Skip to main content

Posts

Showing posts from July, 2009

నా వరకు వచ్చేసరికి ఎందుకిలా?

నన్ను ప్రేమించేవారు, ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు. నా కోసం ఏమైనా చేయగలిగిన వారు కూడా ఉన్నారు. కానీ వారంతా ఇప్పుడు నా కోసం ఏమీ చేయలేకపోతున్నారు. నేనిప్పుడు పిచ్చిదానిలా చదువుతున్నాను. ఇంతకముందు కూడా నాకు వీలు దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివేదాన్ని. ఇప్పుడంతా నాకు వీలే. వారానికి ఒక పుస్తకం చదవడం పూర్తి చేస్తున్నాను. జీవితంలో లోతుపాతులను తెలుసుకోవాలంటే నాకు ఎప్పుడూ ఆసక్తే. ఇప్పుడు నేను విలాసంగా, ఆనందంగానే ఉన్నాను. కానీ ఏదో తెలియని బాధ. నిజం చెప్పాలంటే క్యాన్సర్‌ నా హృదయాన్ని తొలచివేస్తోంది. నాకు ఎనిమిది కంటే ఎక్కువ కెమో చికిత్సలు చేయాలి. 35 రకాల రేడియేషన్‌ సెషన్లు. 2010 జనవరి వరకు ఇలాగే ట్రీట్‌మెంట్‌. అదొక ప్లాన్‌. నేనూ చేయగలను. కానీ ఎందుకు చేయాలి? నా పాత జీవితం నాకు తిరిగి కావాలి. భవిష్యత్తును తలచుకొని, గతాన్ని గుర్తుచేసుకుని నరకం అనుభవిస్తున్నాను. ఇది వసంతం. ఒక మొక్కని కూడా నాటలేని స్థితిలో నేను ఉన్నాను. గతంలో ఎన్ని మొక్కలు నాటేదాన్ని. గతంలో ఎందరో పేషెంట్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చాను. ధైర్యం చెప్పాను. నా వరకు వచ్చేసరికి ఎందుకు ఇలా? దేవుడి దయ వల్ల నాకు నయం అయ్యి, మళ్లీ మంచి రోజులు వస్తే....