ఈలకు.. స్వరాలు అద్ది..
శృతిలయలు కలిపి.. గమకాలు పలికించి..
ఈలపాటా ఒక పాటే అని నిరూపించాడు.
అన్నమయ్య కీర్తనలకు... ఘంటసాల గాత్రానికి..
తన ఈలతో కొత్త జీవం పోశాడు.
అలాంటి విజిల్ మ్యాస్ట్రో రమణతో ములాఖాత్ ఇది.
రూపాయి బిళ్ల గాల్లోకి ఎగిరింది. నేలకు సమాంతరంగా చాపిన అరచేతిలో పడింది. ఇంకో చేత్తో దాన్ని మూసేశాడు రమణ. తెరిచి చూడాలంటే భయం. బొమ్మా బొరుసా? లబ్ డబ్.. లబ్ డబ్.. చేతుల మధ్య బిళ్ల కూడా ఎగురుతోంది. బొమ్మయితే బీఏ.. బొరుసయితే ఎమ్మెస్సీ. అదేంటి ఎమ్మెస్సీ చదవాలంటే బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి కదా?! ఎంబీబీఎస్ చదివి.. మెడికల్ షాపు పెట్టుకున్నట్లు.. బిఎస్సీ పూర్తయ్యాక మళ్లీ బీఏ చదవడం ఎందుకు? అక్కడే ఉంది ట్విస్ట్. అది అతని జీవితంతో ముడిపడి ఉంది. భవిష్యత్‌ని నిర్ణయించబోతోంది?
ఏడాది క్రితం..
సికింవూదాబాద్ పీజీ కాలేజ్.. రమణ అక్కడ బీఎస్సీ చదువుతున్నాడు.
‘రేయ్.. ఎస్‌పీ కాలేజ్‌లో సింగింగ్ కాంపిటీషన్ జరుగుతోంది. నువ్వు తప్పకుండా పాల్గొనాలి’ అన్నాడు స్నేహితుడు.
‘లేదు.. అది పెద్ద కాలేజ్. చాలామంది వస్తారు. నేను పాల్గొనను’ అన్నాడు రమణ.
‘అదేంటి అలా అంటావ్.. లేదు లేదు నువ్వు పాల్గొంటున్నావంతే. నువ్వు తప్పకుండా గెలుస్తావ్. నాకు నమ్మకం ఉంది. అందుకే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కట్టేశాను’ బదులిచ్చాడు రమణ స్నేహితుడు.
‘లేదు రా.. నా గొంతు బాగాలేదు. నేను పాడలేను. పాడినా గెలవలేను. అయినా నన్నడగకుండా ఫీజు కట్టెయ్యడమేంట్రా? ’ ప్రశ్నించాడు రమణ.
‘నమ్మకం. నీమీద.. నీ పాట మీద.. చిన్నప్పటి నుంచి నువ్వు పాల్గొన్న ఏ కాంపిటీషన్‌లోనూ ఓడిపోలేదు. నువ్వు తప్పకుండా గెలుస్తావ్’ ఎంకరేజ్ చేశాడు ఫ్రెండ్.
‘అవన్నీ చిన్న చిన్న కాలేజ్ ఫంక్షన్స్. ఇది పెద్దది.. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్. చాలా మంది వస్తారు’ తప్పించుకోవాలని చూశాడు రమణ.
‘లేదు. నా మీదొట్టు. రేపే పోటీ. నువ్వు పాడుతున్నావంతే’ తప్పదని చెప్పాడు మిత్రుడు.
ఎస్‌పీ కాలేజ్..
ఆ సాయంత్రం.. సందడిగా ఉంది. వందల మంది పాడడానికి వచ్చారు. అందులో రమణది 70వ నెంబర్. పార్కులో కూర్చుని గొంతు సవరించుకున్నాడు రమణ. జలుబు.. గొంతు తేడాగా ఉంది. ఇలా పాడితే గెలుస్తానా? చిన్న అనుమానం. అయినా పాడడానికి ప్రయత్నిస్తున్నాడు.. శివరంజని సినిమాలో పాట.. అభినవ తారవో... నా.. అభిమాన తారవో... గొంతు సహకరించడం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు రమణకి. అయినా పాడుతూనే ఉన్నాడు. ఆపేశాడు. ఏదో మెరపులాంటి ఆలోచన. అదే పాటని ఈలపాటగా పాడడం మొదపూట్టాడు. ‘రేయ్.. అదేంట్రా అలా పాడుతున్నావ్?’ అడిగారు
స్నేహితులు.
‘స్టేజి మీద ఇలా పాడితే ఎలా ఉంటుంది?’ సలహా అడిగాడు రమణ.
‘చాలా బాగుంటుంది. కానీ ఒప్పుకుంటారంటావా?’ డౌటొచ్చింది మిత్రులకి. పద అడుగుదామని బయలుదేరారు.
‘వాయిద్యాలు ఏవీ వాడకూడదని చెప్పాం కదా?’ అంటూ నోటీసు బోర్టు వైపు చూపించాడు నిర్వాహకుడు.
Note : Dont use any instruments. అని పెద్ద అక్షరాల్లో రాసి ఉంది.
‘సార్! నేను విజిల్ వాడను. నోటితోనే విజిల్ వేస్తూ పాడతాను’ చెప్పాడు రమణ.
‘అలాగా.. అయితే ఓకే’ అన్నాడు నిర్వాహకుడు.
అభినవ తారవో.. నా.. అభిమాన తారవో.. (ఈలపాట) పాట అందుకున్నాడు రమణ.
అప్పటి వరకు పాటలు వినీ వినీ.. మాడిపోయిన జడ్జీల మొహాల్లో ఏదో వెలుగు. ఒక ఫ్రెష్ వాయిస్. కొత్తగా ఉంది. అంతా నిశ్శబ్దం. కేవలం ఒక విజిల్ మాత్రమే ఆ హాలులో వినిపిస్తోంది. కళ్లు మూసుకున్నారంతా. పాట అయిపోయింది. చప్పట్లు మొదలయ్యాయి. ఇంకో పాట పాడమన్నారు ఆహుతులు.
తకిట తదిమి... తకిట తదిమి తందానా... హృదయలయల జతుల గతుల తిల్లానా..
మళ్లీ ఫస్ట్ ఫ్రైజ్..

ప్రస్తుతం..
నల్లకుంట... శంకర్‌మఠ్.. రమణ చేయి తీశాడు. రూపాయి బిళ్ల.. బొమ్మ పడింది. ‘యాహు..’ అని ఎగిరి గంతేయాలనిపించింది. కానీ నాన్న గుర్తొచ్చాడు. రూపాయి మళ్లీ ఎగరేశాడు. అలా మూడుసార్లు బొమ్మే పడింది. ఇక ఆలోచించకుండా తెలుగు యూనివర్సిటీకి బయలుదేరాడు. ఇంటర్వ్యూకి వచ్చినవారందరూ హాల్లో కూర్చుని ప్రాక్టీస్ చేస్తున్నారు. తకిట తదిమి.. అని కొందరు. తాళం వేస్తూ ఇంకొందరు. కొంచెం ట్రెడిషనల్‌గా ఉంటుంది కదా అని.. లాల్చీ, పైజామా వేసుకుని వెళ్లాడు రమణ. కానీ అక్కడ అలాంటి వారెవ్వరూ కనిపించలేదు. ‘ఎక్కడ సంగీతం నేర్చుకున్నావ్?’ అడిగాడు ఒక కుర్రాడు. ‘నేనెక్కడా నేర్చుకోలేదు. నేర్చుకోవడానికే వచ్చా’ సమాధానమిచ్చాడు రమణ. ‘అదేంటి సంగీతం పరిచయం లేకుండానే ఇంటర్వ్యూలో నెగ్గుతానన్న నమ్మకమా?’ ఎగతాళిగా అన్నాడు ఆ కుర్రాడు. ‘నమ్మకమే. నా మీద నాకు’ బదులిచ్చాడు. పైకి గంభీరంగా ఉన్నా లోపల మాత్రం భయంగానే ఉంది రమణకి. ఒకరి తర్వాత ఒకరు ఇంటర్వ్యూకి వెళ్లి వస్తున్నారు. రమణ వంతు వచ్చింది.
లోపలికి అడుగు పెట్టాడు. ‘రావోయ్ రా.. సాగర సంగమంలో కమల్‌హాసన్‌లా తయారయ్యావు. సంగీతం ఏమాత్రం తెలుసేంటి సామజవరగమనా?’ దీర్ఘం తీశాడు ఒక పెద్దాయన.
‘గురువుగారూ! నాకు సంగీతం రాదండి. నేర్చుకుందామని వచ్చాను’ చెప్పాడు రమణ.
‘అదేంటోయ్ సంగీతం రాకుండానే వచ్చావూ.. వర్ణాలు ఓనమాలు కూడా రావా ఏంటి సామజవరగమనా?’ కోపంగానే అడిగాడు.
‘రావండి’ తలదించుకుని చెప్పాడు రమణ.
‘శృతి.. లయలు కూడా తెలియవన్నమాట.. బావుందోయ్ బావుంది. సంగీతమంటే ఏమనుకున్నావ్?.......’ (శంకరాభరణం సినిమాలో జేవీ సోమయాజులులా రమణకి) క్లాస్ పీకాడు ఆ పెద్దాయన.
చివరగా ‘మరి ఏమొచ్చు?’ అని అడిగాడు పెద్దాయన.
‘పాటొచ్చండి’
‘ఏదీ పాడు’...
‘మల్లియలారా.. మాలికలారా..’
‘సావజవరగమన... బావుందోయ్.. బావుంది. కానీ సంగీతంలో ఓనమాలన్నా వచ్చి ఉంటే బావుండేది’
‘గురువుగారు.. ఒక విన్నపం. ఇదే పాటని ఈలపాటగా పాడగలను’
‘ఏంటీ ఈలపాటా? అదేంటి పాడుచూద్దాం..’
‘మల్లియలారా.. మాలికలారా..’(ఈలపాట)
‘తస్సాదియా.. వినసొంపుగా ఉంది సావజవరగమనా! వినికిడి జ్ఞానం అద్భుతంగా ఉంది నీకు. ఇక స్వరజ్ఞానం మీద పట్టు సంపాదించాలి.. కష్టపడతావా?’
‘కష్టపడి నేర్చుకుంటాను గురువుగారు’
- లిస్ట్‌లో ఫస్ట్ పేరు ఎం. వెంకటరమణాడ్డి. బీఏ ఫస్ట్ ఇయర్.. వయొలిన్.. థియరీ క్లాసులు.. మొదలయ్యాయి. అంతా అయోమయంగా ఉంది రమణకి. మనసులో ఏవో అపశృతులు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కాలేజ్‌లో ఒక గోడపై.. కె.వి. శ్రీనివాస్ = కె.జె. యేసుదాస్ అని రాసి ఉంది. ఓహో అంత గొప్పగా పాడతాడేమో. ఆయన దగ్గర నేర్చుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించాడు రమణ. శ్రీనివాస్ రమణకి సీనియర్. సంగీతంలో ఓనమాలు నేర్పించడానికి ఒప్పుకున్నాడు. రోజూ శ్రీనివాస్‌తో తిరుగుతూ.. నేర్చుకుంటూ.. వర్ణాలు.. ఓనమాలు.. శృతి.. లయలు.. గమకాలు.. అన్నీ నేర్చుకున్నాడు. ఫైనల్ ఇయర్ వచ్చే సరికి కాలేజ్ ఫస్ట్ వచ్చాడు. (శ్రీనివాస్ అంటే ఇప్పుడు సినిమా గాయకుడు నిహాల్. ‘పోకిరి’ సినిమాలో గలగల పారుతున్న గోదారిలా.. పాట పాడాడు)
www
ఎంఏ అయిపోయింది.. మ్యారేజ్ కూడా అయింది. హ్యాపీగా ఉంది రమణ లైఫ్. కానీ సంగీతం? అడపాదడపా.. అక్కడా ఇక్కడా ఈలపాట పాడుతూనే ఉన్నాడు. ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు.. పాటకు పదును పెడుతూనే ఉన్నాడు. అప్పుడే (199)లో డిఎస్సీ పడింది. పరీక్ష రాసి మంచిమార్కులతో గట్టెక్కాడు. ఐదు మ్యూజిక్ టీచర్ పోస్టులున్నాయి. తాను పుట్టి పెరిగింది భువనగిరిలోనే కాబట్టి అక్కడే ఉద్యోగం చేయాలనుకున్నాడు. కానీ.. నల్గొండ రామగిరి గర్ల్స్ హైస్కూల్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడా ప్రోగ్రామ్‌లు ఇస్తూ ఫేమ్ అయ్యారు. ఆ తర్వాత కె.వి. రమణాచారి ప్రోత్సాహంతో లక్నో, కేరళలలో ప్రోగ్రామ్‌లు ఇచ్చాడు. అంతటా ఈలపాటకు విశేష ఆదరణ లభించింది. దేశవిదేశాల్లో పోగ్రామ్‌లు ఇచ్చారు. కొండా లక్ష్మీకాంతాడ్డి సహకారంతో విజ్ఞాన్ సరోవర్ ఆధ్వర్యంలో ఐదు ఆడియో ఆల్బమ్‌లు చేశాడు. మన దేశంలోనే కేవలం ఈలపాటతో రూపొందిన ఆల్బమ్‌లు రూపొందించడం ఇదే ప్రథమం. ఆయన పాటలకు ముచ్చటపడింది.. ప్రముఖ ఆడియో కంపెనీ టీ సిరీస్. అందుకే ఎఆర్ రెహమాన్ హిట్ సాంగ్స్‌ని రమణ ఈలతో నింపి ఆడియో ఆల్బమ్‌ని విడుదల చేసింది.
ఈలకి భాష అక్కర్లేదు. అందుకే రమణ పాట దేశ విదేశాలు దాటింది. ఆయన కళ గురించి మనలో చాలామందికి తెలియకపోవడం.. గుర్తింపుకు నోచుకోకపోవడం.. బాధాకరం.
సరిగమలు
పూర్తి పేరు : ఎం. వెంకట రమణాడ్డి
పుట్టిపెరిగింది : భువనగిరి, నల్గొండ
తండ్రి : దామోదర్ రెడ్డి
చదువు : పోస్ట్‌క్షిగాడ్యుయేషన్ ఇన్ కర్నాటిక్ మ్యూజిక్ (ఓకల్)
ప్రస్తుతం : సంగీతంలో ఎంఫిల్
ఆల్బమ్‌లు
1. ఎ.ఆర్. రెహమాన్ హిట్స్ ఇన్ విజిల్ -టీ సిరీస్
2. విజ్ఞాన్ సరోవర్‌తో కలిసి 5 ఆడియో ఆల్బమ్‌లు (అన్నమయ్య కీర్తనలు, డా. సినారె స్పెషల్, ఇళయరాజా స్పెషల్, చిత్ర స్పెషల్, ఘంటసాల స్పెషల్)
3. మద్రాస్ రికార్డింగ్ కంపెనీ సరగమ్‌తో కలసి నాలుగు ఆడియో క్యాసెట్లు
4. జెమినీ టీవీలో ప్రసారమైన ‘అనగనగా ఒక కథ’ సీరియల్‌కి ప్లేబ్యాక్
ప్రదర్శనలు
1. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ మద్రాస్ మ్యూజిక్ సీజన్
2. క్విట్ ఇండియా.. (ఫర్ దూరదర్శన్.. నాలుగు సార్లు ప్రసారం చేసింది)
3. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నేషనల్ యూత్ ఫెస్ట్ - క్యాలికట్
4. నేషనల్ యూత్ ఫెస్టివల్ - లక్నో
5. తిరుమల బ్రహ్మోత్సవాలు
విదేశీ ప్రదర్శనలు
1. చికాగో తెలుగు సంబరాలు - చికాగో
2. నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ కల్చరల్ ప్రోగ్రామ్ - ఫ్లోరిడా
3. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా కల్చరల్ నైట్ - లాస్ ఏంజెల్స్
4. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కల్చరల్ ప్రోగ్రామ్స్ (న్యూజెర్సీ, న్యూయార్క్, మ్యారిల్యాండ్ వాషింగ్టన్ డీసీ)
అవార్డులు
1. ఈలపాట రఘురామయ్య మెమోరియల్ అవార్డు
2. బెస్ట్ మ్యుజీషియన్ డిస్ట్రిక్ట్ యూత్ అవార్డ్
Comments