Skip to main content

గాలివానలో... వాననీటిలో.. బైకు ప్రయాణం

.27.8.2010 బుధవారం సాయంత్రం 'నాని వేర్‌ ఆర్‌ యు' అని 6.55కి మా ఆవిడ ఎస్‌ఎంఎస్‌.
'ఆఫీస్‌లోనే ఉన్నా. వర్షం తగ్గుతుందేమోనని వెయిట్‌ చేస్తున్నా' నా రిప్లయి.
'మామూలుగానే పడుతోంది కదా వచ్చేయ్‌' ఛాటింగ్‌ మొదలెట్టింది.
'మామూలుగానా? బంపర్‌ ఆఫర్‌గా కురుస్తోందిక్కడ'
'ఏం మొలకెత్తవుగానీ కాస్త తగ్గగానే వచ్చెయ్‌.. బై' అంది.
తనకు హైదరాబాద్‌ వాతావరణం ఇంకా బాగా తెలియదు. వానొస్తే ఇక్కడి రోడ్లు ఎలా ఉంటాయో అస్సలు తెలియదు. నేను తొమ్మిదింటి వరకు ఇంటికి వెళ్లకపోతే భయం 'ఎప్పుడు కరెంటు పోతుందో.. ఈయనెక్కడున్నాడో?' అని ఒకటే కంగారు. అందుకే బాంబులు పేలినా, పిడుగులు పడినా తొమ్మిదింటి వరకు తప్పక వస్తానని ఓ (అ)శుభ ముహుర్తాన ప్రామిస్‌ చేశా(తప్పలేదు).

వర్షం తగ్గేలా లేదు. ఇంకో అర్థగంట వెయిట్‌ చేసినా తడవకుండా వెళతామన్న గ్యారంటీ ఉందా? లేదనే చెప్పారు కొలీగ్స్‌. కాస్త తగ్గు ముఖం పట్టగానే బైక్‌ తీసి తారు రోడ్డు మీద ప్రవహిస్తున్న ఏటికి ఎదురీదుతూ బయలుదేరాం నేను, నా ఫ్రెండ్‌ మహి. పావుకిలోమీటరు వెళ్లామో లేదో జడివాన కాస్తా జోరువానగా మారింది. మేఘాలకు పూనకం వచ్చినట్లు కుంభవృష్టి కురిపిస్తున్నాయి. వర్షంలో తడవడం.. వర్షం సినిమాలో త్రిషని చూడడం అందరికీ ఇష్టంగానే ఉంటుంది. కానీ వానలో బైక్‌ మీద వెళ్లేటపుడు మాత్రం అన్ని ఇష్టాలూ పోయి కష్టమొక్కటే మిగులుతుంది. అందుకే బైక్‌ రోడ్డు పక్కన పెట్టి ఎటిఎం ముందు తల.. కాదు ఒళ్లు దాచుకున్నాం. అప్పటికే మా ఒంట్లో తడవని పార్టంటూ లేదు. సెల్‌ఫోన్‌లు జేబులోనే పేలతాయేమోనని బ్యాటరీ తీసి ఆరబెట్టాం. అరగంట తర్వాత వర్షం కాస్త తగ్గింది. 'తొమ్మిది' గుర్తొచ్చి ఇప్పుడు వెళితేగానీ అప్పటికి చేరుకోలేమని సెల్‌  ఆన్‌ చేశాను. ఇంట్లో కరెంటు పోయిందని అప్పటికే ఓ మెసేజ్‌ వచ్చి ఇన్‌బాక్స్‌లో కూర్చుని ఉంది. ఇక ఇక్కడే కూర్చుంటే లాభం లేదని బయలుదేరాం.

వర్షం వాయిదా పద్ధతుల్లో కాసేపు మెల్లగా, కాసేపు హోరుగా కురుస్తోంది. మధ్యలో ఉరుములు, మెరుపులు బై ఒన్‌ గెట్‌ ఒన్‌ ఫ్రీ ఆఫర్‌లా భయపెడుతున్నాయి. రోడ్డు మీద నిలిచిన నీళ్లలోంచి వెళ్లాలంటే నోరు తెరిచిన మ్యాన్‌హోళ్లు ఎక్కడ వాటేసుకుంటాయోనని వణుకు. 'ఇంట్లో ఏంకాదు టెన్షన్‌ పడకు' అని మహి నాకు 'కంగారు పడకు మెల్లగానే నడుపుతాను' అని నేను మహికి సర్దిచెప్పుకుంటూ ఓదార్పు యాత్ర సాగిస్తున్నాం. మెయిన్‌ రోడ్డు మీదుగా వెళ్తే ట్రాఫిక్‌ ఉంటుందని గల్లీలోంచి వెళ్తూ 'గాలి వానలో.. వాన నీటిలో.. బైకు ప్రయాణం' అని పాడుతున్నాం... అంటే మనసులో. ఆ వానలో నోరెలా తెరుస్తాం మరి. తడిసిన రిమ్ముల వల్ల బ్రేక్‌ వేస్తే బండి ఆగడం లేదు. ముందు చక్రం గుంటలో పడి బండి ఆగింది. అప్పుడే గాడ్స్‌ బోనస్‌ గిఫ్ట్‌లా హెడ్‌లైట్‌ ఫెయిల్‌ అయింది. అంతా చీకటి. అక్కడే బైక్‌ పెట్టేసి బస్‌కి వెళ్దామంటే ఇంట్లో పోయిన కరెంటు సంగతి గుర్తుకువచ్చింది.

కార్లలో వెళ్లే వారిని చూసి కుళ్లుకుంటూ.. ఆటోలో వెళ్లేవారిపై అసూయ పడుతూ... బైక్‌పై బోయ్‌ఫ్రెండ్‌ని వాటేసుకున్న అమ్మాయిని కామెంట్‌ చేస్తూ... (ఆ వెచ్చదనం మాకు దక్కలేదని) వెళ్తున్నాం. వచ్చే వానాకాలానికైనా ఒక పడవ కొనాలని తడిసిన కళ్లతో కల కంటుండగా 'అన్నా! ఇక్కడాపే' అన్న మహి మాటలతో బ్రేక్‌వేశాను. కాని.. బైక్‌ ఓ ఫర్లాంగు తర్వాత గానీ ఆగలేదు. 'ఈ చెరువులో కాదు.. ఆ ఒడ్డున ఆపు' అంటే నవ్వుకుంటూ మహికి బై చెప్పి బయలుదేరాను. ఇంటికి చేరాక గానీ తెలియలేదు మా ఆవిడ గీసిన 'తొమ్మిది రేఖ' ఎప్పుడో దాటేశానని. ఆవిడ మొహం చూడాలంటే గుండెలో పిడుగు పడినట్లయింది. కాని వర్షంలో తడిసిన నన్ను చూసి.. ఆమె కళ్లల్లో కుంభవృష్టి.

Comments

sivaprasad said…
వర్షం సినిమాలో త్రిషని చూడడం అందరికీ ఇష్టంగానే ఉంటుంది. కానీ వానలో బైక్‌ మీద వెళ్లేటపుడు మాత్రం అన్ని ఇష్టాలూ పోయి కష్టమొక్కటే మిగులుతుంది