రిటైర్ ఎర్లీ as soon as possible

By | March 26, 2012 Leave a Comment
మనదేశంలో 2010-11 మధ్య 8,800 మంది టీచర్లు ఎర్లీ రిటైర్‌మెంట్ తీసుకున్నట్లు అధికారిక లెక్కలున్నాయి. గడిచిన 13 ఏళ్లలో ఇదే పెద్ద సంఖ్య అన్నది వాస్తవం. అధిక పనిభారమే దీనికి కారణమని నేషనల్ యూనియన్ ఆఫ్ టీచర్స్ చెబుతోంది.
పోయిన సంవత్సరం వచ్చిన బాలీవుడ్ మూవీ ‘జిందగీ నా మిలేగి దొబారా’ సినిమా చూశారా? అందులో ఒక హీరో సరిపడా డబ్బు సంపాదించి 40 ఏళ్లకే రిటైర్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటాడు. జీవితమనే పరుగుపందెంలోంచి త్వరగా బయటపడాలని తపించే చాలామందికి అతను ఒక ప్రతినిధిలా కనిపిస్తాడు. చాలా సంవత్సరాలు బండ చాకిరి చేయడం నుంచి బయటపడేందుకు రిటైర్‌మెంట్ ఒక రివార్డ్ లాంటిది. అందుకే ఆర్-వర్డ్ ఇప్పుడు హాట్ వర్డ్ అయింది. ఇక్కడ ఆర్ అంటే మరో అర్థం కూడా ఉంది. రాహుల్ ద్రవిడ్. యస్.. ఆయన ఈ మధ్యే తన 39వ ఏట క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఆయనే కాదు కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే యంగ్‌జనరేషన్, యుఎస్ రిటర్న్స్ త్వరగా ‘పరుగు’ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. ఆ ఎక్సైట్‌మెంట్ గురించే ఈ కథనం.

జయవూపకాష్ హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. బెంగళూరు, పుణె అమెరికాల్లో పనిచేశాడు. ఆ సాఫ్ట్‌వేర్ లైఫ్ అతనికిప్పుడు బోర్ కొట్టేసింది. అందుకే 3 ఏళ్లకే రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు అతనిదో కొత్త లక్ష్యం. అంతకుముందు పొందని అనుభూతినిచ్చే పనిని ఎంచుకున్నాడు. గ్లోబల్ వార్నింగ్ మీద ఫైట్ చేస్తున్నాడు. గణేష్ శర్మది ఇంకో దారి. హైదరాబాద్‌లోనే పెద్ద కంపెనీలో ఛార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేశాడు. ఇప్పుడాయన రిటైర్‌మెంట్ తీసుకుని ‘మిల్ కె చలో’ అంటూ కార్ పూలింగ్ మీద ప్రచారం చేస్తున్నాడు. మహర్షిది మరో ముచ్చట. బోయిన్‌పల్లిలో విశ్రాంత జీవితం గడుపుతూ.. ఉదయాన్నే తనకు ఇష్టమైన సైక్లింగ్ చేస్తూ.. ప్రజల్లో ఆరోగ్యం మీద అవగాహన కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. తక్కువ వయసులో రిటైర్‌మెంట్ తీసుకున్నవారు చాలామందే కనిపిస్తారు.

బెంగళూరు ఇన్ఫోసిస్‌లో పనిచేసిన శ్రీనివాస శాస్త్రి ఆరేళ్ల క్రితమే రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడాయనకు 47 సంవత్సరాలు. ఉదయాన్నే బ్యాడ్మింటన్ ఆడి.. తర్వాత పూజ.. బ్రేక్‌ఫాస్ట్.. న్యూస్‌పేపర్.. ఇంటర్‌నెట్..తో గడుపుతున్నాడు. మధ్యాహ్నం కిండెలింగ్ (అమేజాన్ కిండెల్ ఫైర్‌లో పుస్తకాలు చదవడం) సాయంత్రం ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్నాడు. ఆయన ‘ఏ మ్యూజింగ్ ఆఫ్ రామశాస్త్రిఎక్స్’ పేరుతో బ్లాగ్‌ని కూడా నిర్వహిస్తున్నాడు. దాని ట్యాగ్‌లైన్ ఏంటో తెలుసా? We are human beings, after all, not human doings. ఎంత గొప్ప మాట. ఆయన ఎందుకు రిటైర్‌మెంట్ తీసుకున్నాడో.. మనమూ ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందో.. ఒక్కమాటలో చెప్పాడు. ఇలాంటి కారణాలతోనే ఇప్పుడు చాలామంది ఎర్లీగా రిటైర్ అయిపోతున్నారు.

ఇది అందరికీ సాధ్యమా?
ఓ ఇరవై ఏళ్లకు పెళ్లి చేసుకున్నాం.. రెండు మూడేళ్లలో ఒకరో ఇద్దరో పిల్లలు.. బంధాలు.. అనుబంధాలు.. ఆఫీసు.. బాసు.. జీతం.. జీవితం.. ఇదీ లైఫ్. బాగుంది. కానీ ఎంతకాలం? 9 టు 5 జాబ్.. వర్క్ టెన్షన్.. చిరాకు పడే బాస్.. ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూపులు.. రోటీన్ లైఫ్.. పరమ బోర్. ఇలా ఎంతకాలం.. లైఫంటే ఇంతేనా? ఇంకేం లేదా.. ఫ్రస్టేషన్.. దీని నుంచి పుట్టేదే రిటైర్‌మెంట్ ఆలోచన. వీలైనంత త్వరగా రిటైర్ అయిపోవాలి. ఒక సొంత ఇల్లు.. కారు.. పిల్లలు.. పెళ్లిళ్లు.. కూల్‌గా ఉండాలి.. ఇంకేదో చేయాలి?- ఇది అందరికీ సాధ్యమా? అలా ఉండొచ్చా? అంటే.. అందరికీ సాధ్యమే అంటున్నారు ఫైనాన్సియల్ ఎక్స్‌పర్ట్స్. ఇప్పుడు మీకో ముప్ఫయి ఏళ్లు ఉన్నాయనుకోండి.. మరో పదేళ్లలో రిటైర్‌మెంట్ తీసుకోవాలనుకుంటే.. ఇప్పటి నుంచే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే.. ఇక హ్యాపీగా ఉండొచ్చంటున్నారు. అదెలాగా?

ఎంత డబ్బు సంపాదించాలి?
ప్రస్తుతం మీరు నెలకు 25 వేల రూపాయలు సంపాదిస్తున్నారనుకుందాం. ఆ డబ్బుతో హాయిగా బతుకుతున్నారు. ఓ ఎనిమది పదేళ్ల తర్వాత రిటైర్‌మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ అప్పుడూ ఇవే పాతికవేలు సరిపోతాయా? అంటే సరిపోవు. ఎందుకంటే ద్రవ్యోల్బనం. మరి అప్పుడు ఎంత కావాలి? ద్రవ్యోల్బనాన్ని సగటున 6 నుంచి 7 శాతం వేసుకుంటే 2030 నాటికి 67,319 రూపాయలు అవుతుంది. దీన్ని బట్టి రిటైర్‌మెంట్‌నాటికి ఎంత డబ్బు ఆదా చేయాల్సి ఉంటుంది. 2030లో ఇప్పుడున్న జీవితాన్నే గడపాలంటే నెలకు మీకు 67 వేల రూపాయలు కావాలి. అంటే సంవత్సరానికి లక్షల 7వేల 32 రూపాయలన్నమాట. మీరు రిటైర్‌మెంట్ తీసుకుంటే ప్రతినెలా జీతం రాదు కాబట్టి అప్పుడు ఈ సొమ్ము ఎలా వస్తుంది? మీకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఇంట్రెస్ట్. ఇంత సొమ్ము మీరు వడ్డీ రూపంలో పొందాలంటే మీ దగ్గర అప్పటికి 1,15,40,455 రూపాయలు ఉండాలన్నమాట. ఒక్కనిమిషం.. మరి దీనికి ఆదాయపు పన్ను ఎవరు కడతారు? అప్పటికి పన్ను 25 శాతం ఉంటుందనుకుంటే... మీ మూలధనం 1,53,7,272 ఉండాలి.. సింపుల్‌గా కోటి 54 లక్షలన్నమాట. ఇప్పుడు క్లియర్ పిక్చర్ వచ్చింది కదా. ఇంత డబ్బు సంపాదించడం కష్టమైన పనే. కానీ అసాధ్యమైనది మాత్రం కాదు. మీరు ఇది చదువుతున్నారంటే మీకు ఇలాంటి లక్ష్యం ఉన్నట్లే.. పొదుపు చేసేవావ్వరూ ఇంత డబ్బు ఎప్పటికీ సంపాదించలేరు... అందుకే మదుపు మొదపూట్టాలి. మీ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది.

డబ్బు సంపాదించడం ఒక కళ. డబ్బుతో ఆడుకోవడం ఒక ఎంటర్‌టైన్‌మెంట్. మీరు జీవితాంతం ఉద్యోగం చేస్తే కేవలం ఉద్యోగిగానే మిగిలిపోతారు. ఇంటి లోన్లు.. కారులోన్లు.. చెల్లించడం కోసం తప్పకుండా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అంటే మీరు డబ్బు కోసమే పనిచేస్తూ ఉంటారన్నమాట. కానీ డబ్బు మీ కోసం పనిచేసేలా మీరెందుకు ప్రయత్నించకూడదు. మీరు డబ్బు కోసం రోజుకు ఎనిమిది నుంచి పది గంటలే పనిచేస్తారు. అదే మీ డబ్బు మీకోసం.. 24 గంటలూ పనిచేస్తూనే ఉంటుంది. 24 అవర్స్.. 365 డేస్.. ఆన్‌డ్యూటీ అన్నమాట. అదెలా? ఇన్వెస్ట్‌మెంట్! మదుపు చేయండి! సరైన సెక్టార్‌లో మదుపు చేయడం తెలివైన వారి లక్షణం. సింపుల్! మీరొక పది వేల రూపాయలు ఒకరికి వడ్డీకిచ్చారునకుందాం. మీకు చెల్లించేందుకు అతని రోజూ కష్టపడుతూనే ఉంటాడు. అంటే డబ్బు కోసం పనిచేస్తుంటాడు. కానీ మీ డబ్బు మీకోసం పనిచేస్తుంటుంది. చిన్న తేడా! ఇది అర్థం చేసుకుంటే.. మీరు వీలైనంత త్వరలో రిటైర్‌మెంట్ తీసుకోవచ్చు.
కొన్ని కారణాలు
రిటైర్‌మెంట్ తీసుకోవాలనుకుంటున్న కొందరు చెప్పే కారణాలివి.
1. చేసే పనిలో చాలాకాలం సంతృప్తి దొరకకపోవచ్చు.
2. ఉద్యోగం చేసేవారికి సోమవారం ఉదయాలు భారంగా... ఆదివారం సాయంత్రాలు ఆనందంగా ఉంటాయి.
3. కెరీర్‌కంటే గొప్పవి ఇంకా చాలా ఉన్నాయని గ్రహించడం.
4. ఆఫీస్ పనిని ఎంజాయ్ చేయలేకపోవడం.
5. ఆఫీసు పనికంటే వారం రోజులు సెలవుల్నే ఎక్కువ ప్రేమించడం.
6. ఓ కొత్త కెరీర్‌ని ప్రారంభించేందుకు అనువుగా ఉంటుంది.
7. రోటీన్‌గా పీలవ్వడం.. బోర్ కొట్టి కొత్తదానికోసం వెతకడం..
8. పిల్లలు సెటిల్ అవ్వడం.. కుటుంబానికి తోడ్పడడం...

ఎగ్జిట్ టిప్స్
మీరూ ఉద్యోగం నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఈ టిప్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే.
1. అప్పులుండొద్దు : మీరు రిటైర్‌మెంట్ తీసుకోవాలంటే అప్పులుండొద్దు. మీ డెడ్‌లైన్‌లోపు తీసుకున్న అప్పులు, లోన్లు తిరిగి చెల్లించేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే మీ లోన్ బుక్ క్లీన్‌గా ఉండాలన్నమాట.
2. మెడికల్ ఇన్స్యూరెన్స్ : వైద్యం అందని ద్రాక్ష అయిన ఈ రోజుల్లో మెడికల్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి. మీకూ.. మీ కుటుంబానికి.
3. క్యాష్ ఫ్లో : మీరు రిటైర్‌మెంట్ తీసుకున్న తర్వాత కూడా రెగ్యులర్‌గా మీకు క్యాష్‌ఫ్లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఫిక్సిడ్ రిటర్న్స్ ఎక్కువగా ఉండాలి.
4. పెన్షన్ ప్లాన్స్ : ముందు నుంచే పెన్షన్ ప్లాన్ చేసుకోవడం వల్ల మీ రిటైర్‌మెంట్ నాటికి మూలనిధి అందుబాటులోకి వచ్చి మీకు ఉపయోగపడుతుంది.
5. ట్యాక్స్ ఎఫిషియన్సీ : ఇన్‌కమ్ ట్యాక్స్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీ రిటైర్‌మెంట్ తర్వాత మీరు పొందే ఆదాయానికి కూడా మీరు వివిధ రకాలుగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సో.. ఆ ఆప్షన్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.

హ్యాపీ రిటైరింగ్ ఎర్లీ! ఆల్ ది బెస్ట్!!
 

0 comments: