ఇంట్లో చాలా వైర్లు ఉంటాయి.. కరెంటు వైర్లు.. టీవీ కేబుల్ వైరు... టెలిఫోన్ వైరు.. ఇంటర్‌నెట్ వైరు.. ఇలా చాలా. కరెంటు వైర్లని ఇళ్లు కట్టుకునేప్పుడు గోడ లోపల ఫిక్స్ చేస్తాం. స్టార్ టీవీ వైర్‌ని కూడా అలా చేయొచ్చు. ఇప్పుడు కొందరు కంప్యూటర్ లేకున్నా ముందుగానే ఇంటర్‌నెట్ కేబుల్ వైర్‌ని గోడలో ఫిక్స్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో కంప్యూటర్ కొంటే వైరు కనిపించకూడదని. వైర్లు ఎక్కువగా కనిపిస్తే ఇంటీరియర్ దెబ్బతింటుంది. మరి కంప్యూటర్‌కి చాలా రకాల వైర్లు ఉంటాయి. కొన్ని కాళ్లకు తగులుతుంటాయి. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేందుకే ఇప్పుడు వైర్‌లెస్ టెక్నాలజీ డెవలప్ అవుతోంది.
మార్కెట్‌లో చాలా రకాల వైర్‌లెస్ ప్రొడక్ట్స్ లభిస్తున్నాయి. వస్తువుల అసలు ధర కంటే వీటికోసం మరి కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాకపోతే ఆ ఖర్చు చేసిన డబ్బుకి ప్రతిఫలం ఉంటుంది. మీ ఇల్లు, ఆఫీసు.. ఒక కంప్యూటర్ సర్వర్ రూమ్‌లా కాకుండా గుడ్ లుక్ ఉండాలంటే ఇలాంటివి వాడండి.
1. మౌస్, కీబోర్డ్
కంప్యూటర్‌కీ మౌస్ నుంచి ఒకవైరు, కీబోర్డ్ నుంచి ఒకవైరు ఉంటుంది. ఇవి లేకుండా ఇప్పుడు వైర్‌లెస్ మౌసూ, కీబోర్డులు లభిస్తున్నాయి. ఏదైనా కంప్యూటర్ షాప్‌కి వెళ్లి అడిగి చూడండి. రకరకాల కంపెనీలవి, చాలా రకాల డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. లాగీటెక్, మైక్రోసాఫ్ట్ కంపెనీల వైర్‌లెస్ మౌసు, కీబోర్డులు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. సోలార్ ఎనర్జీతో ఛార్జ్ అయ్యే కీబోర్డులు కూడా దొరుకుతున్నాయి.
2. స్పీకర్స్, హెడ్‌ఫోన్స్
కంప్యూటర్ నుంచి స్పీకర్లకు కనెక్షన్ ఇవ్వాలంటే నాలుగు రకాల వైర్లు అవసరమవుతాయి. ఊపర్లు, బాస్‌లు, హై ఓల్ట్ స్పీకర్లు అయితే మరిన్ని వైర్లు అవసరం. వాటి అవసరం లేకుండా ఎలాంటి వైర్లు లేకుండానే కంప్యూటర్‌కి కనెక్ట్ అయ్యే సౌండ్ సిస్టమ్‌లు వచ్చేశాయి. ఇవి వైర్లు ఉన్న స్పీకర్లకు ఏమాత్రం తీసిపోకుండా సౌండ్ క్వాలిటీని అందిస్తాయి.
3. ప్రింటర్లు
చాలామంది ఇప్పుడు ఇళ్లల్లోనూ ప్రింటర్లు వాడుతున్నారు. ఆఫీసుల్లో అయితే మరి ఎక్కువగా ఉంటాయి. ఇల్లు, ఆఫీసుల్లో ప్రింటర్ల వైర్ల సమస్య పరిష్కారం కోసం వైర్‌లెస్ ప్రింటర్లు వచ్చేశాయి. వీటితో ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే.. వీటిని కంప్యూటర్‌కి దగ్గర్లోనే పెట్టాల్సిన అవసరం లేదు. దూరంగా, వేరే గదిలో కూడా పెట్టుకోవచ్చు. దీని ద్వారా మీకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.
4. అప్లియాన్సెస్
వైర్‌లెస్ టీవీ ట్రాన్స్‌మీటర్లు, వైర్‌లెస్ థెర్మోస్మార్ట్ లాంటి మీడియా అప్లియాన్సెస్ వల్ల మీ ఇంట్లో వైర్లు పెద్దగా కనిపించే అవకాశం ఉండదు. వీటితో స్టీరియోలు, సీడీ, డీవీడీ ప్లేయర్లు కూడా వైర్‌లెస్‌గా వర్క్ చేసే వీలుంటుంది. భవిష్యత్తులో ఇలాంటి అప్లియాన్సెస్ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ పీసీలను కంట్రోల్ చేసే విధంగా కూడా రూపొందనున్నాయి. వీటివల్ల మీ ఇంట్లో మరిన్ని వైర్లు లేకుండా సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.
5. రూటర్
మీ ఇంట్లో రెండు కంప్యూటర్లు ఉన్నాయనుకుందాం. ఇక ల్యాప్‌టాప్, నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్ ఉన్న స్మార్ట్ టీవీ కూడా ఉన్నాయి. అప్పుడు ఒక్కో దానికి రెండు మూడేసి అంటే.. ఆరు నుంచి పది దాకా వైర్లు అవసరమవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఈ వైర్‌లెస్ రూటర్ ఉపయోగపడుతుంది. ఇంటర్‌నెట్ ఆధారంగా పనిచేసే గాడ్జెట్‌లనన్నింటినీ ఈ రూటర్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు. కాకపోతే మీ కంప్యూటర్లకు, ల్యాప్‌టాప్, టీవీలకు వైర్‌లెస్ కార్డ్‌లు ఉండాలి. ఇప్పుడొస్తున్న స్మార్ట్ టీవీలలో ఈ సౌకర్యం ఉంటోంది. ల్యాప్‌టాప్, టాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లలో కూడా ఈ ఫెసిలిటీ ఉంటోంది.
6. స్లీవింగ్స్, వైర్ మేనేజర్స్
ఇంట్లో, ఆఫీసుల్లో కేబుల్స్‌ని, వైర్లని కవర్ చేసేందుకు స్లీవింగ్ మెటీరియల్స్, వైర్ మేనేజర్లు ఉపయోగపడతాయి. వీటితో వైర్లను మాస్క్ చేయడమే కాకుండా, ఆర్గనైజ్ కూడా చేయొచ్చు. రకరకాల వైర్లను ఒకే లైన్‌లోకి తెచ్చి హైడ్ చేయొచ్చు. రకరకాల రంగుల స్లీవింగ్ కవర్లను వాడడం వల్ల మీ ఇంటికి కొత్త లుక్ వస్తుంది. మీకు ఆర్టిస్టిక్ వ్యూస్ ఉంటే వైర్ మేనేజర్లని వివిధ డిజైన్లలో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. మరి వైర్‌లెస్ ఫెసిలిటీ లేని వాటి పరిస్థితి ఏంటి? పవర్ కేబుల్స్, వీడియో ఇన్‌పుట్ కేబుల్స్ వీటిని ఎలా హైడ్ చేయొచ్చు. యస్.. వీటిని కూడా స్లీవింగ్ మెటీరియల్స్‌తో కవర్ చేయొచ్చు. లేదంటే బుక్ కేస్‌లతో కవర్ చేయడం, స్టిక్కర్లు అంటించడం, అడెసివ్ అతికించడం లాంటి పాత పద్ధతులు ఫాలో అయిపోవడమే.
ఇన్ ది ఫ్యూచర్
భవిష్యత్తు వైర్‌లెస్ ఉత్పత్తులు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. ఛార్జర్‌లేకుండానే మీ సెల్‌ఫోన్ ఛార్జ్ అయిపోతుంది. ఇది ఫ్యూచర్లలోనే కాదు. స్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3తో వైర్‌లెస్ ఛార్జింగ్ కేపబిలిటీ ఆల్రెడీ వచ్చేసింది. కాకపోతే భవిష్యత్తులో ఈ ఫెసిలిటీ అన్ని రకాల ఫోన్లకు అందుబాటులోకి రానుంది. ఫ్యూచర్ స్మార్ట్ హౌస్ ఎలా ఉంటుందో తెలుసా?.. కేబుల్ లేకుండానే టీవీలో అన్ని ఛానెల్స్ వస్తాయి. వైర్ లేకుండానే ఇంటర్‌నెట్ కనెక్ట్ అవుతుంది. యస్.. ఇన్ ది ఫ్యూచర్ నో కేబుల్స్.. ఓన్లీ వైర్‌లెస్.
Comments