గుర్తుపట్టండ్రా.. ఎవరో ఒకరు!

By | October 11, 2010 4 comments
పూర్వవిద్యార్థుల సమావేశం ఇప్పుడు చాలామంది జరుపుకుంటూనే ఉన్నారు. కాకపోతే ఈ కాలేజీకి కాస్త ప్రత్యేకత ఉంది. స్వాతంత్య్ర దినోత్సవ రజతోత్సవాల సందర్భంగా కర్నూలులో ప్రారంభమైన డిగ్రీ కాలేజ్‌ ఇది. దాని పేరే 'సిల్వర్‌ జూబ్లీ కాలేజ్‌'. ఈ కాలేజ్‌ పూర్వ విద్యార్థులు పన్నెండేళ్లుగా ప్రతి ఏడాది గాంధీ జయంతి సందర్భంగా కలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా కలిశారు. ఆ సన్నివేశమే ఇది.
---
అక్టోబర్‌ 2, ఉదయం 10 గంటలు...
ఠాగూర్‌ ఆడిటోరియం, ఉస్మానియా యూనివర్శిటీ
ఎడమవైపు గోడకు కట్టిన బ్యానర్‌పై Welcome to
J. Raymond Peter, IAS
Principal Secretary, Social Welfare Department
- Silver Jubilee College Fraternity అని రాసి ఉంది.
"అసలు ఈ ఫంక్షన్‌కి ముందు డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారిని అనుకున్నారట. ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో రేమండ్‌ గారిని గెస్ట్‌గా పిలిచారట'' ఆ గుంపులో ఎవరో అంటున్నారు.
ఊ ఊ ఊ
కుడివైపు కౌంటర్‌పై 'రిజిస్ట్రేషన్‌ ఫీజు : 150 రూపాయలు' అని రాసి ఉంది.
కౌంటర్‌ చుట్టూ జనాలు గుమికూడారు.
"ఈ రిజిస్ట్రేషన్‌ దేనికిరా?'' ఫామ్‌ నింపుతూ అడిగాడు ఒకాయన.
"ఎంతమంది వచ్చారో తెలియాలి కదా. డబ్బులు కట్టాక బ్యాడ్జ్‌ ఇస్తారు. నీ పేరు, బ్యాచ్‌నెంబర్‌ రాసుకుని జేబుకు పెట్టుకో'' చెప్పాడు రెండో అతను.
బ్రౌన్‌ కలర్‌ సూటు వేసుకున్న పెద్దాయన అటువైపు వచ్చాడు. ఆయన తెల్లని బూర మీసాలు మెరిసిపోతున్నాయి. "నమస్తే సార్‌'' ఫామ్‌ నింపుతున్న వ్యక్తి వంగి మరీ చెప్పాడు.
"ఆ.. బాగున్నావా.. ఏ బ్యాచ్‌ నాన్నా?'' అడిగాడు పెద్దాయన.
"75-78 సర్‌'' చెప్పాడతను.
"ఇద్దరూ అదే బ్యాచా? బాగున్నారు కదా.. కానివ్వండి'' ఇద్దరి భుజం మీద తట్టి వెళ్లిపోయాడు పెద్దాయన.
"ఆయనే దీని ఆర్గనైజర్‌. మనం వచ్చేశాక ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు.. రమణయ్యగారు..'' చెప్పాడు మొదటి వ్యక్తి. గుర్తుపట్టినట్టు తలూపాడు రెండో వ్యక్తి.
ఆడిటోరియం ముందు అక్కడక్కడా కొందరు గుంపులుగా నిల్చుని ఉన్నారు. అందరి మొహాల్లో చిరునవ్వులు.. ఏదో ఆనందం.
లేత ఎరుపు రంగు చొక్కా వేసుకున్న ఓ నడివయస్కుడు "ఏరా ఇంకా రాలేదేంటి? నేనీడ్నే ఉన్నా. మీరేడిదాంకొచ్చిండ్రు. జల్దీ రాండ్రా బాబు'' అని సెల్‌ఫోన్‌లో అంటున్నాడు.
---
ఒక గుంపులో...
నలుగురు నడివయస్కులు ఇలా మాట్లాడుకుంటున్నారు. వారి బ్యాడ్జీలపై బ్యాచ్‌ : 1980-83 అని రాసి ఉంది.
"మొన్న హ్యాపీడేస్‌ సినిమా చూస్తుంటే.. నాకయితే మన కాలేజీ రోజులే గుర్తొచ్చాయి''
"అవి గుర్తొచ్చే కదా. పోయిన సంవత్సరం మేమంతా కల్సుకుంది. నువ్వేమో అప్పుడు కూడా రాలేదు''
"ఏం చేయమంటావురా. భార్య... పిల్లలు... సంపాదన.. ఉద్యోగం.. బిజీ లైఫ్‌.. అందుకే కదరా ఈసారి ఎలాగైనా అందర్నీ కలుసుకోవాలని వచ్చింది''
"27 ఏళ్ల తర్వాత ఇలా కలుస్తామని నేనయితే అనుకోలేదు''
"రమణగాడేంట్రా! వాడసలు ఉన్నాడా పోయాడా?''
"అలా అనకురా బాబూ నీ నోరు అసలే మంచిది కాదు''
---
ఇంకో గుంపులో...
పక్కనుంచి వెళ్తున్న వ్యక్తి చేయి పట్టుకుని లాగి మొహం చూపిస్తూ "ఒరేయ్‌! ఈడ్ని గుర్తుపట్టలేదా?'' అడిగాడు ఒకతను.
"అరే.. సుబ్బారావ్‌.. ఈడ్ని నేను గుర్తుపట్టకపోవడమేంట్రా.. మేమిద్దరం వెనకబెంచే కదా'' అని షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు రెండో వ్యక్తి.
"ఏరా సుబ్బి! నా పెళ్లికి పిలిస్తే రాలేదేందిరా?''
"కుదరలేదు మామా. అప్పుడు నాన్న చనిపోయిండే..''
"అరె అవునా? సారీరా''
"పర్లేదురా..''
"ఇంకేంట్రా.. నువ్వు పెళ్లి చేసుకున్నావా మరి. ఆ అమ్మాయినేనా?''
"అవున్రా'' సిగ్గుపడుతూ తల ఊపాడు సుబ్బారావు.
"హేయ్‌.. కంగ్రాట్స్‌రా.. మొత్తానికి సాధించావన్నమాట. వాళ్ల అమ్మనాన్న ఒప్పుకున్నారా?''
"లేదురా.. అదో పెద్ద కథ''
"ఇన్నాళ్లకు కలవక కలవక కలిస్తే మళ్లీ ఆ పాత కథే మొదలెట్టారా? వద్దుర బాబు.. నీ పే..ద్ద కథ'' తల పట్టుకున్నాడు మొదటి వ్యక్తి.
---
మరో గుంపులో...
"ఈ కరీమ్‌గాడు (నల్లగా ఉన్నాడు. బహుశా ముద్దు పేరు అనుకుంటా) ఇందాక ఏం చేసిండో తెల్సా. పుల్లారెడ్డి సార్‌ని పట్టుకుని 'అన్నా! నీదే బ్యాచ్చే' అని అడిగిండంట'' నవ్వు ఆపుకోలేక చెబుతున్నాడు ఒకతను.
వారిలో నల్లగా ఉన్నతని మొహం ఎర్రగా మారిపోయింది. "ఎకశకలా? నాకేం దెల్సురా.. జుట్టుకు రంగేసుకుండు సారు. ఇంకా యంగ్‌గానే కనిపిస్తుంటే మన బ్యాచ్‌మేట్‌ అనుకున్న'' కవర్‌ చేసుకున్నాడు కరీమ్‌(సారీ.. అతని పేరు నాక్కూడా తెలియదు).
ఇంతలో పుల్లారెడ్డి సార్‌ వారి దగ్గరికి వస్తూ "నా గురించే మాట్లాడుతున్నట్లున్నారు?'' అని అడిగాడు.
"అవును సార్‌. ఇందాక వీడు..'' మళ్లీ కిలకిలా నవ్వారు అందరూ సార్‌తో సహా.
"ఇంకేంట్రా కరీమ్‌?'' ఆ నవ్వుల్ని బ్రేక్‌ చేస్తూ అడిగారు పుల్లారెడ్డి.
"సార్‌ మీరు కూడా?''
"నీ అసలు పేరు ఎవరికి గుర్తుందిరా! ఈ పేరుతోనే పాపులర్‌ కదా నువ్వు. ఇంతకీ ఏం చేస్తున్నావ్‌?''
"ఎల్‌ఐసి ఏజెంట్‌ సార్‌''
"బాగానే చేయిస్తున్నావా పాలసీలు?''
"ఏదో అట్ల నడుస్తుంది సార్‌. మీ విజిటింగ్‌ కార్డ్‌ ఉంటే ఇవ్వండి సార్‌''
"ఎందుకురా? నాతో కూడా పాలసీ చేయిస్తావా?'' జేబులోంచి పర్సు తీస్తూ అడిగాడు. "ఒక్కటే ఉందిరా కార్డులు లోడ్‌ చేయడం మర్చిపోయా''
"సరే నాది తీసుకోండి సార్‌'' అని బ్యాగులోంచి నాలుగు కార్డులు తీసిచ్చాడు.
"మీ ఎల్‌ఐసి వాళ్లు ఇలా నలుగురున్న దగ్గరికి ఫుల్‌ సరుకుసరంజామాతో వస్తారే! సాయంత్రంలోగా ఓ పది పాలసీలు చేయించుకుని వెళ్తావా?''
"అబ్బా! వదిలేయండి సార్‌. ప్లీజ్‌''
---
ఇంకోచోట... ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. వారి మధ్యలోకి ఒకతను వచ్చాడు. లూజ్‌ ప్యాంటు, గళ్ల చొక్కా వేసుకుని ఇన్‌షర్ట్‌ చేసుకున్నాడు. జుట్టు ఎకరం పోయింది.
"నన్ను గుర్తుపట్టారా?'' అని ఆ ముగ్గుర్ని కుదుపుతూ అడిగాడు.
అందరి మొహాల్లో క్వశ్చన్‌ మార్కులే.
"ఒరేయ్‌ గుర్తుపట్టండ్రా. ఇప్పటికి పదిమందిని అడిగాను. ఎవరూ గుర్తుపట్టం లేదు'' గట్టిగా అరిచాడు.
ఆ ముగ్గురు అతని బ్యాడ్జ్‌ని పట్టుకుని పరీక్షగా చూశారు. పేరు : రమేష్‌, బ్యాచ్‌ : 1985-88 అని రాసి ఉంది.
"రమేషా? మా బ్యాచ్చే! ఏ రమేష్‌రా నువ్వు?'' అడిగాడు ఆ ముగ్గురిలో ఒకతను.
"నేన్రా హాస్టల్‌లో నీ రూమ్మేట్‌ని'' హింట్‌ ఇచ్చాడు రమేష్‌.
"అరే.. బాబాయ్‌ నువ్వా?'' కేరింతలు కొడుతూ ముగ్గురూ కలిసి అతన్ని గట్టిగా వాటేసుకుని పైకెత్తారు.
"వదలండ్రా బాబు.. ఊపిరాడడం లేదు...'' అని అరిస్తే కిందికి దించారు.
"ఏంట్రా ఇలా అయిపోయావ్‌.. మంచి హెయిర్‌ స్టయిల్‌ కదరా నీది. జుట్టేంటి ఇలా ఊడిపోయింది''
"ఏం చేయన్రా. ఆ జుట్టులేకే.. నన్ను ఎవరూ గుర్తుపట్టడం లేదు'' దిగాలుగా అన్నాడు రమేష్‌.
"ఒక పన్జెయ్‌రా. ఈ క్యాప్‌ పెట్టుకో అప్పుడైనా గుర్తుపడతారోలేదో చూద్దాం'' అని ఒకతను టోపీ ఇచ్చాడు.
అది పెట్టుకుని జనాల్లోకి వెళ్లిన రమేష్‌ ఓ పావుగంట తర్వాత వచ్చాడు.
"బాబాయ్‌ నీ ప్లాన్‌ బాగా వర్కవుట్‌ అయిందిరా. అందర్నీ ఇందాక నేను పలుకరిస్తే.. ఇప్పుడు వాళ్లే నన్ను పలుకరించారు. రెండు రెండు సార్లు పలుకరిస్తున్నార్రా బాబు'' సంతోషంగా చెప్పాడు రమేష్‌.
(ఆ తర్వాత పెరిగిన పొట్టల గురించి.. మారిన శరీరం రంగుల గురించి.. జోకుల మీద జోకులు...)
---
ఒకతను ఓ పెద్ద నోటు పుస్తకం పట్టుకుని కనిపించిన వారందరి ఫోన్‌ నెంబర్లు రాయించుకుంటున్నాడు. ఇంతలో అతని ఫోన్‌ రింగయింది. లిఫ్ట్‌ చేసి..
"ఆ.. కిల్లీ చెప్పు... ఇక్కడే ఉన్న. వచ్చావా, ఎక్కడున్నావ్‌? ఆటోలోనా ఏ ఆటోలో? డబ్బులిస్తున్నావా? అరె నీ చేయి...'' అప్పటివరకు సరదాగా మాట్లాడిన అతని మొహంలో ఏదో విషాదం. పరుగు పరుగున ఆ ఆటోవైపు వెళ్లాడు. ఆటో దిగిన వ్యక్తికి కుడిచేయి లేదు. వెళ్లినతను ఎడమ చేయి పట్టుకుని ఏదో అడుగుతున్నాడు. వారు మాట్లాడుకుంటూ నావైపే వస్తున్నారు.
"అందుకే యాక్సిడెంట్‌ అయిన వాళ్లని తాగి బండి నడిపావా? అని అడక్కూడదు. పడ్డ వాళ్లందరూ చెడ్డ వాళ్లు కాదన్నట్లు.. బైక్‌ పైనుంచి పడి చెయ్యో, కాలో పోగొట్టుకున్నవాళ్లందరూ తాగి పడ్డట్లు కాదు..'' నన్ను దాటేసి వెళ్తున్నప్పుడు ఆ ఒంటి చేయతను చెప్తున్నాడు.
ఇంతలో రమణయ్యగారు "కమాన్‌ ఎవ్రీబడీ.. ఇక మీటింగ్‌ మొదలెడదాం రండి'' అనగానే అందరూ లోపలికి వెళ్లిపోయారు.
---
కాలేజ్‌ గురించి...
సిల్వర్‌ జూబ్లీ గవర్నమెంట్‌ కాలేజ్‌ని 1972లో అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు ప్రారంభించారు. స్వాతంత్య్ర దినోత్సవ రజతోత్సవాల సందర్భంగా ఈ కాలేజ్‌ని మొదలెట్టారు. ఆంధ్రా, తెలంగాణ రాయలసీమ ప్రాంతవాసులకు 42:36:22 నిష్పత్తి ప్రకారంగా ఈ కాలే జ్‌లో సీట్లు కేటాయిస్తారు. మొన్నటి వరకు డిగ్రీ మాత్రమే ఉండే ఈ కాలేజ్‌లో ఇప్పుడు పిజి కోర్సులు కూడా ప్రవేశపెట్టారు. చదువుతోపాటు భోజనవసతులు కూడా ఉచితం. ఈ కళాశాలలో చదివిన చాలామంది ఇప్పుడు ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐఆర్‌ఎస్‌లుగా ఉన్నత హోదాల్లో ఉన్నారు. కాలేజి పెట్టిన పాతికేళ్ల తర్వాత 1998లో సిల్వర్‌ జూబ్లీ కాలేజ్‌ ఫ్రెటర్నిటీ ప్రారంభమైంది. ప్రతి గాంధీ జయంతి నాడు పూర్వవిద్యార్థుల సమావేశం ఏర్పాటు చేస్తుంటారు. అలాగే ఈ ఏడాది ఉస్మానియా యూనివర్శిటీలో ఇలా కలిశారు.

4 comments:

Vinay Chakravarthi.Gogineni said...

gud one..........

ఇందు said...

bagundi :)

Anonymous said...

ayya.. idi meeru raasindEna.. lEka.. andhrajyothi loni article kottesaara...

మాలా కుమార్ said...

bagundi.