2010
ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్ ...
మార్చి 16
రాత్రి పదిగంటలు...ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్ ...
మెయిన్ గేటుకు ఎడమవైపు మూలన చిన్న గుడి ఉంది. అమ్మ వారి ముందు దీపం వెలుగుతోంది. దీపం పక్కనే నాలుగు అగరుబత్తీలు కాలుతున్నాయి. వాటినెవరో అరటిపండుపై గుచ్చారు. పసుపూ, కుంకుమా చల్లారు.
గుడి పక్కన ఓ పది పదిహేను బైకులు పార్క్ చేసి ఉన్నాయి.
"నాలుగైదుసార్లు బయటికి వెళ్తుంటాం. వస్తుంటాం. వెళ్లొచ్చిన ప్రతిసారీ ఐదు రూపాయలివ్వాలా?'' అంటూ పార్కింగ్ టోకెన్ అడిగిన కుర్రాడితో గొడవ పడుతున్నాడో పెద్దాయన.
పార్కింగ్ వెనకాల వరండా. ఆ వరండాలో ముగ్గురు పడుకున్నారు. ఇద్దరు కూర్చున్నారు. పడుకున్న వారిలో ఇద్దరికి దుప్పట్లు కూడా లేవు. నేల మీదే పడుకున్నారు. ఒకావిడ స్తంభానికి ఆనుకుని కూర్చుంది. ఆమె ఒళ్లో ఓ చిన్నారి పడుకుంది. కాళ్లు ముడుచుకుని పడుకున్న ఆ పాపని జో కొడుతోంది ఆ తల్లి. చంటిది హాయిగా నిద్రపోతోంది. ఆ అమ్మ మాత్రం శూన్యంలోకి దీనంగా చూస్తోంది.

ఆంబులెన్స్ దాటాకా గోడ పక్కన ఇద్దరు కూర్చున్నారు. అందులో మాసిన గడ్డం ఉన్న వ్యక్తి అన్నం పొట్లాం విప్పి తింటున్నాడు. ప్లేటు కూడా లేదు. ఆ కాగితంలోనే అన్నం కలుపుతున్నాడు. రెండో వ్యక్తి ప్యాకెట్‌కు ఉన్న దారం విప్పి సాంబార్ పోస్తున్నాడు.
వాళ్ల తర్వాత ఓ సిమెంటు దిమ్మె ఉంది. నల్ల చొక్కా వేసుకున్న కుర్రాడు తలపట్టుకుని దిమ్మెపై కూర్చున్నాడు. గీతల చొక్కా వేసుకున్న ఇంకో అబ్బాయి అతని భుజం మీద చేయి వేశాడు. అవతలి పక్కన కూర్చున్న మూడో కుర్రాడు వారిద్దరికి ఏదో చెబుతున్నాడు. ఓదార్చుతున్నట్లుగా అతని హావభావాలున్నాయి.
ఎదురుగా మెయిన్ ఎంట్రన్స్... లోపలి నుంచి నలుగురు వస్తున్నారు. నా వెనకాల ఒకావిడ ఏడుస్తూ.. వడి వడిగా అడుగులు వేస్తోంది. నన్ను దాటేసి లోపలికి వెళ్లిపోయింది. ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఫైబర్ చెయిర్‌లో కూర్చుని ఉన్నాడు. చెయిర్‌కి ఆనించి ఒక లాఠీ ఉంది. అతని విజిల్ కుర్చీ కింది నుంచి వేలాడుతోంది.
రిసెప్షన్‌లో అమ్మాయి అప్పుడే స్నానం చేసి వచ్చినంత ఫ్రెష్‌గా కనిపిస్తోంది. "మేడమ్ గారు లేరు, ఓ గంటలో వస్తారు'' అని ఫోన్‌లో ఎవరికో చెబుతోంది.
ఎంట్రన్స్ దాటి ఎడమ వైపు తిరగ్గానే దూరంగా ఏవో ఏడుపులు... "ఓ కొడుకో.. నా కొడుకో..'' అంటూ ఒకావిడ ఏడుస్తున్నట్లు వినిపిస్తోంది. ఆ ఏడుపులో ఎక్కిళ్లు.. బహుశా రాజు వాళ్ల అమ్మ అనుకుంటా.
రాజుని ఇలా చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు వాడిని చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. మూడేళ్లయ్యింది వాడి మోహం చూసి. "జీవితంలో నీ మోహం నాకు ఇక చూపించకు'' అని నేనే కదా వాణ్ణి ఇంట్లోంచి గెంటేశాను. అలాంటిది నేనే ఈ రోజు వాణ్ణి చూడాల్సి వస్తున్నందుకు నాకెందుకో బాధగా కూడా లేదు. కానీ కొంచెం భయంగా ఉంది. నిజం చెప్పన ఎవరికీ చెప్పలేనంత బాధగా కూడా ఉంది మనసులో.
రాజుకు నేనంటే ఇష్టం. చచ్చేంత ఇష్టం. ఎదుటివాణ్ని చంపేంత ఇష్టం. కాలేజ్‌లో నాపై చేయి వేసినందుకే క దా, వేసినవాడి చేయి విరిచేసి జైలు వరకు వాడు వెళ్లి వచ్చింది. నా కోసమే వాడు అలా చేసింది. అది నాకు తె లుసు. కానీ నాకు వాడంటే కోపం. రాజంటే పగ. మంట. వాడి పేరు వినిపిస్తే కింది నుంచి పైకి ఒళ్లంతా తేళ్లు పాకినట్లుగా ఉంటుంది. అయినా పర్లేదు. వాణ్ని చూడాలి. చివరి సారి. ఎందుకంటే మళ్లీ ఇక చూడలేను.
ఆ వరండాలో కుడిపక్కన పదిపదిహేను మంది నిల్చుని ఉన్నారు. ఎడమ పక్కన ఐదుగురు ఆడాళ్లు కూర్చున్నారు. నాలుగో ఆవిడ రాజు వాళ్ల అమ్మ. జుత్తు చెదిరిపోయి ఉంది. కళ్లు లోపలికి వెళ్లయి. కాళ్లు చాపుకుంది. ఏడుస్తోంది ఆమే.
"నాకొడుకు నామీద అలిగిండమ్మో... యయ్‌హు..
ఎంత పిలిచినా లేస్తలేడమ్మో... యయ్‌హు..
నాకింకెవరూ లేరండమ్మో... యయ్‌హు..
నా పెండ్లాన్ని మంచిగ సూస్కొమ్మండు.. యయ్‌హు..'' - నన్ను చూసి ఏడుపు ఆపింది.
"వచ్చివనా కొడుకో.. నువ్వెస్తవో రావో అనుకున్నం. యయ్‌హు..'' ఇంకా గట్టిగా ఏడుపు మొదలుబెట్టింది.
నా అడుగులు వేగంగా కదిలాయి. నాకే తెలియకుండా ఆమె ఒళ్లో తలపెట్టి మోకాళ్లపై కూర్చున్నాను. ఆమె నా భుజాన్ని గట్టిగా పట్టుకుంది.
నా ఏడుపాగలేదు. అయినా ప్రయత్నించాను. కన్నీళ్లు ఆగిపోయాయనుకున్నాను.
"పొద్దుగూగాల కాంచి ఏడుస్తుంటివి. ఇగ ఊకేరాదే. ఏడ్చేచ్చి నువ్వు కూడా సస్తవే ఏంది?'' ఎవరో పెద్దావిడ ఆమెని ఓదారుస్తూ నా చేయి పట్టుకుని పైకి లేపింది. ఎవరో అబ్బాయి వచ్చి నన్ను పక్కకు తీసుకెళ్లాడు. నా కన్నీళ్లు ఎప్పుడో కట్టలు తెంచుకున్నాయని తెలియలేదు. ఆ నీళ్లలోంచి మసకలో అతనెవరో కనిపించలేదు. కన్నీళ్లు తుడుచుకుని మూడడుగులు ముందుకు కదిలాను. అతనెవరో నా చేయి పట్టుకుని తీసుకెళుతున్నాడు. కళ్లు తెరిచి చూశాను.
"అసలెప్పుడు జరిగింది?'' అడిగాను.
"అసలెప్పుడు జరిగింది?'' అడిగాను.
"ఎనిమిదింటికి. అప్పుడు నేనిక్కడే ఉన్నా. ఫస్ట్ నీకే ఫోన్ చేద్దామనుకున్నా. కానీ గంట వరకు నేనే ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయా.
నేను కుర్చీలోంచి లేచి నిరంజన్ చేయి పట్టుకున్నా.
నేను కుర్చీలోంచి లేచి నిరంజన్ చేయి పట్టుకున్నా.
నిరంజన్ లేచి నాతో పాటే కదిలాడు. ఆ వార్డు తలుపుపై పురుషుల వార్డు అని రాసి ఉంది. లోపలికి వెళ్లాక ఓ నలభై పడగలున్నాయి. ఒక పేషంటు దగ్గర ఒకరు. ఇంకో పేషంటు దగ్గర ఇద్దరు, మరికొంత మంది పేషంట్ల దగ్గర ముగ్గురు నలుగురు ఉన్నారు. ఎడమవైపు టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది. ఒక నర్సు కాలుపై కాలువేసుకుని మ్యాచ్ చూస్తోంది. ఇంకో నర్సు ప్యాడ్ పట్టుకుని ఏదో రాసుకుంటోంది. నిరంజన్ నా చేయి పట్టుకుని కుడివైపు తీసుకెళుతున్నాడు. మేం వెళుతున్న దారికి ఇరువైపులా పడగలున్నాయి. అందరూ మమ్మల్నే చూస్తున్నారు. దాదాపు చివరి పడగ వద్ద చాలామంది గుమి కూడా ఉన్నారు. సెక్యూరిటీ అతను కొందరిని 'చూసి వెళ్లిపోండి' అని బతిమాలుతున్నాడు. ఆ గుంపుని తోసుకుంటూ నిరంజన్ నన్ను తీసుకెళ్లాడు.
నన్ను మంచంవైపు నె ట్టి వాడు తల తిప్పుకుని దూరంగా వెళ్లి నిల్చున్నాడు.
నేను బలవంతంగా మంచం వైపు చూశాను..
రాజు పడుకుని ఉన్నాడు.. గాడ నిద్రలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.. నుదుట కుంకుమ బొట్టు. మొహం వరకు దుప్పటి కప్పి ఉంది. ఒత్తుగా ఉండే వాడి జుట్టంతా ఉడి పోయి ఉంది.
రాజుని అలా చూడలేక పోయాను.
కన్నీళ్ళు ఆగడం లేదు..
.....
....
క్షమించండి.. కీ బోర్డు మీద వెళ్ళు కదలడం లేదు.
నేను బలవంతంగా మంచం వైపు చూశాను..
రాజు పడుకుని ఉన్నాడు.. గాడ నిద్రలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.. నుదుట కుంకుమ బొట్టు. మొహం వరకు దుప్పటి కప్పి ఉంది. ఒత్తుగా ఉండే వాడి జుట్టంతా ఉడి పోయి ఉంది.
రాజుని అలా చూడలేక పోయాను.
కన్నీళ్ళు ఆగడం లేదు..
.....
....
క్షమించండి.. కీ బోర్డు మీద వెళ్ళు కదలడం లేదు.
(రాజు చనిపోయి ఏడాది గడిచింది. ఆ రోజు ఆస్పత్రిలో చుసిన దృశ్యాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి)
Comments