నా ప్రియ శత్రువు

By | January 16, 2009 4 comments



ఆగస్టు 16, 2004... మధ్యాహ్నం 1.40...

ఆ రోజు తొలిసారిగా చంటిని చూశాను. డిగ్రీ పూర్తయ్యాక అతను నేను పనిచేస్తున్న స్కూల్లో టీచర్‌గా చేరాడు. నేను చాలా రిజర్వ్‌డ్‌. కొత్త వాళ్లతో చాలా తక్కువ మాట్లాడేదాన్ని. స్నేహితులతో మాత్రం తెగ వాగేస్తాను. చంటి ఎప్పుడూ నాతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. తొందరలోనే నాకు మంచి స్నేహితుడయ్యాడు. కొన్ని నెలల తర్వాత తను నన్ను ప్రేమిస్తున్నట్లుగా అర్థమైంది. కానీ తను మాటల్లో చెప్పే వాడు కాదు. తన చేతల్లో మాత్రం అది కనిపించేది. నా ప్రేమ కోసం అతను వేసే ప్రతి అడుగు అతనికి కలిసొచ్చేది. చివరికి నా స్కూటీ కూడా. చలికాలంలో సాయంత్రం.. నలుగురు కిక్‌ కొట్టినా స్టార్ట్‌ అవ్వని బైక్‌ అదేంటో అతను మాత్రం ఒకే కిక్‌తో స్టార్ట్‌ చేసేవాడు. ఓ సారి నా చిన్నప్పటి ఫోటో చూపించాను. రెండు నిమిషాలే చూసి... తిరిగి ఇచ్చేశాడు. మరుసటి రోజు నా బొమ్మ తీసుకొనే తెచ్చాడు. అది నా ఫొటో పక్కన పెట్టి పోలిస్తే అచ్చుకొట్టినట్లే ఉందది. గీత కూడా పొల్లు పోలేదు. అది చూసి మొదటి సారి అతని మీద అభిమానం కలిగింది. రెండు నిమిషాలు చూసిన బొమ్మలు అలా ఎలా వెయ్యగలిగాడని చాలా రోజులు ఆలోచించా.తర్వాత ఓసారి మా అన్నయ్య రాసిన కవితల పుస్తకం ఇచ్చా. చదివాక ఇవో కవితలా? అని ఎగతాళి చేశాడు. నాకు చాలా బాధ అనిపించింది. కోపం కూడా వచ్చింది. "అంత సులువు అనుకుంటే ఓ కవిత రాయి చూద్దాం'' అన్నాను. చంటి రాసిన తొలి కవిత నా గురించే. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం అయ్యింది. కవితలంటే నాకు ప్రాణం. ఆ తర్వాత చంటి ఓ పుస్తకమే రాశాడు.ఒకసారి షాపింగ్‌కు వెళ్తే ఒక చిన్నపాప బొమ్మ చూశాను. దాని నోట్లో పీక ఉంటుంది. దాన్ని లాగగానే పాప ఏడుస్తుంది. ఎంత బాగుందో బొమ్మ. కానీ నేను ఆ రోజు దాన్ని కొనలేకపోయా. ఆ విషయం అతనికి ఎలా తెలిసిందే.. మర్నాడు స్కూల్‌కు ఆ బొమ్మ తీసుకొని వచ్చాడు. నేను షాక్‌. ఎంత ఆనందమేసిందో. అది తన పాప అని.. తనకు తల్లి ప్రేమ కూడా కావాలని అందుకే నా చేతిలో పెడుతున్నానని చెప్పాడు. ఆ పాపకు పేరు కూడా పెట్టాడు. నిజానికి మా ఇంట్లో చాలా సమస్యలు. అతని పరిచ యం, మాటలు నా బాధలన్నీ మర్చిపోయేలా చేసేవి. సంవత్సరం తర్వాత నా పుట్టిన రోజున ప్రేమికులమయ్యాం. మరో ఏడాది... ఎన్నో తీపిగుర్తులు.. మరెన్నో చెదర జ్ఞాపకాలు.. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. కొన్ని రోజుల తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎవరో మమ్మల్ని విడదీసేందుకు చెప్పే మాటల్ని నమ్మేవాడు. కొడితే రెండు దెబ్బలు తినడానికైనా రెడీ కానీ.. మాటంటే తట్టుకోలేని మనస్తత్వం నాది. చంటి మాటలు తూటాల్లా ఉంటాయి. అతని మాటలు నా మనసుకు గాయం చేశాయి. రెండేళ్ల తర్వాత... ఒక అమ్మాయి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. "అంత గొప్ప ప్రేమ మీది... చంటిని వదిలి ఇంత జాలీగా ఎలా ఉండగలుగుతున్నారు మీరు'' అని ఆశ్చర్యపోయింది. ఆరా తీస్తే ఆ అమ్మాయి కూడా చంటిని ఇష్టపడింది. కానీ చంటి మాత్రం నా గురించే చెప్పాడట. నన్నింకా మరువలేదని.. మరిచిపోవడం కూడా అంత సులువు కాదని. ఆ అమ్మాయే మా ఇద్దరిని కలిపింది. ఇప్పుడు మేం ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రేమికులుగా కాదు. మంచి స్నేహితులుగా ఉంటున్నాం.

- జాబిలి

4 comments:

నేస్తం said...

:) bagundandi... chakkani mugimpu..kaani alaa undatam nija jevitam lo anta suluvu kaademo

Chari Dingari said...

వయసైపోయిన హీరో లందరూ రాజకీయనాయకులైనట్టు, విఫలమైన ప్రేమికులందరూ స్నేహితులైపోలేరు.....త్రివిక్రం శ్రీనివాస్

Anil Dasari said...

>> "సంవత్సరం తర్వాత నా పుట్టిన రోజున ప్రేమికులమయ్యాం"

ఫలానా రోజు దంపతులమయ్యాం, ఉద్యోగస్తులమయ్యాం, డిగ్రీలు తెచ్చుకున్నాం అనేవి విన్నా కానీ ఇది కొత్త ప్రయోగం. ఇలా కూడా ఉంటుందా?

naa said...

నేస్తం గారికి...
నిజమే... అలా ఉండడం అన్ని సార్లు సులువు కాకపోవచ్చు. నాక్కూడా ఇప్పటికీ అలాగే అనిపిస్తుంది.

నరహరి గారు....
ఔను త్రివిక్రం గారి మాటలు గుర్తున్నాయి. నాకూ బాగా నచ్చిన డైలాగ్‌ అది. కానీ వాస్తవం నాముందుంది.

అబ్రకదబ్ర గారు....
ప్రయోగం చేయకూడదంటారా? అయినా ... స్నేహితులమయ్యాం.. అంటాం. అలాగే ప్రేమికులమయ్యాం అని వాడాను. ఇది అంత ప్రయోగం కాదని నేను అనుకుంటున్నాను.