
కళ్ల నిండా నీళ్లు కమ్ముకు పోయి, మనసు నిండా దిగులు నిండుతూ పోయే సందర్భాలు ప్రతి ఒక్కరికీ ఎన్నెన్నో. ఓటమో, ఆశాభంగమో, అవమానమో మనసును తీవ్రంగా గాయపరిస్తే ఒంటరిగా మగ్గే క్షణాలు ఏదో సందర్భంలో అందరికీ అనుభవం లోకొచ్చేవే. ఆ సమయంలో తమను తాము ఓదార్చుకునే ఆత్మస్థైర్యం అందరికీ ఉండకపోవొచ్చు. ఓదార్చే తోడూ దొరక్కపోవచ్చు. ఆ బలహీన క్షణంలో మదిలో మెదిలే ఒకే ఒక్క ఆలోచన... 'ఆత్మహత్య'. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలంటారు. ఆత్మహత్యకు పాల్పడే వారు కూడా తమ చావుకు అన్ని కారణాలు చెబుతుంటారు. జీవితంలో సర్వస్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలి ఉంటుంది. అదే భవిష్యత్తు. ఇది ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు గ్రహించరు కాబోలు. కాలం గడిచి... మనకూ మంచి రోజులు వచ్చాక ఆ పాత అనుభవాన్ని గుర్తుచేసుకుంటే. ఆ ఆలోచన ఎంతటి తప్పో తెలుస్తుంది. మరి తమకు తాము అంతటి సమయం కూడా ఇచ్చుకోకుండా క్షణికావేశంలో ఆత్మహత్మకు పాల్పడే వారు చాలామంది ఉంటారు. అలాంటి వారిని ముందే గుర్తించి చేయూతనందిస్తే వారి జీవితం చేజారదు.
మారుతున్న పరిస్థితులతో పాటు మానవతా విలువల్లో, జీవన విధానాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యువత అన్ని రంగాల్లో ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, మానసికంగా అంత బలహీన పడుతోంది. ఫలితంగానే ఈ ఆత్మహత్మలు పెరుగుతున్నాయని చెబుతున్నారు మానసిక నిపుణులు. వారు చెబుతున్న ఆసక్తికరమైన విషయాలు... ఆత్మహత్యలు రెండు రకాలు. ప్రణాళికా మేరకు స్థిరమైన నిర్ణయంతో చేసుకునేవి. తాతాల్కిక ఆవేశంతో చేసుకునేవి. ప్రణాళిక ప్రకారం ఆత్మహత్య చేసుకునే వారు కొద్ది రోజుల ముందు నుంచే మానసికంగా అందుకు సన్నద్ధం అవుతారు. అన్నీ సిద్ధం చేసుకుని ఆత్మహత్య చేసుకుంటారు. క్షణికావేశంలో చేసుకునే వారి దారి వేరు. అది అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం. అహం దెబ్బతిన్నప్పుడో, పరువుకు నష్టం వాటిల్లినప్పుడో, తప్పు చేసినప్పుడో, ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మహత్య అన్నది చనిపోవాలనే కోరిక, కాంక్ష కానేకాదు. అది క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం మాత్రమే. బతికి జీవితంలో ఎంతో అనుభవించాలనే కోరిక వారికి బలంగా ఉంటుందట. చనిపోయే ముందు కూడా తమనెవరైనా కాపాడితే బాగుండునని మనసులో వారు కోరుకుంటారట.
అంకెలు చెబుతున్న అఘాయిత్యాలు...
ప్రపంచ వ్యాప్తంగా నేడు రోజూ మూడు వేల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దాదాపు ప్రతి 30 సెకండ్లకు ఒక రు చొప్పున ఆర్థాంతరంగా జీవితాలను ముగించుకుంటున్నారు. అయితే ప్రతి అరనిముషానికీ సుమారు 60 వేలమంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వారు పేర్కొన్నారు. గత 50 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యాయత్నం చేసుకునే వారి సంఖ్య 60 శాతానికి పెరిగిందని అధ్యయనాల్లో బయటపడింది. ఆత్మహత్యకు పాల్పడిన వారు లేదా అందుకు ప్రయత్నించే వారిలో 15 నుంచి 30 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉన్నట్టు పరిశీలకులు చెబుతున్నారు.
యత్నించే వారిలో యువతే ఎక్కువ
ఆత్మహత్యకు పాల్పడే వారిలో 15 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్కుల వారే ఎక్కువ. ఆత్మహత్యకు యత్నించే వారిలో యువకులతో పోలిస్తే యువతులే ఎక్కువ. అయితే ఆ ప్రయత్నాల్లో సఫలురై మరణించే వారిలో మళ్లీ యువకులే అధికం అన్నది పరిశీలకుల అంచనా. యువకులు ఎంచుకునే మార్గాలే దీనికి కారణం. ఆత్మహత్యకు ప్రేరేపించే కారణాలు కూడా యువకుల్లో, మహిళల్లో వేర్వేరుగా ఉన్నాయి. యువకుల్లో అత్యధికంగా ఆత్మహత్యలకు ప్రేరేపించే అంశాలు నిరాశ, నిస్పృహ. యువతుల్లో మాత్రం వ్యక్తిగత సంబంధాలు, మానసిక సమస్యలే కారణమని నిపుణులు చెబుతున్నారు.
కారణాలివి...
ప్రేమలో పడినందుకు పెద్దలు మందలించారని.
ప్రియురాలు, ప్రియుడు, ఆత్మీయుల విరహవేదన.
పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోవడం, ర్యాగింగ్.
ఉద్యోగం దొరకలేదని, పదోన్నతి లభించలేదని.
ఆత్మీయుల్ని అర్థాంతరంగా కోల్పోవడం.
ఆర్థిక ఇబ్బందులు, వేధింపులు, బాధింపులు.
తీవ్ర మానసిక ఒత్తిడి.
డిప్రెషన్, బైపోలార్ డిప్రెషన్, స్కిజోఫినీయా.
మత్తుపానీయాలకు బానిస కావడం, వాటి నుండి బయట పడలేకపోవడం.
లైంగిక వేధింపులు, మోసం.
అపార్థం, అనుమానం, అపోహలు, అనారోగ్యం, అవమానం.
ఇలా గుర్తించవచ్చు...
ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ఎప్పుడూ నిరాశా, నిస్పృహలతో ఉంటారు.
ఎవరితోనూ కలవరు. ఒంటరిగా గడుపుతుంటారు.
'తామెవరికోసం బతకాలి'అని ఆలోచిస్తుంటారు.
కుటుంబ సభ్యులనూ, స్నేహితులనూ తప్పించుకుని తిరుగుతుంటారు.
వారి వ్రపర్తనలోనూ మార్పు కనిపిస్తుంది. తమ వస్తువులను ఇతరులకు అప్పగిస్తుంటారు.
తాను ఇకపై ఉండనని తగు జాగ్రత్తలు చెబుతుంటారు.
వేదాంత ధోరణిలో మాట్లాడుతుంటారు.
ఎప్పుడూ విచారంగా ఉంటుంటారు.
చదువు, టీవీ చూడ్డం తదితర ఏ పనిపైనా ఆసక్తి ప్రదర్శించరు.
నిద్ర పట్టక నిద్రమాత్రలు మింగుతుంటారు.
చావు గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. తనను తాను తక్కువ చేసుకుని మాట్లాడుతుంటారు.
మాటే మంత్రం...
ఊబిలో కూరుకుపోయే వారిని చిన్న తాడు కాపాడినట్లు ఆత్మహత్య ఆలోచనలో ఉన్న వారికి ఒక మంచి మాటే మంత్రంగా పనిచేస్తుంది. వారికి నచ్చజెప్పి మనస్సును మార్చవచ్చని చెబుతున్నారు మానసిక నిపుణులు. మొరిగే కుక్క కరవదన్నట్లు... ఆత్మహత్య చేసుకుంటానని పదే పదే ప్రకటించే వాళ్లు ఎప్పటికీ, అలా చేసుకోరని కొందరంటుంటారు. ఇది చాలా తప్పు. ఇది వారిని మరింత కృంగదీస్తుంది. ఆత్మహత్య గురించి మాట్లాడే వారిని తేలికగా తీసుకోకూడదు. వాళ్ల సమస్య ఏంటో తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునే వారు కొద్ది రోజుల ముందో, కొన్ని గంటల ముందో తమ సన్నిహితులకు ఏదో రూపంలో దానికి సంబంధించిన దానికి సంబంధించిన సంకేతాల్ని ఇస్తారన్నది నిపుణుల మాట. కాబట్టి ఈ విధంగా మనతో ఎవరైనా మాట్లాడితే... వారిపట్ల కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. శ్రద్ధ కనబరుస్తూ వారిని గమనిస్తూ ఉండాలి. అలాంటి వాళ్ల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి. వారిని కదిలించి మరీ ఓపిగ్గా వారి సమస్యల్ని వినాలి. ఆపై సమస్య ఎలాంటిదైనా త్వరలోనే పరిష్కారమవుతుందని ధైర్యం చెప్పాలి. నీవెంట మేమున్నామని వారిలో మనోధైర్యం నింపాలి.
కౌన్సెలింగ్ కోరేది కొందరే...
తీవ్రమైన నిరాశ నిస్పృహలతో చచ్చిపోవాలని భావించే వారికి ఓదార్పు నిచ్చి కౌన్సెలింగ్ ద్వారా మనోధైర్యం కల్పించే స్వచ్ఛంద సంస్థలున్నాయి. మానసిక వైద్య నిపుణులూ ఉన్నారు. అయితే వారిని సంప్రదించేందుకు చాలా మంది సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఆత్మహత్య చేసుకోవాలన్న భావనతో ఉన్న వారు ఎవరి సహాయమూ తీసుకోవాలనుకోరు. సాధారణంగా కౌన్సెలింగ్‌కు రావడానికి అసలు ఇష్టపడరు. అందుకే అలాంటి వారిని గుర్తించినప్పుడు వారినెలాగైనా కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. సకాలంలో గుర్తించి కౌన్సెలింగ్, వైద్య చికిత్సల వంటివి తీసుకున్నవారు ఈ స్థితి నుంచి బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. మరి మన చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా అలాంటి స్థితిలో ఉన్నారేమో గమనిస్తే కొందరి ప్రాణాలనైనా మనం కాపాడవచ్చు.
(ఈ మధ్యే ఆత్మహత్య చేసుకున్న నా స్నేహితుడు క్రాంతికి నివాళిగా...)
Comments
మీ మిత్రునికి ఆత్మశాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను .
from vinay