'వారిలా కలగనండి.. వారిలా సాధించండి'

By | October 12, 2010 Leave a Comment
ఇంగ్లీషులో జనాదరణ పొంది, ఎన్నో భారతీయ భాషల్లోకి అనువాదమైన 'స్టే హంగ్రీ స్టే ఫూలిష్‌'కి తెలుగు అనువాదం ఈ పుస్తకం. నలుగురు నడిచే దారిలో మనం నడిస్తే థ్రిల్‌ ఏముంటుంది? మనమే ఓ కొత్త మార్గాన్ని కనిపెడితేనే ఉంటుంది మజా. కానీ ఆ కొత్తబాటలో ఎన్నో ముళ్లుంటాయి. రాళ్లు రప్పలుంటాయి. ఎత్తుపల్లాలుంటాయి. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌లో చదివి తమ భవిష్యత్తుకు అలా బంగారుబాటలు వేసుకున్న 25 మంది వ్యాపారవేత్తల విజయగాథల్ని ఈ పుస్తకంలో వివరించారు రచయిత్రి.

'వ్యాపార రంగంలో ఎదగాలని ఎంతోమందికి ఉంటుంది. ఒకవేళ అలా జరిగివుంటే నేను కోటీశ్వరున్ని అయిఉండేవాడ్ని.. ఒకవేళ ఇలా చేసి ఉంటే ఈపాటికి కంపెనీ పెట్టి ఉండేవాడ్ని.. ఇలా మనం చాలాసార్లు అనుకుంటుంటాం. ఈ 'ఒకవేళలు' మనం కనే పగటి కలలు కావు. అవి మన ఆశలు, ఆకాంక్షలు, మన స్వప్నాలు. మనం 'ఏదో ఒకరోజు' అనే పెట్టెలో వీటిని భద్రంగా మడిచిపెట్టి చెదలు పట్టకుండా హేతువునీ, తర్కాన్నీ కలరా ఉండల్లా వాటి పక్కనబెట్టి భద్రంగా ఉంచుతాం. ఆ తర్వాత దాన్ని మరిచిపోయినవాళ్లు అలాగే మిగిలిపోతారు. దాని గురించే ఆలోచిస్తూ అవకాశాలను ఎవరు చేజిక్కించుకుంటారో వారు జీవితంలో ఎదుగుతారు. మీరు అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి. మీ అంతరాత్మ ఏం చెబుతోందో వినండి. మీరు సబ్బులమ్ముకునేవాడిలా మిగిలిపోకూడదని, కార్పొరేట్‌ బానిస అస్సలు కావొద్దని చెబుతోందా? అయితే మీ టాలెంట్‌తో మీరు సాధించాల్సింది ఇంతకన్నా పెద్దది, ఇంతకన్నా మంచిది మరేదో ఉందన్నమాటేగా. దానికోసం మొండిగా మారండి. ఆకలికి ఎదురీదండి' అని చెబుతుంది ఈ పుస్తకం. "అవసరమైతే పస్తులుండండి. అవసరమైతే అవహేళలను ఎదుర్కోండి'' అని 2005లో స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో తన విద్యార్థులకు పాఠాలు మొదలుపెడుతూ స్టీవ్‌జాబ్స్‌ సలహా ఇచ్చాడు. దీన్ని అచ్చంగా పాటించిన వారిగా కనిపిస్తారు ఈ పుస్తకంలోని పాతికమంది.
ఆ పాతికమంది గురించి మూడు భాగాలుగా చెప్పారు రచయిత్రి. దేన్నయినా గట్టిగా నమ్మినవాళ్లు ఒకరకం. దొరికిన అవకాశాలను అందుకున్నవాళ్లు రెండో రకం, సృజనాత్మకంగా ఆలోచించేవాళ్లు మూడోరకం. మొదటి రకంవాళ్లలో 'నౌకరీ.కామ్‌' సంజీవ్‌బిఖ్‌ చందానీ, 'సుభిక్షా' సుబ్రమణ్యన్‌లాంటి వాళ్లని పరిచయం చేశారు. 'మేక్‌మైట్రిప్‌.కామ్‌' దీప్‌కాలరా, 'ఆర్కిడ్‌ ఫార్మా' రాఘవేంద్రరావులాంటి వాళ్ల గురించి రెండో కోవలో... 'సింటెక్స్‌' దన్‌గయాచ్‌, 'క్లోరోఫిల్‌' ఆనంద్‌ల గురించి మూడోకోవలో వివరించారామె. ప్రతి వ్యక్తి పరిచయం, వ్యాపారరంగంలో వారి ఎదుగుదలను వివరిస్తూ వారిచేత ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సలహాలు ఇప్పించారు. ఆ సలహాలు ఎంతో విలువైనవి. "మీకు వ్యాపారం చేయాలని ఆలోచన వస్తే దాని గురించి పగటి కలలు కంటూ కూర్చోకండి, దాన్ని వెంటనే అమలు చేయండి'' అని చెప్తారు 'మస్టెక్‌' వ్యవస్థాపకులలో ఒకరైన సుందర్‌. "నువ్వు ఉద్యోగం చేస్తున్నవాడివయితే నీ జీతం ఏడాదికి 15 నుంచి 18 లక్షల దాకా ఉందనుకుందాం. అప్పుడు ఐదేళ్ల కాలంలో నువ్వెంత సంపాదించగలవు? 18X5, అంతేనా? బహుశా నీకు మిగిలే ది 50 లక్షలు. అదే నువ్వు ఏదైనా వ్యాపారం చెయ్యి, ఐదేళ్ల కాలంలో నువ్వు అంతకంటే ఎక్కువే సంపాదించగలవు'' అంటారు 'ఎడుకాంప్‌' వ్యవస్థాపకుడు శంతను ప్రకాశ్‌. ఇలాంటి అమూల్యమైన సలహాలు ఈ పుస్తకంలో మీకు ఎన్నో దొరుకుతాయి. మీకు వ్యాపారరంగంలో విజయం సాధించాలని ఉంటే తప్పకుండా కొని దాచుకోవాల్సిన పుస్తకం.
---
వారిలా కలగనండి.. వారిలా సాధించండి
రచయిత : రశ్మి బంసల్‌, అనువాదం : వాడ్రేవు చినవీరభద్రుడు
పేజీలు : 385, వెల : రూ. 175
ప్రతులకు : రీమ్‌ పబ్లికేషన్స్‌, 30-05-01, దాభా గార్డెన్స్‌, విశాఖపట్నం-20

0 comments: