స్లీపింగ్‌ బ్యూటీ

By | April 13, 2010 8 comments
ఔను మేం వెళ్లిపోతున్నాం. ఈ ఊరికి దూరంగా, అయినవాళ్లందరినీ వదిలి. మీరు లేచిపోవడమే అనుకోండి. కానీ ఏం చేయను? వాళ్ల అమ్మానాన్న ఒప్పుకోవడం లేదు. రేపే తనకి నిశ్చితార్థం. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఈ నిర్ణయం. నేను, మనూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా విషయం తెలిశాక మనూని చదువు మాన్పించారు తనవాళ్లు. తర్వాత సొంత ఊరికి తీసుకెళ్లారు. శ్రీళైలంలో రే పు మా పెళ్లి. ఏర్పాట్లు చేయమని భరత్‌ని పంపించా. నిద్రేమో రావట్లేదు. కానీ పడుకోవాలి. పొద్దున్నే మెలకువ వస్తుందో లేదో?
---
అలారం మోగింది. ఉలిక్కి పడి లేచా. టైమ్‌ ఎనిమిది గంటలు. మనూ బయలు దేరిందో లేదో? స్నానం చేసి తయారయ్యాక ఫోన్‌ తీశాను. రాత్రే కదా ఛార్జింగ్‌ పెట్టింది. అప్పుడే డెడ్‌ అయిందేంటి? కరెంటు కూడా లేదు. బయటికెళ్లి కాయిన్‌బాక్స్‌ నుంచి ఫోన్‌ చేశాను. మొబైల్‌ స్విచ్డ్‌ ఆఫ్‌. ఏమైంది తనకి? కొంపదీసి ఇంట్లో తెలిసిపోయి ఉంటుందా? లేకపోతే... అలా అయితే ఈ రోజు తన ఎంగేజ్‌మెంట్‌.
"ఆటో!... స్టేషన్‌''
మనూకి ఏమై ఉంటుంది. స్టేషన్‌కి వచ్చే వరకు ఫోన్‌ ఆన్‌ చేయొద్దనుకుందా? లేకుంటే ఈ రిస్క్‌ ఎందుకని బావని చేసుకోవడానికి ఒప్పుకుందా? ఛీఛీ.. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా? నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. ఇలా ఆలోచించొద్దంటే నెంబర్లు లెక్కబెట్టాలి. వన్‌..టు.. త్రీ. ఆటో వేగంగా వెళ్తోంది.
---
ఆ రోజు మా కాలేజ్‌ ఫ్రెషర్స్‌ డే. మేం ఎంబిఏ సీనియర్స్‌. మనూ జూనియర్‌. ఈ రోజు ఎలాగైనా మాట్లాడాలి. ఫంక్షన్‌ మొదలైంది. మేమే లేట్‌. 'మందు' మార్భలంతోవచ్చే సరికి ఆ టైమ్‌ అయింది. చివరి వరుసలో కుర్చీలు మాకోసం ఖాళీగా ఉన్నాయి. మాది క్లాస్‌లోనైనా, ఫెస్ట్‌లోనైనా అదే బెంచ్‌. బ్యాక్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌.
స్టేజీ మీద అమ్మాయి.. బహుశా ఫ్రెషర్‌ అనుకుంటా. మౌత్‌పీస్‌ పట్టుకుని 'ఉదయభాను'లా మాట్లాడుతోంది.
"గుడ్‌ ఈవ్‌నింగ్‌ ఎవ్రీబడీ.. ఇప్పుడే మేం అందరికీ ఒక్కో చీటీ ఇస్తాం. దానిపై రాసి ఉన్న పదానికి వ్యతిరేకపదం ఎవరిదగ్గర ఉందో, వాళ్లని వెతుక్కుని ఇక్కడికొచ్చి పరిచయం చేసుకోవాలి.'' అని చెబుతోంది.
నాకు 'స్టార్ట్‌' వచ్చింది. "భరత్‌ కొంపదీసి నీకు 'ఎండ్‌' మాత్రం రాలేదు కదా'' వాడి స్లిప్‌లోకి తొంగిచూస్తూ అడిగా.
"అరె ఇడియర్‌! ఎండ్‌.. ఫ్రెషర్స్‌ దగ్గర ఉంటది రా'' వాడికి బ్యాడ్‌ వచ్చింది. గుడ్‌ కోసం వెతుకుతూ చెప్పాడు.
"హలో సర్‌. మీది స్టార్టా?'' ఎవరో నన్నే పిలిచారు. తిరిగి చూస్తే మనూ.
"ఆ.. యా''
"కరణ్‌ మీరా?''
"నీను మీకు తెలుసా?''
"ఊ.. ఆ రోజు.. అది వదిలేయండి. ముందు మీ గురించి చెప్పండి?''
"నా గురించి తర్వాత. అసలు ఏ రోజు??''
"అయ్‌ బాబోయ్‌. మళ్లీ ఇప్పుడు అది గుర్తు చేసుకుంటే నా నవ్వు ఆగదు. ప్లీజ్‌ వదిలేయండి.''
ఇంతలో 'ఉదయభాను'- "ఫస్ట్‌ వి ఆర్‌ ఇన్‌వైటింగ్‌. మనస్విని ఫ్రమ్‌ ఫస్ట్‌ ఇయర్‌.''
"మనమే దా'' తన చేయి పట్టుకుని స్టేజీ వైపు లాక్కెళ్లాను.
"కానీ మీ గురించి చెప్పనేలేదు?'''' తను చేయి వదిలించుకోబోయింది.
"ష్‌.. పదా'' లెక్కెళ్లాను.
"హాయ్‌.. నేను కరణ్‌. నా భాగస్వామి మనూ. మనస్వినీ కరణ్‌. భలే కుదిరింది కదా. తను నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. తన గురించి చెప్పాలంటే మనూ కాబోయే ఎంటర్‌ప్రెన్యూర్‌. వ్యాపారం అంటే మన సంపాదన కాదు. నలుగురికి జీవితాన్నివ్వాలని నమ్ముతుంది తను. మీరు నమ్ముతారో లేదో? మనూ ఎప్పుడూ టీవీ చూడదు. మరి నేను. నేను చూడనిదెప్పుడు? నేనెక్కువగా టీవీలో యాడ్సే చూస్తాను. ఇంతకు ముందు సీరియల్‌ మధ్యలో యాడ్స్‌ వచ్చేవి. ఇప్పుడు యాడ్స్‌ మధ్యలో అప్పుడప్పుడు సీరియల్స్‌ వస్తున్నాయి. అయినా నేను వాటినే ఎందుకు చూస్తానంటే.. అవి తక్కువ టైమ్‌లో ఎక్కువ అర్థానిస్తాయి. పది సెకన్లలో చూసిన యాడ్‌ని బట్టే కదా. పదిలక్షలు పెట్టి కారుని కొనేది. అందుకే నేను యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ని అవ్వాలనుకుంటున్నా.'' మనూ మాత్రం దూరదర్శన్‌ సీరియల్‌లో డైలాగ్‌ లేని ఆర్టిస్టులా నిలబడి ఉంది. "షార్ట్‌ ఈజ్‌ స్వీట్‌. జీవితం చాలా చిన్నది. అందుకే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్న. తనకి కూడా చెప్పని మాట. నేను మనూని ప్రేమిస్తున్నాను. యస్‌ మనూ! ఐ లవ్‌ యు'' తన వైపు తిరిగి మోకాళ్లపై నిల్చుని వెనుక జేబులోంచి తీసిన గులాబీ తనకిస్తూ చెప్పాను.
---
"సార్‌ స్టేషనొచ్చింది...'' ఎవరో పిలిచినట్లనిపించింది. ఆటోవాలా. మీటర్‌ 40 రూపాయలు..
"టైమ్‌ ఎంతయింది'' జేబులోంచి 50 నోటు తీసిస్తూ అడిగా.
"9.30. చిల్లర లేదు సార్‌'' జేబులో చూసుకుంటూ అన్నాడతను.
"తొమ్మిదిన్నరా? పర్లేదు ఉంచేసుకో నాకు టైమ్‌ లేదు.''
ప్లాట్‌ఫామ్‌ అప్పుడే విడుదలయిన అవతార్‌ సినిమా థియేటర్‌లా ఉంది. ట్రయిన్‌ అర్థగంట ఆలస్యం. మైక్‌లో చెబుతున్నారు. అంటే ఇంకా గంట ఉంది. ఏం చేయాలి? ఫోన్‌ చేద్దాం. కాయిన్‌ బాక్స్‌ కోసం వెతికా. సేమ్‌.. ఇంకా స్విచ్ఛాఫే. నిట్టూర్చుతూ బెంచీపై కూర్చున్నా.
"ఎరా నువ్విచ్చిన షాక్‌ నుంచి మీ డార్లింగ్‌ ఇంకా తేరుకోనట్టుంది.'' క్యాంటిన్‌లో సిగరెట్‌ వెలిగిస్తూ అడిగాడు భరత్‌. "అయినా అంత ధైర్యం ఏంట్రా నీకు? ప్రిన్సిపాల్‌, లెక్చరర్స్‌, స్టూడెంట్స్‌ అందరి ముందూ..''
నేనేం మాట్లాడలేదు. మూడు రోజులయింది. మనూ కాలేజ్‌కి రాక. నేనిచ్చిన షాక్‌ నుంచి తేరుకోవడానికి ఆ మాత్రం సమయం తప్పక పడుతుంది.
"భరత్‌! సాయంత్రం రెడీగా ఉండు.''వాడి చేతిలో సిగరెట్‌ లాక్కొంటూ చెప్పాను.
"మందు కొడదామా మామా?'' ఉత్సాహంగా అడిగాడు.
"రెండు కొడతా. మందు కాదు. మనూ వాళ్ల హాస్టల్‌ దగ్గర అడ్డా. వస్తున్నావంతే'' ఆర్డర్‌ వేశాను.
"అరేయ్‌ అక్కడికెందుకు ఇప్పటికి చేసింది చాలదా?''
"అరె యార్‌! నేనక్కడ కాపురమేమైనా పెడతానా? ట్రై చేద్దాం వర్కవుట్‌ అవుద్దేమో''
మనూ సైకిల్‌పై వస్తోంది. ఎంత దూరంలో ఉన్నా పోల్చుకోగలిగేది మనవాళ్లని మాత్రమే. ఔను. మనూ నాది.
"అరె మామా! నువ్వు చూడకు. అటు తిరుగు. మనల్ని దాటి వెనక్కి తిరిగి చూస్తుందో లేదో చూద్దాం. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసిందంటే ఏ అమ్మాయయినా పడినట్లే'' నా మొహం వెనక్కి తిప్పుతూ సలహా ఇచ్చాడు భరత్‌.
"ఏయ్‌.. హలో! లుక్‌ ఇయర్‌'' ఎవరో పిలిచారు. వెనక్కి తిరిగి చూశాను. ఇంకెవరూ. మనూ. పక్కన భరత్‌గాడు జంప్‌.
"నాకు తెల్సు నువ్వు ఇక్కడికి కూడా రెడీ అయిపోతావని. అయినా ఏంటి నువ్వు. చూడగానే ప్రపోజ్‌ చేస్తావా? అదీ అందరి ముందు. ఊళ్లో నాన్నకీ తెల్సిపోయింది. ఇక్కడ హాస్టల్‌లో కూడా టాంటాం. తలెత్తుకొని తిరగలేకపోతున్నా.'' చాలా కోపంగా అంది.
"సారీ. నిజంగా ఆ రోజు అలా చేసి ఉండకూడదు. అందరిముందు.. ఫస్ట్‌ టైమ్‌ కలవగానే చెప్పేయటం తప్పే. పోనీ ఇప్పటికి నాలుగు రోజులయింది. పైగా, ఇప్పుడెవరు కూడా లేరు. ఇప్పుడు చెప్పమంటావా?''
"ఇడియట్‌. నువ్వు మారవురా. నువ్వు ఎధవని తెలుసుగానీ, ఇంతని మాత్రం తెలీదు''
"హి.. హి. హి.. ఔను, అసలు నా పేరు నీకెలా తెలుసు. మొన్న.. 'ఆ రోజు' అన్నావ్‌. అసలే రోజు?''
"చెబుదామనుకున్నాను. కానీ చెప్పను'' సైకిల్‌ తీసుకుని వెళ్లబోయింది మనూ.
"ఇప్పుడు కూడా చెప్పవా?'' జేబులోంచి ఒక కాగితం తీసి చూపించాను.
మనూ వెనక్కి తిరిగి చూసి "రేయ్‌. నా ఫొటో. నీ దగ్గరికెలా వచ్చింది?'' సైకిల్‌ స్టాండ్‌ వేసి వచ్చి చేతిలోంచి లాక్కోబోయింది.
"ఫొటో కాదు. పెయింటింగ్‌. నేనే వేశా.'' వెనకాల దాస్తూ చెప్పాను.
"నా ఫొటో నువ్వు..? ఔనూ.. నేనేదో మీ పక్కింటి అమ్మాయినయినట్లు నాగురించి అంతా చెప్పావ్‌. అసలు నీకెలా తెల్సు?''
"చెబుదామనుకున్నాను. కానీ చెప్పను'' (రవితేజ వాయిస్‌లో...)
"నా డైలాగ్‌ నాకే.. సరే నే చెబితే చెబుతావుగా'' మొదలెట్టింది మను. నేను ఊ కొడుతున్నాను.
"ఆ రోజు నేను కాలేజ్‌లో చేరడానికి డాడీతో వచ్చాను. ప్రిన్సిపాల్‌ చాంబర్‌ ముందు సోఫాలో కూర్చుని ఉన్నాం. లోపల జరిగేదంతా మాకు క్లియర్‌గా వినిపిస్తోంది. "పదివేల రూపాయలు నేను వాడికిచ్చాను. మీరేమో ఫీజు కట్టలేదంటారేంటి?'' అని ఎవరో ప్రిన్సిపాల్‌ని అడుగుతున్నారు. ప్రిన్సిపాల్‌ ఏమో.. "మీరిచ్చుండొచ్చు. కానీ ఫీజు మాత్రం వాడు కట్టలేదండి. వాడికి చదువు దండగ. అసలు వాడు కాలేజ్‌కి రాకుండా ఏమేం చేస్తాడో తెలుసా?'' మనూ నవ్వు ఆపుకోలేకపోయింది.
"ఏయ్‌. ఎందుకలా నవ్వుతున్నావ్‌. 'సత్తి' ఏం చెప్పాడు?''
రెండు నిమిషాల తర్వాత.. మనూ పొట్ట చేత్తో పట్టుకుని "వాట్‌ నాట్‌ ఎవ్రీథింగ్‌. ప్రిన్సిపాల్‌కి గుడుంబా సత్తి అని నిక్‌నేమ్‌ పెట్టింది. వాళ్లమ్మాయితో సినిమాకెళ్లింది. కాలేజ్‌ క్యాంటిన్‌లో వాళ్లావిడకి కన్ను కొట్టింది. ఇన్‌స్టీ బిడ్డింగ్‌పై దమ్ముకొడుతూ పట్టుబడింది. క్రికెట్‌ గ్రౌండ్‌లో సీనియర్‌ తల పగలగొట్టింది. జులేకా మేమ్‌ స్కూటీ తీసుకెళ్లి డ్రంకన్‌ డ్రైవింగ్‌లో పోలీసులకి దొరికిపోయింది. అన్నీ.. అన్నీ చెప్పాడు''
ఇంకేం మిగిలింది. అన్నీ చెప్పేశాడు. గుండుబా సత్తి. గుండుబా సత్తి. ప్రిన్సిపాల్‌ మీద కోపాన్ని మింగేస్తూ "అయినా అది నేనే అని నువ్వెలా అనుకున్నావ్‌?''
"ఆగాగు. నే చెప్పేది ఇంకా అయిపోలేదు'' శ్వాస గ ట్టిగా వదులుతూ మళ్లీ మొదలెట్టింది మనూ- "ప్రిన్సిపాల్‌ అటెండర్‌ని పిలిచి ఫైనల్‌ఇయర్‌లో కరణ్‌ని పిలుచుకురమ్మన్నారు. ఇప్పుడే హీరో గారి ఎంట్రీ. నువ్వు నన్నే చూస్తూ లోపలికి వెళ్లావ్‌. ప్రిన్సిపాల్‌ క్లాస్‌ స్టార్ట్‌.. ప్లీజ్‌ సార్‌! బయట లేడీస్‌ ఉన్నారని డోర్‌ వేశావ్‌. గుర్తుందా?''
"ఆ మర్చిపోతే కదా. అయినా జరగాల్సిన దారుణం అప్పుడే జరిగిపోయిందని నాకేం తెలుసు.'' కాస్త సిగ్గేసింది.
"ఇప్పుడు చెప్పు స్టేజీపై అలా వాగేశావ్‌. నా గురించి నీకెలా తెల్సు?''
కాసేపాగి..
"అదీ.. ఆ రోజు నేను ప్రిన్సిపాల్‌ గది నుంచి బయటికొచ్చానా? చూస్తే నువ్వులేవు. అంతా వెతికాను. బట్‌ కనిపించలేదు. అకౌంటెంట్‌కి వందకొట్టా. మీ హాస్టల్‌ అడ్రస్‌ ఇచ్చాడు. అంతే.''
"అచ్చా. మరి నా యాంబిషన్‌. ఫొటో?''
"అదా. రెండు రోజులు.. నీ రూమ్‌మెంట్‌ తేజూకి ట్రై చేశా. దాని వీక్‌నెస్‌ నాకు తెలుసుగా. ఫైవ్‌స్టార్‌ చాక్లెట్‌కే పడిపోయింది. అంతా చెప్పేసింది.''
"తే..జస్వినీ? ఫొటో కూడా అదే ఇచ్చిందా? చెప్తా దాని పని.'' మనూ పళ్లు కొరికింది.
"వద్దొద్దు. మా డార్లింగ్‌నేం అనొద్దు ప్లీజ్‌. ఫొటో ఇవ్వలే. నిద్రపట్టలేదు. కళ్లలో మెదులుతున్న ఆ రూపాన్నే.. బొమ్మను గీస్తే.. నీలా ఉంది..'' అని పాట అందుకున్నాను.
"షటప్‌'' పిడికిలి సైకిల్‌ సీటుపై గుద్దింది.
"అంత కోపమెందుకు. నేనేమైనా తప్పు చేశానా? నీకోసమే కదా. తప్పు గీశాననుకుంటే చింపేసెయ్‌. అసలు అలా గీయడమే తప్పు అనుకుంటే క్షమించెయ్‌.'' ఆ పెయింటింగ్‌ మనూ సైకిల్‌ ముందు టబ్‌లో పడేశాను.
---
ట్రెయిన్‌ నెంబర్‌ 1246. పదో నెంబర్‌ ఫ్లాట్‌ఫామ్‌ మీదికి వస్తున్నట్లు మైక్‌లో అనౌన్స్‌మెంట్‌. టెన్షన్‌. ఒక చేతివేళ్లు ఇంకో చేత్తో నొక్కుతూ నిల్చున్నా. ట్రెయిన్‌ వేగంగా వచ్చి ఆగింది. నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకునే మనూలా కనిపించింది ఆ ట్రెయిన్‌. ప్రయాణికులంతా పీటీ ఉష తోబుట్టువుల్లా కనిపిస్తున్నారు. మనూ ఏ కంపార్ట్‌మెంట్‌లో ఉందో ఏమో? అటూ ఇటూ పరుగెట్టా. ఇంజిన్‌ నుంచి చివరి భోగీ వరకు. కానీ మనూ కనిపించలేదు. చుక్‌ చుక్‌ చుక్‌.. రైలు మళ్లీ స్టార్ట్‌ అయింది. గుండె కొట్టుకోడం దాని వేగంతో పాటు పెరిగింది. ఎదురు చూపులతో వేడెక్కిన కళ్లు చల్లబడ్డాయి. బహుశా కన్నీళ్లతో అనుకుంటా.
నేను అనుకున్నదే నిజమై ఉంటుందా? మనూ రాలేకపోయిందా? నన్ను వద్దనుకుని ఆ వెధవతో... ఎంత నమ్మాను. తప్పకుండా వస్తుందనుకున్నాను. ట్రెయిన్‌ కూడా వెళ్లిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఫోన్‌?.. కాయిన్‌ కోసం వెదుకుతుంటే జేబులోంచి ఏదో కాగితం కింద పడింది. దాన్ని చేత్తో పట్టుకుని డయల్‌ చేశా. మళ్లీ స్విచ్చాఫ్‌? ఏడుపాగలేదు. బెంచిపై నిస్తేజంగా కూలబడ్డా. చేతిలో కాగితం... ఫ్రెషర్స్‌డే జరిగిన ఐదు రోజుకు మనూ కాలేజ్‌కి వచ్చింది. క్యాంటిన్‌లో కలిసి లేటర్‌ ఇచ్చింది.
డియర్‌ కరణ్‌,
తేజూని అడిగాను. ఫొటో రెండు నిమిషాలు కూడా సరిగ్గా చూడలేదని చెప్పింది. ఆ పెయింటింగ్‌, నా ఫొటో పక్కన పెట్టి పోల్చాను. అచ్చుగుద్దినట్లు.. చూడకుండా అసలెలా వేశావో అర్థం కాలేదు. అంతే పడిపోయాను. కాదు.. కాదు.. ఇప్పుడు కాదు. 'ఆ రోజే '.
ఆ రోజు నువ్వు ప్రిన్సిపాల్‌ చాంబర్‌లోకి వెళ్తున్నప్పుడు చూసి వీడు ఇంత ఎధవా అనుకున్నాను. కాసేపటి తర్వాత లీజర్‌ హాల్‌లో కూర్చుని నేను, డాడీ అప్లికేషన్‌ ఫామ్‌ నింపుతున్నాం. ఎదురుగా..
"కరణ్‌కి టీసీ ఇస్తున్నారటే. దానికి నువ్వే కారణం''
"కానీ ఏం చేయను. ఆ రోజు నేను ఎంత వద్దన్నా వినలేదు. అయినా కరణ్‌కి అలా ఏంకాదు. నేను ప్రిన్సిపాల్‌ని రిక్వెస్ట్‌ చేస్తాను.'' ఇద్దరమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ అమ్మాయిని ఏం చేశావోనని నేను ఆలోచిస్తున్నా.
"నీకు అంత శ్రమ అక్కరలేదే. వాళ్ల డాడీ వెళ్లిపోగానే కరణ్‌ ప్రిన్సిపాల్‌కి ఏదో గాలం వేశాడట. 'సత్తి' ఆల్రెడీ టీసీ క్యాన్సిల్‌ చేశారు'' మూడో అమ్మాయి హాల్‌లోకి వస్తూ చెప్పింది.
అప్పుడే అర్థమైంది. నువ్వేంటో. తేజూకి కరణ్‌ అంటే 'ఎర్లీ' మార్నింగ్‌ పదింటి వరకు పడుకునే కుంభ కర్ణుడనే తెలుసు. కానీ నీలో కర్ణుడు ఆ అమ్మాయి ఫీజు కట్టేశాడని తెల్సింది. నువ్వు ఇబ్బందుల్లో పడతావని తెల్సినా ఎదుటివారి కష్టాల్ని చూడలేకపోయావు చూడు అది.. అది నాకు నచ్చింది. షార్ట్‌ అండ్‌ స్వీట్‌ అంటే నీకు ఇష్టం. మన పరిచయం కూడా అంతే. కానీ అది లాంగ్‌ అండ్‌ లైఫ్‌ ఉండాలని కోరుకుంటూ..
నీ మనూ
ఉత్తరం మళ్లీ మళ్లీ చదివాను. అవునూ కొంపదీసి అసలు నేను ఆ పెయింటింగ్‌ని ఎలా వేశానో మనూకి నిజం తెలిసిపోయి ఉంటుందా? అయినా నేను అలా చేసింది తన ప్రేమ కోసమేగా? ఎవరు చెప్పి ఉంటారు? భరత్‌?? ఔను.. వాడే. వాడికొక్కడికే తెలుసు.
---
"ఆంటీ! భరత్‌?''
"కరణ్‌ అదేంటి అలా అడుగతున్నావ్‌. వాడు మీ ఊరికే కదా వచ్చాడు. మీకు ఒంట్లో బాగోలేదని చెప్పాడు. పదిరోజులు ఉండొస్తాను, మీ ఊళ్లో ఫోన్‌ సిగ్నల్స్‌ రావని చెప్పాడు. పదిహేను రోజులైంది వాడు వెళ్లి. మీ ఇంటి నెంబరేమో లేదు. అంకుల్‌ మీ పాత ఫ్లాట్‌కి వచ్చారు. మార్చావంట కదా? అందుకే రేపు మీ ఊరికే వద్దామనుకుంటున్నారు.'' కంగారుగా చెప్పింది భరత్‌ వాళ్ల అమ్మ.
"ఆంటీ! ఏంటీ పదిహేను రోజులైందా? నిన్న సాయంత్రమే కదా వాడు మీ ల్యాండ్‌లైన్‌ నుంచి నాతో మాట్లాడింది. అసలు ఈ రోజు వస్తానన్నాడు. మీరేమో పదిహేను రోజులంయిందంటున్నారు. ప్లీజ్‌ ఆంటీ నిజం చెప్పండి.''
"అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటి కరణ్‌. అసలు మేమెందుకు అలా చెబుతాం.'' అంకుల్‌ బాత్‌రూమ్‌లోంచి బయటికి వస్తూ అన్నారు.
"లేదు అంకుల్‌. నిజం వాడు నిన్న నాతో మాట్లాడాడు. కావాలంటే ల్యాండ్‌లైన్‌ నుంచి వచ్చిన కాల్‌ చూపిస్తాను. ఉండండి.'' బ్యాగ్‌లోంచి సెల్‌ఫోన్‌ తీస్తూ చెప్పాను. "అంకుల్‌ నోకియా చార్జర్‌ ఇస్తారా? చిన్నపిన్‌..''
"అంకుల్‌ ఇదిగోండి. 18-2-2015, 5.35 పిఎమ్‌. చూడండి. మీ ల్యాండ్‌ నెంబర్‌.''
"ఏంటీ పద్దెనిమిది రెండా? పద్దెనిమిది. 28. పదిరోజులు. ఇవాళ మార్చి 6. అంటే ఐదు రోజులు. మొత్తం పదిహేను రోజులు అదే కదా మేం చెప్పేది. నువ్వు నిన్న అంటావేంటి?'' అంకుల్‌ కళ్లు ఎరుపెక్కాయి.
"అంకుల్‌ ఏంటీ? ఇవాళ ఆరో తేదా? ఫిబ్రవరి 19 కాదా?'' ఏం అర్థం కాలేదు. కళ్లు తిరుగుతున్నాయి. తలపట్టుకున్నాను. కిందపడిపోయాను.
"కరణ్‌. కరణ్‌'' ఆంటీ మొహం మీద నీళ్లు చల్లుతోంది.
"ఆంటీ! నా.. నాక్‌.. నాకు ఏమైందో అర్థం కావట్లేదు. ఆ రోజు వాడు వస్తానని ఫోన్‌ పెట్టేశాడు. నైట్‌ పడుకున్నాను. పొద్దున్నే లేస్తే.. ఇలా.. పదిహేను రోజులు. పదిహేను రోజులు నేను పడుకోవడమేంటి?''
"ఏంటీ? పదిహేను రోజులు పడుకున్నావా? ఏం తాగావురా. ఈ వయసు నుంచి నువ్వు, వాడు వద్దన్నా వినకుండా తాగుడు. నువ్వు పడుకున్నావ్‌ సరే. మరి వాడు ఏమైపోయాడు. ఏం చేశావ్‌ వాడిని?'' అంకుల్‌ నన్నో ముద్దాయిలా ప్రశ్నిస్తున్నాడు.
"అంకుల్‌ ప్లీజ్‌. నేనేం చేయలేదు. దయచేసి అలా మాట్లాడొద్దు. నాకిప్పుడిప్పుడే అర్థమౌతోంది. మీకు నిజం చెబుతాను. నేను, మా జూనియర్‌ మనస్విని ప్రేమించుకున్నాం. ఫిబ్రవరి 19న తన ఎంగేజ్‌మెంట్‌. ఆ రోజు తనని తీసుకెళ్లి శ్రీశైలంలో పెళ్లి చేసుకుందామనుకున్నాను. భరత్‌ వెళ్లి ఏర్పాట్లు చేస్తానన్నాడు. నేను పొద్దున్నే మనూని తీసుకుని వస్తానని చెప్పాను. 18 సాయంత్రం ఫోన్‌ చేశాడు. ఆ రోజు రాత్రి నేను పడుకున్నాను. ఆ తర్వాత ఏమైందో తెలియదు. నిద్రలేచి స్టేషన్‌కి వెళ్లాను. మనూ రాలేదు. భరత్‌ సెల్‌ పనిచేయడం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను. నిజం అంకుల్‌. ఇదే జరిగింది. నమ్మండి. ప్లీజ్‌. నాకు పిచ్చెక్కుతోంది.'' చేతులు జోడించి నమస్కరించాను.
"పదిహేను రోజులు పడుకున్నావా? మనిషివేనా నువ్వు'' అంకుల్‌ నా చేతిలోంచి సెల్‌ లాక్కున్నారు. కాల్‌ హిస్టరీలో నెంబర్లు చూస్తూ "19వ తేదీ 10 మిస్డ్‌కాల్స్‌. 20 నాడు ఎనిమిది. తర్వాత రెండు రోజులు కూడా ఫోన్‌ చేశారు కదరా నీకు?''
"చూడలేదంకుల్‌. ఈ రోజు మార్నింగ్‌ లేచేసరికి సెల్‌ స్విచ్డ్‌ఆఫ్‌ ఉంది. బయలుదేరేముందు ఫ్లాట్‌లో పవర్‌ కూడా లేదు.'' అంకుల్‌ చేతిలోంచి సెల్‌ తీసుకుని చూశాను. మనూ సెల్‌ నుంచి కూడా మిస్ట్‌కాల్స్‌ ఉన్నాయి.
"మరి భరత్‌ ఏమైఉంటాడు?'' అంకుల్‌ తలపట్టుకుని సోఫాలో కూలబడ్డారు.
"అదే నాకూ తెలియడం లేదంకుల్‌. ప్లీజ్‌ నాకు కొంచెం టైమ్‌ ఇవ్వండి. అసలేం జరిగిందో కనుక్కుంటాను.'' ప్రాధేయపడ్డాను.
"చేసింది చాలు. పదా నేనూ వస్తాను'' అంకుల్‌ చొక్కా వేసుకోబోయారు. అంకుల్‌ని ఎలాగోఅలా ఆపి నేను బయలుదేరాను.
అంటే నేను పదిహేను రోజులు నిద్రపోయానన్నమాట. ఇదెలా సాధ్యం. అసలెవరైనా అన్ని రోజులు పడుకుంటారా? అయితే మన ఆ రోజు స్టేషన్‌కి వచ్చింది. నేను రాకపోవడంతో మనూ?.. ఎక్కడికి వెళ్లి ఉంటుంది? నాకు తెలుసు. నేను మోసం చేశాననుకుని మనూ నా మీద కోపంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయుంటుంది. మరి భరత్‌? ఇద్దరు కలుసుకుని ఉంటారా? యస్‌. మనూని అడిగితే తెలుస్తుంది. రేపొద్దున్నే వాళ్ల ఊరెళ్లాలి.
---
మనూ వాళ్ల ఇంట్లో శ్మశాన నిశ్శబ్ధం. మెల్లగా గేటు తీశాను. కిర్రుమంటూ తెరుచుకుంది. వరండాలో కూర్చున్న మనూ వాళ్ల నాన్న గేటు వైపు చూశాడు. నన్ను చూడగానే.. "అరె పెద్దోడా! వచ్చాడ్రా వాడు. తరిమి కొట్టండ్రా'' అని బిగ్గరగా అరిచాడు.
"అంకుల్‌ ఒక్క నిమిషం.. ప్లీజ్‌ నేను చెప్పేది వినండి.'' బతిమిలాడబోయాను.
"ఏంట్రా వినేది? మా చెల్లిని ఎత్తుకెళ్దామని చూస్తావా? ఇప్పుడు దాని పెళ్లి కూడా చెడిపోయింది. నువ్వు బతకడానికి వీల్లేదు'' కాలితో ఎదుర్రొమ్మున తన్నాడు మనూ వాళ్ల పెద్దన్నయ్య.
తల గోడకు బలంగా గుద్దుకుంది. రక్తం కారుతోంది. తుడుచుకుంటూ "సర్‌ నేను.. నేను తనకోసం రాలేదు. భరత్‌ కోసం.. హా..'' వెనక నుంచి కత్తి పోటు.. మనూ వాళ్ల రెండో అన్నయ్య. "ఉన్నాడ్రా. వాడూ ఉన్నాడు. వాడి కోసమైనా వస్తావని తెలుసు. రేయ్‌ ఆ లోపల ఉన్నోణ్ని వదిలేయండ్రా'' చేతిలోని కత్తి విసిరేస్తూ చెప్పాడు.
"రేయ్‌ కరణ్‌. కరణ్‌.'' పరుగెత్తుకుంటూ వచ్చాడు భరత్‌. చేతులు కట్టేసి ఉన్నాయి. మొహం నిండా గాయాలు.
"మనూ ఎక్కడ్రా'' మూసుకుపోతున్న కళ్లని బలవంతంగా తెరిచి అడిగాను.
"ఇంట్లోనే బంధించార్రా.'' నా నుదట రక్తం తుడుస్తూ చెప్పాడు వాడు. నా కళ్లు మూసుకుపోయాయి.
---
మెలవకువ వచ్చింది. కళ్లు తెరిచి చూశాను. గాజు గోడల మధ్య ఉన్నాన్నేను. ఓ అద్దంపై ఐసియు అని రివర్స్‌లో కనిపిస్తోంది. డిజిటల్‌ క్లాక్‌లో సమయం ఉదయం 10. గురువారం మార్చి 11, 2010. భరత్‌లోపలికి వచ్చాడు. నా చేతులు తన చేతిలోకి తీసుకుంటూ.. "ఎలా ఉందిరా'' అని అడిగాడు.
"పర్లేదు. అసలు ఏమైందిరా నాకు'' మంచంపై నుంచి లేవబోయాను. పొట్టకు కుట్లు ఇంకా మానలేదు.
"ఏం కాలేదు. రిలాక్స్‌ యార్‌''
"అసలేమైంది. చెప్పరా ప్లీజ్‌''
"ఏం కాలేదు. పడుకున్నావ్‌. పదిహేను రోజులు. కుంభకర్ణుడిలా. మనూ స్టేషన్‌కి వచ్చింది. నువ్వు రాలేదని నాకు ఫోన్‌ చేసింది. నువ్వేమో ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదు. తనని రెస్టారెంట్‌లో వెయిట్‌ చేయమని చెప్పి నేను హైదరాబాద్‌కు వచ్చేశా. తర్వాత ఇద్దరం కలిసి నీ అడ్రస్‌ కోసం ట్రై చేశాం. బట్‌ దొరకలేదు. నువ్వేమో ఇవ్వేమీ పట్టనట్లు మాంచి నిద్రలో ఉన్నావ్‌. ఆ రోజు నైట్‌ లాడ్జీలో ఉన్నాం. మర్నాడు సాయంత్రం.. సిబిఎస్‌లో వాళ్ల పేరెంట్స్‌కి దొరికిపోయాం. తన ఎంగేజ్‌మెంట్‌ అయితే క్యాన్సిల్‌ అయిపోయింది. గానీ, నన్ను మాత్రం ఇరగ్గుమ్మేశారు''
"అది సరే. అసలు నేను పదిహేను రోజులు పడుకోవడమేంట్రా?''
"దాని గురించే.. మెన్ననే తెల్సిందిరా. పదిరోజుల క్రితమే. మనూ వాళ్ల అన్నయ్య నిన్ను పొడిచాక వాళ్ల డాడీయే నిన్ను హాస్పిటల్‌లో చేర్పించారు. నన్ను కూడా. పాపం తప్పుచేశానని ఫీలయ్యారు. మీ పెళ్లికి ఒప్పుకున్నారు. మనూ కూడా ఇప్పటి వరకు ఇక్కడే ఉంది.''
"దాని గురించి కాదు. అసలేం తెల్సంది. అది చెప్పు'' టెన్షన్‌ భరించలేకపోయా.
"కంగారు పడాల్సిందేం లేదు. బ్లడ్‌ టెస్ట్‌ చేస్తుంటే డాక్టర్లకు డౌట్‌ వచ్చిందంట. తెల్లరక్త కణాలన్నీ హాయిగా నిద్రపోతున్నాయట. ప్రాబ్లమ్‌ ఏంటో అర్థం కాక యుఎస్‌కి బ్లడ్‌ శాంపిల్స్‌ పంపారు. అప్పుడే తెల్సింది. నీకొక జబ్బు ఉంది. చాలా అరుదైనది. అందమైనది కూడా. దాని పేరు స్లీపింగ్‌ బ్యూటీ సిక్‌నెస్‌. క్లీన్‌ లెవిన్‌ సిండ్రోమ్‌ అని కూడా అంటారట. ప్రపంచంలో వెయ్యి మందికి మాత్రమే ఈ జబ్బు ఉంది. నిద్రపోతే పదిహేను రోజుల వరకు లేవకపోవడం దీని లక్షణం. బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. దీనికి కారణాలు ట్రీట్‌మెంట్‌ కూడా ఏదీ లేదట. వయసు పెరుగుతున్నా కొద్దీ అదే తగ్గిపోతుందట. అదిరా. మేం దొరికి తన్నులు తింటుంటే నువ్వు మాత్రం అందుకే తాపీగా పడుకున్నావ్‌.''
"ఓ మైగాడ్‌. ప్రాబ్లమ్‌ ఏం లేదా?''
"ఏం పర్లేదు. పదిహేను రోజులు పడక. పదిహేను రోజులు కాపురం. అంతే.''
"అయినా నేనసలు నాకొత్త ఫ్లాట్‌ చూపించి ఉంటే ఇంత జరిగేదే కాదు కదా?!''
- బీరెడ్డి నగేష్‌ రెడ్డి

8 comments:

Sravya V said...

Nice one !

పుక్కళ్ళ రామకృష్ణ said...

Wonderful story. Please let me know about updates. Best Regards.
Ram
~ www.telugucartoon.com

devi said...

Nice one. sleeping beauty sickness gurunchi vinatam idey first time.
:)

budugu kandukuri said...

baavundi . . . inthakee ee jabbu nijam gaa vundaa :)

sambasivarao said...

saaa

mahesh.blogspot said...

wonderful narration
cute story

Okkanimisham said...

Hi,
Chala chala bagundhi.......

కొత్త పాళీ said...

Very interesting.
Racy narration.