ధైర్యమే ఆమె ఆస్తి

By | August 25, 2009 1 comment
తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి... పుట్టాక ఆమె ఏడుపు ఆపేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు ఓ చేదు నిజం... ఆ తర్వాత మాట లూ రావని తెలిశాక వారి మనసులో మరో గరళం. కన్నవారి ఆదరణే కరువైతే... చుట్టూ ఉన్నవారి అభిమానం తనదౌతుందా? అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. కన్నీటి కడలిలో ఈదింది. చివరికి దరికి చేరింది. మౌనమే ఆమె భాష... ధైర్యమే ఆమె ఆస్తి... ఆమే హెలెన్‌ కెల్లర్‌ - 2007 అవార్డును అందుకున్న జానకి.

జానకి డెఫ్‌ అండ్‌ డంబే కాదు రఫ్‌ అండ్‌ టఫ్‌ కూడా. తాను అనుకున్నది సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటుంది. మాటలు రాకపోతే నేం. మౌనమే ఆమె భాష. ఆమె కన్నులు కూడా మాట్లాడతాయి. ఆ భావాలు అర్థం కాని వారి ముందు ఆమె చేతి వేళ్లు సెల్‌ఫోన్‌పై చకచకా కదిలి సమాధానాలు చెబుతాయి. వినిపించకపోతేనేం ఎదుటి వాళ్ల మనోభావాలను ఇట్టే పట్టేస్తుంది. తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు... అవి తనలాంటి వారెవరికీ ఎదురుకాకూడదనుకుంది. అందుకే బధిరుల కోసం సంస్థకు స్థాపించి వారికి సేవ చేస్తోంది.

జానకిది మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట. పుట్టి, పెరిగింది మాత్రం మహారాష్ట్ర పూనేలో. చదువు కూడా అక్కడే. ఇంటర్‌ వరకు చదువుకుంది. తల్లిదండ్రులు సత్తెమ్మ, చంద్రప్ప. తల్లి బీడీలు చేస్తుంది. తండ్రి తాపి మేస్త్రీ. వీరికి తొమ్మిది మంది సంతానం. జానకి చిన్నది. ఐదుగురు అక్కలు, ముగ్గురు అన్నయ్యలు. అసలే పేద కుటుంబం, ఎనిమిది మంది పిల్లలు. ఆ తల్లిదండ్రులకు కుటుంబ పోషణ భారమైంది. బతుకుదెరువుకోసం పూనే వెళ్లారు. జానకి కడుపులో ఉన్నప్పుడు కడుపులోనే చంపేయాలని నాటుమందులు వేసుకుంది సత్తెమ్మ. అందువల్ల మాట, వినికిడి లోపంతో జానకి పుట్టింది. కడుపులోనే చంపేయాలనుకున్న తల్లిదండ్రులు చెవిటి అమ్మాయి అని తెల్సిన తర్వాత బయట విసిరేయాలనుకున్నారు. కానీ ఆమె తాతయ్య అడ్డుకున్నాడు. జానికికిప్పుడు పాతికేళ్లు. రెండేళ్ల క్రితం పెళ్లిచేసుకుంది. ఆయన కూడా బధిరుడే. వారికిప్పుడు ఒక బాబు. వారిద్దరిదీ ఒకటే సమస్య కావడం వల్ల బాబును బంధువుల ఇంట్లో పెంచుతున్నారు.

కష్టాల కడలి
చిన్నప్పుడు టీచర్స్‌ చెప్పే పాఠాలు జానకికి అర్థమయ్యేవి కావు. చాలా బాధపడేది. అలా అని కృంగిపోలేదు. కష్టపడేది. ఒకటికి రెండుసార్లు చదివేది. పదో తరగతిలో స్కూల్‌ ఫస్ట్‌ వచ్చింది. ఎప్పుడైనా ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉంటే ఇంట్లో అందరూ వెళ్లేవారు. కానీ తనను మాత్రం తీసుకెళ్లేవారు కారు. అప్పుడు కార్చిన కన్నీళ్లు తనకింకా గుర్తున్నాయట.


బహుముఖ ప్రజ్ఞ
చిన్నప్పటి నుండే జానకిలో నాయకత్వ లక్షణాలు కోకొల్లలు. స్కూల్లో తనే ఎప్పుడూ క్లాస్‌ లీడర్‌. జానకి మంచి పెయింటర్‌ కూడా. జపాన్‌, అమెరికా, రష్యాల్లో అనేక పోటీల్లో పాల్గొంది. ఎక్కడైనా జానకిదే ఫస్ట్‌ ప్రైజ్‌. జానికికి డ్యాన్స్‌ కూడా బాగా వచ్చు. సంగీతం ఆమెకు అక్కర్లేదు. టీవీల్లో ఇలా చూసి అలా స్టెప్స్‌ వేసేస్తుంది. జపాన్‌లో కూడా నృత్య ప్రదర్శనలిచ్చింది.

ఫిన్‌ గురించి...
ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల నెట్‌వర్క్‌ ద్వారా ఏడు సంవత్సరాలుగా బధిరులకు సేవలు అందిస్తోంది. కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎదిగింది. వికలాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఆ తర్వాత వికలాంగుల నెట్‌వర్క్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం. శ్రీనివాస్‌ సహకారంతో పిన్‌ను స్థాపించింది. ఫిబ్రవరి 2007లో స్థాపించిన ఈ సంస్థ ద్వారా గ్రామీణ స్థాయిలో ఉన్న మాట, వినికిడి లోపం గల వారికి ప్రభుత్వ పథకాలు, హక్కులపై అవగాహన కల్పిస్తోంది. బధిరులను ఏకం చేసి వారి హక్కుల కోసం పోరాడుతోంది. వారికి ప్రవేటు కంపెనీల్లో, కార్పోరేట్‌ సంస్థలో ఉద్యోగాలు ఇప్పించి వారి జీవితాలను నిలబెడుతోంది. ఇప్పటి వరకు 50 మందికి ఉపాధి కల్పించింది. కరీంనగర్‌, నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో బధిరుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసింది. అన్ని జిల్లాలోనూ తన నెట్‌వర్క్‌ కోసం ముందడుగు వేస్తోంది.

'హెలెన్‌ కెల్లర్‌' అందరిదీ
వికలాంగుల కోసం సేవ చేసిన వారికి హెలెన్‌ కెల్లర్‌ అవార్డును ఇస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 2న ఈ అవార్డును జాతీయ స్థాయిలో ప్రకటిస్తారు. బధిరులకోసం జానకి చేసిన సేవలకు గాను 2007 అవార్డు ఆమెను వరించింది. ఇది తనకు మాత్రమే వచ్చిన గుర్తింపు కాదని రాష్ట్ర బధిరులందరిదనీ చెప్పే ఉదార స్వభావం ఆమెకే చెల్లింది.

ఇదే నా లక్ష్యం...
"సమాజంలో సరైన సమాచారం అందక బధిరులు చాలా బాధపడుతున్నారు. కుటుంబంలోనే ఆదరణ కరువైన వారెందరో. నా జీవితంలో ఎదురైన సమస్యలు ఎవ్వరికీ ఎదురుకాకూడదు. అన్ని జిల్లాల్లోనూ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసి, గ్రామీణ స్థాయిలో ఉన్న బధిరులను బయటికి తీసుకురావాలి. ఉన్నత చదువులు చెప్పించాలి. ఉపాధి కల్పించాలి. వారికి నేను ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. ఇదే నా లక్ష్యం. నా లక్ష్యమే నాకు కనిపిస్తుంది. బధిరులుతోనే నేను ఎక్కువగా గడుపుతాను. ఖాళీ సమయాల్లో మా బాబు దగ్గరకు వెళ్లి ఆడుకుంటాను. నేను కన్న కలలు వాడి ద్వారా నిజం చేసుకుంటాను.''


1 comments:

చిలమకూరు విజయమోహన్ said...

జానకి గారి చిత్రం ఉంటే అందించి ఉంటే బాగుండేది.