Skip to main content

ఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో..

zinmdhagi

బస్సు ప్రయాణం పుస్తకాలు చదువుకోవడానికి 
బావుంటుంది. ఆచార్య హరి శివకుమార్ రాసిన 
ఓరుగల్లు అసలు చరిత్ర చదువుతుంటే.. నేను బస్సులో కాదు.. టైమ్ మెషీన్‌లో కాకతీయుల 
కాలం నాటికి వెళ్తున్నట్లు అనిపించింది.

చారిత్రాత్మకమైన ఓరుగల్లు నగరాన్ని రాజధానిగా చేసుకుని సువిశాలమైన సామ్రాజ్యాన్ని 
పరిపాలించిన కాకతీయ చక్రవర్తుల కాలం 
చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్పం, తేజం, త్యాగం, 
చైతన్యంతో చరిత్ర పుటల్లో సుస్థిరమైన, శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నారు కాకతీయులు. 

ఓరుగల్లు కోటలోని తోరణ స్తంభాలను చూపించి ఇవి ఏ ఊళ్లో ఉన్నాయని అడిగితే ఎవరైనా 
చెబుతారు వరంగల్‌లో అని. ఈ తోరణాల 
చెంతకే ఈ ప్రయాణం. 

మొబైల్‌లో గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తే.. 7 నిమిషాలు.. 2.7 కిలోమీటర్స్ అని చూపించింది. 
ఆటో బయలుదేరింది. ఇంకెప్పుడు వస్తుందా? అని ఒక ఎగ్జయిట్‌మెంట్. దూరంగా కోట గోడ..రెండు మట్టి గోడల తర్వాత రాతి ప్రాకారాన్ని దాటుతున్నప్పుడు వర్షం సినిమా ఇక్కడే షూట్ చేశారని ఆటోలో ఎవరో మాట్లాడుకుంటున్నారు. 

క్రీ.శ. 13వ శతాబ్దంలో గణపతి దేవుడు, ఆయన కుమార్తె రాణి రుద్రమ దేవి కాలంలో నిర్మించిన ఈ కోట వరంగల్, హన్మకొండ పట్టణాలను కలుపుతూ 19 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. శత్రు దుర్భేద్యమైన ఈ కోటకు ఏడు ప్రాకారాలు, 45 బురుజులు ఉండేవి... అని గూగుల్‌లో చదువుతూ బయటికి చూస్తున్నాను. 

మూలమలుపులతో ఉన్న రాతి ప్రాకారాన్ని దాటి లోపలికి వెళితే అప్పటి నగరం తాలూకు ఆనవాళ్లు, రాజప్రసాదాలు, అందమైన శిల్పాలు, ఎన్నో అవశేషాలు. 
రోడ్డుకు ఎడమవైపున... సితబ్ ఖాన్ నిర్మించిన అపురూప కళాఖండం ఖుష్ మహల్ కోట గోడకు దగ్గర్లోనే ఉన్నది. చూసే అవకాశం దొరకలేదుగానీ కాకతీయుల ఆయుధాలు, పరిసర ప్రాంతాల నుంచి వెలికి తీసిన విగ్రహాలు అందులో ఉన్నాయట. 
అదిగో అల్లదిగో..
తెలంగాణ కీర్తి పతాక.. కాకతీయుల వైభవానికి ప్రతీక.. 
కళా తోరణం!!- కాదు.. కాదు.
ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కాకతీయ చరిత్రను కీర్తితోరణం అన్న కావ్యంగా రాశారు. అప్పటి నుంచి వీటిని కీర్తి తోరణాలు అని పిలుస్తున్నారు. శిలా తోరణాలు, హంస తోరణాలు, ద్వార తోరణాలు అనే పేర్లు కూడా ఉన్నాయి. పేపర్ వాళ్లు కళా తోరణాలు అని రాస్తున్నారు. కానీ వీటి అసలు పేరు తోరణ స్తంభాలు అని సిద్ధేశ్వర చరిత్ర (పు.108)లో రాసి ఉందట. 
తోరణ స్తంభాలు.. శిల్ప కళా నైపుణ్యానికి, ఇంజినీరింగ్ టెక్నాలజీకి నిలువెత్తు సాక్ష్యాలు.. ఫెర్గుసన్ పండితుడు - ఇవి సాంచీ స్థూప ద్వారాలను తలపిస్తున్నాయని ప్రశంసించాడు. కజిన్స్ పండితుడు - గుజరాత్‌లోని సిద్ధమాతృ దేవాలయంతో సాటి వచ్చేవన్నాడు. నాకు మాత్రం.. వీటికి ఏవీ సాటి రావు.. అనిపించింది. వీటికివే పోటీ! 

కోట మధ్య భాగంలో నాలుగు వైపులా నాలుగు తోరణాలు. ఒక్కో తోరణంలో నాలుగేసి స్తంభాలు. పైన అడ్డంగా పెట్టిన దూలం కింద ఏడు తామర మొగ్గలు. దూలానికి రెండు మూలల్లో అందంగా చెక్కిన హంసలు. తోరణానికి మకుటాయమానం ఈ రాజహంసలు. సాహసానికి ప్రతీకగా సింహాలు. 
ఈ తోరణ స్తంభాలలో మరొక విశేషం- వీటి మీద శైవ వైష్ణవ విగ్రహాలు, బౌద్ధ జైన చిహ్నాలేవీ కనిపించవు. వీటిని సర్వమత సామరస్యానికి చిహ్నాలుగా కాకతీయులు తీర్చిదిద్దారని తెలుస్తున్నది. 
నాలుగు తోరణ స్తంభాల మధ్య భాగంలో అద్భుతమైన శిలా సంపద - వేదికలు, ద్వారబంధ శిథిలాలు, నాట్య శిల్పాలు, పద్మపట్టికలు, అశ్వ, గజ పట్టికలు ఎన్నో ఎన్నెన్నో. 

వీటిని మామూలుగా పగటి పూట చూడడం కాదు.. ప్రతి రోజూ సాయంత్రం 7 గంటల తర్వాత జరిగే లైట్ షోలో వీక్షించడం గొప్ప అనుభూతి అని నిర్వాహకుడు రంజిత్ చెప్పాడు. దానికింకా సమయం ఉండడం వల్ల.. పక్కనే ఉన్న ఏకశిలని చూడడానికి వెళ్లాం. ఈ కొండ వల్లే ఓరుగల్లుకి ఏకశిలా నగరం అనే పేరు కూడా వచ్చింది. పార్కు మధ్యలోంచి పైకి ఎక్కేందుకు మెట్లు. పక్కనే చిన్న చెరువు. శిలపైకి ఎక్కితే చుట్టూ 20 కిలోమీటర్ల మేర అందమైన ఓరుగల్లు కనిపిస్తుంది. రాణి రుద్రమ నడయాడిన నేల మీద నేనిప్పుడు నిలబడ్డానన్న ఫీలింగ్ చెప్పడానికి మాటల్లేవ్. మాట్లాడుకోవడల్లేవ్. పదిలంగా.. స్యామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్‌లో బంధించిన పనోరమా షాట్ తప్ప. 

సాయత్రం 7 గంటలు..

నాలుగు తోరణాల మధ్య భాగంలో కొన్ని కుర్చీలు వేసి ఉన్నాయి.. రోజు వర్కింగ్ డే కావడం వల్ల సీట్లు నిండడానికి కాస్త సమయం పట్టింది. లైట్స్ ఆఫ్ అయ్యాయి. అంతా చీకటి. 
ఒక వాయిస్ ఓవర్.. (ఎస్పీ బాలు)
అఖండ భారత దేశానికే తలమానికం. సామాన్యమైన పోరాట పటిమ, అపూర్వ పరిపాలనా దక్షత, అద్వితీయ కళా పిసాస కలిగిన కాకతీయుల చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఈ కళారూపాలు. భారతీయ సంస్కృతికే ఒక కృతిని.. ఆకృతిని కల్పించి తమలో దాగిన ఆగమజ్ఞాన నిధిని, తత్వార్థ ఖనిని రాళ్లలో ఇమిడ్చిన కాకతీయుల ప్రతిభ అనన్యం.. అపూర్వ.. అజరామరం.. స్పందించే మనసుంటే ఇక్కడి ప్రతి రాయీ సుమధురమే. వీక్షించే కనులుంటే ప్రతి శిల్పం మనోహరమే. అద్భుతమైన కాకతీయుల కళామణిహారంలోంచి జాలు వారిన ఆణిముత్యాలివి. కాలగమనంతో పాటే తామూ గతించకుండా.. ఎన్ని ప్రభావాలకి లోనైనా తమ ప్రాభవాన్ని కోల్పోకుండా మనకు కాకతీయుల వైభవాన్ని చెప్పేందుకు సజీవంగా నిలువెత్తున నిల్చున్నాయి. 

వాయిస్ ఓవర్ ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం. ఎదురుగా ఉన్న మొదటి తోరణంపై రంగు రంగుల లైట్లు పడ్డాయి. అది తనని తాను పరిచయం చేసుకుంది. కాకతీయుల వైభవాన్ని కళ్లారా చూసిన ఆ శిల్పం మనకు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేసింది. 

అక్కడి ప్రతి రాయికీ భాష తెలుసు. భావం తెలుసు. అనుభూతి తెలుసు. ఆవేదన, ఆర్ధ్రతాతెలుసు. 
కాకతీయుల పుట్టు పుర్వోత్తరాల నుంచి మొదలు పెట్టి ఒకసారి ఎడమవైపు.. మరోసారి కుడివైపు.. అప్పుడప్పుడు వెనుక నుంచి, ఇంకోసారి ఎదురుగా ఉండే రంగు రంగుల కాంతి వెలుగుల్లో, రకరకాల కంఠాలతో చరిత్ర చెబుతుంటాయి. మధ్య మధ్యలో సంభాషణలు కళ్లు మూసుకుంటే మనం కాకతీయుల నిండు సభలో ఉన్న అనుభూతి కలిగిస్తాయి. గణపతి దేవుడు మన ముందు నడుస్తాడు. రుద్రమ దేవికి పట్టాభిషేకం జరుగుతుంది. సందర్భాన్ని బట్టి సౌండ్ ఎఫెక్ట్స్, లైట్స్... ఇక్కడ హైలైట్స్. 
అప్పుడు రాణీ రుద్రమ దేవరాజు యుద్ధానికి బయలు దేరారు అని గర్వంగా ఒక తోరణం చెప్పినప్పుడు...
గుర్రం ఒక్కసారిగా సకిలించింది. టక టక టక.. అంటూ గుర్రపు డెక్కల శబ్దం.. దూరంగా చెట్ల మీద కలర్‌ఫుల్ లైట్ల మధ్య మనం నిజంగానే రుద్రమ దేవిని చూస్తున్న అనుభూతి. 
కత్తులు కటోరాల శబ్దంలో.. రోమాలు నిక్కబొడిచి మనమూ రుద్రమకు తోడుగా యుద్ధం చేయాలనిపిస్తుంది. 

వెనుక సీట్లో కూర్చున్న ఒకతను నన్ను గట్టిగా పిడిగుద్దు గుద్దినాడు. ఏంటా అని చూస్తే.. అతను ఆల్రెడీ యుద్ధంలో లీనమై ఉన్నాడు. 

ఎనభై ఏళ్ల వయసులో యుద్ధానికి వెళ్లి వీరమరణం పొందిన రుద్రమ.. సాక్షిగా.. 
రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. 
కానీ మన చరిత్రని, సంస్కృతిని, వైభవాన్ని ఎలుగెత్తి వినిపించేందుకు ప్రాణంలేని శిలలు జీవం పోసుకుని ఇక్కడ నిటారుగా నిలబడ్డాయి. ఆధునిక మానవ మనుగడలో నిన్నటి వరకు మౌనంగా రోదించిన ఈ తోరణాలు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని సంతరించుకుని ముందు తరాలకు మన వైభవాన్నీ చాటాలని కోరుకుంటూ బయటికి వస్తున్నప్పుడు.. 
గేటు దగ్గర.. కాకతీయల శిల్ప సౌందర్యాలకు పునాదులు వేసిన నీళ్లలో తేలే ఇటుకని ప్రత్యేకంగా చూసి తరించాల్సిందే! 

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...