‘నిన్న చెప్పా పెట్టకుండా పని మానేశావేంటే?’ పనమ్మాయిపై కోప్పడింది యజమానురాలు. ‘అదేందమ్మ గారు! జర ఒంట్లో సుస్తిగుంది. ఇయాళ రాలేనని మెసేజ్ బెట్టినగద. సూస్కో లేదా?’ సమాధానమిచ్చింది పనమ్మాయి. --- సెల్ ఒకప్పుడు కేవలం స్టే టస్ సింబల్. కానీ ఇప్పుడు.. నిత్యావసరం. హస్త భూషణం. పుట్టిన తర్వాత వచ్చి చేరే అవయవం. ఒక ఆర్టిఫిషియల్ ఆర్గాన్. కళ్లు లేని కబోధిలా... కాళ్లు లేని అభాగ్యుల్లా... సెల్ లేని వారు ఇప్పుడు అవిటివారు.. అందుకే ఇప్పుడు తాగడానికి నీళ్లు లేని చోట కూడా నెట్‌వర్క్ దొరుకుతోంది. పదేళ్ల క్రితం ఒక నిముషం మాట్లాడాలంటే రూ. 32.80 బిల్లు పడేది. ఇప్పుడు ఒక పైసాతో నిముషం మాట్లాడొచ్చు. సిమ్‌కార్డ్ ఫ్రీ.. డబుల్ టాక్‌టైమ్...లాంటి బంపర్ ఆఫర్లు. 2011 అంతానికి మన దేశంలో 81.15 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని అంచనా. 120 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఇంత వేగంగా ప్రజలకు చేరువైన సౌకర్యం మరొకటి లేదు. దేశంలోని మొత్తం మరుగుదొడ్ల కంటే మొబైల్ ఫోన్లే ఎక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. అందుకే 1జీ పోయింది. 2జీ స్కామ్‌లో ఉంది. 3జీ ఫామ్‌లో ఉంది. 4జీ రానుంది. చైనా తర్వాత ఇప్పుడు ప్రపంచంలోనే మన మ...