వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అవార్డు నా కథ

By | July 07, 2014 Leave a Comment

అపరిచితుడు

- నగేష్ బీరెడ్డి
నుషుల్ని చూడండి! ఎవరి బిజీలో వారున్నారు. సంస్కృతి సంప్రదాయాల్లో సహజత్వాన్ని కోల్పోయి మానవ యంత్రాలుగా తయారవుతున్నారు. కృత్రిమంగా బతికేస్తున్నారు.
నాలుగు రాళ్లు సంపాదించేందుకు నానా యాతన పడుతున్నారు. పక్కింటి వారెవరో పట్టించుకునేంత సమయం, తీరిక కూడా దొరకడం లేదు.
అన్నట్లు.. నా పేరు శివ. పల్లెటూరులో పుట్టాను. కష్టపడి చదివాను. హైదరాబాద్ లో మంచి ఉద్యోగం సంపాదించాను. కొత్త పేట హుడా కాంప్లెక్స్ లో ఒక ఫ్లాట్ కూడా కొన్నాను.
నా భార్య ప్రియా తప్ప నాకంటూ ఎవరూ లేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఒప్పుకోక పోతే పెద్దల్ని కాదని వచ్చేశాం. బాగానే బతుకుతున్నాం.
బాగా బతకడం అంటే బాగా సంపాదించడం కాదు. నలుగురితో కలవడం.. నవ్వుతూ బతకడం అని నేననుకుంటాను.
కానీ మా అపార్ట్ మెంట్ ఇందుకు భిన్నం. ఒకరికొకరు కలుసుకుని మాట్లాడుకునేంత సమయం కూడా చాలామందికి ఉండదు. ఒక్క మా అపార్ట్ మెంట్ ఏంటి.. హైదరాబాద్ లో ఇలాంటి అపార్ట్ మెంట్స్ చాలానే ఉండొచ్చు.
అంతెందుకు నెల రోజుల క్రితం మా పక్కింట్లోకి ఓ కొత్త జంట అద్దెకు దిగింది. అతని పేరు వినోద్. ఓ విచిత్రమైన వ్యక్తి. ఎవ్వరితోనూ మాట్లాడడు. పొద్దుననగా వెళ్తాడు. ఏ అర్థరాత్రోగానీ ఇంటికి తిరిగిరాడు. గడ్డం గీసుకునేంత టైమ్ కూడా ఉండదు కాబోలు.. ఎప్పుడూ మాసిన గడ్డంతోనే కనిపిస్తాడు. వాళ్లది కూడా లవ్ మ్యారేజేనట. వాళ్లింటికీ ఎప్పుడూ ఎవరూ వచ్చినట్లు కనిపించరు. నా భార్య వల్ల ఈ విషయాలన్నీ నాకు తెలిశాయి.
వినోద్ ఆఫీస్ కి వెళ్లాక ఆయన భార్య అనూకి కాలక్షేపం మా ఆవిడే.
వినోద్ గురించి.. వాళ్ల ప్రేమ గురించి, తన కోసం వినోద్ సమయం కేటాయించక పోవడం గురించి.. అనూ, ప్రియాకి చెబుతూ ఉంటుంది.
ఈ మధ్య వినోద్, అనూ రోజూ గొడవ పడుతున్నారట. ఇల్లు, పెళ్లాన్ని పట్టించుకోకుండా వినోద్ ఆఫీసులోనే ఎక్కువగా ఉండడాన్ని అనూ తట్టుకోలేకపోతోంది. ఆ ఇల్లు ఒక జైలులా.. ఆమె ఒక ఖైదీలా భావిస్తోందట. మా ప్రియా తానో పెద్ద సైకాలజిస్టు అయినట్లు అనూకి అప్పుడప్పుడూ కౌన్సెలింగ్ కూడా ఇస్తూ ఉంటుంది.
---
ఒక రోజు..
నేనూ, ప్రియా బాల్కనీలో కూర్చుని వెన్నెలని చూస్తూ మాట్లాడుకుంటున్నాం.
వినోద్ వాళ్ల ఇంటి కాలింగ్ బెల్ మోగింది. మా డోర్లు అన్నీ తెరచి ఉండడం వల్ల అది మాకు స్పష్టంగా వినిపించింది. అనూ డోర్ తీసింది.
‘‘రా.. రా.. ఇది నీకూ నాకు కొత్తేం కాదుగా. ఎన్నిసార్లు అడిగాను. ఒక్కరోజైనా త్వరగా వచ్చావా? ఇంట్లో పెళ్లాం గుర్తుండదు. ఎప్పుడు చూడు.. ఆఫీస్.. ఆఫీస్.. నా దరిద్రం.. ’’ అని తలుపు తీస్తూనే అనూ అరవడం మొదలెట్టింది.
‘‘ఎందుకలా అరుస్తున్నావ్? నేనేమైనా తాగొచ్చానా? రోడ్ల మీద తిరిగొచ్చానా?’’ వినోద్ మెల్లిగానే అన్నాడు.
‘‘ఆ.. అవును మరి.. అలాంటోడికి మరి పెళ్లి, పెళ్లాం.. ఎందుకో? ఆఫీసులోనే తగలడొచ్చుగా?’’
‘‘అనూ! నేను మనకోసమే కదా కష్టపడుతున్నాను. సాయంత్రం కాగానే ఇంటికి రావడం నాకు కుదరదు. నా పని అలాంటిది. అర్థం చేసుకో’’
‘‘ఆ.. అవును. నేనే పిచ్చిదాన్ని. నేనే అర్థం చేసుకోవాలి. నీకోసం అమ్మని, నాన్నని అందర్నీ వదిలి వచ్చేశా చూడు. అందుకే.. నేనే అర్థం చేసుకోవాలి? ఈ ఇల్లు నాకో జైలు అయిపోయింది’’ - అనూ గట్టిగా అరిచింది.
‘‘ఏయ్.. ఎందుకలా అరుస్తున్నావ్? చుట్టుపక్కల వారందరికీ వినిపించాలా?’’ - వినోద్ కూడా గట్టిగా అరిచాడు.
‘‘ఆ.. విననీయ్. వాళ్లు వింటే నీకేంటి? వాళ్లలా నువ్వెప్పుడైనా త్వరగా ఇంటికొస్తున్నావా? ఒక్క విషయం చెప్పు.. నాతో ఓ గంట స్పెండ్ చేసి ఎన్నిరోజులైంది?’’
‘‘అరే అనూ! వదిలెయ్. టైమే కదా. రేపు త్వరగా వస్తాలే’’
‘‘ఆ వచ్చినట్లే.. చూద్దాం’’
ఆ రాత్రికి గొడవ సద్దుమణిగింది.
---
నేను చూస్తూనే ఉన్నాను. మర్నాడు వినోద్ ఐదు గంటలకే వచ్చాడు.
కాలింగ్ బెల్ కొట్టాడు. అనూ ఇంట్లో లేదు.
ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయలేదు. మూడు సార్లు ప్రయత్నించాడు. అనూ ఇంకా ఫోన్ లిఫ్ట్ చెయ్యనట్లుంది.
లిఫ్ట్ లో కిందికి దిగాడు. నేను మెట్ల మీది నుంచి కిందికి దిగాను.
నా బైక్ పై వినోద్ కారుని అనుసరించాను.
వినోద్ సరూర్ నగర్ కట్ట మీద కారు ఆపాడు. దిగి.. రెయిలింగ్ పట్టుకున్నాడు. కాసేపు చెరువులోకి చూశాడు. అప్పుడప్పుడూ ఫోన్ వైపూ చూస్తూనే ఉన్నాడు.
నేను కాస్త దూరంలో బైక్ ఆపి.. సిమెంట్ బెంచీ మీద కూర్చుని గమనిస్తున్నాను.
కాల్ కనెక్ట్ అయినట్లుంది.. ‘‘రేణు! అనూ వచ్చిందా? ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యడం లేదు. నీకు ఏమైనా తెలుసా? నువ్వొకసారి ట్రై చేసి చూడు’’ అని ఫోన్ పెట్టేశాడు.
కారు దగ్గరకొచ్చి ఆనుకున్నాడు. శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు.
నేను దగ్గరికి వెళ్లి ‘‘హాయ్’’ అని పలకరించాను. కానీ అతడు స్పందించలేదు.
ఏదో ఒకటి మాట్లాడిద్దామని ‘‘ఫోటో తీస్తావా?’’ అని అడిగాను. కోపంగా చూశాడే తప్ప మాట్లాడలేదు.
‘‘సీనరీ బావుంది. కాస్త ఫోటో తియ్యరాదు’’ - బతిమాలాను.
ఏదో చిరాగ్గా వచ్చి తీశాడు.
‘‘థ్యాంక్స్’’ చెప్పినా పెదవి విప్పలేదు.
చూసి చూసి నేనే.. ‘‘సార్! ఒకటి చెప్తాను. ఏమీ అనుకోవద్దు. సూర్యోదయాలు సూర్యాస్తమయాలు భలే అందంగా ఉంటాయి కదా. ఎవరు ఫోటో తీసినా బాగా వస్తాయి. కానీ మీరు తీస్తే మాత్రం ఏంటో ఇలా వచ్చింది?’’ అని హేళన చేశాను.
అసలే మంట మీద ఉంటే నేను పెట్రోలు చల్లాను.
వినోద్ కళ్లల్లో ఆ ఒళ్లు మంట కనిపించింది.
‘‘ఓకే.. కే.. జస్ట్ స్కిడ్డింగ్. ఇలా అంటేనన్నా మాట్లాడతారేమోనని అన్నాను. సిగరెట్ అలవాటుందా?‘‘ అని జేబులోంచి ప్యాకెట్ తీశాను.
లేదన్నట్లు తల ఊపాడు. మళ్లీ ఫోన్ చేతిలోకి తీసుకుని కాల్ చేస్తున్నాడు.
నేను సిగరెట్ అంటించాను. వినోద్ టెన్షన్ పడుతూనే ఉన్నాడు.
తన పక్కగా వెళ్లి నిల్చున్నాను. దమ్ము పీల్చి ఊదుతూ.. ‘‘సరూర్ నగర్.. మినీ ట్యాంక్ బండ్.. సన్ సెట్.. ఎక్సలెంట్ క్లయిమెట్... బావుంది బాస్ సీనరీ. హైదరాబాద్ లో ఇలాంటి స్పాట్లు చాలానే ఉన్నాయి కదా?’’
తనేం అనలేదు. ఎవడ్రా వీడు.. నా గోల నాకుంటే వీడెవడు నాకు తగులుకున్నాడని అనుకుంటూ ఉండొచ్చు.
మళ్లీ ఫోన్ తీశాడు ‘’రేణూ.. అనూ ఏమైనా ఫోన్ లిప్ట్ చేసిందా?.... లేదు.. లేదు.. అలాంటిదేం లేదు.. నిన్న చిన్న గొడవైంది. ఈ రోజు త్వరగా వచ్చి తనతో స్పెండ్ చేస్తానని చెప్పాను... ఉదయం కూడా బాగానే మాట్లాడింది..’’- ఫోన్ పెట్టేశాడు. వినోద్ లో టెన్షన్ మరింత పెరిగిపోతోంది.
తన పక్కకు వెళ్లి కారుకు ఆనుకుని.. ‘‘బాస్! ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? ఏనీ ప్రాబ్లమ్? నేనేమైనా హెల్ప్ చేయనా?’’ అని అడిగాను.
‘‘ఏంటి సార్ మీ బాధ? ఏం కావాలి మీకసలు. నా టెన్షన్ నాకుంటే మీరొకరు. సతాహిస్తున్నారు’’ అని కోప్పడ్డాడు.
‘‘ఎందుకు సార్ కోప్పడతారు? మనసులో ఏదైనా బాధ ఉంటే.. ఎదుటి వారికి చెప్పుకుంటే కొంత తీరుతుంది? నేను అడిగితే ఫోటో తీశారుగా. మీరు నాకు హెల్ప్ చేశారు. అందుకే నేను మీకు హెల్ప్ చేస్తాను’’.
‘‘ఆ.. రా..రా నా ప్యాంటులోకి పాము దూరింది తీద్దువు గానీ..’’ చిరాగ్గా అటు వైపు తిరిగాడు.
‘‘ఓకే బాస్. ఓకే.. మీ ప్యాంటులో పాము దూరిందో లేదో నాకు తెలియదు గానీ.. మీ ఆవిడ ఇంట్లో లేదని.. అందుకే మీరు టెన్షన్ పడుతున్నారని మాత్రం నాకు తెలుసు. కరెక్టేనా?’’ అని అడిగాను.
అటు తిరిగి ఫోన్ ట్రై చేస్తున్నవాడు.. మెల్లగా ఇటు తిరిగాడు. అతని గుండె గూగుల్ సెర్చ్ అయింది. నాకెలా తెలుసు.. అని అందులో వెతుకుతున్నట్లు అతని కళ్లు కదులుతూ కనిపించాయి. కానీ నోటి నుంచే మాట రాలేదు.
‘‘ఏం సార్.. మీ ఆవిడ ఇంట్లో ఉందా.. లేదా? అయినా మీ ఆవిడ ఇంట్లో లేకపోతే మూడు సార్లే ఫోన్ ట్రై చేస్తారా? మీరేం హస్బెండ్ సార్?’’ మళ్లీ నేనే అడిగాను.
వినోద్ నుంచి సమాధానం లేదు. నా వైపు.. తన ఫోన్ వైపు రెండు మూడుసార్లు చూశాడు. ఎవరికో కాల్ చేస్తున్నాడు. ఆ కాల్ కచ్చితంగా తన భార్య అనుకే.
ఫోన్ రింగ్ అయింది.
నా జేబులో.
వైబ్రేషన్ లో ఉన్న సెల్ తీసి కార్ బోనెట్ మీద పెట్టాను.
వినోద్ మొహం మీద వెయ్యి డాలర్ల ప్రశ్న కనిపించింది. మొబైల్ చేతిలోకి తీసుకుని చూశాడు. వినోద్ కాలింగ్... అని ఆంగ్లాక్షరాలు. తన చేతుల్లోని రెండు ఫోన్ల వైపు మార్చి మార్చి చూశాడు. తర్వాత నా వైపు చూశాడు.
ఆశ్చర్యం, ఆందోళన, ఆవేదన, ఆర్తనాథంలాంటి వాటన్నింటినీ గ్రైండర్ లో వేసి మిక్స్ చేసి వినోద్ మొహాన పూసినట్లు అనిపించింది. మౌనం తప్ప అతని నోటి నుంచి పదాలకు పాస్ పోర్ట్ దొరకలేదు.
‘‘వినోద్.. వయసు 30. హుడా కాంప్లెక్స్ లో అమృతా ఎన్ క్లేవ్.. ప్లాట్ నెంబర్ 305. భార్య అనూ. వయసు 25. న్యూలీ మ్యారీడ్. లవ్ మ్యారేజ్. పొద్దున్నే 8 ఇంటికి ఆఫీస్ కెళ్తావ్. రాత్రి పది దాటితే గానీ తిరిగి రావ్. బిజీ లైఫ్. షేవింగ్ చేసుకోవడానికి కూడా టైమ్ ఉండదు. అలాంటిది.. మీ ఆవిడతో గడుపుదామని ఈ రోజు.. ఐదింటికే వచ్చావ్. కానీ మీ ఆవిడ ఇంట్లో లేదు. కరెక్టేనా బాస్?’’ - నేనే రివీల్ చేశాను.
వినోద్ గుండె పేలిపోవాల్సింది. మొహం పాలిపోయింది.
‘‘ఎవడ్రా నువ్వు? నా వైఫ్ ని ఏం చేశావ్? చెప్పు. అనూ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది. అనూ ఎక్కడ. చెప్పరా చెప్పు? అసలు మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నావ్?’’ కోపం చేతుల్లోకొచ్చి నా కాలర్ పట్టుకున్నాయి.
‘‘కూల్ వినోద్. కూల్. ఎందుకంత టెన్షన్ పడుతున్నావ్? నీ వైఫ్ సేఫ్ గానే ఉంది. నేనే కిడ్నాప్ చేశా! నీ భార్య ఫోన్ పట్టుకుని నీ దగ్గర నిలబడ్డానంటే.. నేను ఎలాంటి వాడ్నో అర్థం చేసుకో. ముఖ్యంగా నీ వైఫ్ నా దగ్గర ఉందని మర్చిపోకు..’’
‘‘ఓకే.. ఓకే.. ఇంతకీ నీకేం కావాలో చెప్పు..’’ కాలర్ వదులుతూ అడిగాడు వినోద్.
‘‘పది లక్షలు.. జస్ట్ 10 లాక్స్.. ఇచ్చి నీ వైఫ్ ని తీసుకెళ్లు. అంతకు మించి పిచ్చిగా ఇంకేం ప్లాన్ చేయకు’’
‘‘పది లక్షలా నా దగ్గర అంత డబ్బు లేదు’’
‘‘బాసూ.. ఈ పులుసు కథలు.. నాకు తెలుసు.. ఈ మధ్యే ఓ పాతిక లక్షల కాంట్రాక్ట్ మీద సంతకం చేశావని నాకు తెలుసు. టైమ్ లేదు. తర్వాత నీ ఇష్టం. ఆలోచించుకో.. డబ్బెలా తేవాలో. నన్ను ఫూల్ చేయాలని చూడకు. నీ గురించి ప్రతిదీ నాకు తెలుసు.’’ హెచ్చరించాను.
‘‘సరే.. సరే.. డబ్బు ఎలా సర్ధాలో ఆలోచిస్తాను. బట్.. ముందు నేను అనూతో మాట్లాడాలి. తను క్షేమంగా ఉందని నాకు తెలియాలి. ఆ తర్వాతే నువ్వడిగిన డబ్బు ఏర్పాటు చేస్తాను’’ అని వేడుకున్నాడు.
‘‘నాకు తెలుసు బాస్ నువ్వు డబ్బు తెస్తావని. తన కోసం నువ్వు ఏమైనా చేస్తావు. ప్రేమ వివాహం కదా. తను నీ గురించి చాలా చెప్పింది. ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది’’
‘‘అనూ.. చెప్పిందా? నీతో? తను నీకెలా తెలుసు?’’
‘‘లైట్ లేలో బాస్. మనకు ఫేస్ బుక్ లో ఎంతో మంది స్నేహితులుంటారు. కానీ ఎవర్నీ కలుసుకోం. అపార్ట్ మెంట్ లో పక్క ఫ్లాట్లో ఎవరుంటారో కూడా మనం పట్టించుకోం. ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయ్యాక.. మనిషికీ మనిషికీ మధ్య దూరం పెరిగిపోతోంది. ఇంకా అర్థం కాలేదు కదూ. కంగారు పడకు. నా పేరు శివ. మీ పక్క ఫ్లాట్లో ఉంటాను. ప్లాట్ నెంబర్ 304. ఐ యామ్ యువర్ నైబర్ సర్’’
‘‘వాట్...? ఈజ్ ఇట్ ట్రూ?’’- అని ఆశ్చర్యంతో కూడిన భయం వల్ల వచ్చిన ప్రశ్న అడిగాడు.
‘‘యస్.. ఇట్స్ ట్రూ. నమ్మశక్యంగా లేదు కదా. నేనెవరో మీకు తెలియదు. కానీ మీరు నాకు తెలుసు. మీ ఆవిడ మా ఆవిడ ఫ్రెండ్స్. మీరు ఆఫీస్ కు వెళ్లాక అనూ ఎక్కువగా మా ఇంట్లోనే ఉంటుంది. ఏదైనా మా ప్రియాతో షేర్ చేసుకుంటుంది. ఈ రోజు పొద్దున కూడా.. నిన్న మీ ఇంట్లో జరిగిన గొడవ గురించి.. చెప్పింది. మీరు తనతో టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నందుకు చాలా బాధ పడింది. నీ పని చూసి జాలి పడింది’’
‘‘ఇంతకీ అనూ ఎక్కడ. ఒకసారి మాట్లాడాలని ఉంది’’ - వినోద్ వేడుకున్నాడు.
‘‘మాట్లాడిస్తా బాస్. మాట్లాడిస్తా. అనూ, ప్రియా నా కారులోనే షాపింగ్ కి వెళ్లారు. వీకెండ్ కదా. నాకు ఆఫీస్ లేదు. ఇంట్లోనే ఉన్నాను. మీకు కీ ఇమ్మని నాకు ఇచ్చి వెళ్లింది. అప్పుడే నాకో ఆలోచన వచ్చింది. కీ మాత్రమే కాదు.. మీ మొబైల్ కూడా ఇవ్వండి.. చిన్న తమాషా చూపిస్తా అన్నాను. అనూ మొదట్లో కాస్త కంగారు పడింది. కానీ తర్వాత అర్థం చేసుకుంది. మీలో మార్పు రావాలని కోరుకుంది. మొదటి నుంచీ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నా. ఎవరితో మాట్లాడరు. సమస్యలూ అందరికీ ఉంటాయి బాస్. అవి పంచుకుంటేనే తగ్గిపోతాయి. మనిషికి మనిషే సాయం కదా. ఈ సమస్య మీదే కాదు.. అపార్ట్ మెంట్ లలో.. అద్దె ఇళ్లలో ఉంటున్న ఎంతో మందిదీ ఇదే పరిస్థితి. సిటీ లైఫ్ అలా తయారైంది. పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా తెలుసుకోలేనంత టైమ్ కూడా ఉండదా బాస్ మనకు?
‘‘మీరెవరు సార్ నన్ను క్వశ్చన్ చేయడానికి? నా పని నాది. నా బతుకేదో నేను బతుకుతున్నాను. నాకు ఇంకొకరితో పనిలేదు. నా లైఫ్, నా వైఫ్.. నా ఇష్టం. మీకేంటి ప్రాబ్లమ్?’’
‘‘అదే బాస్.. ఈ రోజుల్లో నీలాంటి మనుషులకు.. సినిమాలు షికార్లు.. షాపింగ్ మాల్స్..... ఇలాంటి లగ్జరీ లైఫ్ ఉంటుంది కానీ.. పక్కింటివారు ఎవరో.. ఏం చేస్తుంటారో తెలుసుకునేంత టైమ్ మాత్రం ఉండదు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కో, పాన్ కార్డ్ అప్లికేషన్ కో అవసరం పడినప్పుడే పక్కింటి వాడితో పని. పక్కన ఉన్నది దొంగా? దొరా? ఐఎస్ ఐ ఏజెంటా? ఏదీ పట్టించుకోకపోతే ఎలా బాస్? ఇది మిమ్మల్ని బాధ పెట్టడానికో, భయపెట్టడానికో చెప్పడం లేదు. జస్ట్ ఆలోచించమని చెబుతున్నాను అంతే. మేం కూడా మీలాగే లవ్ మ్యారెజ్ చేసుకుని ఇక్కడి వచ్చాం. మాకూ ఎవరూ లేరు. రారు కూడా. మాకు మీరు, మీకు మేం తప్ప ఇంకెవరున్నారు సార్. అందుకే వినోద్. నో యువర్ నైబర్. ఇది చెప్పడానికే ఈ గేమ్’’
‘‘ఓకే.. మీరు చెప్పింది రైట్. నేను రియలైజ్ అయ్యాను. ఇప్పుడైనా ఒక్కసారి అనూతో మాట్లాడిస్తారా?’’ అని అడిగాడు వినోద్.
‘‘ఇంకా నన్ను నమ్మడం లేదు కదా? ఇద్దరు షాపింగ్ కి వెళ్లారు. ప్రియా సెల్ కి కాల్ చేసి అనూతో మాట్లాడిస్తాను’’ అంటూ కాల్ కలిపాను..
కానీ..
అది నేను ఊహించని పరిణామం..
నా మొహంలో చకచకా రంగులు మారాయి.
చెమటలు పట్టాయి.
‘‘నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే..’’ ప్రియా మొబైల్ రింగ్ టోన్.
నా వెనకాల మోగుతోంది.
ఒక్కసారిగా అటు తిరిగితే గుండె ఆగిపోయేదేమో. అందుకే మెల్లగా తిరిగాను..
వినోద్ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నిల్చున్నాడు.
రింగ్ టోన్ శబ్ధం అతని ఎడమ చేతి దగ్గరి నుంచి వస్తోంది. అతని మొహంలో ఇంతకు ముందున్న కంగారు లేదు. ఏదో వెకిలి నవ్వు తాలూకు ఆనవాళ్లు. జేబులోంచి ఫోన్ తీసి నా బైక్ మీద పెట్టాడు.
నోకియా లుమియా 502.. రెడ్ కలర్ ఫోన్. అది ప్రియాదే.
వినోద్ నాకు దగ్గరగా వచ్చి.. నా మొహంలో మొహం పెట్టాడు. నా టీషర్టుకు పెట్టిన గాగుల్స్ తీసుకుని.. తను పెట్టుకున్నాడు. నన్ను చూస్తూ నవ్వాడు. బిగ్గరగా నవ్వాడు.
‘‘నౌ బాల్ ఈజ్ ఇన్ మై కోర్ట్. కన్ఫూజ్ అయ్యావా? ఇట్స్ మై టర్న్.. సరదాగా గేమ్ మొదలు పెట్టింది నువ్వు కాదు... నేను. సీరియస్ గా ప్లాన్ చేసింది నేను. ఈ షో ఇప్పుడు నాది’’ వినోద్ ఇంతకు ముందు నేను మాట్లాడిన తీరుని అనుకరిస్తున్నాడు. ‘‘రామ్ అండ్ ప్రియా. న్యూలీ మ్యారెడ్. ప్రేమించుకుని పారిపోయి వచ్చారు. ఎవరి సపోర్ట్ లేదు. అందుకే ప్రియాతో పరిచయం పెంచుకున్నాం. మేం గొడవ పడడం.. మీరు వినడం.. అంతా గేమ్. ఆ గొడవలతోనే ప్రియా, అనూ దగ్గరయ్యారు. నీ పాతిక లక్షల కాంట్రాక్ట్ గురించి తెలిసింది.. స్కెచ్ వేశాం. ఈ... రోజు... నాది. దిజ్ ఈజ్ మై బిగ్ డే.’’
అంతా అయోమయంగా ఉంది. నాకేం అర్థం కావడం లేదు. ప్రియా ఫోన్ వినోద్ దగ్గరికి ఎలా వచ్చింది???
అదే అడిగాను.
‘‘అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. అనూ, ప్రియా కారులో షాపింగ్ కి బయలుదేరారు. కానీ వారు వెళ్లింది షాపింగ్ కి కాదు.. ప్రియాకి మత్తు ఇచ్చి కిడ్నాప్ చేశాం. ప్రియా ఫోన్ నా చేతికి అందాకే నేను ఇంటికి వచ్చాను. 6.30కి మేం మళ్లీ కలుస్తాం. అప్పటి వరకు నిన్ను ఎంగేజ్ చేయడమే నా పని. నువ్వు ఫోన్ తీసుకుంది.. తమాషాగా గేమ్ ఆడతానన్నది.. అన్నీ నాకు తెలుసు. 6.30 వరకు నిన్ను డైవర్ట్ చేయాలి. అదే నా టార్గెట్. నౌ టైమ్ ఈజ్ 6.30.’’ అంటూ వినోద్ తన మొబైల్ కి వచ్చిన ఎస్ఎమ్ఎస్ చూపించాడు..
‘‘ప్రియా ఇన్ మై కస్టడీ. వీ రీచ్డ్ అవర్ ప్లేస్ సేమ్ లీ.. కమ్ సూన్.. ’’
అనూ పంపిన మెసేజ్ అది.
‘‘ఈ గంట నిన్ను ఎలా ఎంగేజ్ చేయాలా ?.. అని నేను చూస్తున్నాను. నువ్వు గేమ్ ఆడి దాన్ని ఇంకా ఈజీ చేశావ్. ఫోటోగ్రఫీ.. పక్కింటి వారి గురించి పరమశుద్ధులు.. పాన్ కార్డు.. పాస్ పోర్టు.. వాహ్ వా.. బాగా చెప్పావ్. సమాజం గురించి... మనుషుల గురించి.. కానీ నువ్వు చెప్పే సొల్లు ఇక్కడ ఎవడూ వినడు. సో... 20 లక్షలిచ్చి నీ వైఫ్ ని తీసుకెళ్లు’’ అని కార్ స్టార్ట్ చేశాడు. డోర్ మిర్రర్ డౌన్ చేసి.. ‘‘యా.. బాస్.. ఒక విషయం చెప్పడం మరిచిపోయాను. నీ పక్కింటి వాడు ఎవడో కాదు.. ఎలాంటి వాడో నువ్వు తెలుసుకో. నో యువర్ నైబర్ సర్’’ అని వెళ్లిపోయాడు.
నిస్తేజంగా నిలబడడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రియా తన దగ్గర ఉంది. డబ్బులిచ్చి తెచ్చుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు.
నేను తనని రియలైజ్ చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను.
మనుషులు కదా. మారతారు, మారుద్దాం అనుకున్నాను. 

0 comments: