బిందాస్ ప్రతీక... ఈ పిల్లకు మస్త్ నకరాల్

By | July 21, 2011 Leave a Comment
వీచేగాలి వినసొంపుగా ఉంటుంది.
అదే గాలి వేణువు నుంచి వస్తే మరింత మధురంగా వినిపిస్తుంది.
ఇక్కడ గాలి తెలంగాణ భాష..
వేణువు ఆర్‌జే ప్రతీక.
కమ్మని తెలంగాణ మాటలకు ఆమె షో... ఒక ప్రతీక.
ఫస్ట్ అండ్ బెస్ట్ తెలంగాణ ఆర్‌జే ఆమె. 


 
ప్రతీక.. కేవలం మూడక్షరాల పేరు కాదు. ముప్ఫయి వేల మంది నినాదం. మూడు లక్షల మంది అభిమానం. ఆమెదో లోకం. ఆమే ఒక లోకం. దాని పేరు ‘ఫుల్ టు బిందాస్’. మంత్రాలకు మామిడికాయలు రాలతాయో లేదోగానీ.. ఆమె మాటలకు అభిమానులు పుడుతున్నారు. పడుతున్నారు. కీ ఇచ్చి వదిలిన రోబోలా.. పుల్‌స్టాప్, కామాల్లేకుండా మాట్లాడగలదు ప్రతీక. ఆమె మాటలు.. పిజ్జామీద ఆవకాయ రాసుకుని తింటున్నట్టు.. పానీపూరిలో పళ్లరసం పోసుకుని తాగుతున్నట్టు.. బాల్యమివూతుడు బార్‌లో కలిసినట్టు.. పక్కింటి అమ్మాయి ఫారిన్‌లో పలకరించినట్టు ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కలిపి కొట్టే.. ప్రతీకది ఒక డిఫంట్ లాంగ్వేజ్. దానికి ఆమె పెట్టుకున్న పేరు ‘ప్రతీక లాంగ్వేజ్’. ఇప్పుడు చాలామంది యూత్ ఫాలో అవుతున్న ట్రెండీ లాంగ్వేజ్. మాంచి కిక్ ఎక్కించే కొకైన్. ఎంతటి వారైనా ఆ మాటలకు బానిసలు కావాల్సిందే. ఆ వ్యసనానికి దూరంగా ఉండాలంటే సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య రెడ్ ఎఫ్‌ఎమ్ జోలికి మాత్రం వెళ్లకండి.
గుడ్ ఈవ్‌నింగ్.. నమస్తే.. ఆదాబ్.. మీరు ఇంటుండ్రు.. నేను మాట్లాడుతున్న.. సూపర్ హిట్.. 93.5 రెడ్ ఎఫ్‌ఎమ్.. దిస్ ఈజ్ ప్రతీక. అండ్ ద షో కాల్డ్ ఫుల్ టు బిందాస్.. మీరు కాల్ చెయొచ్చు.. ఎస్‌ఎమ్‌ఎస్ చేయొచ్చు... ఐదు కాంగనే ఏమైతది.. ఏంగాదు.. ప్రతీక వస్తది. మీరొస్తరు.. ఆ తర్వాత నెత్తి నొస్తది.. ఏం కాదు.. మీరు ఆడికెంచి ఈడికి రావాలంటే మస్త్ టైమ్ పడ్తది.. అందుకే ఎస్‌ఎమ్‌ఎస్ చెయ్యండి. నీకు ఎస్‌ఎమ్‌ఎస్ చేస్తే మాకేందని.. ఆడికెంచి కొందరు డైలాగ్ కొడుతుండ్రు.. అబ్బ.. వచ్చిందిర పోరీ.. అని కొందరు నెత్తి కొట్టుకుంటుండ్రు.. నాక్ తెల్స్. అది అందరికీ ఇనబడాలిగా.. అందుకే ఫోన్ చేయండి. ఈ లోపు మీకోసం ఒక పాట.. వినండి.. వినండి..ఉల్లాసంగా.. ఉత్సాహంగా...

లైవ్‌స్టూడియో ముందు నిల్చుని.. సెల్‌ఫోన్‌లో ఎఫ్‌ఎమ్ వింటున్నాను. స్టూడియో డోర్ మీదున్న ‘ఆన్ ఎయిర్’ అనే ఎర్రని అక్షరాలు మాయమైపోయాయి. డోర్ తెరుచుకుంది. ప్రతీక బయటికి వచ్చి లోపలికి తీసుకెళ్లింది. ఎంతోమంది సెలవూబిటీలు.. గెస్ట్‌లుగా వచ్చే ఆమె షోలో ఈ రోజు మీరే గెస్టులు. అందుకే ఈ బాతాఖానీ మీకోసం. ఒక పాట.. రెండు ఫోన్‌కాల్స్.. మూడు ఎస్‌ఎమ్‌ఎస్‌ల తర్వాత చిట్కూ స్పాట్లు వస్తున్నప్పుడు మాట్లాడిన మాటలివి.

అసలు ఆర్‌జే ఎలా అయ్యావు?
ప్లాన్స్ లేకుండే. వెన్ ఐ వాజ్ మై కాలేజ్ ప్రెసిడెంట్ (డబ్బ కొట్టడం స్టార్ట్ చేసిన.. లైట్ తీస్కోండి) ఒకసారి రెడ్ ఎఫ్‌ఎమ్ (ఎస్ ఎఫ్‌ఎమ్ జమానా అయ్యింది పొయ్యి) షో కోసం వచ్చిండ్రు. అది నేనే హోస్ట్ చేసిన. అంతా మనదే. మస్త్ నడుస్తుండె కాలేజ్‌ల. ఒక రిప్రజెం నన్ను ఆర్‌జేగా రమ్మనుండె. వచ్చి ఆడిషన్ ఇమ్మనిండ్రు. వచ్చి రెండే లైన్లు చెప్పి.. సెలెక్టయితే.. మై అదృష్టం.. లేకపోతే స్టూడియో దురదృష్టం.. టైప్స్ అన్నమాట. ఆ ఆడిషన్‌లో నా ఆటిట్యూడ్ నచ్చింది. ఫస్ట్ వీక్.. ఏదో తేడా అనిపించింది. డైలాగ్ డెలివరీ కొంచెం ఛేంజ్ చెయ్యమన్నరు. నేనెందుకు చెయ్యాలె. లైట్ తీస్కొమ్మని చెప్పిన. ఆర్గనైజేషన్ ఓకే అన్నది. అప్పట్నించి ఏదో ఇట్ల భరిస్తుండ్రు జనాలు.

ఆ.. ఏదో ఇట్ల భరిస్తుండ్రు? నా షో వింటే నెత్తినొస్తది? ఇలాంటి నెగెటివ్ డైలాగ్స్ మీ షోలో ఎక్కువగా వినిపిస్తుంటాయి? ఎందుకని?
గుడ్ క్వశ్చన్. ఇది ఫస్ట్ నుంచి లేకుండే. నా షో కొంత పాపులర్ అయ్యాక (డబ్బా కాదు) చాలామంది కాలర్స్.. ఫోన్ చేసిన ప్రతివారూ.. మీ షో బాగుంది.. మీరు చాలా బాగా మాట్లాడతారు.. ఇలా అనేవారు.. దానికి నేను.. ఓ.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ.. అని అంటుంటే.. డబ్బాలో రాళ్లేసి.. సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లు.. ఉంటది కదా. అందుకే.. ఇట్ల నెగెటివ్‌గా ఎక్కువ డైలాగులు కొడుతుంట. దాన్ని కూడా లిజనర్స్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్లు అట్ల ఎంజాయ్ చేస్తెనే కదా.. నేను ఎంజాయ్ చేసేది.

యా.. రైట్.. మీ డైలాగ్స్‌ని మీరు.. మీ లిజనర్స్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు! దీనికి మీరేదైనా స్పెషల్‌గా ప్రిపేర్ అవుతుంటారా?
అంత సీన్‌లేదు. మాటలొచ్చినప్పటినుంచి ఎట్ల మాట్లాడుతున్నానో ఇప్పుడు గట్నే మాట్లాడుతున్న. ఇన్ మై స్కూల్.. ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. తెలుగు మాట్లాడనీకి లేకుండె. మా కాలేజ్.. సెయింట్ ఫ్రాన్సిస్ (బేగంపేట్)లో కూడా ఇంగ్లీషే. అందుకే ఇంట్ల తప్ప బయట ఎక్కడా తెలుగు మాట్లాడేదాన్ని కాను. ఇంట్ల, ఫ్రెండ్స్‌తోని ఎట్ల మాట్లాడతానో స్టూడియోలో కూడా అట్లనే మాట్లాడతా. అంతేగానీ.. మీలాగ పేపర్లు పెన్నులు పట్టుకుని రాసుకోను. నేను ఆన్ ఎయిర్‌లో ఒకతీరిగా.. ఆఫ్ ఎయిర్ ఒకతీరిగా ఉంటనని అందరు అనుకుంటరు. అంతలేదు. ఆన్ ఎయిర్ ఎట్లుంటనో.. ఆఫ్ ఎయిర్ గూడ గట్లనే ఉంట.

అందుకే నీ షో హిట్ అయ్యిందని అనుకోవచ్చా? 
యా.. యగ్జాక్ట్‌లీ! ఎండ్ ఆఫ్ ద డే.. నా షో ఎందుకు హిట్ అయ్యిందంటే.. ఆ.. (ఆలోచిస్తూ.. ) ఓకే.. టీక్ హై.. బికాజ్.. ఆర్టిఫిషియాలిటీ ఏం ఉండదు. అందుకే నా షో నాచురల్‌గా ఉంటుందన్నమాట. ఈడ బెయిన్ చూపిస్తూ.. ) ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తా. ఐ నీడ్ నాట్ టు యాక్ట్.. ఐ నీడ్ నాట్ ప్రిటెండ్.. ఐ నీడ్ నాట్.. వాట్ ఐయామ్ నాట్.. మూడూ ఒకటే (పెద్దగా నవ్వుతూ).. అలగ్.. అలగ్ జెప్తున్న. ఒకటి బై.. షోల ఇటుకెంచి నేనున్న.. అటుకెంచి లిజనర్స్ ఉన్నరు. ఎంజాయ్.. దేథడి పోచమ్మ గుడి.

దేథడి పోచమ్మ గుడి? ఇలాంటి పదాలు ఎక్కడ దొరుకుతయ్? రోజుకో టాపిక్ ఉంటుంది దానికోసం ఏమైనా హోమ్ వర్క్ చేస్తారా?
మస్త్ దొరుకుతయ్. పుట్టినకెంచి గిన్ని పదాలిన్నమ్. కొత్తగా నేను క్రియేట్ చేసేది ఏం లేదు. స్పాంటినియస్‌గా ఏది గుర్తొస్తే.. ఆ మాట వాడేస్త. రోజుకో టాపిక్ అంటారా? ఎక్కువగా చదువుతుంట. పుస్తకాలు.. న్యూస్ పేపర్స్...? టీవీ న్యూస్ ఫాలో అవుతుంట. చిన్నప్పుడు అందరూ కార్టూన్ నెట్‌వర్క్ చూస్తుంటే.. నేను న్యూస్ ఛానెల్ చూసేదాన్ని. ఏదైనా ఇట్ల చాలా టాపిక్‌లు దొరుకుతయ్. ఉదయాన్నే పేపర్‌వేసే బోయ్ నుంచి.. సాయంత్రం డ్రాప్ చేసే ఆటోవాలా వరకు చాలా టాపిక్‌లున్నయ్.

ఆటోవాలాలు కూడా ఫ్యాన్స్ అని తెలుసుగానీ.. నీకు ఇష్టమైన కాలర్ ఎవరైనా ఉన్నారా?
ఒక్కరని కాదు. చాలామంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో నేను యూఎస్ వెళ్లేది ఉండే. 24న నా లాస్ట్ షో అని అనౌన్స్ చేసినం. ఏదో వంద రెండొందల మంది వస్తరనుకున్నాం. రెండు వేలకంటే ఎక్కువమంది వచ్చిండ్రు. అందరూ నా షో అపొద్దని రిక్వెస్ట్ చేసిండ్రు. ఒకావిడ చంటి పాపని ఎత్తుకుని వచ్చింది. ఒక ముసలాయిన.. నా షో విన్నంకనే బీపీ తగ్గినట్లు చెప్పిండు. నేను నమ్మలేదు. ఆయన సర్టిఫికెట్లు తీసుకొచ్చి చూపించిండు. అప్పుడే డిసైడ్ అయిన.. యూఎస్ వెళ్లొద్దని.

రోజుకో టాపిక్ ఉంటుంది కదా? మర్చిపోలేని టాపిక్ ఏదైనా ఉందా?
ఉంది. ఒక సారి ఓ లిజనర్ కాల్ చేసి తనకు ట్రాన్సిల్స్ ప్రాబ్లమ్ ఉందని, ఆపరేషన్‌కి మూడు లక్షల రూపాయలు కావాలని చెప్పింది. అది నిజమో కాదో తెలుసుకున్న తర్వాత. నేను ఆమె మీద ఒక షో చేసిన. లిజనర్స్ అందరూ స్పందించి మూడు లక్షల రూపాయలిచ్చారు. ఆమెకు ఆపరేషన్ అయిపోయింది. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఆమె పేరు పాయల్. పాతబస్తీ.

చూడ్డానికీ బాగున్నావ్, మరి సినిమాల్లో ఛాన్స్ వస్తే..?
అబ్బ ఛా.. ఆఫ్‌కోర్స్.. నిజమే అనుకో. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక పెద్ద సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. అదీ ఎగ్జామ్స్ ముందు. అప్పటికీ ఆర్నెల్లు కాలేజ్‌కి డుమ్మా కొట్టిన. ఇప్పుడేమో పరీక్షలు. సినిమాలొద్దు ఏమొ నమస్తే జెప్పిన. మళ్లీ.. ఐ గాట్ ద ఆఫర్ ఇన్ ఎంబీఏ.. అప్పుడు కూడా ఎగ్జామ్స్ ఉండే.. మళ్లీ నమస్తే. మూవీస్ ఎప్పుడైనా.. చేసుకోవచ్చు. కెరీర్ ఇంప్టాంట్.. ఆర్‌జేగా ఓకే.. చానా చదివేది ఉంది. మై గోల్ ఈజ్ సమ్‌థింగ్ ఎల్స్.. సమ్‌థింగ్ ఎల్స్..
రోజూ.. షో కె్లైమాక్స్‌లో ఏదో చెప్తుంటవ్ కదా? అది మాకోసం ఒకసారి?
ఒక్క బతుకు బతుకుతందుకు వచ్చినమ్. దీంట్ల ఎవరేమైతరో ఎవరికి తెలుసు. అందుకే నవ్వుతూ ఉండండి. కీప్ సై్మలింగ్. కేర్. బై బై.

పాంచ్ పటాక్
1. ఎక్కువగా వాడే ఐదు పదాలు
చిట్కు (చిన్నది), అబ్బ ఛా, లైట్ ,తీస్కో, పిల్లా / పిలగా నకరాలా?,దేథడి పోచమ్మ గుడి..
2. బ్రౌనీ (కుక్కపిల్ల) గురించి రెండు మాటలు?
ఓహ్.. వాడి గురించి కూడా తెలుసా? ఐ లవ్ పెట్స్. అమ్మానాన్నల తర్వాత వాడే నాలోకం.
3. షోలో కౌంటర్ ఇచ్చినప్పుడు హ.. హ.. హ(లాఫింగ్) నవ్వులు ఎట ్ల వస్తాయి?
అందర్కి చెప్పకు. నేనే నొక్కుత. దీనికి ఎంతో సమయస్ఫూర్తి కావాలి.
4. నిన్ను నువ్వు అద్దంలో చూస్కుంటే ఏమని పిస్తది?
మస్తు హుషారుంది పిల్ల
5. రోజుకో టాపిక్ ఎక్కడ దొరుకు తుంది?
సూపర్‌మ్కాట్ల.. లైట్ తీస్కో.. దొరుకు తయ్.. ఏడ్నో ఒకదగ్గర.

హైలైట్స్
-మాస్‌గా మాట్లాడే ప్రతీక.. చాలా క్లాస్‌గా కనిపిస్తుంది.
- లిజనర్స్ అంటే ఆమెకి ప్రాణం.
-ఒకసారి యాక్సిడెంట్ అయి చేతికి దెబ్బతగిలినా కూడా రక్తం కారుతుంటే అలాగే షోకి వచ్చేసింది.
- ఈ ఇంటర్వ్యూ చేసిన రోజు (మంగళవారం) టాపిక్- నీ టీలైన్ (టీ షర్ట్ మీద రాసుకునే లైన్) ఏంటి?
- ప్రతీక మూడింటికి భయపడుతుంది.. రక్తం.. వానపాము.. గొడవలు. 

0 comments: