నాడు.. రామదాసు నిలువనీడలేని శ్రీరాముడికి గుడి కట్టిస్తే.. నేడు.. ఈ పరమదాసు నరసింహుడికి గుట్టనే గుడిగా మలిచి ఇచ్చాడు! కాకులు దూరని కారడివిని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చి.. అనంత శోభ తీసుకొచ్చాడు! ఆయనో ఆధ్యాత్మిక వేత్త కాదు.. అతి సాధారణ ఓ పశువుల కాపరి! భక్తిని శక్తిగా మార్చుకుని.. దైవసేవనే లోకసేవగా భావించి.. గుట్టను తొలిచి గుడిని చేశాడు! ఆలయమే ఇల్లుగా.. నారసింహుడి సేవే పరమావధిగా యావత్ జీవితాన్ని దైవపూజకు అంకితం చేశాడు! 85 ఏళ్ల వయసులోనూ.. వెల్చాల్ శ్రీలక్ష్మీ నరసింహస్వామికి నిత్య పూజారిగా సేవ చేస్తున్న పరమదాసు యాదవ్‌ను పరిచయం చేసుకుందాం! యాభై ఏండ్ల క్రితం అదొక కాకులు దూరని కారడవి. పశువుల కాపరులు మాత్రమే కనిపించే నిర్మాణుష్య ప్రాంతం. అలాంటిది ఇప్పుడు పచ్చని చెట్లతో.. ప్రకృతి రమణీయతతో పరిఢవిల్లుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం. నిత్యం పూజా వైభవకాంతితో కళకళలాడుతున్నది. ఈ అద్భుత సృష్టికి కారణం ఒక సామాన్యుడు. అంతులేని భక్తి ప్రపత్తులతో నారసింహుడిని కీర్తిస్తున్న పరమదాసు యాదవ్. వర్షం మార్చిన జీవితం వికారాబాద్‌జిల్లా వెల్చాల్ గ్రామ సమీపంలో ఉంది ఈ ప...