శ్రీరామనవమి పర్వదినాన.. రామాలయం బ్లాగు ప్రారంభమైంది. నల్గొండ పట్టణంలోని రామగిరిలో ఉన్న రామాలయం రెండో భద్రాద్రిగా పేరుగాంచింది. దీనికి చాలా చరిత్ర ఉంది. దాదాపు 300 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు. మొదట ఈ దేవాలయం పట్టణంలోని మాల్‌బౌళి సమీపంలో ఉండేది. కొంతకాలం అనంతరం ఈ ప్రాంతంలో అనాచారాలు, దుష్కర్మలు జరగడంతో శ్రీ స్వామి వారు శ్రీ కంభంమెట్టు శేషాచార్యుల అన్నదమ్ములకు కలలో కనిపించి నన్ను వేరే ఎక్కడైనా ప్రతిష్టించాలని కోరుకున్నారనే ప్రచారం ఉంది. దీంతో ఒక మంచి ముహుర్తం చూసుకుని నల్గొండ సమీపంలోని పానగల్లు గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో గరుడ పక్షి వచ్చి శకునంగా వాలి భూమికి ముక్కు తుడిచి వెళ్లిందని, అప్పుడు వారు ఈ పక్షి దష్టాంతరం తెలుసుకునేందుకు కొందరు వ్యక్తులను తీసుకెళ్లి గడ్డపారలతో తవ్వగా ఆ ప్రదేశంలో ప్రస్తుతం ఉన్న దేవాలయానికి కావాల్సిన రాయి, తదితర వస్తువులు దొరకడంతో సుమారు 200 సంవత్సరాల క్రితం దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయంలో శ్రీ సీతారామ, లక్ష్మణ, భరత, శతృఘ్న, హన్మంత సమేతంగా ప్రతిష్టంచడంతో ఈ ప్రాంతానికి రామగిరి అనే నామకరణం చేశారు.
మొదట్లో ఈ దేవాలయంలో గర్భగుడి మాత్రమే ఉండగా ప్రస్తుతం ఆండాళ్ దేవత, సీతారాముల విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయస్వామి విగ్రహాలు, రాజగోపురం, కళ్యాణమండపాలతో యజ్ఞశాతలతో దేవాలయం ప్రస్తుతం నిత్య పూజలతో భక్తుల మధ్య విరాజిల్లుతున్నది. 1956 పూర్వం దేవాలయం అసంపూర్తిగా ఉండడంతో ఆనాటి డిప్యూటి కలెక్టర్ కన్నయ్య భార్య శ్రీమతి రిందాదేవి నిర్మాణం చేయించారు. రిందాదేవికి అండాళమ్మ కలలో ప్రత్యక్షమై దేవాలయం నిర్మించమని కోరగా అండాళమ్మ దేవి విగ్రహాన్ని ప్రతిష్టంచారు. ఈ ఆలయం గురించి అనేక కథలు ప్రచారంలో ఉండగా మొదట ఈ దేవాలయంలో కంభమెట్లు అనంతాచార్యులు, శేషాచార్యులు గర్భగుడిని నిర్మించినట్లు పూర్వికులు చెబుతున్నారు.
దీనికి సంబంధించిన బ్లాగుని.. ఏప్రిల్ 1న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఇందులో రామాలయానికి సంబంధించి రకరకాల ఫోటోలు.. గోదా కల్యాణం ఫోటోలు.. వీడియోలు ఉన్నాయి. మీరూ ఈ బ్లాగ్‌ని దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Comments