జస్ట్.. ఒక్క నిమిషంలో ఏం జరుగుతోంది?

By | September 02, 2012 Leave a Comment

కంప్యూటర్ ఆన్‌లో ఉంది. 
అది ఇంటర్‌నెట్‌కు కనెక్ట్ అయి ఉంది. 
ఒక ఈ-మెయిల్ పంపించడానికి ఎంత సమయం పడుతుంది? 
జస్ట్.. ఒక్క నిమిషం!
ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్‌డేట్ చేయడానికి.. ట్విట్టర్‌లో ట్వీట్ కొట్టడానికి???
అంతే సమయం.. అదే నిమిషం.. 
అంటే.. కేవలం 60 క్షణాలు...
ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది?
లెక్కల మాస్టారు పాఠం చెప్పినట్లు అంకెలు కాస్త ఎక్కువగా ఉంటాయి, కంగారు పడకండి.

ప్రస్తుతం..
ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్ల మంది ఇంటర్‌నెట్ వాడుతున్నారు. అందులో ఆసియాకి చెందినవారు 44.8 శాతం మంది ఉన్నారు. సుమారు సగం వాడకందారులు మన ఖండంలోనే ఉన్నారన్నమాట. ఇందులో చైనా వాటా 50 శాతం. 12 శాతంతో మన దేశం రెండో స్థానంలో ఉంది. అంటే భారతదేశ జనాభాలో 10 శాతం మంది ఇంటర్‌నెట్ వాడుతున్నారన్నమాట.

‘వెబ్’ దునియా: ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల వెబ్‌సైట్లు ఉన్నాయి. 2011లోనే 30 కోట్ల వెబ్‌సైట్లు కొత్తగా చేరాయి. ప్రతి ఒక్క నిమిషంలో 570 కొత్త వెబ్‌సైట్‌లు రిజిస్టర్ అవుతున్నాయి.
‘సోషల్’యిజం: ఫేస్‌బుక్‌లో ప్రతి ఒక్క నిమిషానికి 6,95,000 స్టేటస్‌లు అప్‌డేట్ అవుతున్నాయి. 2,77,000 మంది బుక్(లాగిన్) అవుతున్నారు. 79,364 మంది వాల్స్ పోస్ట్ చేస్తున్నారు. 6,47,22 లైకులు కొడుతున్నారు, 5,10,040 మంది కామెంట్స్ రాస్తున్నారు. ట్విట్టర్‌లో 320కిపైగా కొత్త అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి. 98 వేల మంది ట్వీట్‌లు పోస్ట్ చేస్తున్నారు.
‘బ్లాగో’తం: 60 సెకన్లకు 60 బ్లాగులు కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. 1500 మంది ఆ బ్లాగుల్లో పోస్ట్‌లు రాస్తున్నారు. 20,000 కొత్త పోస్టులు టుంబ్లర్ (tumbler)లోకి అప్‌లోడ్ అవుతున్నాయి. 125కి పైగా వర్డ్‌వూపెస్ ప్లగిన్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.

2020లో...
రానున్న ఎనిమిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌నెట్ వినియోగదారుల సంఖ్య 600 కోట్లకు చేరుకోనుంది. మొబైల్ ఫోన్లలో బ్రాడ్‌బ్యాండ్ ద్వారా ఇంటర్‌నెట్ వాడే వారి సంఖ్య 2014 నాటికి 250 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతానికి ప్రతి 60 సెకన్లకు 217 మంది కొత్తగా వాడకం మొదలుపెడుతున్నారు. అంటే 2020 నాటికి ఈ సంఖ్య 318 కోట్లకు చేరుకోనుంది. మొత్తంగా ఇంటర్‌నెట్ వాడే వారితో పోలిస్తే మొబైల్ ఫోన్లలో ఇంటర్‌నెట్ వాడేవారే సంఖ్య సగానికి ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి ప్రతి సెకనుకు 10,663 జీబీల సమాచారం కొత్తగా ఇంటర్‌నెట్‌లో చేరుతోంది. ఇది ఎగ్జా బైట్ల నుంచి జిటా బైట్లకు చేరనుంది. అంటే, 2020లో సమస్త సమాచారం మొత్తం మీ చేతిలో ఉంటుందన్నమాట.
మంచి వెన్నంటే చెడూ, వెలుగు వెనకాల చీకటి ఉన్నట్లు... ఇంటర్‌నెట్‌లో ఇన్ఫర్మేషన్‌తోపాటు వైరస్సూ ఉంటుంది. హ్యాకర్లూ కాచుకుని ఉంటారు. ప్రస్తుతానికి ఒక నిమిషంలో 232 కంప్యూటర్లకు వైరస్ వస్తోంది. 12 వెబ్‌సైట్లు హ్యాక్ అవుతున్నాయి. 416 సైట్ల హ్యాకింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2020లో ఇంటర్‌నెట్ మీద హ్యాకర్ల దాడి మరింత పెరగనుంది.

ప్రస్తుతం.. ప్రతి 60 క్షణాలకు...
- 20.4 కోట్ల ఈ-మెయిల్స్ పంపుతున్నారు.
- గూగుల్‌లో వెతికేవారి సంఖ్య 20 లక్షలు.
- యూట్యూబ్‌లో 13 లక్షల వీడియోలు చూస్తున్నారు. ఇదే సమయంలో 48 గంటల వీడియో అప్‌లోడ్ అవుతోంది.
- స్కైప్‌లో 3,70,000 నిమిషాలకు పైగా వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నారు.
-ఫ్లిక్కర్‌లో 3,125 కొత్త ఫొటోలు అప్‌లోడ్ అవుతున్నాయి.
- అమేజాన్‌లో 83 వేల డాలర్ల విలువైన వస్తువులు అమ్ముడు పోతున్నాయి.
- మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ పీసీలలో 47, 000 యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
- వికీపీడియాలో ఆరు కొత్త వ్యాసాలు పబ్లిష్ అవుతున్నాయి.
- 13,000 గంటల మ్యూజిక్ స్ట్రీమింగ్ అవుతోంది.
-మొత్తంగా 639,800 జీబీల సమాచార మార్పిడి జరుగుతోంది.

(september 2, 2012)

0 comments: