Skip to main content

బెంగాల్ టు జులు మా తుఝే సలామ్‌...

రాఘవేంద్రరావు పండ్లు లేకుండా పాట, ఆర్‌. నారాయణమూర్తి ఎర్రజెండా లేకుండా సినిమా తీయరన్నది ఎంత నిజమో ఈయన ఒకే పాటని 265 భాషల్లో పాడారన్నది కూడా అంతే నిజం. అసలు అన్ని భాషలు ఉన్నాయా? అని డౌటొచ్చింది కదూ. ఉన్నాయి కాబట్టే గిన్నిస్‌ వారు వరల్డ్‌ రికార్డు ఇచ్చేశారు. మన ఎఆర్‌ రెహమాన్‌ 'మా తుఝే సలామ్‌' పాటని ప్రపంచదేశాలకు పరిచయం చేసిన ఈ తెలుగోడి పేరు సాయి మనప్రగడ. కాలిఫోర్నియాలో ఉంటున్న సాయి ఇ-మెయిల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చాడు.

మా నాన్న జానప్రద బ్రహ్మ మనప్రగడ నరసింహమూర్తి, మా అమ్మ రేణుకా దేవి. ఇద్దరూ గాయకులుగా, సంగీత విద్వాంసులుగా పేరున్నవారే. సంగీతం మీద ఆసక్తి నాకు వారి నుంచి వారసత్వంగా వచ్చింది. నాకు జానపద గేయాలంటే చాలా ఇష్టం. అంతరించి పోతున్న జానపదాలని వెలుగులోకి తీసుకురావాలని నేను పరిశోధన చేస్తుండేవాడిని. అందులో భాగంగా మన దేశంలోని చాలా ప్రాంతాలు, ఇతర దేశాలు కూడా తిరిగాను. అలా తిరుగుతున్నప్పుడే మన పాటనొకటి చాలా భాషల్లో పాడాలన్న ఆలోచన వచ్చింది.

మా తుఝే సలామ్‌...
నేను ఎంచుకున్న పాట మన దేశ స్తులనే కాదు ఇతర దేశాల వారికి కూడా కన్నతల్లిని, మాతృదేశాన్ని గుర్తు చేయాలనుకున్నాను. మన దేశంలో అలాంటి గేయమంటే వందేమాతరమే గుర్తుకొస్తుంది. కానీ దాన్ని ఇతర భాషల్లో అంతగా పాడలేం. ఎఆర్‌ రెహమాన్‌ 'మా తుఝే సలామ్‌' పాట కూడా ఇంచుమించు అదే అర్థంతో ఉంటుంది. మాతృదేశాన్నే కాకుండా కన్నతల్లిని కూడా గుర్తుచే సేలా ఉంటుంది ఆ పాట. లిరిక్స్‌ కూడా ఇతర భాషల్లోకి సులువుగా అనువదించుకోవచ్చు. ఆ పాట లోపిచ్‌లో మొదలై చాలా హైపిచ్‌లోకి వెళ్లిపోతుంది. అలా హై పిచ్‌లో పాడడమంటే నాకు చాలా ఇష్టం. ఇన్ని ప్లస్‌లు ఉన్న తర్వాత 'మా తుజే సలామ్‌' పాటే నాకు ఫర్‌ఫెక్ట్‌ సాంగ్‌ అనిపించింది.

భాషలు.. బాధలు..
చాలా భాషల్లో పాడాలనుకున్నాను గానీ.. అసలు ఎన్ని భాషలున్నాయి? ఎన్ని భాషల్లో పాడాలన్నది మొదట నిర్ణయించుకోలేదు. భాషల గురించి పరిశోధన మొదలుపెట్టినప్పుడు మాండలికాలతో కలిపి మొత్తం 6800 భాషలున్నట్లు తెలిసింది. అందులో 2200 భాషలకు మాత్రమే లిపి ఉంది. మనదేశంలో 400 కంటే ఎక్కువ భాషలుంటే అందులో 25 భాషలకు మాత్రమే లిపి ఉంది. లిపి ఉన్న భాషల నుంచి చాలా పాపులర్‌ అయిన వంద భాషలను లిస్ట్‌గా రాసిపెట్టుకున్నాను. ఆయా దేశాలలో, ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన మరో వంద భాషలను ఎంచుకున్నాను. నేను జానపదాల మీద పరిశోధన చేసేటప్పుడు చాలా ప్రాంతాల వారి పాటలు సేకరించాను. దేశ విదేశాల్లో ఉన్న మారుమూల ప్రాంతాల వారి సంస్క ృతీ సంప్రదాయలతో కూడా నాకు అనుబంధం ఏర్పడింది. అలాంటి వారి భాషలను మూడో వందగా రాసిపెట్టుకున్నాను. వాటిల్లో చివరికి 265 భాషల్లో పాడాలని నిర్ణయించుకున్నాను. దీనికి సంవత్సరం పట్టింది.

అనువాదం.. అష్టకష్టాలు..
లిస్ట్‌ తయారయ్యాకే అసలు కథ మొదలైంది. వాటిని అనువదించేందుకు మరో ఏడాది అష్టకష్టాలు పడ్డాను. ఈ క్రమంలో నేను చాలామందిని కలిశాను. చాలా అంతర్జాతీయ సంస్థలతో, సాంస్కృతిక సంఘాలతో పరిచయాలు ఏర్పడాయి. కొందరయితే ఇతను వేరే దేశస్తుడు, వారి పాటని మా భాషలోకి ఎందుకు అనువదిస్తున్నాడు? అని అనుమానించారు. నాకు సహకరించేందుకు నిరాకరించారు కూడా. కేవలం మీ భాషలోనే కాదు, మొత్తం ఇన్ని వందల భాషల్లో అనువదిస్తున్నానని లిస్ట్‌ చూపిస్తేగాని వారు నమ్మలేదు. కొందరయితే నా జాబితాలో వారి భాష కూడా ఉన్నందుకు సంతోషించి సహకరించారు. మరికొందరు తమ భాషలో కూడా పాడాలని కోరారు. నేను కుదరదన్నప్పటికీ నాతో కలిసి వాలంటీర్లుగా పనిచేశారు. రకరకాల మనుషులు, భిన్న సంస్కృతులు... ఒక్కో భాష... ఒక్కో పదం... అనువాదం... ఉచ్ఛారణ... కంపోజింగ్‌... అబ్బ.. ఇదంతా నాకు గొప్ప మ్యూజికల్‌ ఎక్స్‌పీరియన్స్‌.

ఏది ముందు ఏది చివర...
ఈ పాట ముందు పాడాలి.. ఇది తర్వాత పాడాలని నేనేం అనుకోలేదు. 265 భాషలు ఎంచుకున్న తర్వాత వాటిని అక్షర క్రమంలో రాసుకున్నాను. ఆశ్చర్యంగా అందులో మొదటి భాష బెంగాలీ. వందేమాతరం ఒరిజినల్‌ బెంగాలీయే. నా లిస్ట్‌లో చివరిపాట జులు. ఆ భాషలో 'గియాకుత్తాన్‌ ద' అంటే వందేమాతరం అని అర్థం. ఈ 265 పాటల్ని మే 16, 2010న కాలిఫోర్నియాలోని శాన్‌ జోస్‌లో ఒక మ్యూజిక్‌ అండ్‌ ఆర్ట్స్‌ సదస్సులో పాడే అవకాశం వచ్చింది. ఆ ప్రదర్శననే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారు పరిశీలించారు. ఆ తర్వాత ఆగస్టు రెండో వారంలో ఒకరోజు ఉదయాన ఇ-మెయిల్‌ ఇన్‌బాక్స్‌ చెక్‌ చేస్తుంటే గిన్నిస్‌ వారి నుంచి నేను రికార్డు సాధించినట్లు మెయిల్‌ ఉంది. ఇంట్లో అందర్నీ లేపి విషయం చెప్పాను. ఆనందంతో అందరం గంతులేశాం. ఓక్‌ల్యాండ్‌లో జయహో కాన్సర్ట్‌ జరిగినప్పుడు ఎఆర్‌ రెహమాన్‌ని కలిశాను. ఆయన పాటకు గిన్నిస్‌ రికార్డు సంపాదించి పెట్టినందుకు ఆయనిచ్చిన కాంప్లిమెంట్స్‌ మరిచిపోలేనివి.

సాయి మన'ప్రతిష్ట'
ఇ - మెయిల్‌ చూసిన తర్వాత రోజే నాకింకో ఆలోచన వచ్చింది. నాకు సహకరించిన అందరితో కలిసి ఈ ఆనందం పంచుకోవాలనుకున్నాను. ఆగస్టు 15న ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో నా టీమ్‌తో మరో ప్రదర్శననిచ్చాను. ఆ రోజు మాతో కలిసి మూడు వేల మంది ప్రేక్షకులు కూడా పాడారు. ఒకే పాటని అంతమంది కలిసి పాడడం కూడా అదే ప్రథమం. మరో గిన్నిస్‌ రికార్డు కూడా త్వరలో రాబోతోంది. నేనిప్పుడు పైకాన్జెన్‌ అనే వైర్‌లెస్‌ ఉత్పత్తుల సంస్థకు సిటివోగా పనిచేస్తున్నాను. నాలుగేళ్ల క్రితం స్నేహితులతో కలిసి ఈ సంస్థను ప్రారంభించాను. నేను నా గమ్యాన్ని మించి ప్రయాణించాను. ఈ ప్రయాణంలో నాకు నా తమ్ముడు శ్రీనివాస్‌, నా పాటకు వాయిద్యాలు అందించిన స్నేహితుడు శైలీల్‌ విజయ్‌కర్‌ల సహకారం మరిచిపోలేనిది. నేను సాధించింది మా అమ్మకు అంకితమిస్తున్నాను. మేరీ మా.. తుజే సలామ్‌.

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...