ఆపరేషన్ డ్రంకెన్ డ్రైవింగ్ Stay Alive,Don’t Drink And Drive

By | July 04, 2012 2 comments

తాగడం తప్పు కాదు.. కానీ తాగి వాహనం నడపడం తప్పే.. డ్రంకెన్ డ్రైవింగ్ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ..పోలీసులూ సీరియస్‌గానే డీల్ చేస్తున్నారు.. తాగి నడిపితే బుక్ చేసి కోర్టుకు పంపిస్తున్నారు.. పేరెంట్స్‌ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు..ఆ తప్పు చేసిన వారి అనుభవాలను ఇక్కడ ‘మిక్స్’ చేస్తున్నాం...మీతో ‘మ్యాచ్’ చేసుకుని అర్థం చేసుకుంటే చాలు. 

15 రోజుల క్రితం.. షిరిడీకి వెళ్తూ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో బస్సు లోయలో పడింది. ఆ ప్రమాదంలో 30 మంది చనిపోయారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడని ప్రయాణికుల్లో ఒకరైన జ్యోతి చెప్పింది. ఈ సంఘటనలో జ్యోతి ఆరోపణని అనుమానించినా.. డ్రైవర్ ‘మత్తు’లో ఉండడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు చాలా సంఘటనలు ఆధారంగా ఉన్నాయి. అందుకే మద్యం సేవించి వాహనం నడపొద్దు. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఆ హ్యాంగోవర్ పట్ల హైదరాబాద్ పోలీసులు యాంగర్‌గా ఉన్నారు. ఆరు నెలలుగా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎగెనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ (మద్యం సేవించినందుకు దావా)’ పేరుతో స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నారు. రోజుకు సగటున 110 మందిని పట్టుకుని కోర్టుకు పంపిస్తున్నారు. అలా వెళ్లి ఫైన్ కట్టిన వాళ్ల అనుభవాలేంటి? వాళ్లు మళ్లీ తాగుతారా? ఇది తెలుసుకునేందుకు ఎల్బీనగర్‌లోని రంగాడ్డి జిల్లా కోర్టులో కొందరిని పలుకరించాం.

కోర్టు సీన్‌కు ముందు...
ఎల్బీనగర్ రింగ్ రోడ్.. గ్రీన్‌ల్యాండ్ కేఫ్ ముందు.. హయత్‌నగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వస్తున్న వాహనదారుల్ని ట్రాఫిక్ పోలీసులు చెక్ చేస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్లు పెట్టి ఊదమంటున్నారు. రెడ్ సిగ్నల్ పడింది. వాహనాలు ఆగాయి. పోలీసుల్ని చూసి ఒకతను తన టూవీలర్ వెనకాల ఉన్న వేరే అతనికి ఇచ్చి అక్కడి నుంచి పరుగుతీశాడు. బహుశా.. సిగ్నల్ దాటాక కాస్త ముందుకు వెళ్లి ఆగుతాడేమో. తర్వాత ఇద్దరు కలిసే వెళ్తారు కాబోలు. ఇంకో కానిస్టేబుల్ ప్యాషన్ ప్లస్ బైక్ పైనున్నతన్ని బ్రీత్ ఎనలైజర్‌లో ఊదమన్నాడు. అతని కళ్లు ఎర్రగా ఉన్నాయి. అతను ఉఫ్ మని ఊదాడు. ఏ ఫలితమూ లేదు. మళ్లీ ఊదమన్నాడు కానిస్టేబుల్. ఊదాడు.. తాగలేదని నిర్ధారణ అయిపోయింది. కానిస్టేబుల్ ఇంకో బైక్ దగ్గరికి వెళ్లాడు. ఆ యువకుడు నీట్‌గా టక్ చేసుకున్నాడు. అతన్ని ఊదమంటే.. గాలి లోపలికి పీల్చాడు. ‘లోపలికి కాదు.. బయటికి ఊదు’ గట్టిగా అన్నాడు కానిస్టేబుల్. అతను ఊదడానికి ఇబ్బంది పడ్డాడు. మూడో సారి ఊదాక.. బీప్ సౌండ్ వచ్చింది. అతని బైక్ తాళం చెవులు లాక్కుని బండి పక్కకు తీయమన్నాడు కానిస్టేబుల్. అతను దొరికిపోయాడు. స్లిప్ రాసి చేతిలో పెట్టారు. రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టమన్నారు. ‘అ్జంటుగా వెళ్లాలి. మళ్లీ ఇంకెప్పుడూ తాగన’ని అతడు పోలీసుల్ని బతిమిలాడాడు. కానీ ఎస్‌ఐ వదిలిపెట్టలేదు. రేపు ఉదయాన్నే కోర్టుకు రమ్మన్నారు. తల్లిదంవూడుల్ని తప్పనిసరిగా తీసుకురమ్మన్నారు. బండి పోలీస్ స్టేషన్లో పెట్టారు. చేసేందేం లేక.. ఆ యువకుడు ఇంటిదారి పట్టాడు.
మర్నాడు కోర్టులో...
రంగాడ్డి కోర్టు మెయిన్ గేటు నుంచి నేరుగా వెళ్తే.. చివరి కుడివైపు చెట్ల కింద చాలామంది కూర్చుని ఉన్నారు. ఎక్కువమంది డల్‌గా ఉన్నారు. ఎవరిని పలకరించాలో అర్థం కాలేదు. పరిచయస్తుల కోసం వెతికాను. ఒకతను కనిపించాడు. పాతపరిచయం. ‘ఏంటిక్కడ?’ అని అడిగాను. తన వాళ్లకు కాస్త దూరంగా తీసుకెళ్లి ‘కోర్టులో కొంచెం పని ఉంది’ అన్నాడు మెల్లగా. పనేంటో అర్థమైనప్పటికీ ‘ఏం పని?’ అని అడిగాను. చెప్పడానికి కాస్త మొహమాటపడినా.. వదిలేలా లేనని అతనికి అర్థమైనట్టుంది. ఇలా చెప్పాడు.‘నాలుగు రోజుల క్రితం బైక్ కొన్న. రెండేళ్ల కల. కష్టపడి డబ్బు కూడబెట్టుకుని సెకండ్ హ్యాండ్‌లో కొన్నా.

పూజ చేయించడానికి ఫ్రెండ్స్‌తో కలిసి నిన్న యాదగిరి గుట్టకి వెళ్లిన. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ పార్టీ అడిగారు. తప్పలేదు. నేను అంతకు ముందు ఎప్పుడూ తాగలేదు. ఫస్ట్ టైమ్ బీర్ తాగిన. స్ట్రెయిట్‌గా రూమ్‌కి వెళ్తే ఏ సమస్య వచ్చి ఉండేది కాదు. ఫ్రెండ్‌ని డ్రాప్ చేద్దామని ఎల్బీనగర్ వైపు వచ్చాను. పోలీసులు పట్టుకుండ్రు. ఒక్కటే బీర్ తాగినా అన్నా వినలే. కొత్త బైక్ అని చెప్పినా వినలేదు. బైక్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. బొట్లు, పూలదండలు వేసి బైక్‌ని బోనంలా అలంకరించిన. బ్యాడ్‌లక్.. అలా పోలీస్ స్టేషన్లో చూడాల్సి వస్తుందనుకోలేదు. ఇదంతా ఒకటైతే.. ఇప్పుడు రెండువేల ఐదువందల రూపాయలు ఫైన్ కట్టాలి. డబ్బుల్లేవు. అప్పు చేసి తీసుకొచ్చా తప్పదు కదా. పైగా తల్లిదంవూడుల్ని తీసుకురమ్మన్నారు. మా వాళ్లు ఇక్కడెక్కడున్నారు? ఊరి నుంచి తీసుకురావాలి. అదో ఖర్చు. ఏం చేయాలి? మా ఓనర్ అంకుల్‌ను బతిమిలాడాను. ఆయన రానన్నాడు. ఏం చేస్తాం. మా కజిన్ బ్రదర్‌ని రిక్వెస్ట్ చేసిన.. చిన్న పిల్లాడ్ని తీసుకుని మా వదిన కూడా కోర్టుకు రావడం నాకు బాధగానే ఉంది. అందుకే బాస్ డిసైడ్ చేసుకున్న.

జీవితంలో ఇక ఎప్పుడూ తాగనని. ఏదేమైనా నాకు మంచే జరిగింది’పై వ్యక్తి తన వెర్షన్ చెబుతున్నప్పుడు ఇంకొకతను.. పక్కన నిల్చుని వింటున్నాడు. మధ్య మధ్యలో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అవకాశం రాకపోవడంతో ఆగిపోయాడు. అయిపోయాక మొదపూట్టాడు. ‘నాదీ సేమ్ ప్రాబ్లమ్. వీళ్లంతా దోచుకుంటున్నారండి. ఏదో రెండొందులు ఖర్చు పెట్టి తాగిన పాపానికి రెండువేల రూపాయలు కట్టాల్సి వస్తోంది. అయినా తప్పు ఈ ప్రభుత్వానిది కాదంటారా? తాగమని బార్లు తెరుస్తారు. తాగితే.. పట్టుకుని ఫైన్లు వేస్తారు! ఒక్క విషయం నాకు అర్థం కాదు.. తాగడం తప్పు. కరక్టే. కానీ బార్‌ల దగ్గర బైక్ పార్కింగ్ కోసం పర్మిషన్ ఎందుకు ఇస్తారు ఈ పోలీసులు? తాగండి.. బైక్ నడపిండి.. మేం మీ పనిపడతాం అనేగా?..’ అని తన ఫ్రస్టేషన్ అంతా వెల్లగక్కాడు. ఇంతలో ఒక్కొక్కరూ లోపలికి రావాలంటూ పిలిచాడు ఒక పోలీసు. ఒక యువకుడు తనతో పాటు ఒక ముసలావిడని తీసుకుని లోపలికి వెళ్తున్నాడు. ‘ఎవరీవిడ?’ అని అడిగాడు పోలీసు. ‘మా నాయనమ్మ’ సమాధానం చెప్పాడు ఆ అబ్బాయి. ‘ఏమమ్మా నీ మనవడు తాగి బండి నడిపిండు. లోపలికి పోతే మీ ఇద్దరికి శిక్ష పడుతుంది. ఆరునెలలు జైల్లో కూర్చుంటావా?’ అని బెదిరించాడు. ‘ఓ నాయిన! నీకు దండం పెడత సారూ. ఈ పిలగానికి నాకు ఏ సంబంధం లేదు. మా నాయనమ్మ అని చెప్పు వంద రూపాయలిస్తా అంటే వచ్చిన’ అని వెనకడుగు వేసింది. ‘ఏరా అయినవాళ్లని తీసుకురమ్మంటే కిరాయికి తీసుకొస్తావా? నడువ్ లోపలికి నీ పనిచెప్తా?’ అని కుర్రాడిని గద్దించాడు పోలీసు.‘సార్ వద్దు సార్. మా వాళ్లు ఇక్కడ లేరు సార్. అందుకే ఇలా చేశా. ప్లీజ్ సార్ వదిలేయండి’ అని రిక్వెస్ట్ చేశాడు. తర్వాత మిగిలిన వారిలో ఒక్కొక్కరు లోపలికి వెళ్లి ఫైన్ కట్టి వస్తున్నారు. కట్టినట్లు రిసిప్ట్ పోలీస్ స్టేషన్లో చూపిస్తే బైక్ ఇచ్చేస్తారు. అదే వ్యక్తి ఇంకోసారి తాగి వాహనం నడిపితే ఈసారి జైలు తప్పదు. దాదాపు అందరూ ఫైన్ కట్టేసిన తర్వాత జడ్జ్జి గారి ముందు అందర్నీ హాజరు కమ్మన్నారు పోలీసులు. తమ వెంట తీసుకొచ్చిన అక్క బావ, అన్నా వదిన, అమ్మానాన్నలతో బాధితులు జడ్జి వద్దకు నడిచారు. జడ్జి వచ్చిన తర్వాత.. ‘తాగి వాహనం నడపడం తప్పు అని తెలిసిన తర్వాత కూడా మీరు బండ్లు నడుపుతున్నారు. మీలాంటి వారు తాగి నడిపి.. వాళ్లు చావడమే కాకుండా ఎదుటివారినీ చంపుతున్నారు. కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చుతున్నారు. ఇది మీకు అర్థం కావాలనే మీ వాళ్లని ఇక్కడికి పిలిపించాం. ఇది చిన్న తప్పే అని మీకు అనిపించొచ్చు. కానీ మీరు చేసిన తప్పు కారణంగా మీ ఆడవాళ్లు కోర్టుకు వచ్చారు చూడండి.. అందుకు సిగ్గు పడండి.. ఇంకెప్పుడూ తాగమని మనసులో ప్రమాణం చేసుకుని వెళ్లండి. ఏమంటారు?’ అని అడాగారు జడ్జ్జిగారు. అందరూ సిగ్గుతో తలదించుకున్నారు. కాసేపు ఎవరూ మాట్లాడలేదు. హాలంతా నిశ్శబ్దంగా ఉంది. ‘తప్పైంది. క్షమించండి. ఇంకెప్పుడూ తాగి వాహనం నడపం అని చెప్పండి’ అని మెల్లగా చెప్పాడు బంట్రోతు. అప్పుడు అందరూ ‘తప్పైంది సార్. క్షమించండి. ఇంకెప్పుడూ తాగి వాహనం నడపం’ అని గట్టిగా చెప్పారు. ‘ఈ మాట చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు. బంట్రోతు చెప్పాక చెబుతున్నారు. ఛీ.. వెళ్లండి’ అని కసురుకున్నాడు జడ్జి. సో.. డియర్ ఫ్రెండ్స్.. సిగ్గు పడుతూ తలదించుకుని క్షమించమని అడగడానికి మీరు రెడీనా? అందుకే drink but dont drive

2 comments:

G.P.V.Prasad said...

న్యాయాధిపతికి నా అభినందనలు.

nagesh beereddy said...

thank u @ గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు