Skip to main content

ఎవడు కొడితే దిమ్మ దిరిగి బొమ్మవుతుందో వాడే మైకెల్‌ జాక్సన్‌


కార్పొరేట్‌ స్కూలు పిల్లలు బడి గడప దాటకముందే ప్రపంచంతో పోటీ పడుతుంటారు. సర్కారు బడి పిల్లలు చదువు పూర్తయ్యాక కూడా ప్రపంచంతో పోటీ పడలేక ఉన్నచోటే ఆగిపోతారు. ఇద్దరూ బడిపిల్లలే అయినా ఎంత తేడా? ఈ తేడాని తుడిపేసేందుకు బొమ్మని భుజానేసుకుని ఊరూరా తిరుగుతున్నాడు కొండా శ్రీనివాస్‌. మాటలు నేర్చిన ఆ బొమ్మ తన బాస్‌ శ్రీనివాస్‌ గురించి ఏం చెబుతుందో వినండి.

ఎవడు కొడితే దిమ్మ దిరిగి బొమ్మవుతుందో వాడే మైకెల్‌ జాక్సన్‌. అంటే నేనే. ఉట్టి బొమ్మనే అని తీసిపారేయకండి. ఈ బొమ్మే లేకపోతే శ్రీనివాస్‌ లేడు. శ్రీనివాసే లేకపోతే సర్కారు బడిపిల్లలకు దారి చూపించేవాడే లేడు. అంత సీన్‌ లేదంటరా? అయితే మా బాసు శ్రీనివాస్‌ గురించి మీకు చాలా చెప్పాలి. ఆయనో బతకలేని... కాదు.. కాదు బతకనేర్చిన బడిపంతులు. బడిపిల్లలకు బతుకు నేర్పుతున్న సర్కారు బడిపంతులు.
నేను చిన్నప్పటి నుంచీ ఆయన వెంబడి ఏం లేను. రెండేళ్ల కిందటే నన్ను కొట్టుకొచ్చాడు.. సారీ.. కొనుక్కొచ్చాడు. అప్పుడు నేను "అసలు నన్నెందుకు తీసుకొచ్చావు?'' అని అడిగాను.
"నాకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. వాళ్లకు మనం పాఠాలు చెప్పాలి'' అన్నాడు.
"పాఠాలా! ఏం పాఠాలు?''
"పర ్సనాలిటీ డెవలప్‌మెంట్‌''
"అబ్బో అందుకు నీ పర్సనాలిటీ.... అబ్బ కొడతావేంటి?... సారీ నా పర్సనాలిటీ సరిపోతుందంటావా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావ్‌?''
"గవర్నమెంట్‌ టీచర్ని''
"ఓహో.. అక్కడ పాఠాలు చెప్పవా?''
"చెప్తాను''
"మరి ఇదేంటి?''
"దానికో పెద్ద కథ ఉంది''
"బాషాలో రజనీకాంత్‌లా ఫ్లాష్‌బ్యాకా? పర్లేదు కాస్త లెంత్‌ తగ్గించి చెప్పు''
శ్రీనివాస్‌ మొదలెట్టాడు (బ్లాక్‌ అండ్‌ వైట్‌లో... సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్‌ అలాగే వస్తుంది కదా) "నాకు స్కూల్లో చదువుకునేప్పటి నుంచే మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్‌ అంటే చాలా ఇష్టం. అప్పుడే కొందరు సినీ హీరోల గొంతులు అనుకరించేవాడ్ని. జనగాంలో ఇంటర్‌ చదివేటప్పుడు యాదగిరి అనే మిమిక్రీ కళాకారుని దగ్గర ధ్వనులు అనుకరించడం నేర్చుకున్నాను. డిగ్రీ చదివేటప్పుడు లోహిత్‌ కుమార్‌ దగ్గర వెంట్రిలాక్విజమ్‌ నేర్చుకున్నాను. ఆ తర్వాత చాలా ప్రోగ్రామ్‌లు ఇచ్చాను. చాలా బహుమతులు కూడా వచ్చాయి. నాకెక్కువగా పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ క్లాసుల మీద ఆసక్తి ఉండేది. ఎక్కడ తరగతులు జరిగినా వెళ్లేవాడ్ని. రకరకాల పుస్తకాలు, సీడీలు కొనేవాడ్ని. పూర్తి స్థాయి పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ ట్రైనర్‌ని కావాలనుకున్నాను. కానీ ఇలా టీచర్‌ని అయ్యాను''
మైకెల్‌ జాక్సన్‌ : తెలుగు సినిమా హీరోయిన్లలా డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయినట్లన్నమాట.
శ్రీనివాస్‌ : నువ్వు మధ్యలో మాట్లాడకు.
జాక్సన్‌ : సరే చెప్పు..
శ్రీనివాస్‌ : ఎనిమిదేళ్ల నుంచి వరంగల్‌లోని మల్కపేట ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాను. అక్కడ చేరిన కొత్తలో విద్యార్థుల్ని బాగా గమనించేవాడ్ని. కార్పొరేట్‌ స్కూళ్లకి, గవర్నమెంట్‌ బడికి చాలా తేడా కనిపించేది. ఊళ్లల్లో పిల్లలు బళ్లో చెప్పే పాఠాలు తప్ప మిగిలిన విషయాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. పట్టణాల్లో చదివే పిల్లలకు తెలిసిన సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్టు, వీడియో గేమ్స్‌.. సర్కారు బడి పిల్లలకు తెలియవు.
జాక్సన్‌ : అవి తెలియకపోతే అంత నష్టమా?
శ్రీనివాస్‌ : అవి మాత్రమే కాదు. అసలు ఎందుకు చదువుకోవాలి? చదివిన నాలుగు ముక్కలైనా గుర్తుండేలా ఎలా చదవాలి? ఏకాగ్రతని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? మార్కులు తక్కువొస్తే నష్టమా? పెద్ద పెద్ద చదువులు చదివి గొప్పవాళ్లయిన వారి గురించి... అసలు చదువుకోకుండానే ఎంతో సాధించిన వారి గురించి..
జాక్సన్‌ : ఓర్నీ.. ఇప్పుడు క్లాస్‌ మొదలుపెట్టేలా ఉన్నావే!
శ్రీనివాస్‌ : ఆ... అదే.. అదే.. ఇలాంటి చాలా విషయాల గురించి వారికి తెలియవు. అందుకే వారికి ఇలాంటి విషయాల పట్ల అవగాహన కల్పించాలనిపించింది. మొదట మా స్కూల్లోనే ప్రారంభించాను. మామూలుగా క్లాసులు వినడం అంటే పిల్లలకు బోర్‌. అందుకే మిమిక్రీ ద్వారా రకరకాల గొంతుల్లో వినిపిస్తే వారు చాలా ఆసక్తిగా వింటారు. నిన్ను తీసుకొచ్చింది కూడా అందుకే.
అదండి విషయం. అలా మా బాస్‌ చెప్పిన కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది. ఊరికే వినోదం పంచడమే కాకుండా ఇలాంటి ప్రోగ్రాముల ద్వారా పిల్లలకు ఇంకేదో నేర్పాలన్న ఆయన తపనకు నేను కూడా తోడయ్యాను. ఇక మేం ఊరూరా తిరగడం మొదలెట్టాం. ఇప్పటి వరకు ముప్పై స్కూళ్లలో పిల్లలకు పాఠాలు చెప్పాం. ఫ్రీగానే లెండి. పర్యావరణ పరిరక్షణ, ఆహారం - ఆరోగ్యం, పట్నం బడి - పల్లెటూరు బడి, చిన్ని చిన్ని కథలు, విజయగాథలు.. తదితర అంశాల మీద కొత్త కొత్త కాన్సెప్ట్‌లు తయారు చేసుకున్నాం. స్కూళ్లలోనే కాదు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఇప్పటి వరకు 200లకు పైనే ప్రోగ్రాములిచ్చాం. మీ స్కూల్లో కూడా పాఠాలు చెప్పాలంటే 96665 49752 నెంబర్‌కు ఫోన్‌ చేయండి. మా అసిస్టెంట్‌ (అబ్బ) మా బాస్‌.. ఫోన్‌ లిప్ట్‌ చేస్తాడు. వీలు చూసుకుని వచ్చేస్తాం.

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...