అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను. పాదచారులు ఆ చెట్ల నీడలో సేదతీరెడివారు- అని చిన్నప్పుడు బట్టీ పట్టిన పాఠం మళ్లీ మళ్లీ గుర్తుకొస్తుంది తొమ్మిదో నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు చూస్తున్నప్పుడు. మన రాష్ట్రంలో ఎన్‌హెచ్9 పొడవు 430 కిలోమీటర్లు. నల్గొండ జిల్లా దండుమల్కాపురం నుంచి కృష్ణా జిల్లా నందిగామ వరకు 181 కిలోమీటర్ల మేర రోడ్డుని ఇప్పుడు వెడల్పు చేస్తున్నారు. అయితే మనం మాట్లాడుకుంటున్నది రోడ్డు వెడల్పు గురించి కాదు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల గురించి కదా. అశోకుడులాంటి మహానుభావులు ఎవరు నాటారో తెలియదు కాని విస్తరణ పుణ్యమా అని ఇప్పుడు ఆ చెట్లన్నింటిని నిరికివేశారు. నరికివేయకుండా రోడ్డుని ఎలా వెడల్పు చేస్తారు మరి? అని మీరు అడగొచ్చు. కరెక్టే. కాదనలేం. కానీ అంతంత పెద్ద చెట్లని నరికేస్తుంటే ఏదో బాధ.
కోర్టు స్టే..
నిత్యం రద్దీగా ఉండే ఎన్‌హెచ్9ని ఫోర్ లేన్‌గా చేయాలని నేషనల్ హైవే డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ మూడోదశ కింద ఫిబ్రవరిలో టెండర్లు పిలిచింది ప్రభుత్వం. సుమారు రెండు వేల కోట్ల ఈ ప్రాజెక్టుని జిఎమ్‌ఆర్ సంస్థ చేజిక్కించుకుంది. మార్చి 21న నార్కెట్‌పల్లిలో కేంద్రమంత్రి ఆర్‌పిసింగ్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. పనులు శరవేగంగా మొదలయ్యాయి. కాని రోడ్డుకు ఇరువైపులా ఒకటా రెండా? సుమారు తొమ్మిది వేల చెట్లున్నాయి. మరి వీటిని ఏం చేయాలి? ఈ చెట్లన్నింటిని రక్షించాలంటూ హైదరాబాద్‌కు చెందిన సేవ్(సోసైటీ ఫర్ అవేర్‌నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్‌మెంట్) అనే స్వచ్ఛంద సంస్థ ఫిబ్రవరిలోనే హైకోర్టులో కేసు వేసింది. ఇలాంటి పిటిషన్ దాఖలు కావడం హైకోర్టులో అదే మొదటిసారి. వెంటనే ఉన్నత న్యాయస్థానం కేసుని పరిశీలించి అన్ని చెట్లని కాకపోయినా ఎక్కువ వయస్సున్న చెట్లని పరిరక్షించాలని ఆదేశం ఇచ్చింది.
పెద్ద ఖర్చేం కాదు..
సేవ్ సంస్థ పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసే సంస్థ ఆ సంస్థ వ్యవస్థాపకులు విజయ్ రామకుమార్- గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో చెట్లని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పెరిగింది. తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిని వేల కోట్ల రూపాయలతో విస్తరిస్తున్నారు. దానిలో ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే చెట్లన్నింటినీ ట్రాన్స్‌లొకేట్ చేయవచ్చు. అంటే మరోచోట నాటొచ్చు. చెట్టుని తొలగించాలంటే ఎలాగూ ప్రొక్లెయిన్‌ని వాడి తవ్వుతారు కదా. దాన్ని ఎక్కడో దూరంగా నాటాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి పెద్దగా రవాణా ఖర్చు కూడా ఉండదు. ఇలా దాదాపు అన్ని చెట్లను పరిరక్షించవచ్చు. అందుకే మేం హైకోర్టుని ఆశ్రయించాం- అని చెప్పారు
ఎలా గుర్తించారు..
కోర్టు స్టే ఇచ్చిన తర్వాత పురాతన చెట్లను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. అప్పటికి ఐదువేలకు పైగా చెట్లని నరికేశారు. మిగిలిన చెట్లలో మర్రి, జువ్వి, చింత, మద్ది చెట్లని పరిశీలించి 36 చెట్లను ఆ కమిటీ గుర్తించింది. అవన్నీ 50 నుంచి 100 సంవత్సరాల వయస్సున్న చెట్లే. అందులో చౌటుప్పల్ నుంచి సూర్యాపేట వరకు 19 చెట్లు, సూర్యాపేట నుంచి నందిగామ వరకు 17 చెట్లు ఉన్నాయి. చౌటుప్పల్ ఇవతల అవతల ఉన్న ఎనిమిది చెట్లను తొలిగించి చిట్యాల రైల్వే బ్రిడ్జి దగ్గర ట్రాన్స్‌లొకేట్ చేశారు. చెట్టుకు చెట్టుకు మధ్య పది మీటర్ల దూరం ఉంచి వీటిని నాటారు. మిగిలిన చెట్లను సూర్యాపేట ప్రాంతంలో నాటారు.
ఏంటీ ట్రాన్స్‌లొకేషన్?
టమాట, బంతి చెట్లను పెంచడం మీరెప్పుడైనా చూశారా? నారు మొలిచిన తర్వాత పీకి వేరే చోట దూర దూరంగా నాటుతారు. ఆ మాటకొస్తే వరి అయినా. అది ట్రాన్స్‌ప్లాంటేషన్ అయితే ఇది ట్రాన్స్‌లొకేషన్. అవి చిన్న మొక్కలు కాబట్టి చేతులతో నాటొచ్చు. కానీ పెద్ద పెద్ద చెట్లను ఎలా నాటుతారు? నాటినా అవి బతుకుతాయా? అంటే బతుకుతాయనే చెబుతున్నారు సేవ్ సెక్రటరీ దీపక్. కాకపోతే అది ఖర్చుతో కూడుకున్న పని. ముందు చెట్టు ఆకులను, కొమ్మలను తొలగించాలి. పెద్ద వేర్లని కోసేయాలి. పైకి లేపి వాహనంలో మరో ప్రాంతానికి తరలించి అక్కడ నాటాలి. తవ్వడానికి ప్రొక్లెయిన్, రవాణా చేయడానికి ట్రాలీ, దానిపై ఎక్కించేందుకు క్రేన్, చెట్టు చనిపోకుండా కాపాడేందుకు వేర్ల చుట్టూ పూసే రసాయనాలు అవసరమవుతాయి. ఈ వాహనాలన్నీ రోడ్డు విస్తరణలో వాడతారు కాబట్టి చెట్ల ట్రాన్స్‌లొకేషన్ ఖర్చు మరీ ఎక్కువేం ఉండదు.
ఎంత ఖర్వవుతుంది?
ఎన్‌హెచ్ 9 పై గుర్తించిన చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేయడంలో జిఎంఆర్ సంస్థకు హైదరాబాద్‌కు చెందిన గ్లాడ్‌ఫామ్ హార్టికల్చర్ అనే స్వచ్ఛంద సంస్థ సహాయం చేసింది. చెట్టు సైజు, ట్రాన్స్‌లొకేట్ చేయాల్సిన ప్రాంతానికి గల దూరాన్ని బట్టి ఖర్చు మారుతూ ఉంటుంది. చిట్యాల దగ్గర మేం లొకేట్ చేసిన చెట్లకు ఒక్కోదానికి 30 వేల రూపాయల నుంచి 50 వేల వరకు ఖర్చు అయింది అని చెప్పారు ఆ సంస్థ డైరెక్టర్ భాస్కర్. కానీ కొందరు అధికారులు మాత్రం ఒక్కో చెట్టుకు 70 వేల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కలు చూపుతున్నారు. సేవ్ ప్రతినిధులేమో 30 వేల రూపాయలు కూడా కాదని వాదిస్తున్నారు.
పిఎస్ ః కట్ చేస్తే.. రెండు నెలల తర్వాత చెట్టు ఇలా చిగురువేస్తుంది. పూర్వ రూపంతో పోలిక లేదు కాని బతికింది అంతే చాలు. మళ్లీ అంతలా ఎదగాలంటే, వచ్చేపోయేవారికి నీడనివ్వాలంటే ఎన్నేళ్లు పడుతుందో!
Comments