గుట్టను తొలచి..గుడిగా మలిచిన ఒకే ఒక్కడు

By | January 27, 2017 Leave a Comment

 


నాడు.. రామదాసు నిలువనీడలేని శ్రీరాముడికి గుడి కట్టిస్తే..  నేడు.. ఈ పరమదాసు నరసింహుడికి గుట్టనే గుడిగా మలిచి ఇచ్చాడు!  
కాకులు దూరని కారడివిని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చి.. అనంత శోభ తీసుకొచ్చాడు! ఆయనో ఆధ్యాత్మిక వేత్త కాదు.. అతి సాధారణ ఓ పశువుల కాపరి!
 భక్తిని శక్తిగా మార్చుకుని.. దైవసేవనే లోకసేవగా భావించి.. గుట్టను తొలిచి గుడిని చేశాడు! ఆలయమే ఇల్లుగా.. నారసింహుడి సేవే పరమావధిగా యావత్ జీవితాన్ని దైవపూజకు అంకితం చేశాడు! 
85 ఏళ్ల వయసులోనూ.. వెల్చాల్ శ్రీలక్ష్మీ నరసింహస్వామికి నిత్య పూజారిగా సేవ చేస్తున్న పరమదాసు యాదవ్‌ను పరిచయం చేసుకుందాం!

యాభై ఏండ్ల క్రితం అదొక కాకులు దూరని కారడవి. పశువుల కాపరులు మాత్రమే కనిపించే నిర్మాణుష్య ప్రాంతం. అలాంటిది ఇప్పుడు పచ్చని చెట్లతో.. ప్రకృతి రమణీయతతో పరిఢవిల్లుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం. నిత్యం పూజా వైభవకాంతితో కళకళలాడుతున్నది. ఈ అద్భుత సృష్టికి కారణం ఒక సామాన్యుడు. అంతులేని భక్తి ప్రపత్తులతో నారసింహుడిని కీర్తిస్తున్న పరమదాసు యాదవ్.

వర్షం మార్చిన జీవితం 
వికారాబాద్‌జిల్లా వెల్చాల్ గ్రామ సమీపంలో ఉంది ఈ ప్రాంతం. ఒకప్పుడు దట్టమైన చెట్లతో కారడవిని తలపిస్తూ పులులు సంచరించడంతో ఈ గుట్ట ప్రాంతాన్ని పులిలొంకగా  పిలుస్తారు. ఆ గుట్టకు పశువులను మేపేందుకు వెళ్లేవారు పరమదాసు. వర్షంవస్తే తలదాచుకోవడం కోసం గుట్టను తొలచి చిన్నపాటి స్థావరం ఏర్పరచుకున్నారు. ఒకరోజు కురిసిన కుండపోత వర్షం ధాటికి తట్టుకోలేక మిగిలినవాళ్లంతా ఇంటికి వెళ్లిపోతే ఆయన మాత్రం అక్కడే ఉన్నారు. రాత్రి కలలో నరసింహస్వామి కనిపించి తనకూ గుట్టపై చోటు కల్పించాలన్నారట!

తిరిగి ఇంటికెళ్లలేదు 
మరుసటి రోజు స్నేహితులంతా గుట్టకు వెళ్లారు. పొద్దుమూకంగానే ఇంటికెళ్లిపోయారు. పరమదాసు మాత్రం ఇక ఇంటికి వెళ్లొద్దని నిర్ణయించుకున్నారు. స్వామి ఆజ్ఞానుసారం గుట్టను తవ్వడం ప్రారంభించారు. ఆకలి.. దప్పికలనూ మరచిపోయి రాత్రింబవళ్లు గుట్టను తొలిచారు. రోజూ కష్టపడుతూ సొరంగం లాంటి దొనను తొవ్వారు. పరమదాసు ప్రయత్నానికి గ్రామస్తుల సహకారం లభించింది. లక్ష్మీ నరసింహుడిని ప్రతిష్టింపజేసి ప్రతీ సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

గుట్టల్లో అద్భుతం 
బయట నుంచి చూస్తే మామూలు గుట్టల్లాగే పులిలొంక కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే అద్భుతాలు కనిపిస్తాయి. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని ఆ సమయంలో ఇంత పెద్ద దొనను ఒంటరిగా ఆవిష్కరించడం నిజంగా అద్భుతమేనంటారు ఈ ప్రాంతాన్ని దర్శించినవారు. నున్నటి గోడలతో కనిపించే దొన లోపలిభాగం పూతపూసినట్టుగా ఉంటుంది. అదంతా పరమదాసు చేతిమాయే. ఆ కళాత్మకత చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. గుట్ట మొదట్లో పరమదాసు తవ్వించిన గుండంలో నీరు ఎప్పుడూ పుష్కలంగా ఉంటుంది!

స్వామికే తెలుసు 
ఇంత పెద్ద గుట్టను తొలిచి గుడిగా మలిచిన వ్యక్తి బాగా బలిష్టుడై ఉంటాడనుకోవచ్చు. కానీ పరమదాసు మాత్రం బక్కపలుచని మనిషి. రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు. ఇతరుల చేతితో ఏం పెట్టినా తినరు. మంత్రాలు.. తంత్రాలు వంటివి ఆయనకసలు తెలియవు. ఆడంబరాలు ఉండవు. ధోతి.. బనీను.. మెడలో జపమాల.. భుజాలపై ఒక గొంగడి.. ఇదే ఆయన ఆహార్యం. ఎవ్వరికీ ప్రత్యేక ఆహ్వానాలుండవు. అంతా ఆ స్వామికి తెలుసు.. నన్నూ ఆయనే నడిపిస్తున్నారు. మీ బాధలు.. కోర్కెలు ఏమైనా ఉంటే ఆయనతో చెప్పుకోండి అంటూ భక్తులకు తనవంతు సలహా ఇస్తుంటారు తప్ప వేరే ఏమీ సందేశాలివ్వరు పరమదాసు. స్వామి ఆదేశానుసారమే ఇదంతా చేశానని.. ఆయనే చేయించుకున్నాడని చెప్తారు!

మరెన్నో ఆలయాలు
లక్ష్మీ నర్సింహుడికే కాదు ఈ గుట్టపై మరెన్నో దేవాలయాల్ని స్థాపించి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారాయన. బద్రీనాథేశ్వరస్వామి, మల్లిఖార్జునస్వామి, ఆంజనేయ స్వామి, నాగేశ్వర స్వామి.. వేరువేరు ఆలయాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. వికారాబాద్ నుంచి సదాశివపేట వెళ్లే మార్గంలో ఉంటుంది వెల్చాల్. అక్కణ్నుంచి ఆటోల్లో నరసింహస్వామి గుట్టకు చేరుకోవచ్చు. నడిచి కూడా వెళ్లొచ్చు. మొక్కులు తీర్చుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వంటావార్పు చేసి స్వామికి నైవేద్యం సమర్పించి ఇంటిళ్లిపాది భోజనాలు చేసి వెళ్తుంటారు.

ఉత్సవ వైభవం! 
ఆయనెప్పుడో యువకుడిగా ఉన్నపుడు స్వామికి అంకితమయ్యాడు. ఇప్పుడాయన వయసు 85 సంవత్సరాలు. ఇన్నాళ్లు ఒంటరిగా సేవ చేస్తున్న పరమదాసు వయోభారాన్ని అర్థం చేసుకుని గ్రామస్తులు ఓ కమిటీ వేసుకుని పర్యవేక్షణ చూస్తున్నారు. గుట్ట పరిసరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ప్రతీ సంవత్సరం వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఊళ్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం నుంచి గుట్ట వరకు స్వామివారి ఉత్సవ విగ్రహానికి నిర్వహించే రథోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. హోలీ పండగకు మూడు రోజుల ముందు ఉత్సవాలు ముగుస్తాయి.ప్రభుత్వ సహకారం లభిస్తే ఈ క్షేత్రం మరింత అభివృద్ధ్ది చెందే అవకాశం ఉంది. గొప్ప పర్యాటక క్షేత్రంగానూ మారుతుందంటున్నారు గ్రామస్తులు.

ఎలా వెళ్లాలి?
బస్సులో అయితే హైద్రాబాద్ ఎంజీబీస్ నుంచి వికారాబాద్ చేరుకుని.. అక్కణ్నుంచి సదాశివపేట వెళ్లే బస్సుల్లో వెల్చాల్ కు చేరుకోవచ్చు. హైద్రాబాద్ నుంచి బీదర్ వెళ్లే బస్సుల్లో సదాశివపేటకు వచ్చి.. అక్కణ్నుంచి వికారాబాద్ వెళ్లే బస్సుల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక్కడికి రైలు సదుపాయం కూడా ఉంది. బీదర్ వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, ఇతర ప్యాసింజర్ రైళ్లు, వెల్చాల్‌కు సమీపంలో ఉన్న మొరంగపల్లి (సదాశివపేట్ రోడ్) స్టేషన్‌లో ఆగుతాయి. అక్కణ్నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో లక్ష్మీనరసింహాస్వామి క్షేత్రం ఉంటుంది.

Story by Santosh Kumar pyata, 
source : Namasthe Telangana

0 comments: