వానికి తెరలేపిన సమయం.. భూమి కోసం.. భుక్తి కోసం.. తెలంగాణ విముక్తి కోసం.. కూలీ జనం కణ కణ రగిలే నిప్పులై.. కరకర పొడిచే పొద్దులై, చరచర పొంగే ఉప్పెనలై ఎగబడిన తీరు ప్రపంచ విప్లవోద్యమానికి కొత్తదారులు వేసింది. ఆ దారుల్లో ఉద్యమోన్ముక్తులైన అనేకమందిలో.. రణదివిటీ.. ఈ రంగక్క. అలియాస్ నజియా!