బస్సు ప్రయాణం పుస్తకాలు చదువుకోవడానికి బావుంటుంది. ఆచార్య హరి శివకుమార్ రాసిన ఓరుగల్లు అసలు చరిత్ర చదువుతుంటే.. నేను బస్సులో కాదు.. టైమ్ మెషీన్‌లో కాకతీయుల కాలం నాటికి వెళ్తున్నట్లు అనిపించింది. చారిత్రాత్మకమైన ఓరుగల్లు నగరాన్ని రాజధానిగా చేసుకుని సువిశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించిన కాకతీయ చక్రవర్తుల కాలం చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్పం, తేజం, త్యాగం, చైతన్యంతో చరిత్ర పుటల్లో సుస్థిరమైన, శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నారు కాకతీయులు. ఓరుగల్లు కోటలోని తోరణ స్తంభాలను చూపించి ఇవి ఏ ఊళ్లో ఉన్నాయని అడిగితే ఎవరైనా చెబుతారు వరంగల్‌లో అని. ఈ తోరణాల చెంతకే ఈ ప్రయాణం. మొబైల్‌లో గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తే.. 7 నిమిషాలు.. 2.7 కిలోమీటర్స్ అని చూపించింది. ఆటో బయలుదేరింది. ఇంకెప్పుడు వస్తుందా? అని ఒక ఎగ్జయిట్‌మెంట్. దూరంగా కోట గోడ..రెండు మట్టి గోడల తర్వాత రాతి ప్రాకారాన్ని దాటుతున్నప్పుడు వర్షం సినిమా ఇక్కడే షూట్ చేశారని ఆటోలో ఎవరో మాట్లాడుకుంటున్నారు. క్రీ.శ. 13వ శతాబ్దంలో గణపతి దేవుడు, ఆయన కుమార్తె ...