ఈ అనంత కాలగమనంలో.. మహానగరాల ప్రస్థానంలో...ఏదో ఒకరోజు.. ఏదో ఒక క్షణం..చీకటి అలుముకుంటుంది. ఉజ్వలంగా వెలుగొందిన నగరాలన్నీ ఇలాంటి పెనువిషాదాన్ని చవి చూసినవే.
ఇది చరిత్ర చెప్పిన సత్యం.అలాంటి విషాదానికి, ప్రకృతి విలయానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ప్రాణధాత్రి.
ఒకప్పుడది..
తెల్లటి నురగల హారంతో పరవళ్లు తొక్కుతూ ఆందంగా కనిపించే నది.
పేరు ‘ముచ్‌కుందా’ నేడు చలనం లేని మూసీ. ఒక మురికి కాలువ.
దిగాలుగా కదిలే ఆ నీటిలో ఒక విషాదం ఉంది. చరివూతలో ‘మూడు రోజుల’ మచ్చ ఉంది.
ఏంటా మూడు రోజులు? అసలేమైంది? చెప్పేవావరు? ఉన్నారు. మూసీకి ఉత్తరానున్న ఉస్మానియా ఆసుపత్రి ఇన్‌పేషెంట్ బ్లాక్‌లో ఒక పెద్ద చింత చెట్టు ఉంది. ఆ మూడు రోజులకు ఇదొక్కటే సజీవ సాక్ష్యం. 150 మందికి పునర్జన్మనిచ్చిన ఆ ‘ప్రాణధాత్రి’ ఆత్మకథ ఇది.
103 సంవత్సరాల క్రితం..
సరిగ్గా ఇదేరోజు.. ( సెప్టెంబర్ 24, 1908 - గురువారం)
ఆ రాత్రి.. బంగాళాఖాతంలో వాయుగుండమేదో ఏర్పడుతున్నట్లు భూమి పొరల్లోంచి నా వేర్లకు సంకేతం అందినట్లనిపించింది. నా ఒళ్లు జలదరించింది. అటూ ఇటూ చూశాను. నగరం ప్రశాంతంగా ఉంది. తుఫాను ముందు ఉండే ప్రశాంతత. నన్ను కలవరపెట్టింది. మర్నాడు.. (సెప్టెంబర్ 25, శుక్రవారం)ఉత్తరం నుంచి చిన్నగా ఈదురు గాలి మొదలైంది. ఆ రోజంతా నాకు గుండెలో గుబులుగానే ఉంది. చినుకుల కోసం చూస్తున్నాను. కానీ ఒళ్లంతా వణుకుతూనే ఉంది. శనివారం(సెప్టెంబర్ 26) మధ్యాహ్నం.. చిరుజల్లు మొదలైంది. 4 గంటల ప్రాంతంలో కొద్దిసేపు వాన గట్టిగా కురిసింది.

సోమవారం (సెప్టెంబర్ 28)...
ఇన్నేళ్ల నా జీవితంలో నేనిప్పటికీ.. ఎప్పటికీ మర్చిపోలేని రోజది.. ఆరోజు ఏం జరిగిందో చెప్పే ముందు...అంతకు ముందురోజు మూసీకి ఎగువన ఏమైందో చెబుతాను. హైదరాబాద్‌కు 22 మైళ్ల దూరంలో యెంటేర్ లోయ ఉంది. అందులో పాల్మాకుల చాలా పెద్ద చెరువు. కుండపోతకు ఆ చెరువు నిండు కుండయ్యింది. అది బద్దలై ఆదివారం ఉదయం చెరువుకు గండి పడింది. ఆ నీళ్లు వేగంగా దిగువన ఉన్న పార్తీ రిజర్వాయర్లోకి చేరాయి. అక్కడి నుంచి నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. మీరాలం ట్యాంకు కూడా పొంగి పొర్లింది. ఆ చుట్టు పక్కల చాలా చెరువులూ కట్టలు తెంచుకున్నాయి. ఆ నీరంతా ఆదివారం అర్థరాత్రి మూసీలోకి చేరింది. ఇక ఆ ఉధృతి నగరం వైపు దూసుకొచ్చింది.మూసీలో నిమిషనిమిషానికీ నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల వరకు తీరాల వెంబడి ప్రవహిస్తున్న నీరు మూసీ నుంచి పైకి లేవడం మొదపూట్టింది. కొద్ది సేపట్లోనే పూరానాపూల్ బ్రిడ్జీని తాకే వరకు పొంగింది. 3 గంటలకు ఒడ్డును దాటి నీరు బయటకు రావడం మొదలైంది.

11 గంటలకల్లా మూసీలో నీళ్లు తారాస్థాయికి చేరాయి. నా చుట్టూ ఎటు చూసినా అరమైలు వరకు నగరం మునిగిపోయే ఉంది. మూసీ అడుగు భాగం నుంచి 700 అడుగుల పైకి నీళ్లు వచ్చాయన్నమాట.
ఉన్నట్లుండి హైదరాబాద్‌కు ఓ మహా సముద్రం వచ్చినట్లనిపించింది. మైలుదూరం వరకు నివాస ప్రాంతాలపైకి 20 అడుగుల దాకా నీరు చేరింది. వానదేవుడు ఆగ్రహించాడని.. మూసీ తల్లి కన్నెర్ర చేసిందని.. కట్ట మైసమ్మకు కోపం వచ్చిందని నా పైన కూర్చునవాళ్లు మాట్లాడుకుంటున్నారు. వరద ఉధృతి ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నారు. తమ వారు ఎక్కడున్నారో.. వరదలో ఎక్కడ చిక్కుకుపోయారోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. మాలాగే క్షేమంగా ఉండాలని.. బతికుంటే చాలని దేవుడ్ని వేడుకుంటున్నారు. ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. మరో 45 నిమిషాల వరకు ఈ ఉధృతి అలాగే ఉంది. 11.45 ప్రాంతంలో అఫ్జల్‌గంజ్ వంతెన వద్ద ఒక అడుగు నీరు తగ్గింది.
ఆపై ఇక నీరు తగ్గుతూనే ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వంతెన తేలింది. అది ధ్వంసమై కనిపించింది.కొద్దిసేపటికి ఇంకా వేగంగా తగ్గింది.

ఆఫ్ ద రికార్డ్
మూసీ వరదల్లో నేను ఎంత మందిని కాపాడానో నాకు నిజంగా తెలియదు. నేనసలు లెక్కబెట్టుకోలేదు కూడా. 150 మందిని కాపాడినట్లు బోర్డు రాసి నా మెడలో వేశారు. నేరం చేసినవాడి మెడలో నెంబర్ రాసిన పలక వేసి ఫోటో తీసినట్లు. నేను పెరుగుతున్నా కొద్ది అది నా గొంతుకు బిగుసుకుపోతోంది. దీన్ని మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఇంకొందరయితే నాకు వారసత్వ హోదా ఇప్పించే ప్రయత్నం చేశారు. నేను చేసిన గొప్ప పనిని గౌరవిస్తూ.. ప్రతి ఏటా నవంబర్ 30న హాస్పిటల్ డేను ఈ ఆసుపత్రి సిబ్బంది ఇక్కడే నిర్వహిస్తుంటారు. నన్ను ‘ప్రాణధావూతి’గా అభివర్ణించారు. నాక్కావాల్సింది.. ఈ అవార్డులు రివార్డులు కాదు. తెల్లటి నురగలతో చూడడానికి అందంగా ఉండే మూసీని మురికికి పర్యాయపదంగా మార్చేశారు. ఆ మూసీకి పూర్వవైభవం మళ్లీ రావాలని ఆశగా ఉంది.
అప్పటి హైదరాబాద్ వ్యూ

- మూసీకి దక్షిణాన నిజాం ప్యాలెస్, ఇతర నవాబుల నివాసాలుండేవి. ప్రస్తుత పాతబస్తే అప్పటి హైదరాబాద్.
- ఉత్తరాన కొత్తనగరం మూడువైపులా ఉండేది. ప్రస్తుత ఛాదర్‌ఘాట్‌తో పాటు బ్రిటీష్ రెసిడెన్సీ.. ఇసామియా బజార్ అవి.
- అప్పటి మొత్తం నగర జనాభా 4.5 లక్షలు.
- పాల్మాకుల చెరువు, పార్తీ రిజర్వాయర్ ఉన్న శంషాబాద్ ప్రాంతంలో రికార్డు స్థాయి వర్షం కురిసింది. సోమవారం ఉదయానికి 24 గంటల్లో 12 అడుగుల 18 అంగుళాల వర్షపాతం నమోదైంది.
- సోమవారం ఉదయం 2 గంటలకు ముంచుకొస్తున్న ముప్పును పసిగట్టిన అధికారులు నగరవాసులకు మొదటిసారిగా హెచ్చరికలు జారీ చేశారు. వరదలకు చదరపు మైలు విస్తీర్ణంలో జలవిలయం సంభవించిందని తర్వాత లెక్కలు కట్టారు.
- ఈ వరదల వల్ల సుమారు 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా.
- 19 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. జనాభాలో మూడింట్లో ఒక వంతు అంటే దాదాపు 80 వేల మంది నిరాక్షిశయులయ్యారు.
- నిజాం తేరుకుని సహాయక చర్యల కోసం ప్రధాని కిషన్ ప్రసాద్ అధ్యక్షునిగా ఓ కమిటీని వేశారు.
- హిందూ పూజారుల సూచన మేరకు నిజాం మూసీ తీరానికి వెళ్లి పూజలు చేసి విలువైన కానుకలు, ఆభరణాలు, చీరలు అర్పించారట.
- నిరాక్షిశయులైన వారిని నిజాం ప్యాలెస్‌లైన పురానా హవేలి, పంచ్ మహాల్లా ప్యాలెస్, జులుఖానా, ఫతేమైదాన్‌లలో ఆశ్రయం కల్పించారు.
- పరదాలో ఉండే మహిళలకు నవాబ్ ఫఖర్ ఉల్ ముల్క్ బహదూర్‌కు చెందిన అసద్ బాగ్‌లో ఆశ్రయం కల్పించారు.
- హిందూ ముస్లింలకు ప్రత్యేక వంటశాలలు తెరచి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 13 వరకు ఉచితంగా భోజన సదుపాయం సమకూర్చారు.
- అప్పట్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రాంతంలో అఫ్జల్‌గంజ్ ఆసుపత్రి ఉండేది. వరదలకు అది దెబ్బ తినడంతో 1924లో ఏడో నిజాం ఇప్పుడున్న ఆసుపవూతిని కట్టించాడు.
జంట జలాశయాలు

బీరెడ్డి నగేష్‌రెడ్డి
Comments