Skip to main content

మల్లి

సెల్‌ఫోన్‌ రింగయ్యింది. లిఫ్ట్‌ చేసి "హలో'' అన్నాను.
"హలో... ఇందాక ఎవరు మిస్స్‌డ్‌ కాల్‌ ఇచ్చింది'' అంటూ ఓ లేడీ వాయిస్‌.
"మిస్డ్‌కాలా? నేనివ్వలేదండి!'' సమాధానమిచ్చా.
"ఇంకోసారి చేస్తే చంపేస్తా '' అంటూ కోపంగా ఫోన్‌ పెట్టేసింది ఆమె.
* * *
తల తీసేసినట్టయ్యింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది. "ఎవరా అమ్మాయి? ఎందుకలా అంది? మిస్డ్‌కాల్‌ ఎవరిచ్చారు?''
ఆ గుర్తొచ్చింది! శీను!! ఇందాక ఫోన్‌ చేసుకుంటానంటే సెల్‌ ఇచ్చా. వెంటనే శీనుకు ఫోన్‌ చేసి విషయం అడిగా.
"ఔన్రా నేనే చేశా. లిఫ్ట్‌ చేయలేదు. ఏం కాదు లైట్‌ తీస్కో'' నిర్లక్ష్యంగానే సమాధానమిచ్చాడు శీను.
"ఇంతకు ఎవర్రా అమ్మాయి?''
"అదేరా మీ క్లాస్‌మెట్‌ మల్లి''
"ఓ... యా... మల్లి.. మల్లిక. తనకు పెళ్లయిపోయింది కదా, నువ్వెందుకు ఫోన్‌ చేశావ్‌''
"ఔను.. పెళ్లీ అయిపోయింది... మొగుడూ వదిలేశాడు. అందుకే... ట్రయల్‌ ''అంటూ అదోలా నవ్వాడు వాడు.
* * *
మల్లికి పెళ్లయిపోయింది. భర్త నుంచి వేరుగా ఉంటోందా?! ఒక్కసారి కలవాలి. ఎందుకో తెలియదు. బస్‌ ఎక్కాను. మది నిండా ఆమె జ్ఞాపకాలు. నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. అందరితో చనువుగా ఉండేది. అమ్మానాన్నలకు ఒక్కతే కూతురు. అమ్మమ్మ వాళ్లింట్లో ఉండి చదువుకునేది. ఎందుకలా అని అడిగితే ఎప్పుడూ చెప్పేది కాదు. ఆమెకో లక్ష్యం. "అష్టకష్టాలు పడైనా డాక్టరవ్వాలని'' ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పేది. అలాంటి మల్లి జీవితం ఇప్పుడిలా అగాథంలో!?... ఇంతలో హాస్పటల్‌ వచ్చింది.
* * *
నర్సు డ్రెస్సులో మల్లి కడిగిన ముత్యంలా ఉంది. నన్ను చూడగానే ఓ చిరునవ్వు... అదే నవ్వు.. కళ్లలో అదే ఆత్మవిశ్వాసం.
కాసేపయ్యాక కాఫీ కేఫ్‌లో "సారీ మల్లి! శీను అంతా చెప్పాడు. నీకే ఎందుకిలా అవుతోంది'' అనగానే.. అప్పటి వరకు ఆమె కళ్లల్లో ఉన్న ఆత్మవిశ్వాసం కరిగి కన్నీరైంది. కట్టలు తెంచుకుని ఉబికి వచ్చింది. ఇద్దరి మధ్యా కాసేపు మౌనం. ఉబికే క న్నీళ్ల నుంచి ఆమె కష్టాల గాధ జాలువారింది.
* * *
అమ్మ ఐదో ఏటనే చనిపోయింది. నాన్న తాగుడుకు బానిసయ్యాడు. నన్ను చూసుకునేవారెవరు? అందుకే అప్పుడు అమ్మమ్మ వాళ్లింట్లో ఉండి చదువుకునేదాణ్ణి. ఆ తరువాత అమ్మమ్మ చనిపోయింది. అర్థాంతరంగా చదువు ఆగిపోయింది. తిరిగి నాన్న దగ్గరకు వెళ్లిపోయాను. తాగుడుకు బానిసైన నాన్న నన్ను గుండెల మీద కుంపటి అనుకున్నాడు. నా భారాన్ని వదిలించుకొనేందుకు ఓ కసాయికి కట్టబెట్టాడు. వాడు మనిషి కాదనే విషయం నాకు పెళ్లయ్యాక తెలిసింది.
పెళ్లయ్యాక అర్నెల్లు హాయిగా ఉన్నాం. ఆ తర్వాత ఆయనకు కట్నం పిచ్చి పట్టుకుంది. డబ్బు తెమ్మంటూ పీడించేవాడు. నాన్న దగ్గర ఎక్కడున్నాయ్‌ పైసలు? అర్థం చేసుకునేవాడు కాదు. గొడవయ్యేది. వేధించేవాడు. తాగొచ్చి కొట్టేవాడు. మరో ఆర్నెల్లు అన్నీ భరించా. ఇదంతా నాన్నకు చెబితే? ఆ వయసులో తట్టుకోలేడు. అందుకే చెప్పలేదు. ఆ తర్వాత నాన్న పోయారు. నాకో పాప పుట్టింది. మా వారికి మరో పెళ్లి చేస్తాననేది మా అత్త. నాన్న పోయాక డబ్బెలాగూ రాదనుకున్నారు. మరో పెళ్లికి సిద్ధమయ్యారు. నన్ను విడాకులడిగారు. నీనివ్వనన్నా. తిట్టారు. కొట్టారు. చివరకు వదిలించుకునేందుకు పక్కింటతనితో సంబంధం అంటగట్టారు. పదిమందిలో అవమానించారు. భరించేవాడే భర్త అంటారు. భరితెగించినవాడు కాదు. వాణ్ణి భరించలేకపోయాను. సహనం చచ్చింది. చావాలనిపించింది. పాపని చూసి ఆ పని చేయలేకపోయాను. దాని భవిష్యత్తే నా కళ్ల ముందు కనిపించింది. కావాల్సింది విడాకులేగా? నా కాళ్ల మీద నే నిలబడలేనా? అందుకే విడాకులిచ్చేశా. ఇదిగో ఇలా ఒంటరినయ్యా.
* * *
తన కథ చెబుతున్నంత సేపు తదేకంగా చూస్తున్నాను.
నా మొహం మీద చిటికేసి "హలో ఏంటి అలా చూస్తున్నావ్‌. నీ కళ్లలో కనిపించే సందేహం నాకర్థమైంది. జీవితాంతం ఇలానే ఉండిపోతావా? అనే కదా.''
ఊ అన్నట్లు తల ఉపాను.
"వాడిన ఈ జీవితం మళ్లీ చిగురిస్తుందని నేననుకోను. ఆ ప్రయత్నంలో మళ్లీ కష్టాలు కొనితెచ్చుకొని, వాటిని భరించే ఓపిక నాకు లేదు. నాకున్న ఆశ ఒక్కటే. డాక్టర్‌ కావాలనుకొని నేను నర్సునయ్యాను. నా కూతురయినా డాక్టర్‌ అయితే అంతే చాలు. నా ఒంటరి తనం గుర్తుకొస్తే గుండె బరువెక్కుతుంది. ఆస్పత్రిలో రోగులకు సేవ చేస్తూ... వాళ్ల కళ్లలో కృతజ్ఞతను చూస్తున్నప్పుడు మనసు తేలికపడుతుంది. జీవితంలో ఇంతకు మించి మరేం కావాలి?'' అని ప్రశ్నించింది.
నా దగ్గర సమాధానం లేని ప్రశ్న అది.
"సారీ... నా గొడవంతా చెప్పి నీ తలతిన్నట్టున్నాను కదూ?'' ఇంతలో ఓ నర్సు వచ్చి డాక్టరు పిలుస్తున్నారని చెప్పింది.
"ఒకే... మనం మళ్లీ కలుద్దాం మల్లి'' అన్నాను.
సరే అంటూ బయలుదేరింది.
నేను నిలబడి ఆమెనే గమనిస్తున్నాను.
రోగుల మంచి చెడ్డలు అడుగుతూ, వారి బంధువులను పలకరిస్తూ వెళుతున్న ఆమెను చూస్తే ఆత్మవిశ్వాసం నడిచివెళుతున్నట్లనిపించింది.

Comments

Anonymous said…
really we have to appreciate and encourage that confident lady,malli....
so sweet...
Padmarpita said…
కధనం బాగుందండి!

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...