పదిహేను సంవత్సరాల క్రితం... ఒకరోజు...
దారుల్ షిఫా అంధుల పాఠశాల, హైదరాబాద్
తొమ్మిదో తరగతి గది ఖాళీగా ఉంది. ఒక అబ్బాయి ఒంటరిగా కూర్చుని టేప్ రికార్డర్ వింటున్నాడు. అతని పేరు పవన్ కుమార్. అంతకుముందు రోజు ఆ అబ్బాయి స్కూల్‌కి డుమ్మా కొట్టాడు. అందుకే తన ఫ్రెండ్ దగ్గర క్యాసెట్ తీసుకుని పాఠాన్ని వింటున్నాడు. టీచర్ చెప్పిన పాఠం అయిపోయింది. ఆ తర్వాత టేప్ రికార్డర్‌లో ఒక పాట వినిపించింది. ఆ పాటలో ఒక బీట్ అతని మనసు దోచింది. ఆ సౌండ్ అతని మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది.
పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ హోరులో కూడా అదే స్వరం అతని చె వుల్లో మారుమోగుతోంది. మెట్ల మీద చెప్పుల చప్పుడు, తెరుచుకుంటున్న తలుపు శబ్దం, నల్లా నుంచి వస్తున్న నీటి గల గల.. గదిలో తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ సౌండ్.. ఇలా అన్ని శబ్దాలను ఆ స్వరంతోనే పోల్చుకుంటున్నాడు ఆ అబ్బాయి. దేనిదా శబ్దం? ఎంత మాధుర్యంగా ఉంది?... రాత్రి నిద్రలేదు. ఉదయం ఆకలి లేదు. మూడీగా ఉన్నాడు. అమ్మతో కబుర్లు చెప్పడం లేదు. నాన్నతో ఆడుకోవడం లేదు. "ఏమైందిరా అలా ఉన్నావు'' అని అడిగారు వాళ్ల నాన్న దయాకర్. పవన్ నుంచి సమాధానం లేదు. రెండు రోజుల తర్వాత టీవీలో అలాంటి సంగీతమే పవన్‌కి వినిపించింది. "ఆ శబ్దం దే నిది నాన్నా?'' పరుగున వచ్చి అడిగాడు పవన్. 'వయోలిన్' చెప్పారు దయాకర్. ఎగిరి గంతేశాడు పవన్. "వయోలిన్.. వయోలిన్'' పదే పదే అదే పదం పలికాడు. "నాన్నా! నేను వయోలిన్ నేర్చుకుంటాను'' అన్నాడు. మౌనంగా ఉండిపోయాడు తండ్రి.
***
సంగీతమంటే చాలామందికి ఇష్టమే. కానీ అందులో పరిజ్ఞానం సంపాదించాలంటే చాలా కష్టం. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికే అది కష్టమైనప్పుడు మా వాడికి అంత సులువుగా అబ్బుతుందా?- ఒక గదిలో కూర్చుని ఆలోచిస్తున్నారు దయాకర్. నేను ఎలాగైనా వయోలిన్ నేర్చుకోవాలి. చాలా ప్రోగ్రాములు ఇవ్వాలి. చాలామందికి నేర్పించాలి. వయోలిన్ ఎవరు బాగా వాయిస్తారంటే నా పేరే చెప్పాలి. నేను అంతటి వాడ్ని కావాలి- మరో గదిలో పవన్ కలలు కంటున్నాడు.
ఒక రోజు.. "పదో తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యావుగా. ఇంటర్‌లో కూడా అలాగే పాసవ్వు. వయోలిన్ నేర్పిస్తాను'' పవన్‌కు హామీ ఇచ్చాడు దయాకర్. పదో తరగతే కష్టంగా గట్టెక్కిన పవన్‌కు ఇంటర్ ఓ ఇనుప కొండలా కనిపించింది. అంధుల కోసం ప్రత్యేక కళాశాలలు అప్పట్లో లేవు. అందరితో పాటు చదువుకోవాలి. పాఠాలను రికార్డు చేసుకుని దాన్ని బ్రెయిలీలోకి మార్చుకోవాలి. అంటే మామూలు వారికంటే డబుల్ కష్టపడాలన్నమాట. వయోలిన్ నేర్చుకోవాలంటే తప్పదు మరి. మనకెందుకులే అని వదిలేస్తే పవన్ సైడ్ క్యారెక్టర్‌గానే మిగిలిపోతాడు. కానీ పవన్ హీరో కావాలనుకుంటున్నాడు. హీరో వెనుకడుగు వేయకూడదు. సవాళ్లతో సై అనాలి. ఛాలెంజ్‌తోనే ఛాలెంజ్ చేయాలి.
***
ఎవరైనా తోడు లేనిదే బయట కాలు పెట్టలేని పవన్ ఆలియా కాలేజ్‌లో అడుగుపెట్టాడు. అందరితోపాటే తరగతిలో కూర్చున్నాడు. చుట్టూ అంత మంది ఉన్నా పవన్ ఒంటరి. అందరూ నోట్స్ రాసుకుంటుంటే తను మాత్రం పాఠాన్ని రికార్డ్ చేసుకునేవాడు. ఇంటికి వెళ్లి దాన్ని బ్రెయిలీలో రాసుకుని ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకునేవాడు. ఒకరోజు క్లాస్‌లో లెక్చరర్ స్టూడెంట్స్‌ని ఒక ప్రశ్న అడిగారు. దానికి ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. పవన్ లేచి టక్కున సమాధాన ం చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ క్షణమే పవన్ వాళ్ల హృదయాలను గెలిచాడు. వారందరూ అతన్ని స్నేహితునిగా అంగీకరించారు. కట్ చేస్తే.. ఇంటర్ పరీక్షలు.. రైటర్ సహాయంతో రాసి ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాడు.***
హైదరాబాద్ కింగ్‌కోఠీలోని శ్రీ త్యాగరాయ సంగీత కళాశాల... పవన్ కలగన్న రోజు..."అందరితో పాటు నేర్పలేం. ప్రత్యేకంగా చెప్పాలి. అంత సమయం ఉండదు'' అన్నాడు ఒక గురువు.
"గుడ్డి వాడికి సంగీతం ఎందుకండి?'' ఒక లెక్చరర్ విసుక్కున్నాడు. పవన్ కల బద్దలయింది. వయోలిన్‌ను నేలకేసి కొట్టాడు. ఆ చప్పుడుకు అటుగా వెళ్తున్న ప్రిన్సిపల్ పూసర్ల మనోరమ అక్కడికి వచ్చి పవన్‌ను విషయం ఏమిటని అడిగారు. అతని ఆసక్తి ఆమెకు అర్థమయింది. తానే స్వయంగా నేర్పుతానని ముందుకొచ్చారు. బహుశా ఆమెకు పవన్‌లో ఆమె తాతగారు ద్వారం వెంకటస్వామి నాయుడు కనిపించి ఉంటారు. ఆయన ప్రసిద్ధ వయోలిన్ విద్వాంసులు. పవన్‌లాగే అంధుడు(పుట్టుకతో కాదు).
***
వయోలిన్ సర్టిఫికెట్ కోర్సు నాలుగు సంవత్సరాలు... డిప్లమా రెండు సంవత్సరాలు. మొదటి సంవత్సరం మొత్తం సరిగమలు. తర్వాత గీతాలు, వర్ణాలు, కృతులు. ఇవన్నీ నేర్చుకోవడం పవన్‌కి పెద్ద సమస్య కాలేదు. వాటిని రికార్డు చేసుకుని ఇంట్లో కూడా సాధన చేసేవాడు. ఓకల్ తరగతులు పూర్తయ్యాయి. వీటిలో ఫర్‌ఫెక్ట్ అయితేనే వాయిద్యంపై గమకాలు నేర్పుతారు. పవన్‌కు సమస్య అక్కడే మొదలైంది. వయోలిన్ మీద సరిగమలు పలికించాలంటే తీగల మీద చేతి వేళ్లు ఎలా నొక్కాలి?, స్టిక్‌ని ఎలా కదపాలి.. ఇవి చూసి నేర్చుకుంటేనే స్వరాలు సరిగ్గా పలికించవచ్చు. పవన్ ప్రతిదీ తప్పుగా వాయించేవాడు. అప్పుడు మనోరమ పవన్ వేళ్లని పట్టుకుని వయోలిన్ ఎలా ముట్టాలో నేర్పారు. ఒక్కో స్వరానికి ఒక్కో రోజు పట్టింది. తర్వాత ఇ, ఎ, డి, జి తంత్రుల్లో ఏ తంత్రిపై ఏ పంచమం పలుకుతుందో ఒకటికి పదిసార్లు చెప్పారు. అవసరమయితే అదనంగా సమయం కేటాయించారు. అప్పట్నించి వయోలిన్‌పై పవన్ వేళ్లు కదలడం ఆగలేదు. పొడి స్వరాలే కాదు, గమకాలు కూడా ఘనఘన వాయించడం మొదలెట్టాడు. ఆరేళ్లు గడిచాయి. పవన్ డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. ***
2002లో రవీంద్ర భారతిలో మొదటి ప్రదర్శన... ఆ తర్వాత చాలా సంగీత కచేరీలు.. 2004 నుంచి ఆకాశవాణిలో యువవాణి ద్వారా తన వయోలిన్ మాధుర్యాన్ని వినిపించాడు. కానీ పవన్ లక్ష్యం అది కాదు. తాను నేర్చుకున్నది మరో నలుగురికి నేర్పాలనుకున్నాడు. తాను నేర్చుకున్న కళాశాలలోనే అధ్యాపకునిగా చేరాలనుకున్నాడు. కానీ అతను నేర్పలేడని ఆ కళాశాలలో కొందరు కొట్టి పారేశారు. పవన్ రెండు సంవత్సరాలు ఉచితంగా పని చేసి తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు నాలుగు సంత్సరాలుగా అదే కళాశాలలో వయోలిన్ అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. అంతేకాదు తన ఇంట్లో కొంతమంది పిల్లలకు ఉచితంగా వయోలిన్ కూడా నేర్పిస్తున్నాడు. ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎం.ఎ. కూడా చదువుతున్నాడు. భవిష్యత్తులో పెద్ద పెద్ద ప్రోగ్రాములు ఇచ్చి ఎంఎస్ గోపాలకృష్ణన్ అంతటివాడ్ని అవుతానంటున్నాడు. ('నెలవంక' పేరుతో 'ఆంధ్రజ్యోతి-ఆదివారం అనుబంధం'లో నేను రాస్తున్న కొత్త శీర్షిక. నెలలో రెండుసార్లు కనిపించే నెలవంకలా రెండు వారాలకొకసారి.)
Comments
nagesh,
kindley, convey all of our comments to pavan.
pavan's challenging skill is great.
nageshjii! thank you to you for writing this best one.
ఇటువంటి అసాధారణ వ్యక్తుల కథల్ని వెలుగులోకి తెస్తున్న మీకు కూడ అభినందనలు.