స్టాల్ నెంబర్ 91 మాత్రం ప్రత్యేకమైనది ఎందుకో ?

By | December 25, 2011 Leave a Comment
,డిసెంబర్ 24...మధ్యాహ్నం 12.30.. హైదరాబాద్ బుక్ ఫెయిర్, నెక్లెస్ రోడ్.. గేటుకు ఎదురుగా చాలా పుస్తకాల స్టాల్స్ ఉన్నాయి. ప్రతిదాంట్లో చాలామంది రచయితల పుస్తకాలు.. రకరకాల అంశాల మీద రాసినవి కనిపిస్తాయి. కానీ ఎడమవైపు రెండోది మాత్రం అక్కడ ప్రత్యేకమైనది.
ఎందుకో మీరే చదవండి.
స్టాల్ నెంబర్ 91.. గాంధీ ప్రచురణలు..
సలామ్ హైదరాబాద్, చత్తీస్‌గఢ్ స్కూటర్ యాత్ర, ఒక హిజ్రా కథ, 1948 సెప్టెంబర్ 17 జ్ఞాపకాలు గాయాలు, 1857 హైద్రాబాద్ తిరుగుబాటు గాథలు, హైద్రాబాద్ జనజీవితంలో ఉర్దూ సామెతలు.. ఇలా చాలా పుస్తకాలు ఆ స్టాల్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ రాసింది ఒక్కరే.. ఆయనే పరవస్తు లోకేశ్వర్. 250కి పైగా స్టాల్స్ ఉన్న ఆ పుస్తక ప్రదర్శనలో ఒక రచయిత ఏర్పాటు చేసిన స్టాల్ మాత్రం అదొక్కటే.
‘వట్టికోట’ వారసత్వం...
తెలంగాణ ప్రజా సాహిత్యానికి పాదులు తీసి ప్రాణం పోసిన వట్టికోట ఆళ్వారుస్వామి స్ఫూర్తితో ఈ స్టాల్‌ని ఏర్పాటు చేశానని చెప్పారు లోకేశ్వర్. నిజాంను గడగడలాడించిన ‘ఆంవూధమహాసభ’ నల్గొండ జిల్లా అధ్యక్షుడుగా, గ్రంథాలయోద్యమ సారథిగా వట్టికోట సుపరిచితులు. 1923లో ఆయన గ్రామ గ్రామనికి వెళ్లి పుస్తకాలు అమ్మేవాడు. ప్రపంచం గర్వించదగ్గ గణిత మేధావి బాలగోపాల్ కూడా పావలా, ఆఠాణాకు పుస్తకాలను ఫుట్‌పాత్ మీద కూర్చుని అమ్మాడు. అలాంటి గొప్ప వ్యక్తుల స్ఫూర్తితోనే బుక్‌స్టాల్ పెట్టానంటారు లోకేశ్వర్.
రెండు లక్ష్యాలు...
‘‘వట్టికోట వారసత్వాన్ని కొనసాగించాలన్నది నా మొదటి లక్ష్యం. టీవీలు.. సినిమాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో పుస్తకాలు.. వాటి ప్రాధాన్యం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రచయితలు కూడా పుస్తకాలు అమ్ముకోవడం నామోషిగా భావిస్తున్నారు. ఉచితంగా పంచితే ఎవరూ చదవరు.. కొనడం నేర్పితేనే చదవడం నేర్చుకుంటారు. రెండోది.. సామాన్య పాఠకులతో పరిచయాలు ఏర్పడతాయి. పాఠకులు ఏం కోరుకుంటున్నారో రచయితకు తెలుస్తుంది. అలాంటి అనుభవాలు నాకు ఇక్కడ చాలా ఎదురయ్యాయి’’ అని చెప్పారు లోకేశ్వర్.
ఎన్నో అనుభవాలు..
‘‘రోజూ ఈ స్టాల్‌కు వచ్చే వారిని పరిశీలిస్తున్నాను. వారితో మాట్లాడుతున్నాను. ఈ పుస్తకాల మీద అభివూపాయాలు తీసుకుంటున్నాను. ఒకరోజు.. ఒక సాధారణ వ్యక్తి.. వచ్చి ఈ పుస్తకాల్ని పరిశీలనగా చూశాడు. ఒక్కో పుస్తకాన్ని తెరిచి పేజీలు తిప్పి చదివాడు. అతన్ని చూస్తే చదువుకున్నవాడిలా లేడు. ఈ పుస్తకం చూడండి అని ‘సలామ్ హైదరాబాద్ పుస్తకం ఇచ్చాను. ‘ఇది నేను ఎప్పుడో చదివేశాను’ అన్నాడతను. నాకు ఆశ్చర్యం వేసింది. అతని వివరాలడిగాను. అతనో తాపీమేస్త్రీ. ఇంకొకాయన.. యూనివర్సిటీలో ప్రొఫెసర్.. ‘పుస్తకాలు కాదు.. ఏవైనా పాటల సీడీలు ఉంటే చూపించండి’ అన్నాడు. చూడండి... ఎంత వ్యత్యాసం.. నేను ఇక్కడ కూర్చోబట్టే ఇవి తెలిశాయి. రచయితగా ఆ తాపీమేస్త్రీ అభినందనలు నేనెప్పటికీ మర్చిపోలేను.’’
లక్ష రూపాయలు...
బుక్ ఫెయిర్‌లో పుస్తకాలు ప్రదర్శించాలని నేను అనుకున్నప్పుడు చాలామంది వొద్దని చెప్పారు. రచయితవి నువ్వు ఏర్పాటు చేయడమేంటని కొందరన్నారు. అక్కడ పుస్తకాలు అంతగా అమ్ముడుపోవు.. 20... 30 వేలు నష్టపోతావన్నారు ఇంకొందరు. అయినా ఫర్వాలేదు.. సామాన్య పాఠకుల నాడి తెలుసుకోవాలనుకున్నాను. స్టాల్ ఏర్పాటు చేశాను. నేను నా భార్య శోభ ఇద్దరం కూర్చునేవాళ్లం. ఈ స్టాల్‌లో కూర్చుని.. పాఠశాల విద్యార్థుల్ని కలవగలిగాను.. అనాథ బాలలకు ఉచితంగా కొన్ని పుస్తకాలు ఇచ్చాను. పుస్తకాలు కొనేందుకు పోలీసులొచ్చారు.. డాక్టర్లు.. లాయర్లు.. బిజినెస్‌మేన్‌లు.. సినిమావాళ్లు.. ఇంతమంది వచ్చారు. వారందరినీ కలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఈ చిన్న స్టాల్‌లో ఈ రోజు వరకు నేను లక్ష రూపాయల విలువైన పుస్తకాలు అమ్మగలిగానంటే.. మీరు నమ్మలేకపోవచ్చు. కానీ నిజం. ఈ సొమ్మును కూడా మంచి పుస్తకాల ప్రచారం కోసం వాడతాను.

0 comments: