ఆ ఇంటి తలుపుపై 'పచ్చని జీవనశైలికి ఆహ్వానం' అని రాసి ఉంటుంది. హాలులో గోడపై పచ్చని చెట్లు, సెలయేరు, ఎగిరే పక్షులు ఉన్న అందమైన వాల్ పోస్టర్ అంటించి ఉంది. పచ్చని కిటీకీ కర్టెన్లు.. పదహారు ఇరవై చెట్లు.. అక్కడక్కడా హాఫ్ ఓల్ట్ ఎల్ఇడి బల్బులు.. నల్లా దగ్గర అందమైన మగ్గులు కనిపిస్తాయి. ఇంట్లో ఎక్కడా ప్లాస్టిక్ కవర్లు మాత్రం కనిపించవు. ఆ ఇంట్లో వాళ్లు లోకం పచ్చగా ఉండాలని కలగంటున్నారు. అందుకే పచ్చని జీవన శైలికి అలవాటు పడ్డారు. 'మాలాగా మీరూ మారండి. ఈ లోకాన్ని మార్చండి. భూమి భవిష్యత్తు మీ చేతుల్లోనూ ఉంది' అని అంటున్నారు ఆ ఇంటాయన జయప్రకాశ్ నంబారు. లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి గ్రీన్ ప్లానెట్ విజన్స్ సంస్థని ఎందుకు నడుపుతున్నాడో వినండి.
"అమ్మతో నాన్నతో సరదాగా ఓ సాయంత్రం.. ఆడుదాం పాడుదాం భూమిని కాపాడుదాం.. మన తరం భావితరం కలిసి భవితని కాపాడుదాం..'' ఇదే మా క్యాప్షన్. భవిష్యత్తు పిల్లలది. అందుకే ముందు పిల్లల్ని మార్చాలనుకున్నాను. వారి దగ్గరకు వెళ్లి పర్యావరణం గురించి ఎలా చెప్పాలి అని ఆలోచించాను. రోజుకు ఇంత చెత్త ఉత్పత్తి అవుతోందని లెక్కల్లో చెప్పాలా? భూగోళం వేడెక్కుతోందని సైన్స్‌లో చెప్పాలా? అలా అయితే వారు నేర్చుకునే పాఠాలకు వీటికి తేడా ఏముంది? అందుకే వారికి సున్నితంగా, సృజనాత్మకంగా చెప్పాలి. అలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే గ్రీన్ ప్లానెట్ విజన్స్.
ఆలోచన ఎలా వచ్చింది..
నేను పదిహేను సంవత్సరాలు సత్యం, ఇన్ఫొటెక్ లాంటి పెద్ద సంస్థల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశాను. సింగపూర్‌లో పనిచేస్తున్నప్పుడు ఒక రోజు అక్కడ దోమల మందు(ఫాగింగ్) కొట్టడం గమనించాను. అలా కొట్టేముందు కరపత్రాలు పంచి తినుబండారాలపై గుడ్డలు కప్పి ఉంచమని చెప్పేవారక్కడ. కానీ మన దగ్గర అలాంటి జాగ్రత్తలు ఏమీ తీసుకోరు. ఫాగింగ్ తర్వాత కూడా రోడ్ల మీద అమ్మే తినుబండారాలను తింటూనే ఉంటారు చాలామంది. ఇది ఎప్పుడూ నా మనసుని కలిచివేస్తూ ఉండేది. 2006లో హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగంలో చేరాను. వర్షం వస్తే ట్రాఫిక్ జామ్, రోడ్లపై నిలిచిపోయే నీరు.. మురికి కాలువల్లో చిక్కుకునే ప్లాస్టిక్ కవర్లు.. నరకంలా అనిపించేది. ఒక ఆవు ఎప్పుడూ రోడ్లపై తిరుగుతూ కనిపించేది. దాని పొట్ట లావుగా ఉండేది. ఒక రోజు అది చనిపోయింది. పగిలిన దాని కడుపు నిండా ప్లాస్టిక్ కవర్లు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఒకటే ఆలోచనలు.. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే గ్రీన్ ప్లానెట్.
ఓ డాడీ..
పర్యావరణ పరిరక్షణ కోసం అప్పటికే చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. మరి వారు చేయలేనిది నేనేం చేయగలను? కారణాలు వెతికాను, అధ్యయనం చేశాను. మనకు మనం జాగ్రత్తగా ఉంటే పర్యావరణానికి హాని కలిగించే అంశాల్లో 25 శాతం నివారించవచ్చు. దీనికి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాను. అందులో మొదటిది పిల్లలకు అవగాహన కల్పించడం. అదీ కొత్తగా.. వారికి అర్థమయ్యేలా చెప్పాలి.. ఎలా? ఒకరోజు రాత్రి పదకొండు గంటలకు నా స్నేహితుని ఇంటికి వెళ్లాను. వాడప్పుడు నేల మీద కూర్చుని ఐదో తరగతి చదివే తని కొడుకు స్కూల్లో ఏదో అడిగారని రాసిపెడ్తున్నాడు. ఎంత బిజీ లైఫ్‌లో ఉన్నా పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా చేస్తారు... వారు అడిగిన దానికి ఓపిగ్గా సమాధానం చెబుతారు. అదంతా ఆలోచించాక అమ్మానాన్నలను సరదాగా ఓ సాయంత్రం... ఇలా అడగమని నా పాట ద్వారా చెప్పాలనుకున్నాను. నా అనుభవాల నుంచి పదమూడు నెలలు కష్టపడి ఒక పాట రాసుకున్నాను. అదే 'ఓ డాడీ' సాంగ్. తండ్రి చిన్నప్పటి జీవితం గురించి ఇప్పుడు తాను అనుభవిస్తున్న జీవితం గురించి ఓ చిన్నారి ఎంత సున్నితంగా, తల్లిదండ్రులను ప్రశ్నిస్తుందో! ఆ పాట మీరూ వినండి తెలుస్తుంది. నేను సీడీ ఇచ్చిన వారికి 'ఈ భూమి భవిష్యత్తు మీ చేతుల్లోనూ ఉంది' అని స్వయంగా రాసిస్తాను. ఇది చదువుతున్న మీ చేతుల్లో కూడా.
ఇంకేం చేస్తామంటే..
ప్రముఖులతో పాడించి 2009లో ఆడియో సీడీ రూపొందించాను. 2010 జనవరిలో ఉద్యోగం మానేశాను. మా పాప మేఘన విద్యాంజలి అనే ఎకో ఫ్రెండ్లీ స్కూల్లో చదువుతోంది. అప్పటి వరకు ఎప్పుడూ పేరెంట్స్ మీటింగ్‌కి వెళ్లని నేను నా ఆలోచనలు చెప్పి పాట వినిపించాను. మంచి స్పందన వచ్చింది. మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్ వాడొద్దని పిల్లలు చెబితే తల్లిదండ్రులు వినకుండా ఉంటారా? కరెంటు, నీళ్లు వృథా చేయొద్దని పిల్లలు చెబితే లైట్ ఆఫ్ చేయకుండా, కుళాయి కట్టేయకుండా ఉంటారా? ఇదే విషయాలు పిల్లలకు చెబుతున్నాను. కుళాయి తిప్పినప్పుడు చేయిని కడిగేందుకు ఉపయోగించే నీళ్లకంటే ఎక్కువ నీరు వృథాగా పోతాయి. అదే మగ్గులో పట్టుకుని కడుక్కుంటే.. అలాంటి మగ్గు పిల్లలకు ఇష్టమైన బొమ్మల ఆకారంలో ఉంటే వారు మరీ ఇష్టంగా దాన్ని వాడతారు. ఇప్పటి వరకు రోటరీ క్లబ్, ప్రగతి ప్రింటర్స్ వారి సహకారంతో 120 పాఠశాలల్లో పిల్లలకు అవగాహన కల్పించాను. నాలుగు వేల సీడీలు పంచాను. ఇప్పుడొక కాంటెస్ట్ కూడా పెడుతున్నాం. సమాజంపైన సెలబ్రిటీల ప్రభావం చాలా ఉంటుంది. అందుకే చాలామందిని కలిసి నా ఆలోచనలు చెప్పి వారు వెళ్లిన చోట ఒక్కమాట పర్యావరణం గురించి కూడా చెప్పమని అడుగుతున్నాను. ఇప్పుడు కొన్ని వీడియో సీడీ లు కూడా రూపొందించాను. భవిష్యత్తులో గ్రీన్ ప్రొడక్ట్స్‌ని రూపొందించాలనుకుంటున్నాను. నేను మారాను... విద్యార్థుల్ని మారుస్తున్నాను... ఆ మార్పు విద్యార్థుల నుంచి తల్లిదండ్రులకు వెళ్తోంది. వారూ మారితే ఈ సమాజం మారుతుంది. పచ్చని భూగోళం ఏర్పడుతుంది. ఈ భూమి భవిష్యత్తు మనందరి చేతుల్లోనే ఉంది అని చెప్పడమే నా ఉద్దేశ్యం.
జయప్రకాశ్ ఫోన్ నెంబర్ : 98663 96569
Comments
Jayaprakash Nambaru
www.greenplanetvisions.net