Skip to main content

ఓం వినాయక విగ్రహాయనమః

'ఈ విగ్రహాలన్నీ ఎంతకిస్తావ్‌?' ఓ పెద్దావిడ అడిగింది.
'లేదండీ నేనివ్వను' చెప్పాడతను.
'మహా అంటే లక్షల విలువ చేస్తాయి. నేను కోటి రూపాయలిస్తాను' ఆశ పెట్టింది ఆమె.
'ఎన్ని కోట్లు?' అడిగాడాయన ఆసక్తిగా.
'పదికోట్లిస్తాను' గర్వంగా చెప్పిందామె.
'లేదండి. నేనివ్వను' ఆయన స్థిరంగా అన్నాడు.
'ఇరవై కోట్లిస్తాను' కాస్త పెంచింది.
'అయినా ఇవ్వను' ఆయన ఏమాత్రం దిగలేదు.
'ఇక బేరాలొద్దుగానీ, యాభై కోట్లిస్తాను. నాకిచ్చెయ్‌ ప్లీజ్‌' బతిమాలింది.
'ఎంతాస్తి ఉందేంటి మీకు?' అడిగాడాయన.
'ఓ ఐదువేల కోట్లు' చెప్పిందామె.
'ఆ ఆస్తంతా ఇచ్చినా ఈ విగ్రహాలు ఇవ్వను' కరాఖండిగా చెప్పాడు. లక్షల రూపాయల విలువచేసే విగ్రహాలను యాభై కోట్ల రూపాయలకు కూడా ఆయన ఎందుకివ్వలేదు? అంత విలువైనవా అవి? అవును. చుక్కలన్నీ ఏరి మీ ఇంట్లో దాస్తే.. ప్రపంచాన్ని బంధించి మీ గదిలో పెడితే.. మీరిచ్చేస్తారా? ఆయన కూడా అంతే. అవి కేవలం విగ్రహాలు కావు. ఆయన జీవితం.



హైదరాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో ఆ ఇంటి తలుపుపై వినాయకుని విగ్రహం చెక్కి ఉంటుంది. అలాంటివి చాలా చూశాం అంటారా? ఆగండాగండి. ఆ తలుపు కాస్త తెరిచిచూడండి మీకే తెలుస్తుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 వేల 160 విఘ్నేశ్వరుని విగ్రహాలు మీకు కనిపిస్తాయి. అమ్మో అన్ని విగ్రహాలా అంటారా? అవును నిజం. ఆయన ఇంట్లో ఉన్నాయి మరి. ఏ రెండు విగ్రహాలు కూడా ఒకేలా ఉండవు. అదే ఆ విగ్రహాల ప్రత్యేకత. విగ్రహాలే కాదు.. 14 వేల 150 పార్వతీనందనుడి ఫోటోలు, 1100 వాల్‌పోస్టర్లు కూడా ఉన్నాయి. ఈ విగ్రహాల సేకరణుడే పబ్సెట్టి శేఖర్‌. 50 ఏళ్ల వయసున్న ఆయన స్టేట్‌ బ్యాంక్‌ ఉద్యోగి. 38 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఆ గణపతి విగ్రహాలను, ఫోటోలను సేకరించారు. ఆయన గురించే ఆ కథనం.

చిన్నప్పట్నించి అంతే...
శేఖర్‌ తాతాముత్తాతలు మహారాష్ట్రకు చెందిన వారు. డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. శేఖర్‌ చిన్నప్పుడు ఎప్పుడూ గణపతి బొమ్మలు గీస్తుండేవాడు. ఎందుకో ఆ బుజ్జి గణపయ్య రూపం అతన్ని మంత్రముగ్ధున్ని చేసింది. "12 ఏళ్లప్పుడు మా కుటుంబసభ్యులందరితో కలిసి షిరిడీకి వెళ్లాను. అక్కడ కనిపించిన ఒక చిన్న వినాయకుని విగ్రహాన్ని ఎంతో ప్రేమగా కొనుక్కున్నాను. మరుసటి ఏడాది మహాబలేశ్వరంలో మరో విగ్రహం కొన్నాను. అంతే అప్పటి నుంచి నాకు తెలియకుండానే అదో అభిరుచిగా మారిపోయింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకంగా సమయం కేటాయించి మరీ రకరకాల ఏకదంతుని ప్రతిమలను కొంటుండేవాడ్ని. కాలం మారుతున్న కొద్దీ.. వందలు వేల వక్రదంతుని విగ్రహాలు అలా ఆ కలెక్షన్‌లో చేరిపోయాయి'' అని చెప్పారు శేఖర్‌.

ఎన్నో వెరైటీలు
ఆ చిన్న హాలులో వేల విగ్రహాలు ఉన్నాయంటే నమ్మలేం. గుమ్మానికున్న తోరణం.. గోడగడియారం.. వెలిగే లైటు.. కాలింగ్‌ బెల్‌.. ఇలా ఎటుచూసినా వస్తువులన్నీ లంబోదరుని ఆకారంలోనే ఉంటాయి. బాత్‌రూమ్‌ టబ్‌లో ఎలుకతో కలిసి స్నానం చేసే గణాధిపతిని మీరెప్పుడైనా చూశారా? పోనీ మొబైల్‌ ఫోన్‌.. ల్యాప్‌ట్యాప్‌లు పట్టుకున్న మోడ్రన్‌ గణపతిని? న్యూస్‌పేపర్‌ వినాయకుడిని.. గిరిజన గణపతి.. రిక్షాలో వెళుతున్న మూషిక వాహనుడు, బెడ్‌పై పడుకున్న బుజ్జి గణపతి, ఉయ్యాల ఊగుతున్న వినాయకుడు.. చైనా, జపాన్‌ దేశాల గెటప్‌లో ఉన్న ఫారిన్‌ గణేష్‌.. ఇలాంటి ఎన్నో వెరైటీ రూపాలు ఆయన ఇంట్లో కనిపిస్తాయి. శంకరహర గణపతి, శుభదృష్టి గణపతి, పంచముఖ గణపతి లాంటి అరుదైన విగ్రహాలు కూడా ఉన్నాయి. "ఇవన్నీ కేవలం మన దేశంలో సేకరించినవే కాదు. అమెరికా, అఫ్ఘనిస్తాన్‌, సింగపూర్‌, ఇండోనేషియా, మలేషియా, ఈజిప్ట్‌, నేపాల్‌, శ్రీలంక, సౌత్‌ ఆఫ్రికా, కెన్యా, కొరియా, టిబెట్‌, కంబోడియా, పాకిస్తాన్‌, బంగ్లాదేవ్‌, మంగోలియా, బెల్జియం, టర్కీ, ఇరాన్‌.. ఇలా ఎన్నో దేశాలవి కూడా ఉన్నాయి. మన దేశంలో జరిగిన రకరకాల ఎగ్జిబిషన్స్‌లో ఇవి నాకు దొరికాయి. కొన్ని ఇంటర్‌నెట్‌ ద్వారా కొన్నాను'' అని చెప్పారు శేఖర్‌.

రకరకాల మెటీరియల్స్‌
శేఖర్‌ దగ్గర ఉన్న విగ్రహాల ఆకృతి, పరిమాణం, వాడిన మెటీరియల్స్‌లో ఒక్కో గణేశునికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆయన కలెక్షన్‌లో అర అంగుళం వినాయకుని నుంచి మూడు అడుగుల ఎత్తున్న విగ్రహాల వరకు ఉన్నాయి. భూతద్దంతో చూడాల్సినవి కొన్నియితే.. చూడ్డానికి రెండు కళ్లూ సరిపోనివి మరికొన్ని. పంచలోహ విగ్రహాలు.. వెండి బంగారంతో చేసినవి, వన్‌గ్రామ్‌ గోల్డ్‌ పూసినవి, బ్రాంజ్‌, బ్రాస్‌, అల్యూమినియం, విలువైన రాళ్లు, టెర్రకోట, క్రిస్టల్స్‌, గాజు బై మెటల్‌, ఐవరీ, కోరల్‌, గ్రానైట్‌, సోప్‌ స్టోన్‌, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ చివరాఖరికి మట్టితో చేసిన వినాయకులు కనిపిస్తాయి. శాండిల్‌ ఉడ్‌, టేకు, వెదుకు, రోజ్‌ ఉడ్‌ కూడా ఎన్నో చెక్కల మీద చెక్కిన గణేశులూ అక్కడ దర్శనమిస్తారు. ఆయన సేకరించే విగ్రహాలే కాకుండా స్వయంగా తయారు చేసిన విగ్రహాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. న్యూస్‌పేపర్‌, మట్టి, ఎం-సీల్‌, సిరామిక్‌ పౌడర్‌, బాదం కాయలు, కొబ్బరి కాయలు, గవ్వలు, రకరకాల రాళ్లు, నత్తగుల్లలతో ఆయన, ఆయన కూతురు సంజన కలిసి 50 చిన్న విగ్రహాలు తయారు చేశారు.

ఫోటోలు.. పోస్టర్లు కూడా..
ఇంటర్‌నెట్‌లో వెతికి విదేశాల్లో దొరికే వినాయకుని ఫోటోలు కూడా ఎన్నో సంపాదించారు శేఖర్‌. ఎంతోమంది చిత్రకారులు గీసిన బొమ్మలు కూడా సేకరించారు. అలా ఆయన సంపాదించిన ఫోటోలు 56 పెద్ద ఆల్బమ్‌లలో పదిలంగా దాచిపెట్టారు. ఆ ఫోటోల్లో ఉన్న పన్నెండు రాశుల ఆకారంలో కూర్చుని ఉండే వినాయకుని బొమ్మలను మీరెప్పుడూ చూసి ఉండరని చెబుతారు శేఖర్‌. అంతేకాదు 160 కీచెయిన్లు కూడా సేకరించారు శేఖర్‌. ఆయన ప్రత్యేకంగా తయారు చేయించిన కీచెయిన్లను ఇంటికి వచ్చిన అతిథులకు కానుకగా ఇస్తుంటారు.

నో ఎగ్జిబిషన్స్‌!
చిన్నప్పటి నుంచి ఈ విగ్రహాలన్నీ నా కోసం సేకరించుకున్నాను. కానీ ఎప్పుడూ ఎగ్జిబిషన్లలో ప్రదర్శించాలని అనుకోలేదు. 2003లో మలేషియాకు చెందిన టెంపుల్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ వారు విశ్వ వినాయక గణేష్‌ ఫెస్టివల్‌ జరిపినప్పుడు చాలామంది నన్ను అక్కడ విగ్రహాలు ప్రదర్శించమని చెప్పారు. పెట్టాను. నా విగ్రహాలకు మంచి పేరొచ్చింది. అప్పుడే నాకు 'బెస్ట్‌ కలెక్షన్‌ అవార్డు' కూడా లభించింది. ఆ సందర్భంగానే ఆస్ట్రేలియాకు చెందిన ఎలిజబెత్‌ అనే పెద్దావిడ కోట్ల రూపాయలు ఇస్తాను, విగ్రహాలన్నీ ఇచ్చేయమంది. కానీ నేనివ్వలేదు. 2004లో మళ్లీ ఒకసారి ఎగ్జిబిషన్‌ పెట్టాను కానీ ఆ తర్వాత మరెప్పుడూ ప్రదర్శనకు పెట్టకూడదని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ నేను ఎంతో కష్టపడి సేకరించిన విగ్రహాలు. ఇందులో ఏ విగ్రహం మీద చిన్న గీత పడినా నేను తట్టుకోలేను'' అని ఓ విగ్రహం దగ్గరికి తీసుకెళ్లారు శేఖర్‌. ఆ అంబాసుతుని తొండం కొంచెం విరిగి ఉంది. దాన్ని అతికించడానికి ప్రయత్నించినా పూర్వపు సహజత్వం రాలేదని బాధపడ్డారాయన.

ఫ్యూచర్‌ టెన్స్‌
శేఖర్‌కు 2010 లిమ్కా బుక్‌ ఆఫ్‌ ఇండియన్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. ప్రపంచంలో ఎవరి దగ్గరా ఇన్ని విగ్రహాలు లేవు కాబట్టి తనకు గిన్నిస్‌ రికార్డు కూడా తప్పకుండా వస్తుందని చెబుతున్నారు శేఖర్‌. ఇప్పుడాయన నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో పంచముఖ గణేష్‌ ఆలయాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. అందుకోసం పదిమందితో కూడిన ట్రస్ట్‌తో పనిచేస్తున్నారు. అంతేకాదు వినాయకుని విగ్రహాల సేకరణలో తన అనుభవాలను, ప్రపంచదేశాల్లో ఉన్న గణపతి ఆలయాల వివరాలను, మన దేశంలోని వినాయక దేవాలయాల విశిష్టతని తెలుపుతూ ఒక పుస్తకం రాస్తున్నారు.


ఫోటోలు : జి. భాస్కర్‌

to see more photos here

Comments

abba naku urgent ga valla intiki velli chudalani undi kani vellina problem endukante naku emina nachite konukkovalanipistadi kada :(
ishtamunnavi konukkolekapothe chala bada paduthamu papam ame entha bada padindo :(

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...