Skip to main content

జానకి డెఫ్‌ అండ్‌ డంబే కాదు రఫ్‌ అండ్‌ టఫ్‌ కూడా... (నెలవంక - 2)


('నెలవంక' పేరుతో 'ఆంధ్రజ్యోతి-ఆదివారం అనుబంధం'లో నేను రాస్తున్న శీర్షిక. నెలలో రెండుసార్లు కనిపించే నెలవంకలా రెండు వారాలకొకసారి.)

 ఆ మురికివాడలోని ఒక గుడిసెలో కిరోసిన్‌ దీపం వెలుగుతోంది. ఎనిమిది మంది పిల్లలు ఆరుబయట పడుకుని ఉన్నారు. వారి తండ్రి దీపం వెలుగులో ఏదో ఆకులు నూరి ఆ పసరు తన భార్యకు తాగించాడు. ఆమె మూడు నెలల గర్భవతి. కడుపు పట్టుకుని బిగ్గరగా ఏడ్చింది. ఆమెని ఒళ్లోకి తీసుకుని ఓదార్చాడతను. కడుపులో బిడ్డను చంపాల్సిన అవసరం వారికి ఏమొచ్చిందో! అది చూడలేక ఆకాశంలో నెలవంక మబ్బుల చాటుకు వెళ్లిపోయింది.
***
ఆరు నెలల తర్వాత...
ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తల్లిదండ్రుల మొహాల్లో ఊహించినట్టుగానే సంతోషం లేదు. ఎందుకంటే పుట్టింది ఆడపిల్ల. అప్పటికే వారికి ఆరుగురు అమ్మాయిలు. ఈసారీ ఆడపిల్ల పుడుతుందనే వారు పురిట్లోనే చంపేయాలనుకున్నారు. కాని ఆ తల్లి తాగిన పసరు మందు పనిచేయలేదు. పోనీ పుట్టాక ఆ బిడ్డను చెత్తకుప్పలో విసిరేద్దామనుకున్నారు. కాని కన్నపేగు కదా... మనసు రాలేదు. దేవుడి దయ ఉంటే మంచి రోజులొస్తాయనుకున్నారు. ఆ పాపకి జానకి అని పేరు పెట్టుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ తల్లిదండ్రులకు మరో చేదు నిజం తెలిసింది. 'చిన్నా.. బుజ్జీ' అని పిలిచినా జానకిలో ఎలాంటి స్పందన లేదు. కుండను బద్దలు కొట్టినా.. ఆ చప్పుడుకు తిరిగి చూడలేదు. అప్పుడు అర్థమయ్యింది వారికి జానకికి వినిపించదని. ఆ ఆకుపసరు వల్ల అంగవైకల్యం వచ్చిందని. ఇంకెక్కడి మంచి రోజులు?.. నిట్టూర్పు వారిలో.

***
2007 డిసెంబర్‌ 3 (వికలాంగుల దినోత్సవం)
ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌, న్యూఢిల్లీ
వేదిక మీద అప్పటి పంచాయితీ రాజ్‌ మంత్రి మణి శంకర్‌ అయ్యర్‌ చేతుల మీదుగా జానకి 2007 సంవత్సరానికి గాను హెలెన్‌ కెల్లెర్‌ జాతీయ అవార్డును అందుకుంది. ఏమై పోతుందో అనుకున్న అమ్మాయి.. ఎక్కడికో ఎదిగింది. అది టీవీలో చూసిన జానకి తల్లిదండ్రులకు పట్టలేని ఆనందం. ఆ నిట్టూర్పు.. ఆనందాల మధ్య కథ తెలుసుకోవాలంటే జానకిని పలకరించాలి. కానీ ఆమె మాట్లాడలేదు. కాదు. కాదు... ఆమె మాటల్ని అర్థం చేసుకోలేని అవిటివాడ్ని నేను. నాకు, జానకికి మధ్య ఒక మాటల వారధి కావాలి. ఆయన యాకయ్య. జానకి దగ్గర పనిచేసే ఒక కార్యకర్త. నా ప్రశ్నల్ని సైగలుగా మార్చి.. జానకి సైగల్ని నాకు మాటలుగా అందించాడు.
***
జానకి డెఫ్‌ అండ్‌ డంబే కాదు రఫ్‌ అండ్‌ టఫ్‌ కూడా. తాను అనుకున్నది  సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటుంది. మాటలు రాకపోతేనేం... ఆమె కళ్లు మాట్లాడతాయి. ఆ భావాలు అర్థం కాని వారి ముందు ఆమె చేతి వేళ్లు సెల్‌ఫోన్‌పై చకచకా కదిలి ఎస్‌ఎమ్‌ఎస్‌లు అవుతాయి. ఆఫీసులో ఉంటే ఆమె వెనకాల ఉండే వైట్‌ బోర్డుపై నల్లని అక్షరాలు సమాధానమిస్తాయి. వినిపించకపోతేనేం.. ఎదుటి వాళ్ల మనోభావాలను ఇట్టే పట్టేస్తుంది. ఒకటికి రెండు సార్లు మాట్లాడితే మన పెదాల కదలికలను(లిప్‌ రీడింగ్‌) బట్టి అర్థం చేసుకుంటుంది. ఆమె విజిటింగ్‌ కార్డు వెనకాల ఎ.. బి.. సి.. డిలకు సైన్‌లు ఉంటాయి. నాలుగుసార్లు కలిస్తే తనకు అంగవైకల్యం ఉన్నట్లే మనకు అనిపించదు. ఆమె జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు... అవేవీ తనలాంటి వారెవరికీ ఎదురుకాకూడదనుకుంది. అందుకే బధిరుల కోసం ఓ సంస్థ స్థాపించి వారికి సేవ చేస్తోంది.
***
జానకి తల్లి సత్తెమ్మ. తండ్రి చంద్రప్ప. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట వారిది. కరువు జిల్లాలో పనుల్లేక మహారాష్ట్రలోని పూనేకి వలసవెళ్లారు. సత్తెమ్మ బీడీలు చేస్తూ, చంద్రప్ప తాపీ పనిచేస్తూ పొట్టపోసుకునేవారు. ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే ఇక పిల్లల చదువులెలా? అయినా ఆడపిల్లలకు చదువెందుకు? చిన్నదాన్నయినా చదివించాలి. మూగ, చెవిటిది కాబట్టి ఇంతో అంతో చదువుకుంటేనైనా బాగుపడుతుందేమో? అనుకున్నారు. చేతిలో పలకాబలం పట్టుకుని జానకి బడికెళ్తుంటే మురిసిపోయారు. కానీ నెలలు గడుస్తున్నా జానకికి ఎ.. బి.. సి.. డిలు అబ్బలేదు. పందిరి గుంజకు కట్టేసి కొట్టేది సత్తెమ్మ. ఆ వాతలు అక్షరాలుగా మారాయి. ఇక జానకి చదువు ఆగలేదు. నాలుగో తరగతి నుంచి తనే క్లాస్‌ లీడర్‌. పదో తరగతిలో స్కూల్‌ ఫస్ట్‌. ఇంటర్‌ కూడా చదివింది. ఆమె స్కూల్లో, కాలేజ్‌లో అందరూ ఆమెలాంటి వాళ్లే. కానీ బయటి పిల్లలు తనను చిన్నచూపు చూసేవారు. వారికంటే గొప్పదాన్నని నిరూపించుకోవాలని కలలు కనేది జానకి.
***
స్కూల్లో చదివేటప్పటి నుంచే జానకి బొమ్మలు బాగా వేసేది. అది గమనించిన సుమతి టీచర్‌ ఆమెని ఇంకా ప్రోత్సహించేది. తన భావాలన్నింటి ని బొమ్మల్లో చూపించేది. తన  ఇల్లు, చందమామ, తనకు ఇష్టమైన పొలాలు, ఆకట్టుకునే ప్రకృతి.. ఇలా ఎన్నో రకాల బొమ్మలు వేసేది. జానకికి వినిపించకపోయినా టీవీలో కనిపించే స్టెప్స్‌ని ఇట్టే అనుకరించేది. ఒకసారి స్కూల్‌ ఫంక్షన్‌లో జానకి చేసిన డ్యాన్స్‌ను చూసి అక్కడి టీచర్లు ఆమెకు ప్రత్యేకంగా డ్యాన్స్‌ నేర్పించాలనుకున్నారు. మ్యూజిక్‌ని బట్టి స్టెప్పులు వేయడం పెద్ద కష్టం కాదు. కానీ.. అసలు మ్యూజిక్కే వినకుండా స్టెప్పులు ఎలా వేస్తుంది? అయినా జానకి డ్యాన్స్‌లో ఎన్నో ఫ్రైజ్‌లు గెల్చుకుంది. తను డ్యాన్స్‌ నేర్చుకుంటున్నప్పుడు గడియారం ముల్లుని అనుసరించేది. ఏ ముల్లు ఎక్కడున్నప్పుడు టీచర్‌ ఏ స్టెప్పు నేర్పిందో.. తర్వాత గడియారాన్ని వెనక్కి తిప్పి మళ్లీ అదే టైమ్‌కి ఆ స్టెప్పుని చేసేది. జానకిలో ఉన్న ఈ టాలెంటే ఆమెకు విదేశాలకు వెళ్లే అవకాశం తెచ్చి పెట్టింది. జపాన్‌, అమెరికా, రష్యాల్లో జరిగిన అనేక పెయింటింగ్‌, డ్యాన్స్‌ పోటీల్లో జానకి పాల్గొంది. ఎక్కడైనా జానకిదే ఫస్ట్‌ ప్రైజ్‌. 30 సర్టిఫికెట్లను సంపాదించింది.
***
1999లో జానకి తల్లిదండ్రులు తిరిగి మహబూబ్‌నగర్‌కు వచ్చేశారు. ఏదో ఒక పనిచేస్తూ తన కుటుంబానికి చేదోడుగా ఉండాలనుకుంది జానకి. సికింద్రాబాద్‌లోని స్వీకార్‌ ఉపకార్‌లో టీచర్‌గా చేరింది. అక్కడి బధిరులకు సైన్‌ లాంగ్వేజ్‌ని నేర్పేది. డ్యాన్స్‌, పెయింటింగ్‌ క్లాస్‌లు కూడా చెప్పేది. అలా కొంతకాలం పనిచేసిన తర్వాత యాక్షన్‌ ఎయిడ్‌ అనే స్వచ్ఛంద సంస్థలో చేరి గ్రామాల్లో తిరుగుతూ బధిరుల తల్లిదండ్రులకు వాళ్ల పిల్లలు చదువుకోవాల్సిన అవసరాన్ని గురించి చెప్పేది. అలా 500 మందిని పాఠశాలల్లో చేర్పించగలిగింది జానకి. ఆ పయనంలో జానకికి ఎన్నో అనుభవాలు. ఆ అనుభవాలే స్వయంగా ఒక సంస్థను ప్రారంభించాలన్న ఆలోచనకు పునాదిరాళ్లయ్యాయి.
***
ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల నెట్‌వర్క్‌ సహకారంతో  ఫిన్‌ (PHIN - People with Hearing Impaired Network) అనే సంస్థను 2007లో ప్రారంభించింది జానకి. "సరైన సమాచారం అందక బధిరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబంలోనే ఆదరణ కరువవుతున్న వారెందరో. నాకు ఎదురైన సమస్యలు ఎవ్వరికీ ఎదురుకాకూడదు. అన్ని జిల్లాల్లోనూ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసి, గ్రామీణ స్థాయిలో నాలాగా వైకల్యం ఉన్నవారిని బయటికి తీసుకురావాలి. ఉన్నత చదువులు చెప్పించాలి. ఉపాధి కల్పించాలి'' అన్నది ఆమె లక్ష్యం. ఫిన్‌ సంస్థ ద్వారా గ్రామాల్లోకి వెళ్లి మాట, వినికిడి లోపం ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు, హక్కులపై అవగాహన కల్పిస్తోంది. ఆ పనిలో బాలు అనే కార్యకర్త ఆమెకు తోడుంటాడు. ఆయన కూడా వికలాంగుడే. అలా తిరుగుతూ ప్రైవేటు కంపెనీల్లోగాని, కార్పోరేట్‌ సంస్థల్లోగాని ఇప్పటి వరకు 200 మందికి ఉద్యోగాలు ఇప్పించింది. అన్ని జిల్లాల్లోనూ బధిరుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తోంది. 
***
బధిరుల నెట్‌వర్క్‌ను ఆమె మన రాష్ట్రంలోనే కాదు తాను పుట్టి పెరిగిన పూనేలో కూడా స్థాపించింది. బధిరురాలైన తన స్నేహితురాలు దీపాలి కాలే దాన్ని అక్కడ నిర్వహిస్తోంది. ఇద్దరూ రోజూ సాయంత్రం ఇంటర్‌నెట్‌ ద్వారా వెబ్‌కామ్‌లో మాట్లాడుకుంటారు. బధిర మహిళలకు సమస్యలు ఇంకా ఎక్కువ. వారి కోసం ప్రత్యేకంగా విమెన్‌ సెల్‌ని ఏర్పాటు చేయబోతోంది జానకి. వాళ్లకు పెళ్లిళ్లు చేయించేందుకు ఒక మ్యారేజ్‌ బ్యూరోని కూడా ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 11 జంటలకు పెళ్లి చేసింది. తాను కూడా నల్గొండకు చెందిన బధిరుడైన శ్రీనివాస్‌ని పెళ్లి చేసుకుంది. వాళ్లకో బాబు! పేరు మారుతి. చిన్నప్పుడు తమ మధ్య ఉంటే మాటలు రావని పిల్లవాడిని తమ బంధువుల ఇంట్లో ఉంచింది జానకి. అతనికి మామూలుగానే మాటలు వచ్చాయి. భవిష్యత్తులో మారుతి ద్వారా తన వాయిస్‌ వినిపించబోతోంది జానకి.

Comments

గొప్ప వ్యక్తులంటే వీళ్ళే.

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...