కంప్యూటర్‌లో డేటాని బ్యాకప్ తీసుకోవడం చాలా సులభం. అందుకు డీవీడీలు, పెన్‌డ్రైవ్‌లు, ఎక్స్‌టర్నల్ డిస్కులు ఉపయోగపడతాయి. కానీ అవి ఎంతకాలం భద్రంగా ఉంటాయనేది కచ్చితంగా చెప్పలేం. దీనికి ప్రత్యామ్నాయంగా పాపులర్ అవుతున్నదే ఆన్‌లైన్ బ్యాకప్ సర్వీస్. దీంతో ఒక్కసారి కమిట్ అయితే దాని మాట అదే వినదు. మీ ప్రమేయం లేకుండానే మీ డాటాని అనుక్షణం బ్యాకప్ చేస్తూ సేఫ్‌గా ఉంచుతుందన్నమాట. అలాంటి ఆన్‌లైన్ బ్యాకప్ సర్వీసుల గురించే ఈ బిగ్ స్టోరీ.
మీ కంప్యూటర్ హార్డ్‌డిస్క్ డేటాతో నిండిపోయింది. ఏం చేస్తారు? ఇమేజ్‌లన్నింటికీ ఒక డీవీడీలోకి, టెక్ట్స్ ఫైల్స్‌నన్నింటినీ ఇంకో డీవీడీలోకి రైట్ చేసి పెడతారు. లేదంటే ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్‌లో సేవ్ చేసుకుంటారు. గీతలు పడితే సీడీ, డీవీడీ ఓపెన్ కాకపోవచ్చు. వైరస్ సోకితే ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్‌లో ఫైల్స్ కరప్ట్ అయిపోవచ్చు. సో.. అవి ఎక్కువ కాలం మీ డేటాని భద్రంగా ఉంచలేవనేగా? మరేం చేయాలి? దీనికి పరిష్కారం ఉందిప్పుడు. ఇంటర్నెట్ ఆధారంగా మీ డేటానంతటినీ సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇలాంటి క్లౌడ్ సర్వీస్‌లను ఉచితంగా అందిస్తున్నాయి కొన్ని ఆన్‌లైన్ బ్యాకప్ పోర్టల్స్. మరికొన్ని ఎంతో కొంత ఛార్జ్ చేస్తున్నాయి. అంటే ఇవి పెయిడ్ సర్వీసులన్నమాట. ఉచితంగా సేవలందించే వాటిలో తక్కువ సైజు డేటాని, మిగిలిన వాటిలో డబ్బుని వెచ్చించడాన్ని బట్టి ఎక్కువ సైజు డేటాని భద్రపరుచుకునే సదుపాయం పొందవచ్చు.
ఫ్రీ స్టోరేజ్
ఉచితంగా ఆన్‌లైన్ బ్యాకప్ సర్వీస్‌లను అందించే వాటిలో 2జీబీ వరకు డేటాని భద్రపరుచుకోవచ్చు. ఈ సైట్‌ల నుంచి ఒక చిన్న డెస్క్‌టాప్ టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు భద్రపరచాలనుకున్న డేటాని మార్క్ చేస్తే ఆ టూల్ ఆటోమెటిగ్గా ఫైల్స్‌ని క్లౌడ్‌లోకి అప్‌లోడ్ చేస్తుంది. మీ ఫైల్ ఒకసారి ఆన్‌లైన్‌లోకి అప్‌లోడ్ అయిందంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ఎక్కడి నుంచైనా దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాంటి సర్వీసులను అందిస్తున్న వాటి వివరాల్ని పట్టికలో ఇచ్చాం. ఇందులో సుగర్‌సింక్, జుమోడ్రైవ్‌లను చాలామంది వాడుతున్నారు. సుగర్‌సింక్ మ్యాక్, విండోస్ కంప్యూటర్‌లకు అందుబాటులో ఉంటే జుమోడ్రైవ్ ఈ రెంటితో పాటు లైనెక్స్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. డ్రాప్‌బాక్స్ కూడా హాట్ ఫేవరెట్‌గా ఉంది. దీంట్లో ఫైల్ సింక్రనైజేషన్, ఆన్‌లైన్ బ్యాకప్ ఫెసిలిటీలు ఉన్నాయి. కాకపోతే డ్రాప్‌బ్యాక్స్ ఫోల్డర్‌లో ప్లేస్ చేసినవాటిని మాత్రమే బ్యాకప్ తీసుకుంటాయి. త్వరలో ఈ వెర్షన్స్ కూడా డ్రాప్‌బాక్స్ మార్పు చేయనుంది.
పెయిడ్ సర్వీసెస్
అన్‌లిమిటెడ్ డేటాని ఆన్‌లైన్‌లో భద్రపరుచుకునేందుకు కొన్ని పెయిడ్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫోటోలు, ఈమెయిల్స్, డాక్యుమెంట్స్‌తో పాటు మీ కంప్యూటర్ హార్డ్‌డ్రైవ్‌లో ఉన్న ముఖ్యమైన డేటానంతటినీ ఆన్‌లైన్‌లోకి బ్యాకప్ తీసుకోవచ్చు. అలాంటి వాటిల్లో కొన్ని ఇవి.
1. బ్యాక్‌బేజ్ : Set it and forget it
-సెటప్ చేయడం సులభం. కంప్యూటర్ డేటానంతటినీ ఆటోమెటిగ్గా బ్యాకప్ తీసుకుంటుంది.
-మీ కంప్యూటర్‌లో కొత్త ఫోల్డర్‌ని క్రియేట్ చేసి ఏవైనా ఫైల్స్‌ని సేవ్ చేస్తే వీటిని మళ్లీ బ్యాక్‌బేజ్‌లోకి అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త ఫోల్డర్లను, డేటాని కూడా ఆటోమెటిగ్గా బ్యాకప్ తీసుకుంటుంది బ్యాక్‌బేజ్.
-బ్యాకప్ ఫైల్స్‌ని రీస్టోర్ చేసుకోవడం కూడా ఇందులో చాలా సులభం.
2. కార్బోనైట్ : Makes data recovery really simple
-కార్బోనైట్‌లోకి బ్యాకప్ తీసుకున్న తర్వాత కంప్యూటర్‌లోని ఫైల్స్, ఫోల్డర్లపై కలర్ డాట్స్ కనిపిస్తాయి. అంటే అవి కార్బోనేట్ బ్యాకప్‌లో ఉన్నాయని చూడగానే అర్థమైపోతుంది. డాట్ లేదంటే వాటిని మీరు బ్యాకప్ చేయలేదన్నమాట.
-ఐఫోన్, బ్లాక్‌బెర్రీల కోసం ప్రత్యేకమైన కార్బోనేట్ అప్లికేషన్లు ఉన్నాయి.
-విండోస్ ఎక్స్‌ప్లోరర్‌ని ఉపయోగిస్తూ రీస్టోర్ చేసుకునే వీలుంది.
3. మోజీ : The original cloud backup service
-మీ ఫైల్స్‌ని, డాక్యుమెంట్స్‌ని మోజీ ఆటోమెటిగ్గా ‘సెట్స్’గా గ్రూప్ చేస్తుంది. దీంతో డాక్యుమెంట్లు, ఈమెయిల్స్, ఫోటోలు, మ్యూజిక్ ఫైల్స్ స్టఫ్‌ని ఆన్‌లైన్‌లోకి బ్యాకప్ చేయడం సులభమవుతుంది.
-మోజీ ఆన్‌లైన్ బ్యాకప్‌కి అడిషనల్‌గా డేటాని ఎక్స్‌టర్నల్ డిస్క్‌లోకి బ్యాకప్ తీసుకునే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.
-ఫైల్స్‌ని బ్యాకప్ చేయడం, చేసినవాటిని రీస్టోర్ చేయడానికి ఈజీ స్టెప్స్ మోజీలో ఉన్నాయి.
4. ఐడ్రైవ్ : For quick and easy backups
-ఐడ్రైవ్‌లో బ్యాకప్ చేయడం మొదలెడితే మీ కంప్యూటర్ ఫైల్స్‌కి ఫోల్డర్‌ట్రీని ఆఫర్ చేస్తుంది. వాటిని సెలక్ట్ చేసుకుంటే ఫోల్డర్స్ బ్యాకప్ అవుతాయి.
-విండోస్ ఎక్స్‌ప్లోరర్‌లో మౌస్ రైట్ క్లిక్ బటన్ ద్వారా ఫైల్స్‌ని ఐడ్రైవ్ బ్యాకప్ స్టోరేజ్‌లోకి యాడ్ చేయొచ్చు.
-ఐడ్రైవ్ డెస్క్‌టాప్ క్లైంట్ ద్వారా బ్యాకప్ డేటాని రీస్టోర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ ప్లాన్ ద్వారా సింగిల్ అకౌంట్‌తో మల్టిపుల్‌గా కంప్యూటర్ డేటాని బ్యాకప్ చేసుకోవచ్చు.
5. క్రాష్‌ప్లాన్ : One backup service for all platforms
శకాష్‌ప్లాన్‌లో సోషల్ బ్యాకప్ ద్వారా మల్టీపుల్ లొకేషన్స్‌లోకి డాటాని బ్యాకప్ చేసుకోవచ్చు. క్లౌడ్‌లోకి గానీ, ఇంట్లోని ఇంకో కంప్యూటర్‌లోకి, ఆఫీసులోని కంప్యూటర్‌లోకి లేదా ఇంటర్నెట్ ఉన్న ఇతర ఏ కంప్యూటర్‌లోకైనా బ్యాకప్ చేసుకోవచ్చు.
శకాష్‌ప్లాన్ డెస్క్‌టాప్ క్లైంట్ మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా డేటాని బ్యాకప్, రీస్టోర్ చేసేందుకు ఆప్షన్స్‌ని తెలియజేస్తుంది.
-విండోస్, మ్యాక్, లైనక్స్ ప్లాట్‌ఫామ్స్‌ని క్రాష్‌ప్లాన్ సపోర్ట్ చేస్తుంది.
6. జంగిల్ డిస్క్ : Metered online storage
-జంగిల్ డిస్క్ అమేజాన్ ఎస్3 క్లౌడ్ స్టోరేజ్‌ని ఉపయోగించుకుంటుంది.
-మల్టీపుల్ కంప్యూటర్లతో యాక్సెస్ చేసుకోవడానికి సింగిల్ లైసెన్స్ చాలు.
-ఇది విండోస్, మ్యాక్, లైనక్స్ ప్లాట్‌ఫామ్స్‌ని సపోర్ట్ చేస్తుంది.
7. సుగర్ సింక్ : Backups from any mobile device
-ఇదో రియల్ టైమ్ బ్యాకప్ సర్వీస్. ఏ ఫైల్‌ని బ్యాకప్ చేసినా మానీటర్డ్ ఫోల్డర్‌గా మారిపోతుంది.
-బ్యాకప్ ఫైల్స్‌ని వెబ్ నుంచే కాకుండా మొబైల్ డివైజెస్ నుంచి యాక్సెస్ చేసుకునేందుకు యాప్స్ ఉన్నాయి.
-విండోస్ ఎక్స్‌ప్లోరర్‌తో ఇంటిగ్రేట్ అయి ఉండదు కాబట్టి కొత్త ఫోల్డర్స్‌ని బ్యాకప్ చేయడం కాస్త కష్టమే.
8. జుమో డ్రైవ్ : Simple and elegant
-వాడుకోవడం చాలా సులభం.
-జస్ట్ రైట్ క్లిక్ చేసి మీ ఫైల్‌నే కాదు... మీ కంప్యూటర్‌నే బ్యాకప్ చేసేయొచ్చు.
-బ్యాకప్ తీసుకున్న ఫైల్స్ జిప్ ఆర్వైవ్స్‌లో ఉంటాయి. వాటిని మాన్యువల్‌గా ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవాల్సిందే.
ఏది వాడాలి?
ఇన్ని సర్వీసుల మధ్య దేన్ని వాడాలని అనుమానం రావొచ్చు. మీ డేటా, మీరు వెచ్చించే సొమ్ముని బట్టి మీరు దేన్నయినా ఎంచుకోవచ్చు. మరీ పటిక్యులర్‌గా చెప్పాలంటే మ్యాక్ లేదా విండోస్ పీసీల డేటాని సింపుల్‌గా బ్యాకప్ చేసేందుకు బ్యాక్‌బ్లేజ్ బావుంటుంది. ఇండివిజ్యువల్ ఫైల్స్‌ని, ఫోల్డర్లని సెలెక్ట్ చేయకుండానే బ్యాకప్ చేసుకోవచ్చు. అన్‌లిమిడెట్ స్టోరేజ్‌ని ఇది అందిస్తోంది. కాకపోతే రీస్టోర్ చేసుకునేందుకు మాత్రం అంత కన్వినెంట్‌గా ఉండదు. సుగర్‌సింక్ కూడా బావుంటుంది. మల్టిపుల్ కంప్యూటర్లు, ప్లాట్‌ఫామ్‌ల మీద ఇది పనిచేస్తుంది. క్రాష్‌ప్లాన్, కార్బోనేట్ కూడా సేఫ్‌గానే ఉంటాయి.
లేటెస్ట్ క్లౌడ్ ‘కుబ్బీ’
రిమోట్ యాక్సెస్ పోర్టల్ ‘లాగ్‌మీఇన్’ కూడా తాజాగా క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్‌ని అందుబాటులోకి తెచ్చింది. ‘కుబ్బీ’ పేరుతో అందుబాటులో ఉన్న ఈ సర్వీసు ద్వారా 5జీబీ వరకు ఉచితంగా డేటాని బ్యాకప్ చేసుకోవచ్చు. దీని ద్వారా మ్యాక్, విండోస్ పీసీలు, ఐప్యాడ్‌లు, ఐఫోన్‌లతోపాటు ఇతర ఆండ్రాయిడ్ డివైజ్‌లలో కూడా డేటాని పొందొచ్చు. ఫైల్స్ బ్యాకప్‌తో పాటు సింక్రనైజ్, షేర్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి ఇది బేటా పీరియడ్‌లో ఉంది. ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే డ్రాప్‌బాక్స్, ఐక్లౌడ్‌లకు పోటీ కానుంది.
Comments