వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ

By | September 18, 2009 3 comments

నేను చాలా తక్కువగా మాట్లాడతానని చాలామంది అంటుంటారు. గొప్ప వాళ్లు ఇలాగే ఉంటారని నాకు నేను సర్తి చెప్పుకునేవాన్ని. అసలు నిజం చెప్పాలంటే నాకు నేనలా ఉండడం నచ్చదు. మానవుడు సంఘజీవి. నలుగురిలో తిరుగుతూ నలుగురు స్నేహితులని వెనుక వేసుకుంటేనే బొద్దిగా లోకజ్ఞానం పెరిగినట్లు అని అర్థమైంది. కాని ఎదుటి వారు ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా. అందుకే "వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ''.. సినిమాలో హ.. హ... హసినీ క్యారెక్టర్‌ డిసైడ్‌ చేసేందుకు ఇలా అడుగుతుంది. నిజమే కదా! ఒకరి గురించి తెలుసుకోవాలంటే నాలుగు మాటలు మాట్లాడాల్సిందే మరి. అందుకే ఇలా మొదలెట్టా.

'విభూషణం మౌనం అపండితానాం' అన్నారు పెద్దలు. పాండిత్యం లేని వారు మౌనంగా ఉంటేనే బావుంటుందని దీనర్థం. ఇప్పుడిది అవుటాఫ్‌ డైలాగ్‌. ఎందుకంటే పండితులైనా పామరులైనా ఇప్పుడు గల గలా మాట్లాడాల్సిందే. అలా మాట్లాడగలిగితేనే సమాజంలో నలుగురితో పరిచయాలు. నలుగురిలో గుర్తింపు. మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో కానీ, మాట్లాడితే మాత్రం నలుగురు స్నేహితులు తప్పక దొరుకుతారు.

వసపిట్టలా...

కాలం మారింది. కళ్లతో భావాలు పలికించే వారికి కాలం చెల్లింది. నలుగురిలోకి వెళ్లినప్పుడు ఎవరితో మాట్లాడకుండా కూర్చునేవారిని ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మంచి స్నేహాలు, సంబంధాలు పొందాలంటే గలగల పారుతున్న గోదారిలా మాట్లాడాల్సిందే. రోడ్డుపైన బాటసారితో, లిఫ్ట్‌ ఇచ్చిన అంకుల్‌తో, పక్కింటి వాచ్‌మెన్‌తో... పనిమనిషి రాములమ్మతో ఇలా అందరితో ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు వసపిట్టలా మాట్లాడుతూనే ఉండండి. కొంతకాలానికి మీకు ఎందరో స్నేహితులు అవుతారో చూడండి.

పంచ్‌ ఉండాలి...

సాదాగా ఎవరైనా మాట్లాడతారు. అలాంటి వారిని కూడా గుర్తుపెట్టుకునేవారు చాలా తక్కువమంది. నలుగురిలో మంచి గుర్తింపును, స్నేహసంబంధాలను పెంచుకోవాలంటే మాత్రం బాగా మాట్లాడాల్సిందే. ఎలా అంటే మీ మాట తుటాలా పేలాలి. అంటే మాటల్లో పంచ్‌ ఉండాలన్నమాట. అలాగని పంచ్‌ కోసం ప్రాణాలు తీసెయ్యడం గానీ, తీసుకోవడం గానీ చేసుకోకండే ం. మాటల్తో మంత్రముగ్ధుల్ని చేసేవారినే చాలామంది ఇష్టపడతారు.

మీతో మీరు...

పక్కవారితో, పది మందితో మాట్లాడడం కామన్‌. మీతో మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? అంటే ఎదుటి వారితో ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడేప్పుడు మీరెలా ప్రవర్తిస్తున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వాటిలో మీరు కొన్ని మెలకువలు తెలుసుకుంటే మంచి సంబంధాలు సంపాదించుకోవచ్చు. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దూరడం, ఒకరు మీతో మాట్లాడుతుంటే పక్కచూపులు చూడడంలాంటివి చేయకూడదు. రోజుకు కనీసం ఒకరినైనా మీ డ్రెస్‌ బాగుందనో... మీ హెయిర్‌ స్టయిల్‌ బాగుందనో... ఇలా అభినందించి చూడండి.

అడ్డుగోడలు తొలగేదిలా...

ఒకరు మీ గురించి చెడుగా చెప్పారనుకోండి. లేకపోతే మీమల్ని నొప్పించే మాట వెరొకరితో చెప్పారు. అప్పుడు మీరేం చెస్తారు? వారితో మాట్లాడడం మానేస్తారు. అది మనసులో పెట్టుకుని బాధపడుతుంటారు. అప్పుడు ఏంటి ప్రయోజనం. వెళ్లండి. అసలు మీరేం చేశారో అడగండి. మీ గురించి చెడుగా ఎందుకు చెప్పారో తేల్చుకోండి. ఒక వేళ మీలో వారు తప్పు చూపినట్లయితే వెంటనే క్షమాపణ అడగండి. ఎందుకంటే మాట్లాడితేనే కదా అడ్డుగోడలు తొలగిపోయేది.

సో... స్నేహ సామ్రాజ్యాన్ని విస్తరించాలంటే... మాట్లాడండి.. మాట్లాడండి ఉల్లాసంగా.. ఉత్సాహంగా... మాట్లాడుతూనే ఉండండి... టీవీ 9... మాట్లాడాల్సింది మిగిలే ఉంది.. ఐ న్యూస్‌...

3 comments:

radhika said...

బావుంది.మంచి విషయాలు చెప్పారు.స్వాతి పుస్తకం లో వచ్చే ఫీచర్ లా వుంది.మీరు ఏ పత్రికలో అన్నా పనిచేస్తున్నారా?

హను said...

nice one chala baga rasaru, good one

సుభద్ర said...

very very good,anntlu nannu amtaa vaspitta anE amtaaru.chinnapudu vasa ekkuva posaamani maa tatayya baadha padutu umtaaru.photo maredi ayinaa ayite baagunnu.