కళ్ల నిండా నీళ్లు కమ్ముకు పోయి, మనసు నిండా దిగులు నిండుతూ పోయే సందర్భాలు ప్రతి ఒక్కరికీ ఎన్నెన్నో. ఓటమో, ఆశాభంగమో, అవమానమో మనసును తీవ్రంగా గాయపరిస్తే ఒంటరిగా మగ్గే క్షణాలు ఏదో సందర్భంలో అందరికీ అనుభవం లోకొచ్చేవే. ఆ సమయంలో తమను తాము ఓదార్చుకునే ఆత్మస్థైర్యం అందరికీ ఉండకపోవొచ్చు. ఓదార్చే తోడూ దొరక్కపోవచ్చు. ఆ బలహీన క్షణంలో మదిలో మెదిలే ఒకే ఒక్క ఆలోచన... 'ఆత్మహత్య'. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలంటారు. ఆత్మహత్యకు పాల్పడే వారు కూడా తమ చావుకు అన్ని కారణాలు చెబుతుంటారు. జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలి ఉంటుంది. అదే భవిష్యత్తు. ఇది ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు గ్రహించరు కాబోలు. కాలం గడిచి... మనకూ మంచి రోజులు వచ్చాక ఆ పాత అనుభవాన్ని గుర్తుచేసుకుంటే. ఆ ఆలోచన ఎంతటి తప్పో తెలుస్తుంది. మరి తమకు తాము అంతటి సమయం కూడా ఇచ్చుకోకుండా క్షణికావేశంలో ఆత్మహత్మకు పాల్పడే వారు చాలామంది ఉంటారు. అలాంటి వారిని ముందే గుర్తించి చేయూతనందిస్తే వారి జీవితం చేజారదు. మారుతున్న పరిస్థితులతో పాటు మానవతా విలువల్లో, జీవన విధానాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యువత అన్ని రంగాల్లో ఎంత వేగంగ...