
'అతడు' సినిమా చూసినప్పటి నుంచి నన్నో మాట వెంటాడుతూనే ఉంది. ఆ సినిమా చివర్లో నాజర్ మహేష్ బాబుతో ఇలా అంటాడు- 'నాకు ఈ వయసులో
కావాల్సినవి జ్ఞాపకాలు. అవి నీ వల్ల చాలానే ఉన్నాయి' అని. అలాంటి జ్ఞాపకాలు నాకూ కావాలి. వాటి కోసం చాలా రోజులు వెతికాను. ఇంకా వెతుకుతూనే ఉన్నాను. అలా జ్ఞాపకాలు మూటగట్టుకున్నవారి కోసం కూడా గాలించాను. చివరికి దొరికారు. ఒక రోజంతా వారితో గడిపిన
అనుభూతి నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. ఆ అనుభవాలనే మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్లే దారిలో ఇబ్రహీంపట్నం అది. అక్కడి నుంచి నాయినంపల్లి వెళ్లే
మార్గంలో వినోభానగర్ ఉంది. అక్కడ పచ్చని చెట్ల మధ్య పాలరాతి శిల్పంలా కనిపిస్తుంది ఓ ఆశ్రమం. జనజీవనానికి దూరంగా ఆహ్లాదకర వాతావరణంలో కనిపిస్తుంది మాతాపితరుల సేవాసదనం. అనాథలుగా మిగిలిన వృద్ధుల పాలిటి అమ్మఒడి అది.
ఫిబ్రవరి 22
మధ్యాహ్నం12.30 గంటలు
గణగణా గంట మోగింది. భోజన సమయం అయిందనడానికి అది సంకేతం. ఓ గదిలో మంచంపై లేవలేని స్థితిలో మూలుగుతూ పడుకొని ఉంది ఓ వృద్ధురాలు. ప్లేటులో భోజనం పెట్టుకుని వచ్చి ఆమెని లేపింది ఓ పెద్దావిడ. ఆమె భుజాలు పట్టుకుని మెల్లగా లేపి కూర్చొబెట్టింది. ముద్దలు కలిపి పెడుతూ ఆమె వద్దంటుంటే 'ఇంకొంచెం.. ఇంకొంచెం' అంటూ కొసరింది. అయినా వద్దని చేతితో ప్లేటు నెట్టబోతే 'తినకపోతే ఎలా? చస్తావ్!' అని కోప్పడింది. అది నిజంగా కోపం కాదు... అందులో కొండంత ప్రేమ ఉంది. ఆ వృద్ధురాలి పేరు కనకమ్మ. తినిపించినావిడ దానమ్మ. ఆశ్రమం పనిమనిషి. ఇంతలో భోజనం ముగించుకు
ని రంగమ్మ, సుక్కమ్మ, శామలమ్మ, పద్మమ్మ కూడా అక్కడికి వచ్చారు. వారు ఆ సదనంలో ఆశ్రయం పొందుతున్న మరో నలుగురు. "తిన్నావా అక్కా! పడుకోబెట్టమంటావా?'' అని కనకమ్మని పడుకోబెట్టి దుప్పటి కప్పింది రంగమ్మ.
ఒకరికి ఒకరు
కనకమ్మ ఆశ్రమంలో అందరికంటే ముందు చేరిందట. సదనం ని

ర్వాహకులు కొల్లా భాస్కరరావు ఆమెని తీసుకొచ్చారు. అంతకుముందు కుంట్లూరు సాయిబాబ గుళ్లో ప్రసాదం తింటూ అక్కడే తలదాచుకునేదట. తర్వాత మిగతావారు వచ్చారు. ఎవరి గది వారికున్నా అందరూ ఎప్పుడూ హాల్లోనే కూర్చుంటారు. ఇన్నేళ్ల జీవితంలో అనుభవించిన కష్టాలు, సుఖాల గురించి మాట్లాడుకుంటారు. ఎన్నెన్నో జ్ఞాపకాలు పంచుకుంటారు. చిన్ననాటి జ్ఞాపకాలను తమ ముందు పరుచుకొని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు
. పెద్దయ్యాక అనుభవించిన కష్టాలను చెప్పుకొని... ఒకరినొకరు ఓదార్చుకుంటారు. ఆశ్రమంలో చేరి వెళ్లిపోయిన వారిని గుర్తుచేసుకుంటారు. సరదాగా పాటలు పాడుకుంటారు. పని మనుషులు ఉన్నా ఎవరి పనులు వారు చేసుకుంటారు. కొద్దిగా ఓపిక చేసుకుని మొక్కలకు నీళ్లు పెట్టడం, పాదులు తీయడం లాంటి పనులూ చేస్తుంటారు. ఇప్పుడివే వారి వ్యాపకాలు. ఒకే రక్తం పంచుకుని
పుట్టకపోయినా తోబుట్టువుల్లా కలిసి ఉంటున్నారు. ఎందుకంటే రక్తసంబంధాల మీద వారి నమ్మకం ఎప్పుడో పోయింది. ఆ రక్తం కడిగేసుకున్నాక ఇప్పుడు వారి మధ్య ఎలాంటి తారతమ్యాలు లేవు. గతంలో అనుభవించిన కష్టాలలో తేడా తప్ప.
అమ్మనాన్నల తాజ్‌మహల్
బండారు రంగారెడ్డి స్వాతంత్ర సమరయోధులు. ఆయనకు మిగిలింది కేవలం ఆయన భార్య సరోజిని దేవి జ్ఞాపకాలే. షాజహాన్‌లా ఆమె కోసం తాజ్‌మహల్ కట్టలేకపోయినా, తనలాంటి నలుగురికి కనీసం గంజి అయినా పోసి సేవచేయాలనుకున్నాడు. మిఠాయిల పుల్లారెడ్డి సూచన మేరకు వ్యాపారంలా కాకుండా వయోధికులకు నిజంగా అండగా నిలవాలనుకున్నాడు. మిఠాయిల పుల్లారెడ్డి సలహాతో పాటు, ఆ
ర్థిక సహాయం కూడా అందించారు. భూదాన్ బోర్డు వారు ఇచ్చిన రెండెకరాల్లో పది గదులు నిర్మించి 2005లో సదనాన్ని ప్రారంభించారు. నిన్నటి వరకు రంగారెడ్డి పెన్షనే సదనానికి ఆధారం. ఇప్పుడు నలుగురూ నాలుగు చేతులు వేస్తున్నారు. తనకు వయసు పైబడడంతో సదనం బాధ్యతను మిత్రుడు కొల్లా భాస్కరరావుకు అప్పగించారు రంగారెడ్డి. ఇప్పుడా సదనం అమ్మానాన్నలకు నిజంగా తాజ్‌మహల్.

కదిలిస్తే కన్నీరే
సదనంలో ఉన్న వాళ్లలో ఏ ఒక్కరిని కదిలించినా మొదట మౌనం... ఆ పైన కట్టలు తెగే దు:ఖం. కన్నవాళ్ల గురించి అడిగితే వాళ్లని గుర్తుచేసుకోకపోవడమే మేలని ఒకరంటారు. చెప్పుకోవడానికి సిగ్గుపడతారు ఇంకొకరు. ఉన్నా నాకెవరూ లేరని కోప్పడతారు మరొకరు. ఎవరిని కదిలించినా పొడిపొడి మాటలే... ఆ పొడిమాటల వెనుక కన్నీటి కథలే. కనకమ్మ సదనంలో చేరాక తన దగ్గర ఉన్న ఓ నోటుపుస్తకంలో ఒక ఫోన్‌నెంబర్ దొరికింది భాస్కరరావుకి. ఆయన ఫోన్ చేస్తే అది కనకమ్మ కూతురి నెంబరని తెలిసింది. 'మీ అమ్మ బతికే ఉంది. తీసుకెళ్లమని' బతిమాలినా? ఆ కూతురు ఒప్పుకోలేదు. భాస్కరరావు సదనం తరపున నెలకు ఐదొందల రూపాయలు ఇస్తామన్నా వద్దంది. ఇప్పటికీ కనీసం ఒక్కసారి కూడా చూడడా
నికి రాలేదు. ఇప్పుడు కనకమ్మ కాటికి కాలు చాచింది. కన్నకూతురి కడచూపైనా ఈ తల్లికి దక్కుతుందో? లేదో?. మొన్న సంక్రాంతి సమయంలో చలికి తట్టుకోలేకపోతే భాస్కర రావుగారే దగ్గరుండి ఆమెను కాపాడుకున్నారు. ఏ జన్మ బంధమో వారిది. 'నేను చస్తే ఏం చేస్తావని' కనకమ్మ భాస్కరరావుగారికి అడిగిందట. అప్పుడాయన 'నేను తలకొరివి పెడతాలే' అన్నాడట. కనకమ్మ అప్పుడు కన్నీరు పెట్టుకుంటూ తను ఎన్నాళ్ల నుంచో దాచుకున్న ఒక వెండి బిళ్లని తీసి ఇది నేను చనిపోయాక నా నోట్లో పెట్టు అని ఇచ్చిందట. భద్రంగా దాన్ని బీరువాలో దాచిపెట్టిన భాస్కరరావు గారు చెబుతున్నప్పుడు ఆయన కళ్లు చెమర్చాయి.
ఆత్మీయ నేస్తాలు
రంగమ్మది ఇంకో కథ. పిల్లలు లేరు. ఆస్తులున్నాయి. మేనల్లుడు తనను చూసుకుంటానంటే ఆస్తి అంతా ఆమ్మి ఆ డబ్బు ఇచ్చింది. అతనేమో వంచన చేసి, హైదరాబాద్ తీసుకొచ్చి ఓ ఆశ్రమంలో చేర్చాడు. రెండు నెలలు అక్కడ డబ్బు కట్టాడు. ఆ తర్వాత ఆ డబ్బుతో అమెరికా చెక్కేశాడు. డబ్బు కట్టకపోయే సరికి ఆ ఆశ్రమం నుంచి రంగమ్మని బయటికి గెంటేశారు. ఇక్కడకు వచ్చిపడింది. సుక్కమ్మ కూడా పిల్లలు పుట్టకపోతే భర్తకు ఇంకో పెళ్లి చేసింది. వారికి ఓ కూతురు పుట్టింది. సుక్కమ్మ భర్త చనిపోయాక ఆ ఇల్లు ఓ నరకం అయిపోయింది. ఇల్లు వదిలి వీధిన పడింది. పద్మమ్మది, శామలమ్మది కూడా ఇంచుమించు ఇలాంటి కథే. ఈ చేదు జ్ఞాపకాలను దిగమింగుకుని, చివరి రోజుల్లో మధురజ్ఞాపకాల కోసం అన్వేషిస్తూ జీవిస్తున్నారు వారంతా. ఇప్పుడు వాళ్లకు రక్తం పంచుకు పుట్టిన వాళ్లు లేరు.. కానీ అంతకు మించిన ఆత్మీయ నేస్తాలున్నారు. వారితో పంచుకుంటున్న మధురజ్ఞాపకాలున్నాయి.
మాది ప్రేమాలయం
రంగారెడ్డి గారికి వయసు పైబడింది. తాను నాటిన పచ్చని మొక్క మరింత ఏపుగా పెంచాలన్న కోరిక మాత్రం తీరలేదు. అందుకే ఆ బాధ్యతను తన మిత్రుడు కొల్లా భాస్కరరావుకు అప్పగించారు. ఆయన రాష్ట్రంలో ఎన్నో వృద్ధాశ్ర

మాలను సందర్శించారు. వాటి తీరుతెన్నులపై పరిశోధన చేశారు. దిక్కులేని వందలమందిని ఆశ్రమాల్లో చేర్పించారు. ఐదేళ్లుగా ఇదే సదనంలో ఒకడుగా ఉంటున్నారు. సదనంలో తనచేతుల మీద పెంచిన తోటంతా తిప్పి చూపిస్తూ ఇలా చెప్పారు. "ఇందులో నా ఒక్కడి చె య్యేం లేదు. నా మిత్రులు శనగపల్లి సుబ్బారావు, సర్వేశ్వరరెడ్డి, రమాకుమారి సహకారం కూడా ఉంది. ఇక్కడ పెరిగిన ప్రతి మొక్కతో, ప్రాణితో నాకు అనుబంధం ఉంది. వృద్ధుల భారం తాత్కాలికంగా దూరం చేసుకుని, సమాజం కోసం అప్పుడప్పుడు శుభకార్యాలకు ఇంటికి తీసుకుపోతుంటారు చాలామంది. అటువంటి వారు డబ్బుతో నడిపే వాటిలో చేరడం మేలనేది నా సలహా. అందరినీ వదులుకొని వచ్చే వారికి మాత్రమే ఇక్కడ చోటు ఇస్తున్నాం. చేరిన తర్వాత ఇంటికి పంపటం అనేది ఉండదు. ఎందుకంటే బంధువులు ఉన్నవారు చేరితే వారు తరచూ వచ్చిపోతుంటే మిగిలిన వారిలో భాధగలగడం సహజం. కొందరు అలా చేరి వెళ్లిపోతామంటే పంపించాం కూడా. ఎందుకంటే అందరు ఉన్న పదిమంది కంటే, నిజమైన అనాథలైన ఒకరిద్దరికి సేవ చేసినా చాలు. దాతలిచ్చిన నిధులను బట్టి ప్రస్తుతం మా సదనంలో ఎనిమిది మంది స్త్రీలకు, ఏడుగురు పురుషులకు ఖాళీలున్నాయి. మేం పంచభక్ష్య పరమాన్నాలేవీ పెట్టం. ప్రేమని మాత్రమే పంచుతాం. అనుబంధాల్పి అందిస్తాం. ఆప్యాయతలని పంచుతాం. ఈ వయసులో వారికి కావలసింది కేవలం మధుర జ్ఞాపకాలు వాటినే అందిస్తాం. దీనికి సహకరించాలనుకునేవాళ్లు వచ్చి వారితో పుట్టిన రోజు వేడుకో, వివాహ వార్షికోత్సవమో జరుపుకోవచ్చు. మనసుకు నచ్చిన సాయం చేయవచ్చు. సంప్రదించాల్సిన ఫోన్ నెం. 94901 13983.
వీళ్లు జీవితాన్ని చూశారు. తాము కని పెంచిన వాళ్లే కాదుపొమ్మంటే కాలమహిమ అనుకున్నారు. చరమాంకంలో బతుకుసమరం మొదలుపెట్టారు. ఆసరా కోసం వెదికారు. చివరికి ఇక్కడికి చేరారు. ఈ భామ్మలకు ఇప్పుడు కావాల్సింది పట్టెడన్నం... పుట్టెడు ఆదరణ. గుప్పెడు ప్రేమ... గుండెలు నింపే జ్ఞాపకం. ఇక్కడవి పుష్కలంగా దొరుకుతున్నాయి. జీవితాన్ని కష్టాలతో కొడిగట్టిపోనీకుండా మధుర జ్ఞాపకాలతో వెలిగించుకోవడమే అసలైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనిపించింది వారిని కలిశాక. వారితో కలిసి భోజనం చేసి అక్కడి నుంచయితే తిరిగి వచ్చేశాను. కానీ నా మనసు ఇంకా వారి చుట్టే తిరుగుతూ ఉంది.
ఆ భామ్మల పండు మొములు, భాస్కరరావుగారి బోసి నవ్వులు, కనకమ్మగారి వెండి బిళ్ల, తోటలో పూసిన పూలు, విరగ కాసిన కాయలు, ఆ చల్లని గారి, పచ్చని వాతావరణం.. ఇంకా ఇంకా గుర్తొస్తున్నాయి.
పి. ఎస్ : నేను ఒంటరిగా వెళ్లకుండా నా స్నేహితుడు వెంకట్‌ని కూడా తీసుకెళ్లాను. ఇద్దరం కలిసి ఒకేసారి హైదరాబాద్ వచ్చాం. ఇద్దరం కలిసి హైదరాబాద్‌లో దాదాపు అన్ని ప్రదేశాలూ చూశాం. కొన్ని రోజుల తర్వాత వాడు వెళ్లిపోయాడు. తిరిగి మళ్లీ ఇక్కడే సెటిల్ అయ్యేందుకు వాడు వచ్చాడు. ఆ రోజు తనని తీసుకెళ్లేముందు వాడికొక ప్రామిస్ చేశాను. నీకొక కొత్త హైదరాబాద్‌ని చూపిస్తానని. ఆశ్రమానికి వెళ్లేవరకు ప్రకృతినంతటినీ ఆస్వాదించిన వాడు ఆశ్రమం, తోట అన్నీ బాగున్నాయన్నాడు. కానీ నేను చూపిస్తానన్న 'కొత్త' ఫీలింగ్ మాత్రం వాడి మొహంలో కనిపించలేదు. ఇలాంటి వృద్ధాశ్రమాలన్నీ కమర్షియల్ బిజినెస్‌రా. నేను కూడా మస్తు చూశాను. ఇందులో పెద్ద గొప్పేం ఉందన్నాడు. బోర్డు మీద రాసి ఉన్న చందాలను లెక్కలేసి మరీ చక్రవడ్డీ తీశాడు. తిరిగి వచ్చేడప్పుడు అక్కడ మొదలుపెట్టిన వాడు హైదరాబాద్‌కి వచ్చే వరకు ఆపలేదు. వాడు ఎంతటి అనుభూతిని పొందాడో అలా చెప్పుకొచ్చాడు. భాస్కరరావు గారి కళ్లల్లో నీళ్లు వచ్చినప్పుడు వెంకట్ కళ్లల్లోనూ నీళ్లు తిరగడం నేను చూశాను. వెండి బిళ్లను పట్టుకుని పదే పదే తడిమి చూశాడు. నన్ను వదిలేసి ఆశ్రమంలో అన్ని గదులూ తిరిగి చూసొచ్చాడు. కర్రీ బాగోలేకపోతే కడుపు మార్చుకునే వాడు వాళ్లతో కలిసి కడుపునిండా తిన్నాడు. గోరుముద్దలు తినిపిస్తున్న ధనమ్మలో మాతృమూర్తిని చూశానని చెప్పాడు.
Comments