మెంటల్ రిటార్డేషన్ కోసం మెడిటేషన్‌కి... హెల్త్ ఇన్‌ఫ్యాచుయేషన్ కోసం యోగాకి వెళ్లే పెద్దల కోసం

By | August 17, 2012 Leave a Comment

పాలు ఏ చెట్టు నుంచి వస్తాయి? సబ్బులు ఏ ట్రీకి కాస్తాయి?
- అని అడిగే పిల్లల కోసం ఈ స్టోరీ.

మెంటల్ రిటార్డేషన్ కోసం మెడిటేషన్‌కి... హెల్త్ ఇన్‌ఫ్యాచుయేషన్ కోసం యోగాకి వెళ్లే పెద్దల కోసం కూడా. 

మంజిష్ట అనేది సంస్కృత నామం. ఒక విలువైన ఔషధ మూలిక పేరు. రుబియా కార్డిఫోలియా దీని శాస్త్రీయ నామం. ఆయుర్వేదంలో చెట్టంత చరిత్ర ఉంది ఈ మూలికకి. ఆయుర్వేద వైద్యానికి మూల పురుషుడు చరకుడు తన చరక సంహితలో దీని గురించి వర్ణ, జ్వరాహర, విషజ్ఞ అని రాశాడు. మేని ఛాయని పెంచడం, జ్వరాన్ని తగ్గించడం, విషపదార్థాల నుంచి రక్షించడంలో ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. రక్తాన్ని శుద్ధి చేయడం దీని ప్రత్యేకత. ఇదంతా మంజిష్ట మూలిక గురించి.. కానీ మనం చెప్పుకునేది ‘మంజిష్ట’ అనే హెర్బల్ గార్డెన్ గురించి. ఆ తోటలో అన్నీ మంజిష్ట చెట్లే ఉంటాయనుకుంటున్నారా? కానే కాదు.. అలాంటివి ఇంక చాలా ఉన్నాయి.

ఎక్కడుంది?
హైదరాబాద్ మియాపూర్‌కి దగ్గరలో మై హోమ్ జువెల్ అనే పే..ద్ద అపార్ట్‌మెంట్ ఉంది. 24 ఎకరాల స్థలంలో 9 ఎకరాల నిర్మాణం. 14 బ్లాకులు.. 14 ఫ్లోర్లు.. మొత్తం 2016 త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్స్. సుమారు ఎనిమిది వేల మంది అక్కడ నివసిస్తున్నారు. అర్బన్ ఏరియాలో కనిపించే చాలా అపార్ట్‌మెంట్ల మాదిరిగానే అక్కడ స్విమ్మింగ్ పూల్, జిమ్, సూపర్ మార్కెట్, చిల్డ్రన్ ప్లే పార్క్.. లాంటివి ఉన్నాయి. కానీ వీటికి భిన్నంగా రూరల్ వాతావరణానికి దగ్గరగా ఇక్కడ ఒక గార్డెన్ ఉంది. అదే మంజిష్ట.. ది హెర్బల్ గార్డెన్ ఫర్ రెజువనేషన్... పునరుజ్జీవం కోసం ఔషధ వనం. ఇందులో 114 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇన్ని రకాల మొక్కల్ని ఒకే దగ్గర చేర్చి ఆయుర్వేద వనంగా తీర్చిదిద్దడం చాలా అరుదుగా కనిపిస్తున్నది.

ఎందుకిలా?
హైదరాబాద్‌లోనే కాదు చిన్న చిన్న పట్టణాల్లోనూ అపార్ట్‌మెంట్‌లు వెలుస్తున్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా నిర్మించేవాటిని ఒక థీమ్‌తో నిర్మించడం ఒక ట్రెండ్ అయిపోయింది. మంజిష్ట గార్డెన్ ఉన్న మై హోమ్ జువెల్ కూడా అలాంటిదే అంటారు దాని అసోసియేషన్ ప్రెసిడెంట్ రత్నం చౌదరి. ఎందుకంటే ఇందులో ఉండే పద్నాలుగు బ్లాకులకు రూబీ, ఎమెరాల్డ్, టరోస్కీ, డైమండ్ అని... 14 రకాల రాళ్ల పేర్లు ఉంటాయి. అలాగే గోల్ఫ్ కోర్టు, టెన్నిస్ కోర్టు కూడా ఉన్నాయి. ‘మా వెంచర్‌లో 32 శాతం మాత్రమే అపార్ట్‌మెంట్లు నిర్మించాం. చెట్లు ఉంటే వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే మిగిలిన ప్రదేశంలో దాదాపు 250 వేపచెట్లు ఉన్నాయి. అలాగే యోగా, మెడి కోసం మామూలు పార్క్ కాకుండా ఏమైనా చేయొచ్చా అని ఆలోచించాం. దాని నుంచి వచ్చిందే ఈ హెర్బల్ పార్క్ ఐడియా’ అని చెప్పారు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌డ్డి.

ఏమేం మొక్కలున్నాయంటే..
మంజిష్టలో అన్ని రకాల ఔషధ మొక్కలున్నాయి. ఆరు రకాల తులసి చెట్లు, రెండు రకాల వేప, రెండు రకాల కలబంద, రెండు రకాల వావెల్లి, రోజ్‌వుడ్, సపన్ వుడ్, పారిజాతం, శంఘు పుష్పాలు, నైట్‌క్వీన్‌లాంటి పూలమొక్కలు, రకరకాల గడ్డి, గంధాలు, గానుగ, విప్ప, పొగడ, దాల్చిన చెక్క, కిడ్నీ ప్లాంట్, మల్టీ విటమిన్‌లాంటి ఎన్నో రకాలున్నాయి. ముందు ఎన్ని రకాల మొక్కలున్నాయో పరిశోధన చేసింది అసోసియేషన్. వాటిలో మన దగ్గర దొరికే మొక్కల లిస్ట్ రాసుకుని ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడి నుంచి తెప్పించింది. ప్రభుత్వ ఉద్యానవన శాఖ నుంచి, ప్రగతి రిసార్టుల నుంచి ఈ ఔషధ మొక్కలను సేకరించింది. వీటిని ఎవరు పడితే వాళ్లు నాటి పెంచడం అంత సులభమైన విషయం కాదు. అందుకే వీటి బాధ్యతను మొక్కల పెంపకంలో నిపుణుడైన రమేష్ గౌడ్‌కి అప్పగించింది. రమేష్ మొక్కల పెంపకంలో డిప్లొమా చేశాడు. గతంలో ‘అపోలో’లాంటి సంస్థలో పనిచేసిన అనుభవం ఉంది. ట్రీప్లాం కూడా అతనికి అవగాహన ఉంది.

యోగా.. మెడి
‘గ్డాన్‌కి హెర్బల్ గార్డెన్‌కి తేడా ఉంది. ఉదయాన్నే మామూలు పార్కులో యోగ చేసినదానికి హెర్బల్ గార్డెన్‌లో చేసిన దానికి తేడా ఉంటుందంటున్నారు డాక్టర్లు. అందుకే హెర్బల్ గార్డెనింగ్‌లో నిపుణులైన డాక్టర్ దేవేందర్ సహాయంతో మేం ఈ గార్డెన్ ఏర్పాటు చేయగలిగాం. ఇప్పటికే ప్రతి రోజు మూడు విభాగాలుగా యోగా తరగతులు నిర్వహిస్తున్నాం. ఇకపై అవన్నీ ఈ గార్డెన్‌లోనే కొనసాగుతాయి. ఇవన్నీ నాటి.. నెల రోజులే అయింది. ఇవి పెరిగి పెద్దయితే ఫలితాలు ఇంకా బాగుంటాయి. ఇంకో ముఖ్య విషయం... ఇక్కడ నివసించే వారి పిల్లలు ఎక్కువగా కార్పొరేట్ స్కూల్స్‌లో చదువుకునే వారే. అందులో కొందరు పాలు ఏ చెట్టు నుంచి వస్తాయి? సబ్బులు ఏ చెట్టుకు కాస్తాయి? అని అడిగే వాళ్లున్నారు. వరి మొక్క ఎలా ఉంటుందో కూడా కొందరికి తెలియదు. ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 800 మంది పిల్లలున్నారు. వారికి ఈ హెర్బల్ గార్డెన్‌లో మొక్కల గురించి చెబుతాం. వాటి ప్రత్యేకతను వివరిస్తాం. అందుకే ప్రతి మొక్కకి లేబుల్స్ ఏర్పాటు చేశాం. వాటి డిస్‌వూస్కిప్షన్ కూడా రాసి పెట్టాల్సి ఉంది. ఎన్ని మొక్కలున్నాయో వాటి పేర్లు, శాస్త్రీయ నామాలు బోర్డు మీద రాసి పెట్టాం. వాటిని చదవడంలో వాటి గురించి తెసుకోవడంలో పిల్లలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు’ అని చెప్పారు హార్టికల్చరల్ ఇన్‌ఛార్జ్ అర్జునరావు.

ఉన్నంత జాగలో ఇలాంటి మొక్కలు నాటాలని మీకూ అనిపిస్తోందా? అయితే ఖర్చు గురించి భయపడాల్సిన పనిలేదు. మొక్కల్ని తక్కువ ధరలోనే ప్రభుత్వ ఉద్యానవన శాఖ వారు అందిస్తున్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోనూ లభిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల వారు సంబంధిత ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించొచ్చు.

అద్భుతం... ఔషధం..
చెట్లు కార్బన్ డై ఆక్సైడ్‌ని పీల్చుకుని ఆక్సిజన్‌ని ఇస్తాయని మనకు చిన్నప్పటి నుంచీ తెలుసు. దాంతోనే మనం బతుకుతున్నామనీ తెలుసు. ప్రస్తుతం పర్యావరణం పాడైపోతుందనీ తెలుసు. చెట్లు పెంచడం ద్వారా దాన్ని కొంత నిర్మూలించొచ్చనీ ఎరుకే. అయినా మనలో కొందరికే తప్ప మిగిలిన వారికి మొక్కల పెంపకం పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. అలాంటిది మై హోమ్ జువెల్ అసోసియేషన్ వాళ్లు ఔషధ మొక్కల పట్ల ఆసక్తి చూపడం నాకు బాగా నచ్చింది. సాధారణ మొక్కల కంటే ఔషధ మొక్కలు ఆక్సిజన్‌ని ఎక్కువగా విడుదల చేస్తాయి. అంతేకాకుండా వాటికి విశేషగుణాలుంటాయి. అందులో సుగంధ మొక్కలుంటాయి. శ్వాస సంబంధ వ్యాధుల్ని నయం చేసేవి ఉంటాయి. డయాబెటీస్‌ని తగ్గించేవి ఉంటాయి. ఇలా రకరకాల వ్యాధుల్ని దూరం చేసే గుణాలు వాటిలో ఉంటాయి. నేను ఆయుర్వేదం మీద, ఔషధ మొక్కల మీద కొంత పరిశోధన చేశాను. హిమాలయాల్లో ప్రశాంత వాతావరణం ఉంటుందని కొందరు వెళ్తుంటారు... ఎందుకు? అక్కడ ఎక్కువగా ఔషధ మొక్కలుంటాయన్నది వాస్తవం. మంజిష్ట పేరుతో ఒక హెర్బల్ గార్డెన్‌ని ఏర్పాటు చేయాలనుకోవడం అభినందించాల్సిన విషయం. అందుకే నేను మై హోమ్ జువెల్ అసోసియేషన్‌తో కలిసి పనిచేశాను. మనదేశంలో 400లకు పైగా ఔషధ మొక్కలున్నాయి. మన రాష్ట్రంలో 200 వరకు అందుబాటులో ఉన్నాయి. మేం ఇప్పుటికే మంజిష్టలో 114 మొక్కల్ని నాటాం. ఇంకొన్నింటిని నాటే ప్రయత్నంలో ఉన్నాం. కొన్ని రోజులయితే అవి బాగా పెరుగుతాయి. ఆ సుగంధ పరిమళాల మధ్య యోగ, ధ్యానం చేయడం వల్ల ప్రాణశక్తి పెరుగుతుంది. పునరుత్తేజం కలుగుతుంది. కొందరు ఇళ్లల్లో ఔషధ మొక్కల్ని పెంచుతున్నారు. ఒక అపార్ట్‌మెంట్‌లో ఒక ప్రత్యేకమైన పార్క్‌ని ఏర్పాటు చేయడం మాత్రం నేను చూసినంత వరకు ఇదే ప్రథమం. ఈ సంస్కృతి పెరగాలి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి.
- డాక్టర్ దేవేందర్ మందారపు,
యోగా థెరపిస్ట్, క్రియ యోగా సంస్థాన్

0 comments: