ఎర్ర రొయ్యల్లో.. చింత చిగురు..శనగపప్పు.. వేస్కొని తింటే..

By | January 24, 2017 Leave a Comment

అబ్బ.. ఏం కాంబినేషనబ్బ ఇది? వింటేనే నోట్లో ఊరీలొస్తున్నాయి! చెరువులో నీళ్లుండి.. చేతినిండా పని ఉన్న రోజుల్లో.. చేను ఒడ్డుపై కూర్చుని రొయ్యల కూర తింటుంటే.. ఆ రుచుల ఘుమఘుమలు కిలోమీటర్ దాకా వెళ్లేవంట! చాలారోజుల తర్వాత చెరువుల్లో నీళ్లొచ్చాయి.. చేపలు.. రొయ్యల పెంపకానికి మంచిరోజులొచ్చాయి! తెలంగాణ నాటుదనపు ఘాటు వంటకమైన 
ఈ రొయ్యల వెరైటీలను మనమూ రుచి చూస్తే.. ఆ మజాయే వేరప్పా.! 

అరిటాకు రొయ్యలు


aritaku

కావాల్సినవి :


రొయ్యలు : 200 గ్రా, కారం : ఒక టీస్పూన్, పసుపు : అర టీస్పూన్, గరం మసాలా : అర టీస్పూన్, అరటి ఆకు : ఒకటి, కొత్తిమీర : ఒక కట్ట, పుదీనా : ఒక కట్ట, నూనె, ఉప్పు : తగినంత

తయారీ :


ముందుగా రొయ్యలను బాగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దీన్ని అరిటాకులో చుట్టి నిప్పుల మీద కాల్చాలి. బాగా కాలిన తర్వాత ఆకు నుంచి తీయాల్సి ఉంటుంది. వీలైతే మరో అరిటాకు తీసుకొని ఈ కూరను అందులో పెట్టి సర్వ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. 

చిట్టి ముత్యాల రొయ్యల పలావ్


pulav

కావాల్సినవి :

రొయ్యలు : 200 గ్రా., బియ్యం : 250 గ్రా., కారం : ఒక టీస్పూన్, ధనియాల పొడి : ఒక టీస్పూన్, గరం మసాలా : పావు టీస్పూన్, మిరపకాయలు : 2 టీస్పూన్స్, కొత్తిమీర : అర కట్ట, పుదీనా : అర కట్ట, ఉల్లిపాయ : 1, నెయ్యి : 2 టీస్పూన్స్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీస్పూన్స్, నూనె : 2 టీస్పూన్స్,ఉప్పు : తగినంత 

తయారీ :

ముందుగా రైస్ నానబెట్టాలి, ఆ తర్వాత రొయ్యలు కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేగాక, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, రొయ్యలు వేయాలి. ఇవి వేగిన తర్వాత బియ్యం వేసి సరిపడా నీళ్లు పోయాలి. సన్నని మంట మీద అన్నం ఉడికే వరకు అలాగే ఉంచాలి. చివరగా నెయ్యి వేసి పదిహేను నిమిషాల పాటు దమ్ మీద అన్నాన్ని ఉడికించాలి. సూపర్ పులావ్ నోరూరిస్తుంది. దీన్ని రైతాతో తింటే కూడా చాలా బాగుంటుంది. 

రొయ్యల బూందీ


bhundi

కావాల్సినవి :

రొయ్యలు : 200 గ్రా., కార్న్‌ఫ్లోర్ : 50 గ్రా., మైదా : 50 గ్రా., కారం : ఒక టీస్పూన్, ధనియాల పొడి : ఒక టీస్పూన్, మిరపకాయలు : 50 గ్రా., వెల్లుల్లి : 50గ్రా, అల్లం : 50 గ్రా. కొత్తిమీర : ఒక కట్ట, ఉప్పు, నూనె : తగినంత 

తయారీ :

రొయ్యలను కడిగి పెట్టుకోవాలి. ఇందులో కార్న్‌ఫ్లోర్, మైదా, ఉప్పు, కారం వేసి కలపాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఈ రొయ్యలను డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. వీటిని ఒక ప్లేట్‌లో వేసి పక్కన పెట్టాలి. మరో కడాయిలో కొద్దిగా నూనె పోసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. ఇవి వేగాక ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, చివరగా వేయించుకున్న రొయ్యలను వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. వేడి..వేడి రొయ్యల బూందీ రెడీ!

చింతచిగురు ఎర్ర రొయ్యలు


chinta-chiguru

కావాల్సినవి :

రొయ్యలు : 200 గ్రా., చింతచిగురు : 50 గ్రా. శనగపప్పు : 100 గ్రా.,
కారం : ఒక టీస్పూన్ 
పసుపు : అర టీస్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్, 
గరం మసాలా : అర టీస్పూన్, 
కరివేపాకు : 2 రెమ్మలు, 
పచ్చిమిర్చి : 2ఉల్లిపాయలు : 2, 
కొత్తిమీర : ఒక కట్ట ఉప్పు, నూనె : తగినంత 

తయారీ :

శనగపిండిని పప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. రొయ్యలను కూడా మంచిగా కడిగా పెట్టాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. దీంట్లో రొయ్యలు వేసి వేగనివ్వాలి. ఇవి వేగాక ఉప్పు, కారం, గరం మసాలా, చింత చిగురు వేసి మగ్గనివ్వాలి. కాసేపటి తర్వాత ఉడికించిన పప్పు వేసి మూత పెట్టేయాలి. సన్నని మంట మీద రెండు నిమిషాలు ఉంచాక కొత్తిమీర వేసి దించేయాలి. నోరూరించే చింతచిగురు ఎర్ర రొయ్యలు మీ ముందుంటుంది. 

వంకాయ రొయ్యల కూర


vankaya

కావాల్సినవి :

రొయ్యలు : 200 గ్రా., వంకాయలు : 100 గ్రా., ఉల్లిపాయ : 1, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి : 2, కొత్తిమీర : అర కట్ట, గరం మసాలా : ఒక టీస్పూన్, నూనె : 2 టీస్పూన్స్, చింతపండు రసం : 2 టేబుల్‌స్పూన్స్ , పసుపు : అర టీస్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్ , ఉప్పు, కారం : తగినంత 

తయారీ :

కడాయిలో నూనె వేసి గరం మసాలా దినుసులు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీంట్లో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి, ఆ తర్వాత వంకాయలు వేసి మూత పెట్టుకోవాలి. ఇవి కాస్త వేగాక రొయ్యలు వేయాలి. ఇవి కాస్త వేగాయనుకున్నాక చింతపండు రసం వేసి కాసేపు మరగనివ్వాలి. ఇందులో ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి సన్నని మంట మీద కాసేపు ఉండనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. రుచికరమైన వంకాయ రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుంది. 

0 comments: