అతని కళ్ళు ఆమె.. ఆమె కాళ్ళు అతను

By | June 28, 2010 5 comments
మా ఫ్రెండ్స్‌ కొందరు యంగ్‌ ఇండియా యూత్‌ అసోసియేషన్‌గా ఏర్పడి కొత్తపేటలోని హుడా కాంప్లెక్స్‌ రామాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్‌కి నూనూ వెళ్లాను. అక్కడ ఏర్పాటు చేసిన ఒక కౌంటర్‌ నన్ను ఎందుకో ఆకట్టుకుంది. నలుగురు అంధ విద్యార్థులు అగరుబత్తీలు అమ్ముతున్నారు. వాళ్లని ఆరా తీస్తే అవి వాళ్లు చేసినవే అని తెలిసి ఆశ్చర్యపోయాను. వాళ్ల వెనకాల వికలాంగుల కళ్యాణవేదిక అని ఒక బ్యానర్‌ కట్టి ఉంది. దాన్ని నిర్వహించేదెవరన్నది తెలుసుకోవాలనిపించింది. అక్కడ మొదలైంది ఈ కథ.

వికలాంగుల కళ్యాణ వేదిక నిర్వహించేంది సుభాష్‌ గుప్తా. ఆయన కూడా అంధుడే. సమయానికి అక్కడే ఉన్నారు. నేను తర్వాత మాట్లాడతానని ఫోన్‌ నెంబర్‌ తీసుకుని అక్కడి నుంచి వచ్చేశాను. ఒక వారం రోజుల తర్వాత ఫోన్‌ చేశాను. నా వాయిస్‌ వినగానే ఆయన గుర్తుపట్టారు. కళ్యాణ వేదిక కింద పెళ్లి చేసుకున్న జంటలందరినీ కలవాలనుందని చెప్పాను. ఎందుకని అంటే చెప్పడానికి నా దగ్గర మాత్రం అప్పుడు సమాధానం లేదు. "వాళ్లందరు ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఎవరి జీవితం వారు అనుభవిస్తున్నారు. అందరినీ కలవడం సాధ్యం కాదు గానీ కొందరిని కలిపించే ప్రయత్నం చేస్తానని''

చెప్పారాయన.

కోఠీలోని ఆంధ్రాబ్యాంక్‌లో సుభాష్‌ గుప్తా గారు టెలిఫోన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తుంటారు. తర్వాత ఒకరోజు అక్కడ కలిశాను. ఫోన్‌పై ఆయన వేళ్లు కదిలే స్పీడు చూస్తే నాకు మతి పోయింది. ఇంతకీ వికలాంగుల కోసం కళ్యాణవేదిక ఎందుకు ఏర్పాటు చేయాలనిపించింది అని అడిగితే ఇలా చెప్పారు. "మాది నిజామబాద్‌ జిల్లా బోధన్‌. నేను ధనిక కుటుంబంలోనే పుట్టాను. కేవలం చూపు లేకపోవడం వల్లే అయినవాళ్ల మధ్య చిన్నచూపునకు గురయ్యాను. అక్కడ ఇమడలేనన్న ముందుచూపుతో ఇంటి నుంచి బయటికి వచ్చేశా. నా బతుకుదెరువు నేనే చూసుకుంటూ చదువుకున్నా. చిన్న చిన్న వ్యాపారాలు చేశా. చివరికి ఆంధ్రా బ్యాంక్‌లో ఉద్యోగం సంపాదించా. నాలాంటి వాళ్లు ఎంతో మంది. వాళ్లందరికి నావంతు సహాయం చేస్తుండేవాడిని. వయసొచ్చాక పెళ్లి చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డా. అలాంటి కష్టాలు ఎవరికీ రావొద్దనిపించింది. అప్పుడే నిర్ణయించుకున్నా. వికలాంగుల కోసం కళ్యాణ వేదిక ఏర్పాటు చేయాలని. అలా 2000 సంవత్సరంలో వికలాంగుల కళ్యాణ వేదిక మొదలైంది. వికలాంగుల నుంచి అప్లికేషన్లు తీసుకొని, తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే అవకాశం కల్పించా. ఆడపిల్లగా పుట్టడమే అంధత్వం, ఇక అంధురాలిగా పుడితే అది రెండో అంగవైకల్యం. అందుకే 30 మంది అంధులైన ఆడపిల్లల్ని చేరదీసి వారికి ఆశ్రయం కల్పిస్తున్నాను. అందులో ఇప్పుడు తొమ్మిది మంది ఉద్యోగాలు సంపాదించారు. వారి పెళ్లి చేయాల్సిన బాధ్యతకూడా నాపై ఉంది. అయితే గతంలో పెళ్లి చేసిన వారి బయోడేటా తీసుకుని పెట్టుకున్నాను గానీ, అంధుల ఆశ్రమాన్ని నేను ఓ ఆరు సార్లు మార్చాల్చి వచ్చింది. అలా మార్చినప్పుడు ఆ ఫైల్‌ ఎక్కడో మిస్‌ అయింది. నేను ఎలాగూ వెతకలేను కాబట్టి ఎవరితోనైనా వెతికించే ప్రయత్నం తప్పకుండా చేస్తానన్నారు.

ఓ వారం తర్వాత నేనే ఆ ఆశ్రమానికి వెళ్లాను. కర్మన్‌ఘాట్‌ దగ్గరలోని తపోవన్‌ కాలనీలో ఉంటుంది ఆ ఆశ్రమం. నేను వెళ్లేసరికి ఆయన అక్కడ లేరు. అక్కడ ఉండే అమ్మాయిలు నా పేరు చెప్పగానే గుర్తుపట్టారు. అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పలుకరించారు. వారితో కాసేపు మాట్లాడిన తర్వాత బీరువాలో ఉన్న ఫైల్స్‌ అన్నీ దుమ్ము దులుపుకుంటూ వెతికాను. సాయంత్రం వరకు వెతికినా దొరకలేదు. కానీ ఒక క్లూ దొరికింది. వెంకటేష్‌ అనే ఒక అంధుడు లక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. వెంకటేష్‌ వివరాలు తెలియలేదు గానీ లక్ష్మి గురించి కాస్త తెలిసింది. స్నేహపురి కాలనీలోని వికలాంగుల హాస్టల్‌లో ఆమె పెళ్లికి ముందు ఉన్నట్లు ఆమె బయోడేటాలో ఉంది. ఆ చిరునామాని బట్టి నేను స్నేహపురి కాలనీలో ఆ హాస్టల్‌కి వెళ్లాను. కానీ ఆ హాస్టల్‌ చాలా సంవత్సరాల క్రితమే తీసేశారని ఒక్కడో పెద్దాయని చెప్పారు. ఇక వారి చిరునామా దొరికే అవకాశం లేదని చాలా బాధేసింది. ఎందుకు అంతలా అడుగుతున్నానే తెలుసుకోవాలనుకున్నాడు ఆ పెద్దాయన. ఆయనకు విషయం మొదటినుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఆ పెద్దాయన లక్ష్మి తనకు తెలుసని, ఆమె కొత్తపేటలోని పాత రంగారెడ్డి కోర్టు ఆవరణలో ఎస్టీడీ బూత్‌లో పనిచేసేదని చెప్పాడు. నేను వెంటనే అక్కడికి వెళ్లాను. ఇప్పుడు అక్కడ బూత్‌ ఉండదని ఆ 'పాత'లో గ్రహించలేకపోయాను. కానీ ఆ పాత కోర్టు దగ్గర ఒక చెప్పులు కుట్టే ఆయన్ని అడిగాను. ఆయన్ని చూస్తే ఎన్నో ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నట్లు అనిపించింది. అందుకే అడిగాను. ఆయనతో మాట్లాడాక నా ప్రాణం లేచివచ్చినట్లనిపించిది. నేను వెతికేవారు కచ్చితంగా దొరుకుతారన్న నమ్మకం కుదిరింది. లక్ష్మి ఓ రెండు మూడు సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చిందని, పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నానని, చర్లపల్లి జైలుకు వెళ్లే దారిలో ఎస్టీడీ బూత్‌ పెట్టుకున్నట్లు చెప్పిందని చెప్పాడు.

అదే రోజు నేను చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు బయలుదేరాను. జైలు రాకముందు ఓ చౌరస్తాలో వెంకటేష్‌, లక్ష్మి చిరునామా కోసం ఓ పెద్దాయనని అడిగా. "ఫోన్‌ డబ్బ నడుపుతడు గదా. మొగుడు పెళ్లాలు ఇద్దరు ఇకలాంగులే. మూడు గిళ్లల బండి మీద ఆమె కూసుంటే ఆయిన నెడుతుంటడు. ఒకరు లేంది ఇంకోరు రోడ్డు దాటలేరు. ఆల్లే కదా. ఇంగో గిట్ల బోయి కుడిచెయి రోకు తిరుగు ఆడ డబ్బ కనబడ్తది.'' అని చెప్పాడు. ఆయన చెప్పిన ఆ నాలుగు మాటల్లోనే వారి మధ్య అనురాగం అర్థమైంది. వారిద్దరు వేరు కాదు... ఒకటేనని.

నేను వారి దగ్గరికి వెళ్లి మీరెలా ఉన్నారో చూసిరమ్మని సుభాష్‌ గుప్తాగారు పంపించారని చెప్పాను. వారి ఆనందానికి అవధులు లేవు. తర్వాత పెళ్లికి ముందు ఇద్దరి జీవితాల గురించి అడిగి తెలుసుకున్నాను. బేతాల యాదమ్మ, సత్తెమ్మలకు ఒక్కగానొక్క కొడుకు వెంకటేష్‌. పుట్టుకతోనే అంధుడు. వెంకటేష్‌ని చూసి ఆ తల్లిదండ్రులు ఏడ్వని రోజు లేదు. యాదయ్య కూలీ పని చేసేవాడు. పైసాపైసా కూడబెట్టి వెంకటేష్‌కి బాగుచేయించాలనుకున్నాడు. వెంకటేష్‌ పెద్దమ్మ కొడుకు పాండు వెంకటేష్‌ బాగోగులు చూసుకుంటుండేవాడు. వెంకటేష్‌ని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో చూపించారు. కానీ ఫలితం లేకపోయింది. డాక్టర్లు చూపురాదన్నారు. దాంతో కన్నవారి ఆశలు అడిఆశలే అయ్యాయి. ఇక వెంకటేష్‌ జీవితం అంతే అనుకున్నారు. కానీ వెంకటేష్‌ మాత్రం నిరుత్సాహ పడలేదు. కవాడిగూడ రామానంద సెంటర్‌లో చేరి ఒకేషనల్‌ కోర్సు చేశాడు. మీల్స్‌ ప్లేట్ల తయారీలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత చిన్న వ్యాపారం మొదలెట్టాడు.

లక్ష్మిది ఇంకో కథ. ఆమె అసలు పేరు భాగ్య. నల్గొండ జిల్లా గుజ్జకోతులారం ఆమెది. పుట్టుకతోనే వికలాంగురాలు. ఆమె పుట్టిన కొంత కాలానికే తండ్రి చనిపోయాడు. ముగ్గురు అన్నయ్యలు ఉన్నా లక్ష్మి గురించి పట్టించుకోలేదు. ఆ ఇంట్లో ఉండలేక పదహారవ ఏట అన్నయ్య స్నేహితుల సహాయంతో హైదరాబాద్‌ వచ్చింది. స్నేహపురి కాలనీలోని వికలాంగుల హాస్టల్‌లో ఉంటూ కొత్తపేటలోని పాత కోర్టు దగ్గర ఎస్టీడీ బూత్‌ని ప్రారంభించింది. ఇంట్లో వారిని కోల్పోయానన్న బాధ ఉన్నా దిగమింగింది. అన్నలు పట్టించుకోవడం లేదని ఆవేదన ఉన్నా.. అన్న మనోడు.. వదిన కాదుగా అని సర్దిచెప్పుకుంది. అలా ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్మతో మాట్లాడాలని చాలాసార్లు అనిపించేది. ఇంట్లో మిగిలినవారెవ్వరూ లేనప్పుడు అమ్మకు ఫోన్‌ చేసి మాట్లాడేది.
అయితే వీరిద్దరు ఎలా కలుసుకున్నారో తెలుసా? వెంకటేష్‌ అన్నయ్య పాండుకు సుభాష్‌ గుప్త పరిచయం. గుప్త వికలాంగుల కళ్యాణ వేదిక ఏర్పాటు చేశాడని తెలిసి వెంకటేష్‌తో దరఖాస్తు చేయించాడు పాండు. అప్పటి వరకు మేనబావపై ఆశలు పెట్టుకున్న లక్ష్మి ఆయనకు పెళ్లి కావడంతో ఆ ఆలోచన మానుకుంది. మేనరికం చేసుకోవద్దని తనకు తాను రాజీ పడింది. తనతో పాటు హాస్టల్‌లో ఉంటున్న స్నేహితురాలు వికలాంగుల కళ్యాణ వేదికకు తీసుకెళ్లింది. సుభాష్‌ గుప్తా వెంకటేష్‌ గురించి చెప్పాడు. ఇద్దరూ ఇష్టపడడంతో త్వరలో పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. "నేను వికలాంగురాలిని కదా. నన్నేలా చేసుకుంటావ్‌'' అని మొదటిసారి కలిసినప్పుడు లక్ష్మి వెంకటేష్‌ని అడిగిందట. "నాకు చూపే లేదు. నువ్వు ఎలా ఉన్నావో నాకెలా తెలుస్తుంది. అయినా నిన్ను నడిపించడానికి నాకు కాళ్లున్నాయి. నాకు చూపించటానికి నీకు కళ్లున్నాయి. ఇది చాలదా మనం పెళ్లి చేసుకోవడానికి?'' అని చెప్పాడు వెంకటేష్‌. ఆ మాటలే ఆమెకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి.


2004లో చైతన్య పురిలోని పద్మావతి కళ్యాణ మండపంలో లక్ష్మి, వెంకటేష్‌ల పెళ్లి బాజాలు మోగాయి. ఆ పెళ్లి సమయంలోనే భాగ్య పేరును లక్ష్మిగా మార్చాడు సుభాష్‌ గుప్త. పెళ్లాయ్యాక చర్లపల్లిలోనే కాపురం పెట్టారు. అప్పటికి వరకు ఇద్దరు దాచుకున్న డబ్బుతో ఒక ఎస్టీడీ బూత్‌ను పెట్టుకున్నారు. అప్పటికే వెంకటేష్‌ నాన్న పక్షవాతంతో చనిపోయాడు. ఆయన సంపాదించిన ఒక గుడిసె మాత్రం మిగిలింది. "నా కొడుకు జీవితం ఇక ఇంతే అనుకున్న. పెద్దమనసుతో నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు. నువ్వు లక్ష్మివి కాదు. మా ఇంటి మహలక్ష్మివి'' అని వెంకటేష్‌ తల్లి అన్నమాటలు లక్ష్మి ఇప్పటికీ మర్చిపోలేదు. పెళ్లయ్యాక వెంకటేష్‌కు తన కళ్లతో లోకం చూపించింది లక్ష్మి. "ఇనకి ఎమీ తెల్వకపోతుండే. పెళ్లయినంక నేనే తిప్పిన. ఇప్పుడు సికింద్రబాద్‌ దాక ఒక్కడే పోయి వస్తడు'' అని ఆనందంతో చెప్తుంది లక్ష్మి. ఇద్దరు ఉదయాన్నే లేచి చకచకా ఇంటి పనులు చేసుకుని మూడు చక్రాల బండిలో లక్ష్మి కూర్చుంటే, వెంకటేష్‌ వెనకాల పట్టుకుని బయలుదేరతారు. దారిలో కనిపించిన వాటి గురించి చెబుతూ, తెలిసినవారిని పలుకరించుకుంటూ వెళతారు. తొమ్మిదింటిగల్లా బూత్‌కు చేరుకుంటారు. సాయంత్రం 7 గంటలకు తిరిగి ఇంటికి. ఇదీ వారి జీవితం. "నిజంగా సుభాష్‌ గారికి రుణపడి ఉన్నాం. పోయిన నెలలో మా డబ్బాలో దొంగలు పడి అన్నీ దోచుకుపోయారు. సహాయం కోసం సుభాష్‌ గారిని కలవాలనుకుంటున్నట్లు చెప్పారు.

వికలాంగుల కోసం ఓ కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి వారి జీవితంలో వెలుగులు నింపుతున్నారు సుభాష్‌ గుప్త. ఆయన నాకు స్నేహితుడు కాదు ఆత్మబంధువు. అన్నీ ఉన్నవారి మధ్యే అనుబంధం కొరవడుతున్న ఈ రోజుల్లో అంగవైకల్యం ఉన్నవారి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది అనడానికి ఉదాహరణ లక్ష్మి, వెంకటేష్‌. అతనికి కళ్లు లేవు.. ఆమెకు కాళ్లు లేవు... అయితేనేం లక్ష్మి కళ్లతో లోకం చూస్తున్నాడు వెంకటేష్‌. ఆయన చేయి పట్టుకుని జీవనపయనం సాగిస్తోంది లక్ష్మి. వాళ్ల అనురాగాన్ని చూస్తే అనుబంధం ముందు అంగవైకల్యం ఓడిపోయినట్లనిపిస్తుంటుంది.

(ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయమని నేను అడగడం లేదు. వాళ్ల అనుబంధాన్ని అభినందిస్తూ ఒకమాట, వాళ్ల బాధల్ని ఓదారుస్తూ ఒక మాట.. రెండు మాటలు కేవలం రెండు మాటలు అప్పు ఇవ్వండి. వెంకటేష్‌ ఫోన్‌ నెంబర్‌ : 9297352280)

5 comments:

తిక్క తింగరోడు said...

##వాళ్ల అనురాగాన్ని చూస్తే అనుబంధం ముందు అంగవైకల్యం ఓడిపోయినట్లనిపిస్తుంటుంది.##

సార్! బాగా చెప్పినారు. వాళ్ళు నిజంగా అభినందనీయులు. వారిగురించి వ్రాసిన మీకు థాంక్స్. మంచి టపా.

Anonymous said...

Hello sir really nice. Anni avayavalu bagundi sampradayam ga pellillu chesukonnavale okarinokaru arthamchesukokunda kottukontu peddavalaki manasanti lekunda chestunnaru. Ituvanti aadarsaprayamaina jantalni chusi aina vaalalo marpu vaste baguntundi.

కొత్త పాళీ said...

మీటపా టైటిలు వెరైటీగా ఉందని తెరిచాను. అద్భుతమైన అనుభవాన్ని మూటగట్టి ఇచ్చారు. అభినందనలు.

Sai Praveen said...

ఇందులో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

Sirisha said...

very impressive blog...manchi info pettaru