మా ఫ్రెండ్స్ కొందరు యంగ్ ఇండియా యూత్ అసోసియేషన్‌గా ఏర్పడి కొత్తపేటలోని హుడా కాంప్లెక్స్ రామాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్‌కి నూనూ వెళ్లాను. అక్కడ ఏర్పాటు చేసిన ఒక కౌంటర్ నన్ను ఎందుకో ఆకట్టుకుంది. నలుగురు అంధ విద్యార్థులు అగరుబత్తీలు అమ్ముతున్నారు. వాళ్లని ఆరా తీస్తే అవి వాళ్లు చేసినవే అని తెలిసి ఆశ్చర్యపోయాను. వాళ్ల వెనకాల వికలాంగుల కళ్యాణవేదిక అని ఒక బ్యానర్ కట్టి ఉంది. దాన్ని నిర్వహించేదెవరన్నది తెలుసుకోవాలనిపించింది. అక్కడ మొదలైంది ఈ కథ. వికలాంగుల కళ్యాణ వేదిక నిర్వహించేంది సుభాష్ గుప్తా. ఆయన కూడా అంధుడే. సమయానికి అక్కడే ఉన్నారు. నేను తర్వాత మాట్లాడతానని ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడి నుంచి వచ్చేశాను. ఒక వారం రోజుల తర్వాత ఫోన్ చేశాను. నా వాయిస్ వినగానే ఆయన గుర్తుపట్టారు. కళ్యాణ వేదిక కింద పెళ్లి చేసుకున్న జంటలందరినీ కలవాలనుందని చెప్పాను. ఎందుకని అంటే చెప్పడానికి నా దగ్గర మాత్రం అప్పుడు సమాధానం లేదు. "వాళ్లందరు ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఎవరి జీవితం వారు అనుభవిస్తున్నారు. అందరినీ కలవడం సాధ్యం కాదు గానీ కొందరిని కలిపించే ప్రయత్నం చేస్తానని'' చెప్పా...