రాలిపోయిన తలవెంట్రుకలని నా చిన్నప్పుడు మా నాయనమ్మ గోడ దువ్విట్లో దాచిపెట్టేది. జడసవరాలు అమ్మేవాళ్లు వచ్చినప్పుడు ఆ జుత్తుని వాళ్లకిస్తే పిన్నీసులు, జడరబ్బర్లు ఇచ్చేవారు. ఊడిపోయిన జుత్తుకు అవి కాకపోతే ఇంకేం ఇస్తారు అని చీప్‌గా తీసిపారేయకండి. తలనీలాల వ్యాపారానికి మన రాష్ట్రంలో వందల కోట్ల రూపాయల టర్నోవర్ ఉందని మీకు తెలుసా? పది ఇరవై ఏళ్ల క్రితం 'మొండబండ' తెగకు చెందినవారు ఊళ్లల్లో జడసవరాలు అమ్ముతూ, జుట్టును కొనుక్కెళ్లడం చాలామందికి తెలుసు. ఇప్పుడు కూడా అలాగే తీసుకెళ్తున్నారా? అని అడిగితే "ఔను. చాలా గ్రామాల్లో ఇప్పటికీ అలా జుట్టుని కొనేవాళ్లున్నారు. కాకపోతే జడసవరాలే కొనేవారు లేక అవి అంతరించి పోయాయి'' అని చెప్పారు వికాస్ హెయిర్ ఎంటర్‌ప్రైజర్స్ యజమాని పొగర్తి శంకర్. ఎనిమిది పుణ్యక్షేత్రాల నుంచి టన్నుల్లో తలనీలాలను సేకరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారాయన. అనాదిగా ఇదే పని తమ్ముడు ఆదినారాయణతో కలిసి ఇరవై ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు శంకర్. వారి తాతముత్తాతలు కూడా ఇదే వృత్తిలో కొనసాగారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ వెంట్రుకలు సేకరించేవారు. వాటిని సవరాలుగా త...