Skip to main content

ప్రయివేటు టీచర్‌.కామ్‌

గూగుల్‌ కూడా గుర్తించలేని ఒక మారుమూల తండాలో పుట్టాడు సోమేశ్వర్‌ వంశీ నాయక్‌. అయితే ఇప్పుడు గూగుల్‌లో అతని గురించి ఒక్కసారి వెతికి చూడండి.. మీకు కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. అసలు వంశీ గురించి మేమెందుకు తెలుసుకోవాలి అంటారా? ఉద్యోగ వేటలో తనకు ఎదురైన అనుభవాలు మరెవరికీ ఎదురుకాకూడదని ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ని రూపొందించాడు. దాని గురించే ఈ కథనం.


మీరు టీచర్‌గా పనిచేస్తున్నారా? లేదంటే పనిచేయాలన్న ఆలోచన ఉందా? ఇప్పుడున్న పాఠశాలలో కాకుండా మరో మంచిస్కూల్‌ కోసం వెతుకుతున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు ఒకే దగ్గర దొరుకుతుంది. అదే ఎడ్యునెస్ట్‌ (www.edunest.org). కేవలం టీచర్ల కోసమే రూపొందించిన వెబ్‌ పోర ్టల్‌ ఇది. దీన్ని డిజైన్‌ చేసింది పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కాదు, నిన్న మొన్ననే ఎంఏ పూర్తి చేసిన ఒక సాధారణ టీచర్‌. అసలు అతనికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో చదవండి.

ఓ దసరా పండగ మధ్యాహ్నం.. ట్యాంక్‌బండ్‌పై ఒంటరిగా బెంచీ మీద కూర్చుని ఇలా డైరీ రాసుకుంటున్నాడు వంశీ నాయక్‌. "అందరూ కొత్తబట్టలు వేసుకుని, పండగ జరుపుకుంటూ సంతోషంగా ఉన్నారు. కానీ నా పరిస్థితేంటి ఇలా ఉంది? ఆకలిగా ఉంది. జేబులో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలి? చచ్చిపోవాలనిపిస్తోంది. ఛీ... నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా? లేదు. పిరికివాడిలా చావకూడదు. ఎలాగైనా చదువుకోవాలి. ఏదైనా సాధించాలి'' అనుకున్నాడు.


తండాలో పుట్టి...
నిజానికి వంశీకి అమ్మానాన్నా, ఇద్దరు అక్కలూ ఉన్నారు. అతనిది మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బుద్ధారం ధర్మ తండా. చాలా పేద కుటుంబం. కుటుంబంలో అందరూ ఏదో ఒక పనిచేస్తేనే కడుపునిండేది. అలాంటి పరిస్థితుల్లో వంశీని చదివించడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయింది. వంశీ అప్పుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో అక్కలతో కలిసి కూలీ పనికి వెళ్లేవాడు. రోజుకు పది రూపాయలు వచ్చేవి. అలా కూడబెట్టుకున్న డబ్బులు, అక్కావాళ్లు ఇచ్చిన ఇంకొన్ని డబ్బులు మూటకట్టుకుని ఇంట్లోంచి పారిపోయాడు. వనపర్తిలోని ఒక హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోసాగాడు. వాళ్ల అమ్మనాన్న కూడా 'పోనీ చదువుకోనీలే' అని వదిలేశారు. సెలవుల్లో ఇంటికి వెళ్లి వస్తుండేవాడు కానీ ఇంట్లో వాళ్లు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలా రెండు మూడేళ్లు గడిచింది.

పేపర్‌ బాయ్‌గా..
ఏడో తరగతి చదువుతున్నప్పుడు సాయంత్రం పూట వంశీ ఒక ఎస్టీడీ బూత్‌లో పనిచేసేవాడు. నెలకు వంద రూపాయలు వచ్చేవి. అవి కూడా సరిపోయేవి కావు. 'ఇంకా ఏదైౖనా పని ఉంటే చెప్పండి' అని ఎస్టీడీ యజమానిని అడిగితే 'పేపర్‌ బాయ్‌గా చేస్తావా? 150 రూపాయలిస్తాను' అన్నాడు. వంశీ పేపర్‌ వేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ పని చేయాలంటే సైకిల్‌ ఉండాలి. ఆ యజమాని సైకిల్‌ తానే ఇస్తానన్నాడు కానీ దానికి అద్దె నెలకు 75 రూపాయలు. అలా ఉదయం, సాయంత్రం కష్టపడితే వచ్చే 175 రూపాయలతో వంశీ చదువుకునేవాడు.

ఆలోచన పుట్టిందిలా..
ఇంటర్‌ అయిపోయాక వేసవి సెలవుల్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'మళ్లీ బడి' కార్యక్రమంలో చేరాడు. పాటలు పాడుతూ, పాఠాలు చెబుతూ గ్రామాల్లో తిరిగేవాడు. ఆ సందర్భంలోనే ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తి కలిగింది. తర్వాత వనపర్తిలో డిగ్రీ చదువుతూ హైదరాబాద్‌లోని జనవిజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుండేవాడు. ప్రయివేటు ట్యూషన్లు చెబుతూ ఎంఏ కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు వనపర్తిలోని బ్రిలియంట్‌ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగ వేటలో తనకు ఎదురైన అనుభవాలు, సహోద్యోగులు ఎదుర్కొన్న సమస్యల నుంచి పుట్టిన ఆలోచనే ఎడ్యునెస్ట్‌.

ఎడ్యునెస్ట్‌ గురించి...
ఈ రోజుల్లో ఒక వెబ్‌సైట్‌ రూపొందించడం పెద్ద కష్టం ఏం కాదు. చాలా తక్కువ ఖర్చులో కూడా తయారుచేయొచ్చు. కానీ వంశీ తయారు చేసుకున్న కాన్సెప్ట్‌ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం కోసం చాలా జిబి స్పేస్‌ కావాలి. ఒకరు మ్యాథ్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నారనుకుందాం. వేరే స్కూల్లో అదే పోస్ట్‌, ఎక్కువ జీతంతో ఖాళీ ఉందనుకుందాం. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేస్తే అవి వెంటనే ఆ టీచర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో వెళ్తాయి. ఇప్పటి వరకు ఇలాంటి సమాచారాన్ని కేవలం ఇ-మెయిల్స్‌ ద్వారానే అందిస్తున్నాయి మిగతా వెబ్‌సైట్లు. అందరూ ప్రతిరోజూ ఇంటర్‌నెట్‌ చూసే అవకాశం ఉండదు కాబట్టే ఈ ఎస్‌ఎమ్‌ఎస్‌ పద్ధతిని ఎంచుకున్నానంటాడు వంశీ. ఈ వెబ్‌సైట్‌ రూపకల్పనకు అతనికి 50 వేల రూపాయలు ఖర్చు అయింది. ఈ మొత్తాన్ని తనకు నెల నెల వచ్చే జీతం నుంచి వాయిదాల పద్ధతిలో కడుతున్నాడు వంశీ. అధికారికంగా వెబ్‌సైట్‌ని ప్రారంభించేందుకు గవర్నర్‌గారి అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు.

Comments

Anonymous said…
అసలు ఆంధ్రజ్యోతి టపాలని యధాతధం గా వాడేసి కనీసం క్రెడీత్ కూడా ఇవ్వరేంటండీ బాబూ. మొన్న డిజేబుల్డ్ పిల్లల గురించి ఆ మధ్య ఇంకేదో వ్యాసం కూడా మక్కీ దించేసారుగా
అనామకా, ఈ బ్లాగునిర్వాహకులే ఆంధ్రజ్యోతిలో ఆయా శీర్షికలు రాసి ఉండచ్చనే కనీస జ్ఞానం తమరికెందుకు కలగలేదో. అయినా బ్లాగుల్లో రచనల్ని పేరుపొందిన దిన పత్రికలన్నీ ఫ్రీగా కొల్లగొడుతుండగా, కాసిని బ్లాగులు అటునించి కూడా కొట్టుకొస్తే తప్పేం లేదు.

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...