Skip to main content

అతన్ని ఊరి నుంచి వెలివేసి గెలిపించారు! (నెలవంక - 3)

1978, కర్ణాటక
ఆ గ్రామవాసులు.. రక్షిత మంచినీటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో.. సర్కారు బడికి పది కిలోమీటర్ల దూరంలో.. ప్రభుత్వాసుపత్రికి పాతిక కిలోమీటర్ల దూరంలో.. దురదృష్టానికి మాత్రం అతి దగ్గరగా బతుకుతున్నారు. గూగుల్‌ కూడా గుర్తించలేని ఆ కుగ్రామం పేరు మొటక్‌పల్లి. అప్పట్లో అక్కడ నలభై యాభై పూరి గుడిసెలుండేవంతే.
ఒకరోజు రచ్చబండ దగ్గర ఊరంతా చేరి పంచాయితీ పెట్టారు.
"ఇక వాడ్ని ఊళ్లో ఉంచడానికి వీల్లేదు'' తీర్మానించాడు ఒక పెద్దమనిషి.
"అయ్యా! ఊరు కాని ఊరు. చేతుల పైసల్‌ గూడ లేవు. వాడ్ని అంత దూరం తీస్కపోయేదెట్టయ్యా?'' బతిమాలాడు ఒకాయన.
"అదంతా మాకు తెల్వదు. ఆడ్ని ఈడ్నే ఉంచి ఊర్ని వల్లకాడు చేస్తావా ఏంది? నర్సిగాడు ఊళ్లో ఉండడానికి వీల్లేదంతే'' కరాకండిగా చెప్పాడు పెద్దమనిషి. 


ఆయన చెప్పిన నర్సిగాడి అసలు పేరు నరసప్ప. పదేళ్ల పిల్లాడు. అతని తల్లిదండ్రులు పేద రైతుకూలీలు. వారికి ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారిలో నాలుగోవాడే నరసప్ప. వారెవ్వరూ బడికి వెళ్లేవారు కాదు. అందరూ రోజూ కూలీకి వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నరసప్ప చేతిపైన కొన్ని మచ్చలు కనిపించాయి. అది చూసి తల్లిదండ్రులు ఏదో పురుగు ముట్టిందనుకున్నారు. అదే మానిపోతుందిలే అని పెద్దగా పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే అతనికి శాపమైంది. ఒకరోజు కూలీకి వెళ్లినప్పుడు నరసప్ప చేతికి ముల్లు గుచ్చుకుంది. కాని నొప్పే అనిపించలేదు. ఇంటికి వచ్చాక తల్లిదండ్రులకు చెబితే ఆశ్చర్యపోయారు. సూదితో గుచ్చి చూశారు. అయినా నరసప్పకి స్పర్శ లేదు. అందరూ భయపడ్డారు. పని మానుకుని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. వారి గుండెలు అగ్నిపర్వతాల్లా పేలిపోయే నిజం చెప్పారు డాక్టర్లు. నరసప్పకి కుష్టువ్యాధి సోకిందని.

అయినవాళ్లూ వదిలేశారు
రోజూ తినే కంచంలో అన్నం పెట్టడం లేదు తల్లిదండ్రులు. పడుకునేందుకు పక్క కూడా వేరుగా వేస్తున్నారు. తోటి పిల్లలు తమతో ఆడుకోనివ్వడం లేదు. నరసప్ప వీధిలోంచి వెళ్తుంటే చీదరించుకుంటూ లోపలికి వెళ్లిపోతున్నారు ఆడవాళ్లు. ఎదురుగా వస్తున్న వాళ్లు వెనక్కి తిరిగి దూరంగా వెళ్లిపోతున్నారు. పొలంలో పనిచెయ్యడానికి వీల్లేదని చెప్పాడు యజమాని. నరసప్ప ఒంటరి అయిపోయాడు. ఒళ్లంతా పుండ్లు అయ్యాయి. ఇలాగే ఉండనిస్తే ఊర్లో అందరికీ సోకుతుంది, వెంటనే ఊరి నుంచి పంపించేయాలని పంచాయితీ పెట్టారు ఊరి పెద్దలు. అప్పుడు నరసప్పని నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని విక్టోరియా రిహాబిలిటేషన్‌ హోమ్‌లో వదిలేసి వెళ్లాడు తండ్రి. అప్పట్లో కుష్టు వ్యాధికి చికిత్స చేసే పెద్ద ఆస్పత్రి అదే. అక్కడ నరసప్పలాంటి వారు ఎంతో మంది. కానీ నరసప్పకు తెలుగు రాదు. ఒంటిరిగా ఒక మూలన కూర్చుని ఏడుస్తుండేవాడు. అమ్మానాన్నలు గుర్తొచ్చేవారు. అక్కాతమ్ముళ్లను మర్చిపోలేకపోయాడు. అమ్మానాన్నలు ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూస్తుండేవాడు. రెండేళ్లు గడిచింది. చేతి వేళ్లు పోయాయి. కాళ్లకు పుండ్లు తగ్గిపోయాయి. అయినా తన వాళ్లెవరూ రాలేదు.

కొత్తమలుపు
రెండేళ్ల తర్వాత వ్యాధి నయం అయిపోయిందని నరసప్పని ఆస్పత్రి నుంచి బయటికి పంపించేశారు అక్కడి సిబ్బంది. కానీ నరసప్పను తీసుకువెళ్లడానికి ఎవరూ రాలేదు. ఎక్కడికి వెళ్లాలో నరసప్పకు అర్థం కాలేదు. మొటక్‌పల్లికి వెళ్లాలని ఉంది. కానీ ఎలా వెళ్లాలో తెలియదు. డబ్బు కూడా లేదు. ఏడుస్తూ రోడ్ల మీద తిరుగుతుండేవాడు. ఒకరోజు తనతోపాటు ఆస్పత్రిలో ఉన్న ఒకాయన కనిపించాడు. ఆయనకు తన గురించి అంతా చెప్పాడు నరసప్ప. అప్పుడు ఆయన నరసప్పని తనతోపాటు తీసుకెళ్లి హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని శివానంద రిహాబిలిటేషన్‌ హోమ్‌లో చేర్పించాడు. 'ఇక నా బతుకు ఇంతే. నాకెవ్వరూ లేరు. ఇదే నా ప్రపంచం' అనుకున్నాడు నరసప్ప. అలా అర్థం చేసుకున్నాక అతని జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. ఆ హోమ్‌లో అతనికి చదువు నేర్పించారు. ప్రయివేటుగా ఏడో తరగతి పరీక్ష రాశాడు. మైదానంలో ఒంటరిగా నేల మీద కూర్చోబెట్టి పరీక్ష రాయించారు టీచర్లు. అలా తెలుగు మీడియంలో పదో తరగతి వరకు చదివాడు నరసప్ప.

ఇంకా బతికే ఉన్నావా?
మొటక్‌పల్లికి వెళ్లి అమ్మానాన్న, అక్కతమ్ముళ్లను చూడాలనిపించింది. ఇక వారితో పాటే ఉంటానని చెప్పి హోమ్‌ నుంచి బయలుదేరి వెళ్లాడు నరసప్ప. ఆరేళ్ల తర్వాత తిరిగి ఊళ్లో అడుగుపెట్టాడు. అతన్ని ఎవరూ గుర్తుపట్టలేదు. తల్లిదండ్రులు మాత్రం నరసప్పని చూసి ఆశ్చర్యపోయారు. 'ఎలా ఉన్నావురా?' అని అడుగుతారని ఆశపడ్డ నరసప్పని 'నువ్వు ఇంకా బతికే ఉన్నావా?' అని అడిగారు. వాళ్లు నరసప్ప ఎప్పుడో చనిపోయి ఉంటాడని అనుకున్నారట. అందుకే చూడడానికి కూడా రాలేదట. అక్కల పెళ్లిళ్లు అయిపోయాయి. ఆ శుభకార్యాలకు కూడా తనని పిలవనందుకు బాధ పడ్డాడు. నరసప్ప తిరిగొచ్చాడని ఊళ్లో అందరికీ తెలిసింది. అతన్ని చూడడానికి ఇంటి ముందు గుమికూడారు చాలామంది. నరసప్ప కాళ్లకు, చేతులకు ఉన్న పుండ్లు చూసి భయపడ్డారు. ఇక అలాంటి ఊళ్లో తను ఉండలేనని తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాడు నరసప్ప.

ఓ 'హోమ్‌' వాడయ్యాడు
శివానంద హోమ్‌కు వెళ్లి ఏదైనా పని ఇప్పించమని అడిగాడు నరసప్ప. మెడికల్‌ అటెండర్‌గా ట్రెయినింగ్‌ ఇచ్చారు హోమ్‌ నిర్వాహకులు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం. తనలాంటి బాధితులకు సేవ చేస్తూ ఉండేవాడు. వారి గాయాలకు కట్లు కడుతూ, సమయానికి మందులు ఇస్తూ, అవసరమయినప్పుడు వారికి ఓదార్పునిస్తూ ఉండేవాడు. అందుకు అతనికి లభించే ప్రతిఫలం నెలకు పది రూపాయలు. అలా ఐదేళ్ల పాటు అక్కడే పనిచేశాడు. ఆ సమయంలో ఆ హోమ్‌లో చేరిన తనలాంటి బాధితురాలు నిర్మలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. 1991 జనవరిలో నలుగురైదుగురు పెద్దల సమక్షంలో వారి పెళ్లి జరిగింది. తర్వాత ఇద్దరూ హయత్‌నగర్‌లోని వర్డ్‌ అండ్‌ డీడ్‌ అనే సంస్థలో చేరారు. అది కూడా కుష్టువ్యాధిగ్రస్తుల సేవా కేంద్రమే. తల దాచుకునేందుకు ఇద్దరికీ ఒకచోటే స్థానం దొరికింది, వారే తిండి పెట్టేవారు. కాకపోతే ఆదాయం మాత్రం ఉండేది కాదు. అందుకే అక్కడ నుంచి బయటికి వెళ్లాలనుకున్నారు.

'స్లాప్‌' పుట్టింది..
విక్టోరియా హోమ్‌, శివానంద హోమ్‌, వర్డ్‌ అండ్‌ డీడ్‌ హోమ్‌లలో నరసప్పకు ఎన్నో అనుభవాలు. తనలాంటి వారిని ఎంతో మందిని చూశాడు. వ్యాధితో తనకంటే ఎక్కువగా బాధ పడినవారు కూడా అతనికి తెలుసు. వ్యాధి భరించలేక ఆత్మహత్య చేసుకున్నవారి అంతరంగాలను అతను అర్థం చేసుకున్నాడు. ఇంట్లోనే వివక్షని భరించలేక రోడ్ల పాలైన వారి జీవితాలను అతను చదివాడు. ప్రతి ఒక్కరిలో తనను తాను చూసుకున్నాడు. వారందరికీ చేతనైనతం సహాయం చేయాలని పోరాటం మొదలుపెట్టాడు. 1991 చివర్లో గురుస్వామితో కలిసి ఆంధ్రప్రదేశ్‌ లెప్రసీ అసోసియేషన్‌ని మొదలుపెట్టాడు. మరో నలుగురితో కలిసి రాష్ట్రంలోని అన్ని లెప్రసీ కాలనీలు తిరిగి సమస్యలు తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ఆర్థిక సమస్యల వలన అసోసియేషన్‌ మూతపడింది. 2003లో నరసప్ప నివసించే శాంతినగర్‌ లెప్రసీ కాలనీకి వికలాంగుల హక్కుల కోసం పోరాడే శ్రీనివాసులు అనే ఆయన వచ్చాడు. ఆయన మాటలు నరసప్పకు స్ఫూర్తినిచ్చాయి. అతని సహాయంతో స్లాప్‌ (Society of Leprosy Affected Persons) సంస్థని ప్రారంభించాడు. సత్యనారాయణ, దత్తుల సహాయంతో రాష్ట్రంలోని 80 లెప్రసీ కాలనీలు తిరిగాడు. 10 వేల మంది బాధితుల్ని కలిశాడు. అందరికీ అతను చెప్పింది ఒకే మాట.

అంతా ఆయన చలవే..
2004 ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ బస్టాప్‌ నుంచి ఎంజి రోడ్‌లోని మహాత్మాగాం«ధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిగింది. వేలమంది లెప్రసీ బాధితులు పాల్గొన్న ఆ ర్యాలీని నరసప్ప ముందుండి నడిపించాడు. ఆయన చెప్పిన మాటలు వారి మనసుల్లో నాటుకుపోయాయి. ఆ ర్యాలీ చాలామంది నాయకులకు కనువిప్పు అయింది. ఎందరో వారికి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చారు. 2006లో మానవ హక్కుల కమీషన్‌తో కలిసి లెప్రసీ బాధితుల డిమాండ్లపై హైకోర్టులో పిటిషన్‌ వేశాడు నరసప్ప. సంవత్సరం తర్వాత ఉన్నత న్యాయస్థానం స్పందించింది. వారి డిమాండ్లను అమలు చేయాలని మౌఖిక తీర్పునిచ్చింది. ఇప్పుడు లెప్రసీ కాలనీల్లో వారం వారం మెడికల్‌ క్యాంపులు జరుగుతున్నాయంటే, మౌలిక సదుపాయాలు అందుతున్నాయంటే అది నరసప్ప చలవే. బాధితులకు నెలసరి పెన్షన్లు ఇప్పించడం, అంత్యోదయ కార్డులు, పిల్లలకు ఉచిత విద్య, వికలాంగ ధృవీకరణ పత్రాలు ఇప్పించడం, ఉపాధి కల్పించడం ఇలా ఎంతోమంది బాధితులకు స్లాప్‌ ద్వారా సహాయం చేస్తున్నాడు నరసప్ప. అందుకే 2008లో 17వ అంతర్జాతీయ లెప్రసీ కాంగ్రెస్‌ అతన్ని ప్రత్యేక ప్రతినిధిగా ఆహ్వానించింది. పుణె, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నైలలో జరిగిన ఎన్నో కాన్ఫరెన్స్‌లకు హాజరయ్యాడు నరసప్ప. రాష్ట్రంలో వ్యాధిగ్రస్తులయితే తగ్గారు కానీ ఊరవతల ఉండే లెప్రసీ కాలనీలు ఇంకా మిగిలే ఉన్నాయి. వారికోసం నరసప్ప పోరాటం ఇంకా ఆగలేదు.

Comments

మన మధ్యలోనే ఉన్న ఆసాధారణ వ్యక్తుల అద్భుతమైన జీవిత కథనాల్ని వెలికి తీసి స్ఫూర్తి కలిగించేలా అందిస్తున్నారు. అభినందనలు.

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...