రోటీ, కపడా ఔర్ మొబైల్

By | August 26, 2012 Leave a Comment

‘నిన్న చెప్పా పెట్టకుండా పని మానేశావేంటే?’ పనమ్మాయిపై కోప్పడింది యజమానురాలు. 
‘అదేందమ్మ గారు! జర ఒంట్లో సుస్తిగుంది. ఇయాళ రాలేనని మెసేజ్ బెట్టినగద. సూస్కో లేదా?’ సమాధానమిచ్చింది పనమ్మాయి. 
---
సెల్ ఒకప్పుడు కేవలం స్టే
టస్ సింబల్.
కానీ ఇప్పుడు.. నిత్యావసరం. హస్త భూషణం.
పుట్టిన తర్వాత వచ్చి చేరే అవయవం. ఒక ఆర్టిఫిషియల్ ఆర్గాన్.
కళ్లు లేని కబోధిలా... కాళ్లు లేని అభాగ్యుల్లా... సెల్ లేని వారు ఇప్పుడు అవిటివారు..
అందుకే ఇప్పుడు తాగడానికి నీళ్లు లేని చోట కూడా నెట్‌వర్క్ దొరుకుతోంది.
పదేళ్ల క్రితం ఒక నిముషం మాట్లాడాలంటే రూ. 32.80 బిల్లు పడేది. ఇప్పుడు ఒక పైసాతో నిముషం మాట్లాడొచ్చు. సిమ్‌కార్డ్ ఫ్రీ.. డబుల్ టాక్‌టైమ్...లాంటి బంపర్ ఆఫర్లు.
2011 అంతానికి మన దేశంలో 81.15 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని అంచనా. 120 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఇంత వేగంగా ప్రజలకు చేరువైన సౌకర్యం మరొకటి లేదు.
దేశంలోని మొత్తం మరుగుదొడ్ల కంటే మొబైల్ ఫోన్లే ఎక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. అందుకే 1జీ పోయింది. 2జీ స్కామ్‌లో ఉంది. 3జీ ఫామ్‌లో ఉంది. 4జీ రానుంది.
చైనా తర్వాత ఇప్పుడు ప్రపంచంలోనే మన మొబైల్ మార్కెట్ అతి పెద్దది. అతి వేగవంతమైంది.
వాహ్... భారత్ వెలిగిపోతోంది.
హర్ హాథ్ మే ఏక్ మొబైల్!
ప్రతి పేద చేతిలోనూ ఓ సెల్‌ఫోన్ వెలిగిపోతోంది...
ఆ వెలుగు వారి జీవితంలో కొత్తద్వారాలు తెరుస్తోంది... అనుకోని ఆ వెలుగుతో వాళ్లు నోళ్లు వెళ్లబెట్టారు.
ఆ ఆశ్చర్యంలో గంజి గొంతులోకి జారలేదు. కడుపు ఖాళీగా ఉంది.
అయినా ‘కడుపు నిండా’ మాట్లాడుకుంటున్నారు.
అందమైన కల!?
సెల్‌ఫోన్ రింగయింది. కల చెదిరింది. ఇదంతా కలా?
అవును... కలే. యూపీఏ సర్కారు కన్న కల.
రూపాయికి కిలో బియ్యం.. పావలా వడ్డీకి రుణాల్లా.. పేదలకి ఉచితంగా మొబైల్ ఫోన్ల పంపిణీ పథకం.
60 లక్షలకు పైగా ఉన్న నిరుపేదలకు 7 వేల కోట్ల రూపాయలు వెచ్చించి సెల్‌ఫోన్లు కొనిపెట్టాలన్న ఆలోచనలో ఉందట.
సూపర్!
నెల నెలా 200 నిమిషాల ఫ్రీ టాక్‌టైమ్ కూడా ‘రేషన్’ ఇస్తుందట.
కెవ్వు కేక!!
2014 ఎన్నికల్ని ఎదుర్కొనేందుకిదేదో ప్రజాకర్షణ్ పథకంలా ఉంది.
అవును.. అయితేంటి?
ఐస్‌ముక్కలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు కరిగిపోకుండా.. నిజంగా ఈ పథకం పేదల చేతికి చేరిందనుకుందాం. దేశంలో దాదాపు మూడోవంతు మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు.
ఉన్నా పన్నెండు.. పదిహేను గంటలు.. కోసేస్తోందీ ప్రభుత్వం.
మరి పేదలు ఈ ఫోన్లకు ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి?
అందుకే మీరు రీఛార్జ్ కావాలి.
ఓటు మీ ఆయుధం.
ఈ చీప్ పాలిటిక్స్‌ని ఎదుర్కొనేందుకు రెడీ అవ్వాలి.
(august 26, 2012)

0 comments: