ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్ ... రాత్రి పదిగంటలు... మెయిన్ గేటుకు ఎడమవైపు మూలన చిన్న గుడి ఉంది. అమ్మ వారి ముందు దీపం వెలుగుతోంది. దీపం పక్కనే నాలుగు అగరుబత్తీలు కాలుతున్నాయి. వాటినెవరో అరటిపండుపై గుచ్చారు. పసుపూ, కుంకుమా చల్లారు. గుడి పక్కన ఓ పది పదిహేను బైకులు పార్క్ చేసి ఉన్నాయి. "నాలుగైదుసార్లు బయటికి వెళ్తుంటాం. వస్తుంటాం. వెళ్లొచ్చిన ప్రతిసారీ ఐదు రూపాయలివ్వాలా?'' అంటూ పార్కింగ్ టోకెన్ అడిగిన కుర్రాడితో గొడవ పడుతున్నాడో పెద్దాయన. పార్కింగ్ వెనకాల వరండా. ఆ వరండాలో ముగ్గురు పడుకున్నారు. ఇద్దరు కూర్చున్నారు. పడుకున్న వారిలో ఇద్దరికి దుప్పట్లు కూడా లేవు. నేల మీదే పడుకున్నారు. ఒకావిడ స్తంభానికి ఆనుకుని కూర్చుంది. ఆమె ఒళ్లో ఓ చిన్నారి పడుకుంది. కాళ్లు ముడుచుకుని పడుకున్న ఆ పాపని జో కొడుతోంది ఆ తల్లి. చంటిది హాయిగా నిద్రపోతోంది. ఆ అమ్మ మాత్రం శూన్యంలోకి దీనంగా చూస్తోంది. కుడివైపు ప్రహరి వెంబడి ఆంబులెన్స్ ఆగిఉంది. ఆంబులెన్స్‌కు, గోడకి మధ్య సందులో ఒకాయన బీడీ కాలుస్తున్నాడు. ఆంబులెన్స్ దాటాకా గోడ పక్కన ఇద్దరు కూర్చున్నారు. అందులో మాసిన గడ్డం ఉన్న వ్యక్తి అన్నం పొట్లాం ...