అపరిచితుడు - నగేష్ బీరెడ్డి మ నుషుల్ని చూడండి! ఎవరి బిజీలో వారున్నారు. సంస్కృతి సంప్రదాయాల్లో సహజత్వాన్ని కోల్పోయి మానవ యంత్రాలుగా తయారవుతున్నారు. కృత్రిమంగా బతికేస్తున్నారు. నాలుగు రాళ్లు సంపాదించేందుకు నానా యాతన పడుతున్నారు. పక్కింటి వారెవరో పట్టించుకునేంత సమయం, తీరిక కూడా దొరకడం లేదు. అన్నట్లు.. నా పేరు శివ. పల్లెటూరులో పుట్టాను. కష్టపడి చదివాను. హైదరాబాద్ లో మంచి ఉద్యోగం సంపాదించాను. కొత్త పేట హుడా కాంప్లెక్స్ లో ఒక ఫ్లాట్ కూడా కొన్నాను. నా భార్య ప్రియా తప్ప నాకంటూ ఎవరూ లేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఒప్పుకోక పోతే పెద్దల్ని కాదని వచ్చేశాం. బాగానే బతుకుతున్నాం. బాగా బతకడం అంటే బాగా సంపాదించడం కాదు. నలుగురితో కలవడం.. నవ్వుతూ బతకడం అని నేననుకుంటాను. కానీ మా అపార్ట్ మెంట్ ఇందుకు భిన్నం. ఒకరికొకరు కలుసుకుని మాట్లాడుకునేంత సమయం కూడా చాలామందికి ఉండదు. ఒక్క మా అపార్ట్ మెంట్ ఏంటి.. హైదరాబాద్ లో ఇలాంటి అపార్ట్ మెంట్స్ చాలానే ఉండొచ్చు. అంతెందుకు నెల రోజుల క్రితం మా పక్కింట్లోకి ఓ కొత్త జంట అద్దెకు దిగింది. అతని పేరు వినోద్. ఓ విచిత్రమైన వ్యక్తి. ఎవ్వరితోనూ మాట్లాడడు. పొద్దుననగ...