Skip to main content

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine


దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి.. 
కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్రమదేవి సమర్థవంతంగా ఎదుర్కొని తన పరిపాలనా దక్షతను చాటుకుంది. అంతఃకలహాలను ఎదిరించి.. అధికార పునరుద్ధరణ గావించి.. సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ.. సుస్థిర పరిపాలనకు పట్టం కట్టింది రుద్రమ. పాండ్యులు, వేంగి చాళుక్యులు, చోళుల వంటి శత్రువర్గాలను రూపుమాపి కొంచెం ఊపిరి తీసుకొనే లోపునే పరరాజ్య శత్రువులు రుద్రమదేవి మీదికి లంఘించారు. అబల కావడంతో ఆమెను అవలీలగా జయించవచ్చుననే భ్రమ వారిది. కానీ, రుద్రమ అబల కాదు, సబల అని వారికి తెలియదు. ఓరుగల్లు సింహాసనంపై ఒక అబల ఆసీనురాలైంది. అవలీలగా ఆ రాజ్యాన్ని గెలిచి విజయ కేతనం ఎగురవేయవచ్చు అనే ధైర్యంతో దేవగిరి యాదవ మహాదేవుడు రుద్రమపైకి దండెత్తి వచ్చాడు. అతడు ఎనిమిది లక్షల సైన్యంతో ఓరుగల్లుపైకి దూసుకొచ్చి దుర్గాన్ని ముట్టడించాడు. యుద్ధ వ్యూహం రచించడంలో, శత్రువుని అవలీలగా మట్టి కరిపించడంలో రుద్రమది అందె వేసిన చేయి.

మహదేవుని దాడికి ఏ మాత్రం బెదరక.. తానే స్వయంగా నాయకత్వం వహించి యుద్ధరంగాన నిలిచింది. అపార శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాళిలా ఒకటి కాదు.. రెండు కాదు.. పదిహేను రోజులకు పైగా భీకర పోరాటం చేసింది. శత్రువుని పడగొట్టాలంటే ముందు అతని బలం తెలుసుకోవాలి. ముందు ఆ బలాన్ని దెబ్బతీయాలి.
మహదేవుడి బలం అతని అశ్విక దళం. ఆ బలాన్ని, బలగాన్ని రుద్రమ సైన్యం సర్వనాశనం చేసింది.


ఊహించని ఈ పరిణామంతో మహదేవుడు తోకముడిచి దేవగిరి బాట పట్టాడు. కాకతీయ సేనానులు ఆ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టి దేవగిరి కోటనే ముట్టడించారు. రుద్రమ పరాక్రమాన్ని అధిగమించలేక మహదేవుడు ఓటమిని అంగీకరించి రుద్రమతో సంధి చేసుకున్నాడు. కప్పంగా పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాడు. వితరణ శీలురాలైన ఆ రాణి యాదవులు ఇచ్చిన ధనాన్ని సైనికులకు పంచి పెట్టిందట. ఈ యాదవ దురాక్రమణ యత్నాన్ని, తత్పరాజయాన్ని సూచించే నిదర్శనాలు ఉన్నాయి. బీదరు కోటలోని ఆనాటి శాసనం ఈ విషయాన్ని, రుద్రమ విజయాన్నీ పేర్కొంటున్నది. రుద్రమ జరిపిన ఇలాంటి ఎన్నో పోరాటాల్లో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిలో గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు.

కాయస్థ నాయకుడైన జన్నిగదేవుడు ఆదినుంచి రుద్రమదేవికి అత్యంత విధేయునిగా ఉన్నాడు. జన్నిగదేవుని తర్వాత అతని తమ్ముడు త్రిపురాంతకుడు కూడా రుద్రమదేవి ప్రతినిధిగా రాజ్యపాలన చేశాడు. అనంతరం ఇతని తమ్ముడు అంబదేవుడు రాజయ్యాడు. ఇతనికి రుద్రమదేవి చెప్పుచేతల్లో ఉండడం, విధేయునిగా మసలు కోవడం ఇష్టం లేదు. తనకంటూ స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకోవాలని కాంక్షించాడు. కత్తి పట్టాడు. కాకతి రుద్రమ విధేయులయిన అనేక మంది మాండలికుల్ని తాను ఎలా గెలుచుకొచ్చిందీ త్రిపురాంతకం శాసనంలో అంబదేవుడు రాసుకున్నాడు. పాండ్యరాజస్య ప్రియప్రేషిత చండవేదండ తురంగ సార్థ విరాజమాన సంపోషిత సౌహార్థ్ర..(పాండ్యరాజు పంపిన ఏనుగులు, గుర్రాలతో పటిష్ఠమైన స్నేహం.. ), దేవగిరి రాజ ప్రసర్పిత ప్రాభృత మణి కనక భూషణ (దేవగిరి రాజు పంపిన మణి, కనక బహుమానాలతో భూషితుడను) అయ్యానని శాసనం వేసుకున్నాడు. ఇందులో రుద్రమదేవి పేరు వేయకుండా సామ్రాజ్ఞి పట్ల తన అవిధేయతను, స్వతంత్రాన్ని ప్రకటించుకునే ప్రయత్నం చేశాడు. పైగా రుద్రమదేవి శత్రువులైన పాండ్యులు, యాదవులతో స్నేహం చేశాడు. రుద్రమ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ.. సామంతులను సంహరిస్తూ.. రాజ్యం విస్తరించుకున్నాడు అంబదేవుడు. ఇతని విజృంభణను రుద్రమదేవి ఎప్పటికప్పుడు అరికడుతూ, తన సేనానులతో అతనిని అదుపులో పెట్టింది. రుద్రమ ప్రాబల్యంతో అనేకసార్లు ఓటమి పాలైన అంబదేవుడు ఆమెపై కక్ష గట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరిస్తూ .. చాపకింద నీరులా విస్తరించే ప్రయత్నం చేశాడు.

అంబదేవుడి ఆగడాలు ఎంతో కాలం సాగలేదు. రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడు యుక్త వయసుకు వచ్చాడు. రుద్రమ రాజ్య భార నిర్వహణలో చేదోడు వాదోడుగా నిలిచాడు. మహా పరాక్రమశాలి అయిన ప్రతాపరుద్రుడు అంబదేవుడు లాంటి వారి ఆట కట్టించడానికి కంకణం కట్టుకున్నాడు. అందుకు త్రిముఖ వ్యూహం రచించాడు. ఇందులో మధ్య వ్యూహం త్రిపురాంతకం వైపు నడిచింది. అదునుకోసం ఎదురుచూస్తున్న అంబదేవుడికి అండ దొరికింది. కుట్రలు కుతంత్రాలతో పాండ్యులు, చోళులు, ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. ప్రతాపరుద్రునికి అండగా నిలువాల్సిన సేనలను కాకతీయులపైకే ఎక్కు పెట్టే ప్రయత్నం చేశాడు.
అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి కత్తి పట్టి కదన రంగాన దూకినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఏళ్లు. దాదాపు రెండు వారాలకుపైగా పోరాటం చేసిందనీ భావిస్తుంటారు. రుద్రమ ఈ యుద్ధ సమయంలోనే మరణించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కానీ ఎలా మరణించిందన్నది తెలియదు. రుద్రమను అంబదేవుడు యుద్ధంలో నేరుగా ఎదుర్కోలేక కపటోపాయం పన్నినట్లు భావిస్తుంటారు. యుద్ధ క్షేత్రానికి సమీపంలోని గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా రుద్రమ ప్రత్యేక పూజలు చేస్తుండగా, ఈ విషయం ముందే తెలుసుకున్న అంబదేవుడు అంతకు ముందే పూజారుల స్థానంలో తన వాళ్లను పంపాడనీ, పూజలో నిమగ్నమైన రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచి చంపారని చెబుతుంటారు. కొందరు విషప్రయోగం చేశారనీ వాదిస్తుంటారు. రుద్రమ సేనాని మల్లికార్జున నాయకుడు కూడా ఆమెతోపాటే మరణించడంతో ఇద్దరూ యుద్ధరంగంలోనే చనిపోయారని ఇంకొందరు భావిస్తుంటారు. అయితే, చారిత్రకంగా ఈ విషయాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.

పానగల్లు శాసనాన్ని బట్టి మల్లికార్జున నాయకుడు రుద్రమదేవికి సర్వసైన్యాధ్యక్షుడని తెలుస్తోంది. మల్లికార్జునుడి కొడుకు ఇమ్మడి మల్లికార్జున నాయకుడు కుమార రుద్రదేవ మహారాజుకు ధర్మువుగా 1290లో శాసనం వేయించాడు. నల్లగొండ జిల్లా చందుపట్లలో లభించిన శాసనంలో రుద్రమదేవి మరణం గురించి ఉంది. రుద్రమ, మల్లికార్జునుడు ఒకేసారి యుద్ధంలో శివసాయుజ్యం పొందినట్లు ఈ శాసనం పేర్కొంది. శివసాయుజ్యం పొందిన కాకతి రుద్రమదేవి, మల్లికార్జున నాయకులకు ధర్మువుగా పువ్వుల ముమ్మడి అనే బంటు సోమనాథ దేవునికి కొంత భూమిని దానం ఇచ్చినట్లు ఈ శాసనం పేర్కొంది. దీన్నిబట్టి శాసనం(నవంబర్ 27, 1289) వేయించిన కొన్ని రోజులకు ముందు రుద్రమ మరణించినట్లు స్పష్టమవుతోంది. ఇటీవలే వెలుగులోకి వచ్చిన మేడిమల్‌కల్ శాసనం ఈ విషయాన్ని బలపరచడమే కాకుండా ఆమె మరణించిన వెంటనే ఆమె మనుమడు ప్రతాపరుద్రుడు కాకతీయ సింహాసనాన్ని అధిష్టించాడని స్పష్టం చేస్తోంది. రుద్రమ మరణానంతరం ఆ యుద్ధంలో ప్రతాపరుద్రుడు అంబదేవునిపై ప్రతీకారం తీర్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. సర్వాన్ ఆంధ్ర మహీపతీన్ రణముఖే జిత్వా యశోలబ్ధవాన్ అని త్రిపురాంతకం శాసనం అంబదేవుడి గురించి గొప్పగా చెబుతున్నది. నిజమే, అంబదేవుడు అంతటి పరాక్రమశాలియే అయితే.. యుద్ధ రంగాన ఎవరిని ఎలా చంపాడో శాసనాల్లో స్పష్టంగా పేర్కొని ఉండేవాడు. రుద్రమవంటి మహా సామ్రాజ్ఞిని నిజంగానే జయించి ఉంటే ఈ విషయాన్ని సగర్వంగా ప్రకటించుకుని ఉండేవాడు. తాను రుద్రమదేవిని చంపానని అంబదేవుడు తన శాసనాల్లో ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదు. ఓ వృద్ధ స్త్రీని దొంగ దెబ్బ తీసి చంపానని చెప్పుకోవడం తనకే పరువు నష్టం కలిగించేది కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించకపోయి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.
(7th may 2017)

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...